:: భగవంతుని రక్షణ ఎప్పుడు లభిస్తుంది? ::
ద్వారకా నగరం.. కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవితో కలిసి భోజనానికి కూర్చున్నారు. వడ్డన జరుగుతోంది, మొదటి ముద్ద నోటి దగ్గరకు వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో కృష్ణుడి కళ్ళలో ఒక మెరుపు, ముఖంలో ఆందోళన. చేతిలో ఉన్న ముద్దను అలాగే పాత్రలో పడేసి, కనీసం చేతులు కూడా కడుక్కోకుండా హడావుడిగా బయటకు పరుగెత్తారు. రుక్మిణీ దేవి నిర్ఘాంతపోయింది. "స్వామీ! ఎక్కడికి? ఏమైంది?" అని అడుగుతున్నా వినిపించుకోకుండా ఆయన సింహద్వారం వైపు వెళ్ళిపోయారు.
కానీ, చిత్రం ఏమిటంటే.. సింహద్వారం దాటకముందే కృష్ణుడు ఒక్కసారిగా ఆగిపోయారు. వెనక్కి తిరిగి చూసి, ఒక నిట్టూర్పు విడిచి, మళ్ళీ నవ్వుతూ భోజనశాలకు వచ్చేశారు. రుక్మిణి ఆశ్చర్యంతో అడిగింది, "ప్రభూ! అంత వేగంగా వెళ్ళి, అంతలోనే ఎందుకు ఆగిపోయారు? అంతటి ఆపద ఎవరికి వచ్చింది?"
కృష్ణుడు ఇలా వివరించాడు.. "దేవీ! అడవిలో నా భక్తుడు ఒకడు కళ్ళు మూసుకుని నా నామాన్ని జపిస్తున్నాడు. అతనికి తెలియకుండానే కొందరు వేటగాళ్లు అతన్ని కొట్టడానికి వస్తున్నారు. ఆ భక్తుడు నన్నే నమ్ముకున్నాడు కదా అని, వాడిని కాపాడటానికి నేను బయలుదేరాను. కానీ, నేను అక్కడికి వెళ్ళేలోపే ఆ భక్తుడు కళ్ళు తెరిచాడు. తనను కొట్టడానికి వస్తున్న వారిని చూసి భయపడి, 'కృష్ణా నన్ను కాపాడు' అని పిలవకుండా.. పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని చేతిలోకి తీసుకున్నాడు."
"ఎప్పుడైతే వాడు తనను తాను రక్షించుకోవడానికి రాయిని నమ్మాడో, అప్పుడే నా అవసరం అక్కడ లేదని అర్థమైపోయింది. వాడు రాయిని నమ్ముతాడు లేదా తన చేతి బలాన్ని నమ్ముతాడు.. కానీ నన్ను మాత్రం పిలవలేదు. తన భారాన్ని తనే మోయాలనుకున్నప్పుడు నేను మధ్యలో వెళ్లడం ఎందుకు అని వెనక్కి వచ్చేశాను."
మనం భగవంతుడిని సగం నమ్మి, సగం మన తెలివితేటలను నమ్మితే ఆయన రాడు. "నీవే దిక్కు" అని శరణాగతి వేడినప్పుడే ఆ చక్రధారి మన చెంత నిలుస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి