:: వెయ్యివిఘ్నాలు ::
ఒకనాడు నారదుడు కైలాసానికి వెడుతున్న దారిలో కంటకముఖి అనే ఒక యక్షిణి పరిహాసంగా " నన్ను పెళ్ళాడవయ్యా నారదా! బ్రహ్మచెర తప్పించుకోవయ్యా బ్రహ్మకొడుకా! " అని అన్నది
నారదుడు " నేను కలహభోజనుడను. కలహం వండి పెట్టగలిగింది దొరకాలిగదా! " అన్నాడు.
" నేను నీకంటే జగడాలమారిని " అంది యక్షిణి.
ఆ సమయంలో విఘ్నేశ్వరుడూ, కుమారస్వామీ చెట్టాపట్టాలేసుకొని వస్తున్నారు. నారదుడు " ఆ వస్తున్న అన్నదమ్ములమధ్య జగడం తేగలవా? " అన్నాడు.
" ఓష్! అదెంత! " అని కంటకముఖి పక్కనున్న దళసరోవరంలోకి దూకి బంగారు తామరపువ్వుగా మారి, " పార్వతీపరమేశ్వరుల సుపుత్రుడి కోసం వికసించాను " అంటూ కిన్నర మీటుతున్నట్లు పాట మొదలుపెట్టింది. అన్నదమ్ములిద్దరూ దాన్ని పట్టుకొని నాది, నాది అని వాదులాడుతూ " అమ్మ చేసిన బొమ్మవు నీవు, మురికి ముద్దవు " అని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి ఆక్షేపిస్తే, " నువ్వు మురికిగుంట శరవణ సరస్సులోంచి వచ్చావు " అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు.
కుమారస్వామి పిడికిలి బిగించి పొడవబోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో అతని చేతి మణికట్టు బిగించాడు. ఇద్దరూ కలబడ్డారు. వినాయకుడు కుమారస్వామి నడుము తొండంతో బిగించి పైకెత్తాడు. కుమారస్వామి పైనుంచి బళ్ళాన్ని విఘ్నేశ్వరుడి బొజ్జకు గురిపెట్టాడు.
నారదుడు పరుగు పరుగున వచ్చి వారి కలహాన్ని నివారించి " మీరిద్దరూ ఏదైనా పందెం పెట్టుకోండి " అన్నాడు.
కుమారస్వామి ఆలోచించి " ఎవరు విశ్వాన్ని చుట్టి ముందువస్తే వారిదీ స్వర్ణకమలం " అన్నాడు.
" బాగుంది " అన్నాడు నారదుడు.
కుమారస్వామి వెంటనే నెమలిమీద విశ్వప్రదక్షిణానికి ఎగిరి వెళ్ళాడు.
విఘ్నేశ్వరుడు చతికిలబడి నిట్టూర్చగా, నారదుడు " ఏం విఘ్నేశా! నీ సంగతేమిటి? " అన్నాడు.
విఘ్నేశ్వరుడు " ఎవరికెంత ప్రాప్తో అంతేకాని, స్వర్ణకమలం నాకు రమ్మంటే వస్తుందా? నారదా! నా బొజ్జతో, చిట్టెలుక వాహనంతో నేనెక్కడ? విశ్వప్రదక్షణ ఎక్కడ? తమ్ముణ్ణే తీసుకోనీ కమలం " అన్నాడు.
నారదుడు " విఘ్నపతీ! విశ్వ జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులను దర్శిద్దామని వచ్చాను గానీ మళ్ళీ వస్తాను. అని చెప్పి వెళ్ళాడు.
విఘ్నేశ్వరుడు చప్పున లేచివెళ్ళి, ఒక తిన్నెపై కూర్చున్న పార్వతీశివుల చుట్టూరా ముమ్మారు ప్రదక్డణచుట్టి తమ్ముడి రాకకు ఎదురుచూస్తూ నిలబడ్డాడు.
చాలాసేపటికి ముప్పుతిప్పలుపడి విశ్వప్రదక్షణం చేసిన కుమారస్వామి నెమలివాహనం దిగాడు. విఘ్నేశ్వరుడు తమ్ముణ్ణి కౌగలించుకొని, " తమ్ముడా! పాపం చాలా శ్రమపడి విశ్వం చుట్టి వచ్చావు. స్వర్ణకమలం నువ్వే వెళ్ళి తీసుకో. గెలవడం నేనే గెల్చాను గాని, నాకది అక్కర్లేదులే! " అన్నాడు.
కుమారస్వామి నివ్వెరబోతూ, " అదెలాగా? " అన్నాడు.
" నీకంటే ముందు నేనే ముమ్మారు విశ్వ ప్రదక్షణ చేసి నిలబడ్డాను. ఎవరి నడుగుతావో అడుగు " అన్నాడు విఘ్నేశ్వరుడు.
" విఘ్నేశ్వరుడే గెల్చాడు " అని ఆకాశవాణి ముమ్మారు పలికింది.
కుమారస్వామి నిజం తెలుసుకొని వినాయకుడి ముందు మోకరిల్లి, " అన్నా! నేను పెద్ద తపస్సుచేసి బ్రహ్మజ్ఞానం పొందానేగానీ, చిన్న విషయంలో అజ్ఞానంలోనే పడ్డాను. నువ్వు కుశాగ్రబుద్ధివి. నీముందు నేనెంత? నీ తరువాత వాణ్ణే గదా! తారకాసురుడుపై యుద్ధానికి వెడుతున్నాను. నన్ను ఆశీర్వదించు " అన్నాడు.
విఘ్నేశ్వరుడు కుమారస్వామిని లేవదీసి " తమ్ముడూ! నేను పెద్ద అనీ, నీవు చిన్న అనీ అనుకోవద్దు. నీవు కారణ జన్ముడవు. నీవు అన్నట్లుగా అమ్మ ఏదో ఆటగా చేసిన బొమ్మనే నేను. నీ కోసమే పార్వతీశివుల కళ్యాణం జరిగింది. వారి అనురాగ ఫలానివి. నీకు విజయం ఎప్పుడో రాసిపెట్టే ఉంది. తారకాసురుడు నీచేతనే చావాలని వరం కోరుకున్నాడు. నీవు సుబ్రహ్మణ్యేశ్వరుడవు. నాకు అన్నిచోట్లా మామూలు గుళ్ళు ఉంటాయిగాని, నీకు కొన్ని ప్రాంతాల్లో గొప్ప క్షేత్రాలు, పెద్దపెద్ద ఆలయాలు, గోపురాలు ఉంటాయి. ప్రముఖ దైవమూర్తిగా ఆరాధింపబడతావు. శీఘ్రంగా వెళ్ళి తారకాసురుడి బెడద వదిలించు " అన్నాడు.
యక్షుల అధిపతి కుబేరుడు కంటకముఖిని పట్టి తెప్పించి " ఓసీ! మాయలమారి పాపిష్ఠిదానా! శివుడి కుమారులకే కలహం పెట్టావు. పల్లేరువై పడియుండు " అని శపించాడు.
కంటకముఖి ప్రాధేయపడగా, విఘ్నేశ్వరుడి అనుగ్రహంవల్లనే శాపం తొలగుతుంది. అని చెప్పాడు కుబేరుడు. కంటకముఖి పల్లేరు ముళ్ళడొంకగా భూమ్మీద మొలిచింది.
కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై తారకాసుర నిర్మూలన చేశాడు. అతనికి దేవేంద్రుని కూతురు దేవయానను యిచ్చి వివాహం జరిపించడానికి సర్వ సన్నాహాలు చేయబడ్డాయి గాని, అన్నకు కానిదే తమ్మునికెలాగ చేయడం అన్నారు.
పార్వతి విఘ్నేశ్వరుడితో " ప్రియనందనా! తమ్ముడి పెళ్ళి జరగాలంటే, నువ్వు పెళ్ళిచేసుకోవడం నీ ధర్మం " అన్నది.
" ఎందుకమ్మా! ఇలాంటి అర్థంలేని నియమాలు? ఎవరి యిష్ఠానుసారం వారు చేసుకోకుండా తోక తెగిన నక్క సామెతగా నాలాంటి ఏకదంతుల్ని రొంపిలోకి దింపటం మంచిది అనిపించుకోదు " అన్నాడు విఘ్నేశ్వరుడు తొలివిఘ్నంగా.
విఘ్నేశ్వరుడు ఇలా ఎన్నో సాకులూ, విఘ్నాలు కల్పించుకుంటూ వచ్చాడు.
ఒకసారి చాలా పట్టుదలతో పార్వతి పెళ్ళిచేసుకోమని తొందరపెట్టింది. " అమ్మా! నేను తపస్సు చెయ్యాలి. తమ్ముడు చేశాడుగాని నేను చేయలేదుగా " అని విఘ్నేశ్వరుడు తపస్సుకు బయలుదేరాడు.
ఇంద్రుడు అప్సరసలందర్నీ విఘ్నేశ్వరుడి తపోభంగం చేయండని పంపాడు. అర్క అనే అప్సరస నిరాకరించింది. ఇంద్రుడు " నువ్వు మాలకాకివి. అంటరాని జిల్లేడువై భూమ్మీద మొలు " అని శపించాడు.
విఘ్నేశ్వరుడు తపస్సు చేయడానికి అనువైన చోటు వెతికివెతికి ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశంలో పల్లేరు డొంకలు నేలంతా విస్తరించి ఉన్నాయి. జిల్లేడు పొదలు మొగ్గలు నిండుగా తొడిగి విచ్చుకుంటూ ఉన్నాయి. విఘ్నేశ్వరుడు తపస్సు సాగిస్తున్నాడు. అప్సరసలు అక్కడకు చేరి నాట్యం మొదలుపెట్టారు. వాళ్ళ కాళ్ళకు పల్లేరుకాయముళ్ళు గుచ్చుకొని పడిపోతూంటే ఒంటినిండా పల్లేరుముళ్ళు గుచ్చుకుంటూంటే మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు. విఘ్నేశ్వరుడికి ధ్యానభంగమై జరిగింది చూశాడు. పల్లేరుతీగపట్ల అభిమానం కలిగింది. అప్సరసలు భయంతో పడుతూలేస్తూ కుంటుకుంటూ పారిపోయారు. పల్లేరుగా మొలచిన యక్షిణి కంటకముఖి " స్వామీ! మీ అన్నదమ్ములకు తగువుపెట్టి కుబేరుడి శాపం పొంది ఇలా పడి ఉన్నాను. అనుగ్రహించు " అని వేడుకుంది.
ఆరోజు సరిగా భాద్రపద శుక్లచవితి. వినాయకచవితి రోజే. విఘ్నేశ్వరుడు కంటకముఖి శాపం తొలగించి " వినాయక చవితినాడు నీ పల్లేరుముళ్ళ కాయలను వికట వినోదంగా ఉపయోగిస్తారులే " అని చెప్పాడు.
యక్షిణి అలకాపురి చేరుకుంది. అప్పుడు జిల్లేడు " స్వామీ! నన్నుగూడా అనుగ్రహించండి. ఇంద్రుడి ఆజ్ఞ నిరాకరించి శాపం పొంది అంటరాని దానిగా ఇలాపడి ఉన్నాను. నేనెందుకూ కొరగాని దాన్ని. అర్క అనే అప్సరసను. నీయందు భక్తి శ్రద్ధలు గలదాన్ని " అంది.
విఘ్నేశ్వరుడు జిల్లేడుతో " అంటరానితనం అంటూ ఏదీ సృష్టిలో లేదు. నీ మొగ్గల్ని, పువ్వుల్ని నేను ప్రీతితో మాలగా ధరిస్తాను. నీవు ద్వాపరయుగంలో కుబ్జవై పుడతావు. కృష్ణుడు నిన్ను ఏలుకుంటాడు. నీ శాపం పోయింది. సుఖంగా స్వర్గం వెళ్ళు. ఇంద్రుడి వల్లగాని, మరెవ్వరి వల్లగాని నీకెటువంటి భయమూ ఉండదు. ఏ శాపమూ తగులదు. జిల్లేడు వ్రేళ్ళు ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగపడతాయి. జిల్లేడు ఆకులు సూర్యుడికి ప్రీతిగా ఉంటాయి " అని చెప్పాడు.
