25, అక్టోబర్ 2023, బుధవారం

 :: సూక్తిముక్తావళి :: 


శ్లో. శత్రో రపి గుణా వాచ్యా, దోషా వాచ్యా గురో రపి,

        సర్వదా సర్వయత్నేన, పుత్రే శిష్యవ దాచరేత్.   

భావము: శత్రువులందున్నను సుగుణములు ప్రశంసించవలెను. గురువులయందున్నను దోషములు చూపవలసినదే. కుమారుని యెప్పుడును, సర్వవిధములలోను శిష్యునివలెనే చూడవలెను.

పద్యము:

చకోర ( భభ భభ భభ భ గల – 13 )

    వైరులలో గల మంచి గుణమ్ముల పట్లను గౌరవముంచి చరించు,

    తీరుగ దేశికులందు వసించుచు దిర్గెడి లోటులు వారికి దెల్పు,

    ఔరసుడైనను సర్వవిధమ్ముల నాదృతితోగొను శిష్యుని రీతి

    క్రూరమనస్కుల దుష్టుల చేరువ కూడకు వారల చేరగనీకు.

10. శ్లో. లభ్యతే ఖలు పాపీయాన్, నరో సుప్రియవాగిహ,

          అప్రియస్య చ పథ్యస్య, వక్తా శ్రోతా చ దుర్లభ:.

భావము: తీయని మాటలచే మోసపుచ్చు పాపులు యీ లోకంలో సర్వత్రా ఉన్నారు. కాని, కటువైననూ పథ్యముగా నుండే మాటలు చెప్పువారూ, వినువారూ కూడ లోకమున అరుదుగనే ఉంటారు గదా!

పద్యము:

హీరకహారధరం ( భభ భభ భభ – 13 )

     తీయని మాటలు గొప్పగ జెప్పుచు దిర్గెడి మ్రుచ్చులు

     మాయల చేయగ నుండిరి హెచ్చుగ, మంచిని దెల్పుచు

     శ్రేయమొసంగెడు మేలగు పల్కులు చిక్కనివైనను

     హాయిగ జెప్పెడివారు గ్రహించెడు నార్యులు లేరిల.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...