24, సెప్టెంబర్ 2023, ఆదివారం

 :: అంబరీషోపాఖ్యానము :: 

( వివిధ ఛందస్సులలో )

( నిన్నటి తరువాయి .......) 

అపరాజితము: 

పదురగువిధి నా నృపాలుడు మౌనికిన్ 

మృదువగునటు సేవ ప్రేమగ జేయగన్ 

పొదలి యమునలోన మున్గియు రాగ తా 

కదలెను ముని శిష్యకాయము గూడుచున్. 

కుసుమలతావేల్లితము: 

కాళిందిన్ దుర్వాస మునియట శీఘ్రమ్ముగా స్నానమున్ తా 

కాలమ్మున్ పోవిడ్చి చలుపుచు నాకార్యమున్నాపు జేయన్

లోలత్వమ్మే జూపక సమయమున్ లొంగదీయంగనుండన్ 

కాలమ్మే మించెన్ నృపతికట దీక్షన్ ముగించంగనుండన్. 

భాస్కరవిలసితము: 

పారణ సలుపగ జియ్యకు లగ్నంబందున సగము గడియయె పొసంగెన్ 

ఏరుకు నరిగిన మౌనివరీయుండింకను రసనము మెసవని సాకున్ 

మీరెను గడియలు ద్వాదశియందున్, మెల్లగ బుధులని పిలిచియు వారిన్ 

తీరుగ నడిగెను రాజట నాకున్ దెల్పుము పరువగు నెరవును నంచున్. 

తోవకము: 

కొంచెము నీటిని గ్రోలిన జాలున్ 

సంచుగ ధర్మమె జాఱక యుండున్ 

ఇంచుక యీవిధి నీవును జేయన్ 

అంచితమౌనని రందరు నచ్చో. 

గజవిలసితము: 

వారిటు చెప్పగన్ లవము జలము కుడిచి తా 

నోరిమి గూడియుండి యొనరికగ తపసికై 

తీరుగ జూడగా యతియె యగపడి కడినిన్ 

గోరి యెఱింగె నచ్చగు విధి జరిగినదియున్. 

తలుపులమ్మ: 

వెంటనె దుర్వాసు డారాజు వీకగ సల్పినట్టి కర్మన్ 

కంటును గల్గించు పాపంపు కార్యము ననుచు నల్కతోడన్ 

తుంటరియై తిట్లతో తాను దూఱుచు నెఱక నొక్కదానిన్

గంటున తానే కసిన్ పీకి కాల్చెడి కొరివిన్ సృజించెన్. 

క్రౌంచపదము: 

ఆ కొరివే జంకున్ కలుగన్ జేయగ ప్రభువు దరికి నరిగెడి యంతన్ 

శ్రీకరు చక్రంబున్ వడిగా నాశిఖ నదిమియు తపసిని బడలించన్ 

భీకరమౌ తీరున్ వెఱ నెక్కొల్పి తఱుముచు నతడు వెడలెడి తావుల్ 

తాకుచు నేప్రాంతంబునకైనన్ తరలుచు మునినిసతమతము జేసెన్. 

కవికంఠభూషణము: 

తనకున్ భయమ్మతిగ తాకగ జేసెడి చక్రధాటినిన్ 

ఘనబల్మి నడ్డుమని కర్తను గోరెను మౌని నమ్రతన్ 

తనతోడ కాదనగ త్య్రక్షుని వేడి నతండు కాదనన్ 

జినునిన్ యజించగను జియ్యను వేడి యతండు పేర్కొనెన్. 

జలదము: 

జోరుగ నంబరీషు దరి సోలుచు తా 

చేరియు మ్రొక్కగా నతడు చిత్తమునన్ 

శౌరిని వేడి చక్రమును సన్నుతితో 

వారిశుడుండు తావునక పంపెనయా! 

మత్తేభవిక్రీడితము: 

మునియున్నంత నంబరీషుని సరిన్ భూషించి తానా స్థలిన్ 

ఘనమౌ రీతిని వీడె రాజు హరి విఖ్యాతిన్ ప్రశంసించుచున్ 

కొనలెత్తంగను బ్రాహ్మణుల్ నృపతికిన్ కోట్లాది యాశాసనల్ 

అనువున్ పూన్చగ నందరున్ మురిసి యానందమ్ముగా నిల్చిరే!  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...