అర్క అప్సరస రూపంలో స్వర్గాన్ని చేరుకుంది.
విఘ్నేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు. " నాయనా! తపస్సు ముగిసిందికదా! " మరి పెళ్ళి .... అని పార్వతి అంటూండగా " ముగియడమేమిటి? అసలు జరుగనే లేదు. తిరిగి తపస్సు కెడుతున్నా! " అని చెప్పి విఘ్నేశ్వరుడు మరోచోటు ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశమంతా పాములపుట్టల మయంగా ఉంది. చుట్టూ వలయంగా పుట్టలున్నట్టు చూసుకొని తపస్సు మొదలుపెట్టాడు. పుట్టల్లోంచి పాములు నిటారుగాలేచి పడగలువిప్పి బుసలుకొడుతూ కాపలా కాయసాగాయి. ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు " మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్నందరినీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు. పగతీర్చుకోండి " అని కబురుపెట్టి ఉసిగొల్పాడు.
రాక్షసులు వినాయకుడిమీద దాడి చేయగా మహాసర్పాలు పాతాళంనుంచి కట్టలుగావచ్చి వాళ్ళ పొగరు అణచాయి. చచ్చినవాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు తమ తెలివితక్కువను నిందించుకుంటూ ఇంద్రుణ్ణి తిడుతూ అక్కడినుంచి పారిపోయారు.
ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని, వారితో అప్సరసలను కలిపి పంపుతూ " విఘ్నేశ్వరుడికి రాగోదయం కలిగేలా మీ ప్రతాపం చూపండి " అని ఆజ్ఞాపించాడు. వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టి వెళ్ళాడు.
దేవతలు అప్సరసలతో జంటజంటలుగా సుర సేవిస్తూ కోలాహలం చేస్తూ ఆటాపాటా మొదలుపెట్టారు. నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్ళను చుట్టుకొని కోరలతో కాట్లు వేయసాగాయి. ఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని ఝళిపించాడు. నాగులకోపం రెచ్చిపోయింది. నాగలోకం నుంచి బిలబిలమని మహాసర్పాలన్ని వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమాయి. దేవతలకు నాగులకూ చిన్న యుద్ధం లాంటిది జరిగింది. ఇంద్రుడి వజ్రాయుధాన్నే లక్ష్యపెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పుట్టించి మరీ వెళ్ళాయి. విఘ్నేశ్వరుడు నాగుల సహాయానికి సంతసించి పాములను ఎత్తుకొని ముద్దాడి అలంకారాల్లా మీద వేసుకొని కైలాసానికి వెళ్ళాడు.
పార్వతి అతని పాములవాడి వాలకం చూసి నివ్వెరపోయింది. " అమ్మా! తండ్రి సొత్తు తనయుడికి సంక్రమించడం సహజమైనదే కదా! శంకరాభరణాలు నాకూ భూషణాలే. అదీగాక పాములు నాకు ప్రాణ మిత్రులై ప్రాణాలకు తెగించి కాపుకాసాయి. ఆప్తమిత్రుల అండదండలే కదా నిజమైన దండకడియాలూ, అమూల్యాభరణాలూనూ! అందుకే నాగభూషణుడు అనిపించుకున్నాను " అని విఘ్నేశ్వరుడు చెప్పాడు.
శివుడు చిరునవ్వులు ఒలికించాడు. పార్వతి వినాయకుడి వింత చేష్ఠకు విసుక్కుంది. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలు తెచ్చిపెట్టుకుంటూ వచ్చాడు.
పార్వతి మళ్ళీ మరొకసారి బలవంతపెట్టింది. " అమ్మా! ఏదైనా ఘనకార్యం చేస్తేనేగదా సమర్థుడని పించుకుంటారు. నేనేదైనా చేసి తమ్ముడిలాగా ఘనుడిననిపించుకోనిదే ఎలాగ పెళ్ళి చేసుకోమంటావు? " అన్నాడు విఘ్నేశ్వరుడు.
" నీకేం తక్కువ నాయనా? సమర్థుడివి కాక వాజమ్మవా ఏమిటి " అంది పార్వతి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి