:: అంబరీషోపాఖ్యానము ::
( వివిధ ఛందస్సులలో )
అల్పాక్కర:
సవురగు గుణముల సత్వముతో
భువియందు భాసించి బుద్ధిగ తా
పవిదిని శౌరి నుపచరించిన
సువిదుడా యంబరీషుడు భువిలో!
సుగంధి:
అంబరీషు నంతరింద్రియంబు శౌరి నెప్పుడున్
సంబరమ్ముగా నుతించు శ్రద్ధతోడ గొప్పగా
ఇంబునొందురీతి గూడి యేకపొత్తు లీలలన్
పంబునట్లు జేయు వాని పల్కులన్ని మేటిగా!
అశ్వలలిత:
మనమది శౌరి పాదములయందు మాటలవి విష్ణునామ మహిమన్
అనువుగ మెచ్చుటందును కరమ్ములాహరికి వేలలెంచుచును తా
ఘనముగ వీను లచ్యుతుని దివ్య గాథలు వినంగ చూపులు సదా
ఘనుడగు నా యనంతుని ముఖమ్ము గాంచుచు నతండు సందడి గొనెన్.
చంపకమాల:
క్రమమును వీడకుండగను గాఢముగా నతడశ్వమేధముల్
నిమితముతో వశిష్ఠఋషి నేర్పిన రీతిసరస్వతీనదీ
సముఖమునన్ ఘటించియు పసందగు కాన్కలొసంగి యార్యులన్
సమముగ గొల్చిరాజఋషి సత్కృతి నొందెను పృథ్వియందునన్.
అష్టమూర్తి:
మన్నైనన్ పసిడి యైనన్ మదిని భేదమ్ములేనౌ మతము నెంచుచు తానున్
చెన్నౌనట్టి విధి కర్మల్ జినున కర్పించియున్ వాసిగ చతుర్భుజు చెంతన్
పన్నౌనట్లుగను బుద్ధిన్ పదురుగా జేసి నిచ్చల్ పరవశమ్మును జెందన్
వన్నెల్ చిందు వితమున్ తా ప్రకటనన్ జేసె పీతాంబరునిలీలలు తీరున్.
ఇల:
తనకున్నతండు వితముగ చలిపెడువౌ
ఘనమైన సేవలు కరణిని నొసగగా
దనుజారి యా హరి తగులము కలుగగా
తన చక్రమిచ్చె నతనికి హరుసముతో!
కరిబృంహితము:
చిత్తము హరికి నంకిత బఱచి సేవలు సలుపు వానికిన్
బొత్తిగ నిహము నందున వలపు పోవగ సతియె గూడగా
నుత్తరుడయిన విష్ణువు కొఱకు నొక్క వరుసము నెంతయో
యుత్తమ విధిని ద్వాదశ వ్రతము నోపికగ వెలయించె తాన్.
ఖచరప్లుతము:
తెలివి గూడగ నాతడు నాకార్తీకము నందున మూడు రా
త్రులట పస్తులు జేసియు తా పంతున్ యమునానది యందునన్
జలక మాడిన పిమ్మట సంతోషమ్మమరన్ మధు వాటినిన్
పొలుపుగా నభిషేక మొనర్చెన్ పోడిమితోడను చక్రికిన్.
కామేశ:
అచ్చట బ్రాహ్మణుల కమిత నందము గలవై
మెచ్చుగ నుండిన మొదవులు మెల్పుగ నిడుచున్
పెచ్చుగ స్వాదువగు కుడుపు పెట్టి యలరి తా
నచ్చుగ పస్తును విడువగ నాత్మను దలచెన్.
తన్వి:
అంతట దుర్వాస ఋషియె విడిగా నచ్చటకున్ శిశుగణముల తోడన్
పంతగు నాతిధ్యము గొనుటకునై వచ్చెను చక్కగ నెలమియె చూపన్
సంతసమొందంగ ప్రభువు ఘనమౌ సత్కృతి జేయుచు నుచితపు పీఠిన్
చెంతను నెక్కొల్పి తన గృహమునన్ జేమనమున్ చలుపు మనుచు గోరెన్.
( తిరిగి రేపు మరో పది పద్యములు .........)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి