సముచితాలోచన
- క్రొవ్విడి వెంకట రాజారావు
మంచి చెడ్డలను తెలుసుకోగల
బుద్ధి, జ్ఞానం సృష్టిలో మనిషికి మాత్రమే
ప్రసాదించ బడినాయి. విశాల దృక్పథంతో యితరుల పట్ల
సదుద్దేశాలను పెంచుకుంటూ, సహాయ సహకారాలను అందించుకుంటూ సేవాభావంతో
ఈ జీవితాన్ని పరిమళ భరితం చేసుకోవాలి. అందుకు ఉదాత్తమైన ఆలోచనలు కావాలి. సద్బుద్ధి కావాలి. చక్కటి ఆలోచనలే మనిషికి జీవిత గమ్యాన్ని ఏర్పాటు చేస్తాయి. బాగా ఆలోచించి ఉచితమైన
బుద్ధితో వేసే అడుగులు సర్వత్రా విజయాలను వరించి పెడతాయి. సత్కీర్తిని ప్రసరింప చేస్తాయి.
మానసికమైన శక్తులన్నింటిలో చింతనాసక్తి సాత్త్వికమైనది, బలీయమైనది. ఏ మనిషైనా తన మస్తిష్కంలో మెదిలే
ఆలోచనల ప్రభావంతో చైతన్య తేజుడౌతాడు. మనస్సులోని మాలిన్యాలను కడిగి వేసి
చిత్తశుద్ధిని సంపాదించి తద్వారా మనసుకు ఏకాగ్రతను కల్పించి ఆలోచనలను కార్యరూపంలో
పెట్టినపుడు అనంతమైన ప్రయోజనాలను పొందగలం. జీవితంలో విజయాలను సాధించడానికి సరియైన
ఆలోచనలే ఆలంబనగా ఉంటాయి. అయితే, ఆ ఆలోచనలకు పట్టుదల, ప్రయత్నం, కార్యదీక్షల ఒద్దిక కావాలి. మంచిని, చెడ్డను తెలియజెప్పి చేయదగిన, చేయదగని చేష్టలను వివరించే ఆలోచనలు
మనిషికి చక్కని నడవడికను అలవరింపజేస్తూ, వివేకశీలిగా రూపొందింప చేస్తాయి. తద్వారా ఆ వ్యక్తి సమాజంలో కీర్తి ప్రతిష్ఠలతో బాటు అందరి అభిమానాలను
ప్రోది చేసుకుంటాడు. స్పష్టమైన విధానం, ఉదారత కలిగిన సరియైన మార్గంలో దృఢంగా
నిలబడిన ఆలోచన సువిశాలభావాన్ని ఏర్పరచి శోభిల్ల చేస్తుంది. మనిషి కేవలం ఆలోచించడానికే పరిమితం కాకుండా అందుకనుగుణమైన కర్తవ్య
నిర్వహణకు పూనుకోవాలి. అప్పుడే అతడు అంతర్ముఖుడు కాకుండా ఉంటాడు.
మెదడులో ఉద్భవించిన ఆలోచనలకు పదును పెట్టిన వారగుట వల్లనే విమానాలను
కనిపెట్టిన ‘రైటు’ సోదరులు, గురుత్వాకర్షణ సిద్ధాంతకర్త ‘ ఐన్ స్టీన్ ‘ మొదలైనవారు ఈనాటికీ తలపుకొస్తున్నారు. చికాగో సర్వమత సభలో మానవాళికి సోదర
భావాన్ని ఉద్భోదించిన వివేకానందుని ఆలోచనా సరళి, స్వాతంత్ర్య
సమరంలో పంచాక్షరీ మంత్రంలాగా పనిచేసిన ‘ వందేమాతరం ‘ ఆలోచనా నినాదం – యివన్నీ భావనాశక్తికున్న సామర్ధ్యాన్ని
ప్రకటిస్తున్నాయి.
జీవితంలోని అనుమోద ప్రమోదాలను, ఆనందాతిశయాలను ఆస్వాదించ గలిగే భావనలు కలగాలి. దు:ఖాన్ని, స్వార్ధాన్ని, అహాన్ని,
గర్వాన్ని విస్మరించే చింతనలు చేయాలి. అప్పుడే సమదర్శనంతో కూడిన సంస్కారవంతమైన
జీవితాన్ననుభవించగలం.
బ్రతికి ఉన్నంతకాలం సముచితాలోచనలు
చేయవలసినదేనని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
‘ నహికశ్చిత్ క్షణమపి ‘ – అంటే., ఏ ఒక్కరూ ఏ ఒక్క క్షణాన్నీవృధా చెయ్యకుండా సద్భావంతో మెలగాలి. ‘ ఒక్కడూ అందరికోసం – అందరూ ఒక్కడి కోస ‘ మన్న
సహకారాలోచనతో చరించాలి. భారతీయ
సిద్ధాంతాలలో మన గ్రంథాలను పరిశీలించినపుడు జీవితం చివరి క్షణం వరకు చైతన్య
పూరితమైన ఆలోచనలతో కర్తవ్య నిర్వహణ చేసిన శక్తిమంతులే కనిపిస్తారు. విచక్షణతో కూడిన ఆలోచనలు చేసిన జ్ఞానవంతులు
దర్శనమిస్తారు.
సత్యం,
ధర్మం,దయ, ప్రేమ,
సదాచారం, సుహృద్భావాలకు ప్రతీకగా వర్తించిన ఆ మహానుభావుల
ఆలోచనాక్రమాన్ని గ్రహించి కలిగే ఆలోచనలను సన్మార్గంలో మళ్ళించి అందరూ ప్రశంసించే
విధంగా స్థిరపడాలి.
“ అమృతమయమగు చింతన నరయుచుండి
పరిమళభరిత బుద్ధితో వఱలు
నీకు
సతతము విజయమే గూడి సాతమమరు
కనుక మంచిని యోచించ కదులు
మోయి “
చాలా బావుంది. తప్పక ఆచరించవలసిన సందేశం.
రిప్లయితొలగించండిసముచిత ఆలోచన బాగుంది అన్నయ్యా. ఆచరించాలి.
రిప్లయితొలగించండి