10, మార్చి 2026, మంగళవారం

 

    :: ఆపద్బాంధవుడు - అచ్యుతుడు ::

    శ్రీమద్భాగవత పురాణంలోని అష్టమ స్కంధంలో వచ్చే 'గజేంద్ర మోక్షం' భక్తికి, శరణాగతికి పరాకాష్ట. గజేంద్రుడు కేవలం ఒక ఏనుగు కాదు, సంసార సాగరంలో చిక్కుకున్న జీవుడికి ప్రతీక.

    త్రికూట పర్వత ప్రాంతంలోని ఒక సరస్సులో గజేంద్రుడు తన పరివారంతో విహరిస్తూ ఉంటాడు. తన బలం పట్ల, తన కుటుంబం పట్ల ఎంతో గర్వంగా ఉన్న ఆ ఏనుగు కాలును ఒక మొసలి పట్టుకుంటుంది. ఆ పోరాటం సామాన్యమైనది కాదు.. ఏకంగా వెయ్యి సంవత్సరాల పాటు సాగుతుంది.

    మొదటి దశలో గజేంద్రుడు తన సొంత బలాన్ని నమ్మి పోరాడాడు.రెండవ దశలో తన బంధువులు, భార్యలు తనను రక్షిస్తారని ఆశించాడు. కానీ కాలక్రమేణా గజేంద్రుని బలం క్షీణించింది, అతనికి సాయం చేయలేక బంధువులు వెనుదిరిగారు.

    సరిగ్గా అప్పుడే గజేంద్రుడికి జ్ఞానోదయం కలిగింది. భౌతికమైన బంధాలు, శారీరక బలం తనను కాపాడలేవని గ్రహించి, ఆదిమూలమైన ఆ పరమాత్మను తలుచుకున్నాడు.

    లావొక్కింతయు లేదు, ధైర్యంబు విలోలంబయ్యె బ్రాణంబులున్

    ఠావుల్దప్పెను మూర్చవచ్చె దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

    నీవేతప్ప నిత: పరంబెఱుగ మన్నింపన్ దగున్ దీనునిన్

    రావే యీశ్వర! కావవే వరద సంరక్షింపు.భద్రాత్మకా!

    -.అంటూ గజేంద్రుడు దీనంగా ప్రార్థించాడు. ఆ పిలుపు ఎంత శక్తివంతమైనదంటే, వైకుంఠంలో లక్ష్మీదేవితో సరససల్లాపాల్లో ఉన్న విష్ణుమూర్తి గజరాజు మొర వినగానే, కనీసం తన వస్త్రం సరిచేసుకోకుండా, లక్ష్మీదేవికి చెప్పకుండా, ఆయుధాలు తీసుకోకుండా, గరుత్మంతుడిని కూడా పిలవకుండా పరుగున వచ్చాడు. భక్త పరాధీనుడైన ఆ స్వామి సుదర్శన చక్రాన్ని విడిచి మొసలిని సంహరించి గజేంద్రుడిని రక్షించాడు. అంతేకాదు, హుహూ అనే గంధర్వుడైన ఆ మొసలికి శాప విమోచనం కలిగించాడు.

    మనం కూడా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మన బలాన్ని, సంపదను చూసి గర్విస్తాం. కానీ అసలైన ఆపదలో మనల్ని కాపాడేది కేవలం ఆ 'పరమాత్మ' మాత్రమే. మనం "నేను" అనే అహంకారాన్ని వదిలి, "నీవే దిక్కు" అని శరణు వేడితే, ఆ దేవుడు మన పిలుపుకు పలికి తీరుతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: భూమిని తాకిన నక్షత్రం - లోనార్ సరస్సు ::        నమస్కారం! ప్రకృతి వింతలను వెలికితీసే మన జీవనస్రవంతి ప్రయాణంలో ఈరోజు మనం లక్షల ఏళ్ల నాట...