19, సెప్టెంబర్ 2023, మంగళవారం

 :: రామసుగ్రీవులమైత్రి ::

( విభిన్న చందస్సులలో)

అలసగతి: 

విలువగు సుధర్మములు వీడక సతమ్మున్ 

వెలుగులిడు రాఘవుని పేరుకొనుచున్ తా 

మలయశిఖరమ్మె జని మారుతి తనంతన్ 

చెలువముగ నార్కిదరి జేరి యిటు బల్కెన్. 

అసంబాధ: 

శూరుండై వర్థిల్లు ఘనుడవగు సుగ్రీవా! 

పారమ్యంబౌ నీ చెలిమి వలచి ప్రాజ్ఞుండై 

చేరెన్ శ్రీరాముండిట ననుజుని చేకొంచున్ 

తీరౌ రీతిని వారిని బిలుచుము తీపొందన్. 

డిండిమ: 

వనమ్మునను తండ్రి నియమ పాలనమ్మునన్

ఘనమ్ముగ ఘటించెడు తఱి కావరుండు రా 

వణుండితని భార్యను గొని పారిపోవగా 

నినున్ వహిని నండగొనగ నెమ్మి కోరెగా! 

పంక్తి: 

తప్పడు రాముడు ధర్మమునున్ 

గొప్పగ వానిని గొల్చినచో 

నొప్పగు రీతిని యుక్తముగా 

మెప్పుగ నీవిట మీఱుదువే! 

ప్రియవచనము: 

హనుమ ప్రియమ్మౌ నాలాపమ్ముల్ 

వినుచు ముదమ్మే పెంపారంగా 

నినుని సుతుండే యింపౌ రీతిన్ 

వినయముతో జెప్పెన్ తానిట్టుల్. 

( మరి, రేపు 5 పద్యాలు.......)  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...