:: చాటువు ::
సరసిజనేత్ర! నీ విభుని చారుతరంబగు పేరు చెప్పుమా;
అరయగ నీవునన్నడుగు నాతని పేరిదే చిత్తగింపుమా:
కరియును వారిరాశి హరుకార్ముకమున్ శరమద్దమున్ శుకం
బరుదుగా వ్రాయగా నడిమి యక్కరముల్ గణుతింప బేరగున్
- కొడిగట్టిన చాటుపద్య దీపాలనెన్నింటినో తమ కవితా సౌహార్దస్నేహంతో తిరిగి వెలిగించిన ఆ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారి సంపాదకత్వాన వెలువడిన ' చాటుపద్య రత్నాకరము ' లోనిదీ పద్యం.
ఈరోజుల్లో పత్రికల్లో వచ్చే నుడికట్టులు వెనుకటి కాలాన లేవు. అయినా నిఘంటువులను చూసే అలవాటును పాఠకుల్లో పెంపొందించే ప్రయత్నం ఆనాటి కవులు చేసేవారు. మహాకావ్యాలలో పదాలకు అర్థాలు చూసుకోవడానికేగాక నానార్థాలనూ, పరిమితాక్షరాల పదాలను, తెలుసుకునే ఉతకంఠ పఠితృలోకంలో కలగాలె. కొంత పరిశ్రమ చేస్తేగాని అంతుపట్టని పద్యాలు వ్రాస్తే పాఠకులకు బాధ కలుగదా! పురాణకథలు తెలిసి ఉండవలె. రకరకాల నిఘంటువుల సాయంతో అర్థం రాబట్టుకోవలె. ఈ ప్రయత్నంవల్ల పదజాలంతో పరిచయం ఏర్పడుతుంది. పెద్దపెద్ద కావ్యాలు చదివే పద్ధతికి దారి ఏర్పడుతుంది.
మహాకావ్యాలలో ఇలాంటి పద్యాలు అరుదుగా ఉంటాయి. చాటువుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.
" పద్మాక్షీ! నీ భర్త అందమైన పేరు చెప్పవా?"
" తెలుసుకోవడానికి నన్ను నీ వడుగు, ఆయన పేరిదే చిత్తగించు "
కరి = సారంగం (ఏనుగు); వారిరాశి = సాగరం; హరకార్ముకము = పినాకం, సాయకం, ముకురం, చిలుక. ఈ ఆరు పదాలలోని నడిమి అక్కరములను కలిపితే " రంగనాయకులు " అవుతుంది. ఆ సుందరాంగి భర్తపేరు " రంగనాయకులు " అని ఎంత సుందరంగా చెప్పింది?
తన భర్త పేరున్న అక్షరాలు కల పదాలు మూడక్షరాల్లోనే ఉండాలె. సరిగ్గా ఆమె భర్తకు సరిపోయే అక్షరం ఒక్కొక్కటి ప్రతి పదం నడుమ వరుసగా రావలె. ఇన్ని నియమాలను దృష్టిలో పెట్టుకుని ఈ పద్యాన్ని విశ్లేషించాలె. అందుకే అన్నదామె ' అరయగ నీవు నన్నడుగుమ ' ని. ' అరయు ' అనే క్రియాపదంలో ఉంది చమత్కారం. ' అరయుట ' అంటే తెలిసికొనుట, పరిశీలించుట అనే అర్థాలున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి