కోనసీమ
కబుర్లు
అమలాపురంలో
ఉన్న ఓ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకల్లా అక్కడకు దగ్గరలో గల "పేరూరు
" అగ్రహారం వెడదామని బయలుదేరాను. ఆ రోజు అక్కడకు వెడదామనుకోవడానికి రెండు
కారణాలు. అక్కడ ఉన్న పురాతన నరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించి, ఆ
స్వామి కిష్టమైన శనగలను, బెల్లం ను ఆరగింపు చేసి పూజ జరిపించుకొని మొక్కు
తీర్చుకోవడం ప్రధాన కారణమైతే, రెండోది
అదేదో సినిమా - పేరు గుర్తు లేదు (అసలే సినిమాలు చూడడం తక్కువ ) కానీ, కలర్స్
స్వాతి అన్న అమ్మాయి నటించిన ఆ సినిమాలో చూపించిన , నా
మనసును హత్తుకున్న "పేరూరు" వీధులను, మండువా
యిళ్ళను చూడాలన్న ఉబలాటం మరొకటి. ముందు రోజే, అంటే.,శనివారం
రాత్రే నరసింహస్వామి వారికి ప్రసాదాన్ని సిద్ధం చేసుకోవడం వల్ల ఆ విషయమై కాలయాపన
లేకుండా బయలుదేరి, మార్గం కొత్త కాబట్టి ( నేను అక్కడకు వెడుతున్నానని లేశ
మాత్రం ఉప్పందినా మా ఉద్యోగ మిత్ర మండలి పెక్కురు నన్ను వెంటాడే వారు ) వీధిలో ఆ
దారి తెలిసిన వారి నడిగి నా స్కూటరు పై బోడసకుర్రు మార్గం పట్టాను. ఎడమవైపు
అల్లవరం వెళ్లే కూడలి దాటి కొంతదూరం ముందుకు వెళ్లి అక్కడినుండి కుడివైపు బాట
పట్టాను. మొత్తం మీద అరగంటలో పేరూరు అగ్రహారానికి చేరుకొని నరసింహస్వామి వారి ఆలయ
మార్గం వాకబుచేసి గుడికి చేరాను. ఆలయం పురాతనంగా ఉన్నా- గుడిలోకి అడుగు పెట్టగానే
ఏవో అనిర్వచనీయ ఆధ్యాత్మిక భావనలు బలీయంగా తట్టాయి. మానసిక ప్రమోదాన్ని సంపుష్టిగా
అనుభవించాను. జీర్ణ స్థాయిలో ఉన్న ఆ గుడిలో స్వామివారికి ఏలోటూ లేకుండా రానీయకుండా
సశాస్త్రీయమైన పూజాదికాలు జరుగుతున్నాయి. గుడి పూజారి గారి ఇల్లు గూడా గుడి ఆవరణలో
స్వామి వారికి ఎడమవైపున ఉంది. ప్రభాత సమయంలో నిర్వర్తించవలసిన దైవ అనుష్టాల
నన్నింటినీ పూర్తిచేసి, కారణం తెలియదుకానీ ఆయన అప్పుడే అర్జంటుగా యింటి లోనికి
వెళ్లారుట యిప్పుడే వస్తానంటూ. సరే! నేనైతే గుడికి చుట్టూ ప్రదక్షిణాలు
మొదలెట్టాను. ఆలయ ఆవరణ ప్రాంతమంతా చిక్కగా పూసిన చక్కని పూల మొక్కలతో సువాసనలు
వెదజల్లుతూ ఉంది. గుడి లోపల స్వామివారి కిచ్చే ధూప హారతుల నుండి వచ్చే పరిమళంతో
కలసి ఆ వాసనలు మనోల్లాసాన్ని, ఉత్తేజాన్ని
కలిగిస్తున్నాయి. ఇప్పుడు దాదాపు కనబడకుండా అక్కడక్కడా మాత్రమే గోచరమవుతున్న రేకా
మందారాలు, శంఖు పూలు, తుమ్మి
పూలు, గన్నేరు పూలు యింకా ఎఱుపు తెలుపు మందారాలు, తెల్లటి
గరుడవర్ధనాలూ కళ్ళకు సంతసాన్ని, రాభస్యాన్ని
కలుగ జేసాయి. భక్తి తన్మయత్వంతో నేను అయిదు ప్రదక్షిణాలు పూర్తిచేసి
గర్భగుడిలోనికి వచ్చేసమయానికి పూజారి గారు పూజ నిర్వర్తించడానికి రెడీ అయిపోయారు.
పండు ముదుసలిగా ఉన్న వారు అనూచానంగా వారి తాత ముత్తాతలనుండి ఈ గుడిలోనే ఉంటూ
వంశపారంపర్యంగా అర్చకత్వం వహిస్తున్నారట. స్వామివారికి పూజలర్పించి, ప్రసాద
సమర్పణ గావించి, తీర్థప్రసాదాలను, శఠారులను
పొంది, జ్ఞానులైన వారి ఆశీస్సులందుకుని ఆపై వారితో కొద్దిసేపు
ముచ్చటించి బయటకు వచ్చాను.
గుడికి
ఎదురుగా ఉన్న వీధిలోని వసారాలతో గూడిన యిళ్ళను చూస్తే మా పూర్వీకుల యిండ్లన్నీ
కళ్ళకు గట్టినట్లయ్యాయి. వసారాలలో నులక/నవ్వారు మంచాలు, మడతమంచాలు, వాటి
క్రింద మంచి నీటితో నిండి ఉన్న యిత్తడి మరచెంబులు, మంచాల
ప్రక్కన మడత పడక కుర్చీలు, తాటాకు విసనకర్రలు చిన్నతనంలో ప్రత్యక్షంగా నేనాడిన మా తాత
గారింటిని జ్ఞప్తికి తెచ్చాయి. మండువా లోగిలి గలిగిన ఒకరింటికి వెళ్ళి నన్ను నేను
పరిచయం చేసుకుని వారి అనుమతితో వారి యింటిని పరిశీలిస్తూ కలయ తిరిగి చూశాను. ఎన్నో
గదులు, ద్వారాలు, కిటికీలతో
ముస్తాబై సూర్యకాంతి ప్రసరణ నట్టింట విరజిమ్మేలా నిర్మితమై, ఉమ్మడి
కుటుంబానికి చిహ్నంగా, రాజసానికి దర్పణంగా నిలిచిన ఆ యిల్లు కేవలం మండువా లోగిలిగా
గాక మమతల కోవెలగా అనుభూతి నిచ్చింది. ఇప్పుడంతా వేరు కాపురాల సంస్కృతి
పెరుగుతూండడం వల్ల మండువా లోగిళ్ళు ఉనికిని కోల్పోతున్నాయి. మండువాలో నిలుచుని
ఉదయం పైకప్పు నుంచి పలుకరించే భానుడిని, రాత్రి
వేళ వెన్నెలను కురిపించే చంద్రుడిని చూస్తూ రోజంతా పడే కష్టాన్ని మరచి పోయేవారు ఆ
ఆవాసాలలో నివాసముండే వారు. ఇప్పుడు నేను గమనిస్తున్న యింటి వారి ఉవాచ ప్రకారం
వారిల్లు కాలానికి అనుగుణమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందట. అందుకై వారు రెండడుగుల
మందంతో సున్నం, బంకమట్టి మిశ్రమంతో దృఢంగా తాపీ, వడ్రంగి
పనివారి చేతి నైపుణ్యానికి పోటీ పెట్టి మరీ ఆ యింటిని నిర్మింప జేసారుట. దానివల్ల
వేసవిలో లోగిలంతా ఎయిర్ కండిషన్ చేయించినట్లు గానూ, శీతాకాలంలో
దుప్పటి అవసరం లేకుండా నిదురించే సౌలభ్యాన్ని కలిగి ఉండేదిట. మొత్తం మీద వారిల్లు
చాలా అందంగా ఉంది. నాకెన్నో మధుర స్మృతులను మతింప జేసింది. ఆ యింటి పెద్ద ఎంతో
అభిమానంతో, ఆదరణతో, ఆత్మీయంగా
చేసిన మర్యాద లందుకొని బయటకు వచ్చి స్కూటరుపై యింటికి తిరుగుముఖం పట్టాను. మనసంతా
మండువా లోగిళ్ళ గురించి నాకు తెలిసిన విషయాలను నెమరువేసుకొనడంలో నిమగ్నమైపోయింది.
చావడిలో పడక కుర్చీలో పడుకొని గొడుగు కర్రతో తగవులు తీర్చే పెద్దరికం తాతయ్యలు, కోడళ్ళకు
యింటి పనులు అప్పగించి దర్పం ప్రదర్శించే అత్తమ్మలు, వడివడిగా
తమ యింటిపనులు చక్కదిద్దుకునే చలాకీ కోడళ్ళు, నట్టింట్లో
ఆటపాటలతో మారాం చేసే మనవళ్ళతో, మనవరాండ్రతో
కళకళలాడే లోగిళ్ళు జ్ఞాపకానికి వచ్చాయి. పండగొచ్చినా, వేసవిశలవలొచ్చినా, పెళ్ళిళ్ళవంటి
శుభకార్యాలు జరిగినా మండువా లోగిళ్ళలో సందడి అంతాయింతా గాదు. జీవితకాలం నిలిచిపోయే
స్మృతుల అనుస్మరణతో ఉత్సాహంగా యింటికి జేరాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి