:: కుచేలుని చిటికెడు అటుకులు - అంతరార్థం ::
నమస్కారం! భాగవత సుధకు స్వాగతం. కృష్ణ పరమాత్మకు ఆయన బాల్య మిత్రుడు కుచేలుడు అటుకులు ఇచ్చాడని మనందరికీ తెలుసు. కానీ, ఆ అటుకుల వెనుక ఉన్న అసలు రహస్యం, కుచేలుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడో మీకు తెలుసా? చాలామందికి తెలియని ఆ అద్భుతమైన కథను ఇప్పుడు విందాం.
సాందీప మహర్షి ఆశ్రమంలో కృష్ణుడు, కుచేలుడు చదువుకునే రోజుల్లో ఒకరోజు.. గురుపత్ని వారిద్దరినీ అడవికి వెళ్ళి సమిధలు (కట్టెలు) తీసుకురమ్మని పంపిస్తుంది. దారిలో ఆకలి వేస్తే తినమని కొంచెం అటుకులు మూటగట్టి ఇస్తుంది.
అడవిలో అకస్మాత్తుగా పెద్ద వాన పడుతుంది. కృష్ణుడు ఒక చెట్టు పైన, కుచేలుడు మరో చెట్టు పైన తలదాచుకుంటారు. ఆ చలికి, ఆకలికి తట్టుకోలేక కుచేలుడు తన దగ్గర ఉన్న అటుకులను కృష్ణుడికి చెప్పకుండా ఒక్కడే తినేస్తాడు. కృష్ణుడు "మిత్రమా! ఏదో నములుతున్న శబ్దం వస్తోంది, ఏమిటది?" అని అడిగితే, "ఏం లేదు కృష్ణా.. చలికి నా దవడలు కొట్టుకుంటున్నాయి" అని అబద్ధం చెబుతాడు.
పరమాత్మకు భాగం ఇవ్వకుండా, ఆయనను మోసం చేసి తిన్న ఆ అటుకులే కుచేలుడికి దారిద్ర్యాన్ని మిగిల్చాయి. అందుకే కుచేలుడు జీవితాంతం పేదరికంలో మగ్గిపోయాడు.
కానీ, ఏళ్ల తర్వాత కుచేలుడు మళ్ళీ అదే అటుకులను పట్టుకుని ద్వారకకు వెళ్ళినప్పుడు.. కృష్ణుడు ఆ అటుకులను ఎంతో ఇష్టంగా తింటాడు. ఎందుకు? అక్కడ కుచేలుడు "దాచి" తినలేదు, తన దగ్గర ఉన్నది ఏమీ లేకపోయినా కృష్ణుడి మీద "ప్రేమతో" పట్టుకొచ్చాడు. ఒక్క గుప్పెడు అటుకులు తినగానే కుచేలుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కృష్ణుడు.
ఈ కథ ఇచ్చే సందేశం ఒక్కటే, భగవంతుడికి మనం ఏమి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత నిజాయితీతో, ఎంత ప్రేమతో ఇస్తున్నామన్నదే ముఖ్యం. లోభత్వం దారిద్ర్యానికి దారి తీస్తే, అర్పణ భావం అనంతమైన సంపదను ఇస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి