:: అహం ::
త్రికాలవేది, మహాజ్ఞాని అయిన ఒక అద్భుత శిల్పికి అంతిమసమయం దగ్గర పడింది. తన ప్రాణాలను హరించడానికి యమదూతలు ఏ క్షణంలోనైనా రావచ్చని తెలిసింది.
ప్రాణతీపితో...ఆ శిల్పి...యమదూతల్ని తికమకపెట్టి ఉట్టి చేతులతో పంపడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. మైనంతో అచ్చం తనలాగే ఉండే తొమ్మిది బొమ్మల్ని చేసి, యమదూతలు వచ్చే సమయానికి వాటిలో ఒకడుగా నిలబడ్డాడు. యమదూతలు వచ్చారు. బొమ్మల్ని చూశారు. ఆకారంలో...పోలికలలో ఏమాత్రం తేడా లేకుండా ఉండే ఆ బొమ్మలలో ప్రాణం తీయవలసిన శిల్పిని ఎలా గుర్తించాలో అర్థం కాలేదు. వాళ్ళు వెనుదిరిగి వెళ్ళి యముడికి చెప్పారు. యమధర్మరాజు మారువేషంలో స్వయంగా వచ్చాడు. శిల్పి నైపుణ్యానికి అబ్బురపడ్డాడు. ఎలా శిల్పిని గుర్తించడం? ఏ బొమ్మమీద పాశం విసిరినా ...అది శిల్పి కాకపోతే ...శిల్పికి మరణం తప్పే అవకాశం ఉంది. అది తన ధర్మశాస్త్రానికే విరుద్ధం. అందుకని ఎలాగైనా శిల్పిని బయటకు లాగాలని ప్రయత్నించాడు.
బ్రాహ్మణ వేషంలోని యముడు శిల్పాలను పరిశీలనగా చూస్తూ ..." ఆహా! ఏమీ! ఈ కళానైపుణ్యం!ఏ దేవ, గరుడ, గంధర్వ కిన్నెర కింపురుషాదులో శాపవశాన ఏకరూపులో ఇక్కడ నిలబడ్డారా అనిపిస్తుంది. అతి సూక్ష్మమైన తేడా ఏమాత్రం లేకుండా అచ్చుగుద్దినట్లుగా అన్నీ ఒకే రకంగా...జీవం ఉట్టిపడేలా ఉన్నవి. వీటిని విశ్వకర్మనో, మయుడో నిర్మించి ఉండాలి తప్ప మానవ మాత్రునికి సాధ్యమయ్యే పనికాదు" అన్నాడు.
అనగానే...శిల్పికి చర్రున కోపం వచ్చింది. కోపం ఏమాత్రం ఆపుకోలేక పోయాడు. " ఓ పిచ్చి బ్రాహ్మడా! చేసింది నేనైతే...వాళ్ళెవరో చేశావంటావేమిటి? పైగా మనిషికి అసాధ్యం అంటావేమిటి? ...ఇదిగో...నేను మనిషినే...నేనే చేశాను... వీటిని " అన్నాడు.
యముడు ఫకాల్న నవ్వి నిజరూపం దాల్చి పాశం వేసి శిల్పి ప్రాణాలు హరించాడు.
సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి