శ్రీమహాభారతంలోని సభాపర్వం నుండి శబ్దగుణ మాధుర్యం గల ఓ చక్కని పద్యం:
“ ఇచ్చకు వచ్చు పూజనల నెంతయు సంతసమంది తొల్లి నా
కిచ్చె మునీశ్వరుండు దయ నిత్తనయున్; మఱి యిప్డు నెమ్మితో
నిచ్చితివీవు రాక్షసివె! యిక్కుల మెల్లను నుద్ధరింపగా
వచ్చిన పుణ్యదేవతవు వారిరుహాయత చారులోచనా! “
ఈ పద్యానికి భావం ఏమిటంటే, పద్మాలవంటి విశాలమైన అందమైన కళ్ళుకలదానా! పూర్వం చండకౌశిక మహర్షిని పూజిస్తే ఈ పుత్రుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ప్రేమతో నీవిచ్చావు. నీవు రాక్షసివా?నా వంశాన్ని ఉద్ధరించటానికి వచ్చిన పుణ్యదేవతవు.
మనం ఇక్కడి కథను పూర్తిగా తెలుసుకుంటేగాని, మనకు ఈ పద్య సందర్భం అర్థం కాదు. ఎవరు ఎవరితో ఇలా పలికారో గ్రహిద్దాం.
ఇది ‘ జరాసంధుని ‘ జననక్రమం కు సంబంధించింది.
మహాసమర్థుడైన మగధరాజు బృహద్రథుడు కాశీరాజుకు గల అందమైన ఇద్దరి కుమార్తెలను వివాహమాడాడు. అమిత ప్రీతితో ఆ ఇద్దరితో అనేక సంభోగ సుఖాలు అనుభవించాడు. సంతాన కాంక్షతో దేవ బ్రాహ్మణ ముని పూజలు చేశాడు. శాస్త్ర నియమానుసారం పుత్రకామేష్టి యాగాలు, పెక్కు పుణ్యకార్యాలు చేశాడు. అయినా పుత్రుల్ని పొందలేక జీవితంలో విసిగిపోయాడు.
పుత్రులు లేని సంపదలు ఎందుకని నిరాశచెంది, భార్యలిద్దరితో కలిసి బృహద్రథుడు అడవికి వెళ్ళి, అక్కడ మహా తేజస్సుతో ఎడతెగని తపస్సు చేస్తున్న చండకౌశిక మహర్షిని చూచి నియమ నిష్ఠలతో, ఎనలేని భక్తితో సేవించాడు. అతని సేవలకు మెచ్చిన ఆ మహర్షి ‘ నీకేమి కావాలో కోరుకో ’మనగా బృహద్రథుడు శిరసు వంచి ఇలా అన్నాడు. ‘ ఓ
మునిశ్రేష్ఠా! నాకు అంతులేని సుఖసంపదలున్నాయి. కాని, అందుకు తగ్గట్లు సంతానం లేదు. అందుచేత ఆ భోగభాగ్యాలన్నిటినీ వదలి నిశ్చింతగా స్థిరబుద్ధితో తపస్సు చెయ్యాలని వచ్చాను. మీ అనుగ్రహం చేత నాకు పుత్రోదయమైతే నా కోరిక తీరుతుం ‘దని అతడు అనగానే, దయతో ఆ మునిశ్రేష్ఠుడైన చండకౌశికుడు ఒక మామిడిపండును మంత్రించి బృహద్రథ మహారాజుకిచ్చి దీనివల్ల నీకొక కొడుకు జన్మిస్తాడని చెప్పాడు. బృహద్రథుని కోరిక తీరింది. ఆయన తన రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ పండును భార్య లిద్దరకీ సమానంగా పంచి యిచ్చాడు. ఆ పండుతిన్న భార్య లిద్దరూ గర్భవతులయ్యారు. పదినెలల తర్వాత ఒకనాటి రాత్రి యిద్దరికి, ఒక కన్ను, ఒక చెవి, ఒక చెంప, ఒక చన్ను, సగం బొడ్డు, ఒక భుజం, ఒక చెయ్యి, ఒక ప్రక్క