:: రామసుగ్రీవులమైత్రి ::
( వివిధ ఛందస్సులలో )
( నిన్నటి అయిదు పద్యముల తరువాయి - ఈరోజు అయిదుపద్యాలు)
మధ్యాక్కర:
ఈరీతి వారలు సఖులయిన పిమ్మటను భానుజుండు
శ్రీరాముని దరిని జేరి చెన్నగు రీతిని మనము
తీరుగ సౌఖ్యము వెతలు దీర్చుటందున నేకమౌచు
నీరోజునుండి కలివిడిని చవి గొనంగవలెననె.
మురళి:
దళముల్ పూవులతోడ తళ్కొత్తు వృక్షమ్ముదౌ
సెలగన్ జీల్చియు ధాత్రి జీర్వార జేయించి తా
నెలమిన్ రామునికోరి యింపౌ విధిన్ దానిపై
నిలుపం జేయుచు నార్కి నిల్చుండె నమ్రుండునై.
కుసుమ:
హనుమ లక్ష్మణస్వామికై
ఘనముగాను తానొక్క శా
ఖను దళించి కూర్చుండ జే
సెనట దానిపై చక్కగా!
వరలక్ష్మి:
వారెల్ల కూర్చొని జల్పము జేయు తఱిలోనన్
ధౌరేయుడౌ రఘునందనుతో కపివరుండున్
తా రోయుచున్ననె భ్రాతగు వాలి తన భార్యన్
చూఱాడి యీసున పెచ్చుగ రేగిన విధంబున్.
చంచరీకావళి:
ప్రఖ్యాతుండౌ రామా! వాలి సోదర్యుడైనన్
సఖ్యంబే లేకుండన్ సాగు గర్విష్ఠి తానై
అఖ్యాతిన్ గూడంగా నాగడీడై యసూయన్
విఖ్యాతమ్మౌ ప్రేమన్ పెంచు నాభార్య నెత్తెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి