24, ఫిబ్రవరి 2026, మంగళవారం

:: రంతిదేవుడు ::  


దేవుడిని గుడిలో వెతకడం భక్తి. కానీ, ఆకలితో ఉన్న ప్రాణిలో దేవుడిని చూడగలగడం ' భాగవతం ' . రాజ్యాలను దానం చేసిన రాజులున్నారు, కానీ తన ప్రాణధార అయిన గుక్కెడు నీటిని కూడా దానం చేసిన మహానుభావుడు రంతిదేవుడు. ఆయన కథే నేటి మన భాగవతసుధ. 

రంతిదేవుడు ఒక గొప్ప చక్రవర్తి. ఆయనకు ఉన్నదంతా దానం చేసి, చివరకు తనూ తన కుటుంబం అడవిబాట పడతారు. విధి వైపరీత్యం వల్ల వరుసగా నలభై ఎనిమిది రోజులు వారికి కనీసం తిండి, నీరు కూడా దొరకవు. ఆకలితో శరీరం శుష్కించిపోయింది. గొంతు ఎండిపోయింది. ప్రాణాలు పోయే స్థితికి చేరుకున్నారు. సరిగ్గా నలభై తొమ్మిదవ రోజు ఉదయం ఎవరో పుణ్యాత్ములు కొంచెం నెయ్యి వేసిన అన్నం, పాయసం, మరికొంత నీరు తెచ్చి ఇస్తారు.  ఆకలితో అలమటిస్తున్న రంతిదేవుడు  భోజనం చేయబోతూండగా, ఒక బ్రాహ్మణుడు వచ్చి  " అయ్యా! ఆకలిగా ఉంది అన్నం పెట్టండి " అంటాడు. రంతిదేవుడు భక్తితో ఆ అన్నాన్ని ఆయనకు వడ్డిస్తాడు. 

మిగిలిన పాయసాన్ని తినబోతూండగా, ఒక శూద్రుడు వచ్చి తన ఆకలి తీర్చమంటాడు. రంతిదేవుడు చిరునవ్వుతో ఆ పాయసాన్ని కూడా ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గర కేవలం గుక్కెడు నీరు మాత్రమే ఉంది. ఆ నీరు త్రాగితేనే ఆయన ప్రాణం నిలుస్తుంది. అప్పుడు ఒక వేటగాడు తన వేట కుక్కలతో వచ్చి, " మహాప్రభూ! నా కుక్కలు దాహంతో చనిపోయేలా ఉన్నాయి, కాస్త నీటిని యిప్పించండి " అని వేడుకుంటాడు. 

ఆ క్షణంలో రంతిదేవుడు కండ్లలో నీరు తిరుగుతుంది. కానీ, ఆయన స్వార్థం కోసం కాకుండా ఇలా ప్రార్థిస్తాడు:  " న కామయేయహం  - గతిమీశ్వరాత్పరాం ; అష్టర్థియుక్తామ పునర్భవం వా - ఆర్తిం ప్రపద్యేఖిల దేహభాజా - మంతస్థితే యేన భవంత్య దు:ఖా: "  స్వామీ! నాకు అష్టసిద్ధులు వద్దు. మోక్షం కూడా వద్దు. ప్రాణులన్నింటి హృదయాలలో నేను ఉండి, వారు పడే బాధలన్నీ నేనే అనుభవించాలి. తద్వారా వారు సుఖంగా ఉంటే చాలు " అంటూ ఆ నీటిని ఆ కుక్కల దాహం తీర్చడానికి ఇచ్చేస్తాడు. 

ఆ త్యాగానికి ముగ్ధులై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. రంతిదేవుడిని పరీక్షిస్తున్నది వారేనని తెలుస్తుంది. 

తన ఆకలికంటే ఎదుటివారి ఆకలిని గుర్తించే హృదయమే భగవంతుడికి ఇష్టమైన నివాసం. మీరు కూడా ఇతరులకు సాయం చేసేటప్పుడు ఆ రంతిదేవుడిని స్మరించుకోండి. మీ జీవితం ధన్యమవుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...