భాగం, ఒక తొడ, ఒక కాలు ఉన్న మానవ శరీరపు సగభాగం ముక్కలు ఆశ్చర్యకరంగా ఆ యిద్దరికీ జన్మించాయి. ఆ మానవాకారపు ముక్కల్ని చూసి, బృహద్రథుని భార్య లిద్దరుభయపడ్డారు. ఈ ముక్కలుగా పుట్టిన వాణ్ణి ప్రియమార పుత్రుడని మహారాజుకి ఎలా చూపించాలా? అని సిగ్గు పడ్డారు. ఎవరికీ తెలియకుండా ఈ ముక్కల్ని బయట పారేసిరండనిబృహద్రథుని భార్యలుపనికత్తెల్ని పంపారు. పనికత్తెలు ఆ రెండు ముక్కల్నితీసుకుపోయి రాజభవనం వెలుపలి వాకిలి సమీపంలోనాలుగు త్రోవలు కలిసేచోట ఒకవైపు వేసి వచ్చారు.అక్కడ ఉండేజర అనే రాక్షసి ఆ ముక్కలను చూసి, బలి యిచ్చిన ప్రాణి శరీరపు ముక్కలని అనుకొని పరుగెత్తి వచ్చింది.ఆ రాక్షసి తానెత్తుకు వెళ్ళటానికి అనుకూలంగా, కదులుతున్న ఆ రెండు ముక్కల్నికలిపి గట్టిగా పట్టుకున్నది. అవి ఒకదానిలో ఒకటిచక్కగా అతుక్కొని రెండూకలిసి ఒక వ్యక్తిగా రూపొందాయి. ఆ రాక్షసి ఎత్తుకోవటానికి బరువై, వజ్రం లాంటి కఠినమైన శరీరంతోప్రకాశిస్తున్న ఆ బాలుడు పెద్దశబ్దంతో ఏడ్చాడు. ఆ ఏడ్పు విన్న జరకు అతణ్ణి ఎత్తుకుపోవటానికిచేతులాడలేదు.
ఆ బాలుడి ఏడుపు శబ్దం విని అంత:పురంలో ఉండే వృద్ధ స్త్రీలందరూ పరుగెత్తుకొని వచ్చారు. మహదానంతో ఆ బాలకుణ్ణి ఎత్తుకున్నారు. వాళ్ళ వేగిరపాటునిచూచి బృహద్రథుడుకూడా వచ్చాడు.ఎంతో కాంతితో ప్రకాశిస్తూ,రాగివలెఎర్రగా ఉండేలేత పిడికిలినితన పద్మంవంటి ముఖంపై పెట్టుకొని దిక్కులు పిక్కటిల్లేటట్లు ఏడుస్తున్న తన పుత్రుణ్ణి చూచి మహదానంద భరితుడయ్యాడు. ఆ రాక్షసి కోరుకున్న రూపాన్ని ధరించే శక్తి ఉంది కనుక అప్పుడు మానవకాంత రూపం ధరించి ఆ మగధరాజైన బృహద్రథునితో ఇలా అన్నది. ' నీ భార్య లిద్దరికీ పుట్టిన ఈ మానవ దేహపు ముక్కలు రెండింటిని నీ పనికత్తెలు తెచ్చి ఈ నాలుగుత్రోవల కూడలిలో పారేసి వెళ్ళారు.నేను ఆ ముక్కల్ని కలిపి పట్టుకోగా వజ్రంలా కఠినమైన దేహంతో ఈ బాలుడు రూపొందాడు. మేరుపర్వత శిఖరం వలె ఎత్తుకొనటానికి సాధ్యంకాని వాడయ్యాడు. ఈ బాలుణ్ణి ప్రేమతోనీవు అంగీకరించు ‘ అని ఆ రాక్షసి అనగానే బృహద్రథుడు సంతోషంతో అనిన మాటలనే నన్నయ్య గారు పైపద్యంలో ఉటంకించారు.
( బృహద్రథుడు ఆ బాలుడికి జరచేత ఒకటిగా కలుపబడినవాడు కనుక ‘ జరాసంధుడు ‘ అని పేరు పెట్టాడు. రాక్షసియైన జరకు ప్రతి సంవత్సరం పండుగ జరిపిస్తూ పుత్రుణ్ణి ఎంతో ప్రేమతోపెంచాడు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి