31, మే 2025, శనివారం

:: ధ్రువోపాఖ్యానము :: 

    స్వాయంభువునకు శతరూప ద్వారా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇరువురు పుత్రులు కలిగారు. ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇరువురు భార్యలు. సునీతి ధ్రువుణ్ణి, సురుచి ఉత్తముణ్ణి కన్నారు. రాజుకి సురుచిపై మక్కువ ఎక్కువ. 

    ఉత్తానపాదు డొకనాడు సురుచి సుతుడగు ఉత్తముణ్ణి తొడలపై ఉంచుకొని లాలిస్తూ ఉన్నాడు. ధ్రువుడు వచ్చి తానూ తండ్రి తొడపై ఎక్కగోరాడు. ప్రక్కనే ఉన్న సురుచి " తండ్రి తొడ ఎక్కాలంటే నీవు నా కడుపున పుట్టి ఉండాలి. ఇతర గర్భజుడవైన నీకు ఆ భాగ్యం ఎక్కడిది? నీవు విష్ణు పాదసేవ చేస్తే ఆ దేవుడు నా గర్భాన పుట్టిస్తాడు " అని తూలనాడింది. 

    తండ్రి వింటూ ఉండగా పినతల్లి అన్న మాటలు వానికి వ్యథ కలిగించాయి. ఏడుస్తూ వాడు తన తల్లి చెంతకు పోయాడు. ఆమె జరిగిన వృత్తాంతం అంత:పురవాసుల ద్వారా విన్నది. " నాయనా! దు:ఖించకు. నా కడుపున పుట్టడం వల్లనే నీకీ అవమానం జరిగింది. తండ్రి తొడ ఎక్కాలనుకుంటే సురుచి చెప్పినట్లు హరి చరణాలను దర్శించు. ఆ దేవుణ్ణి సేవించు " అని ఆమె ఆ బిడ్డకు చెప్పింది. 

    తల్లిమాట విని ధ్రువుడు నగరం వదిలి వెళ్ళాడు. దారిలో నారదుడు అతని వృత్తాంతం తెలిసి అతని చెంతకు వచ్చాడు. సవతితల్లి వాగ్బాణంవల్ల కలిగిన వ్రణాన్ని భగవధ్యాన రసాయనంతో మాపుకుంటానని ధ్రువుడు నారదునితో అన్నాడు. ధ్యాన దీక్షనుండి ఆ బాలుని విరమింప జేయడానికి ఆయన యత్నించాడు. కాని ఆ బాలుడు తన నిశ్చయం నుండి మరలలేదు. 

    అతని పట్టుదలకు సంతసించిన నారదుడతణ్ణి మధువనానికి పోయి ధ్యానం కొనసాగించమని బోధించాడు. " ఓం భగవతే వాసుదేవాయ " అన్న ద్వాదశాక్షరీ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ధ్రువుడు మధువనం చేరుకొన్నాడు. పిదప నారదుడు ఉత్తానపాదుని చెంతకు పోయి పుత్రవియోగంతో దు:ఖిస్తున్న ఆ రాజును ఓదార్చాడు. 

    అక్కడ ధ్రువుడు సర్వేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఫల భక్షణతో మొదటి మాసం, జీర్ణతృణపర్ణాలు ఆహారంగా రెండవ మాసం, జలపానంతో మూడవ మాసం, వాయుభక్షణతో నాల్గవనెల, నిరుచ్ఛ్వాసుడై ఒంటికాలిపై అయిదవ నెల గడిపాడు. 

    అతని దీక్షకు భగవంతుడే కంపించాడు. ప్రాణ నిరోధం పొందిన లోకపాలకులు నారాయణుని శరణు పొందారు. ఆ దేవుడు ధ్రువుని విషయం గ్రహించి అతణ్ణి తపోదీక్ష నుండి మరలించడానికై మధువనానికి వెళ్ళాడు. ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయినాడు. సంతోషాతిశయంవల్ల ధ్రువుడు భగవానుణ్ణి స్తుతించ లేకపోయాడు. దేవుడు తన శంఖంతో అతని కపోలతలం అంటాడు. అప్పుడు ఆ బాలుడు భగవంతుణ్ణి పలువిధాల వినుతించాడు. 

    అందుకు భగవానుడు సంతసించి ఆ బాలునికి " ధ్రువక్షితి " అన్న స్థానం ప్రసాదించాడు. ఆ స్థానం లభించే వరకూ ధర్మబద్ధంగా రాజ్యం పాలించగలవన్నాడు. ఉత్తముడు వేటకు పోయి అడవిలో మరణిస్తాడని చెప్పాడు. వాని తల్లి వానిని అన్వేషిస్తూ పోయి అక్కడ దావాగ్నిలో పడి చనిపోతుందని తెలియజేశాడు. నీవు అనేక యజ్ఞాలు చేసి నన్ను భజించి తుదకు సప్తర్షిమండలోన్నతమైన నా పదవి పొందగలవని చెప్పి గరుడారూఢుడై ధ్రువుడు చూస్తూ ఉండగా వైకుంఠానికి వెళ్ళాడు.

    పిదప ధ్రువుడు భగవదనుగ్రహం పొందినా భగవానుణ్ణి మోక్షం కోరలేకపోయానే అని చింతిస్తూనే తన నగరానికి పయనమయ్యాడు. శ్రీహరి అనుగ్రహం పొంది వస్తున్న కుమారుని వార్తవిని ఉత్తానపాదుడు సపరివారంగా ఆ బాలుని కెదురేగి నగర సమీపంలో అతణ్ణి చూశాడు. రథం దిగి తనయుణ్ణి కౌగలించుకొన్నాడు. ధ్రువుడు తండ్రి ఆశీర్వాదం పొంది ఆయన పాదాలకు నమస్కరించాడు. పిమ్మట తల్లులకు ప్రణమిల్లుతూ సురుచికి మ్రొక్కగా ఆమె అతణ్ణి నగుమోముతో ఆలింగనం చేసుకొని ఆశీర్వదించింది. ఉత్తముడూ, ధ్రువుడూ అన్యోన్యంగా కౌగలించుకొని ఆనందాశ్రువులు కార్చారు. సునీతి కుమారుణ్ణి కౌగలించుకొని దు:ఖరహిత అయింది. పురజనులు ధ్రువుణ్ణి ప్రశంసించారు. 

    ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. ఆపై వనానికి వెళ్ళాడు. ధ్రువుడు " భ్రమి " అనే కన్యను చేపట్టి ఆమె ద్వారా కల్పుడు, వత్సరుడు అన్న ఇరువురు కొడుకులను కన్నాడు. " ఇల " అన్న భార్య ద్వారా ఉత్కలుడనే కొడుకును, ఒక అందమైన కన్యనూ సంతానంగా పొందాడు. 

    పిమ్మట వివాహం లేకుండానే ఉత్తముడు వేటకు వెళ్ళి అక్కడ యక్షునిచే నిహతుడయ్యాడు. అతని తల్లి వనానికి పోయి అక్కడ దావానలంలో దగ్ధురాలయింది. 

    ధ్రువుడు సోదర మరణానికి కోపించి రథమెక్కి అలకాపురికి వెళ్ళాడు. అతని శంఖనాదం విని యక్షభటులతనితో తలపడ్డారు. యుద్ధంలో యక్షులు పరాజితులయ్యారు. ఇంతలో అసురమాయ వ్యాపించి ధ్రువుణ్ణి చీకాకు పరిచింది. అతడు నారాయణాస్త్రం ప్రయోగించి అసురమాయను దూరీకరించాడు. 

    అప్పుడు స్వాయంభువుడు వచ్చి ధ్రువుణ్ణి శాంతింపజేశాడు. ఆపై కుబేరుడు రాగా ధ్రువుడతనికి నమస్కరించాడు. కుబేరుడతనికి స్థిరమైన హరిస్మరణమనే వరం ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. 

    ధ్రువుడు తిరిగి తన నగరం చేరి పలు యజ్ఞాలు చేశాడు. శ్రీహరిని భక్తితో ఆరాధించాడు. ఇరవయ్యారువేల సంవత్సరాలు రాజ్యం పాలించాడు. పిదప కొడుకుకు పట్టంగట్టి తాను విరక్తుడై బదరికా భూమికి వెళ్ళాడు. అక్కడ భగవధ్యానం అనుష్ఠించాడు. అప్పుడొక విమానం అక్కడకు వచ్చింది. అందులో వచ్చిన నందసునందులనే భగవత్కింకరులు ధ్రువుణ్ణి విమానమెక్కించుకొని మాధవపదానికి తీసుకొనిపోయారు. అతని తల్లికూడా అతనికి ముందే విమానమెక్కి వెళ్ళింది. ఇలా ధ్రువుడు హరిపదం పొందాడు. నారదుడు ప్రచేతసుల సత్త్రంలో ధ్రువుని మహిమను కీర్తించాడు. 

24, మే 2025, శనివారం

:: బ్రాహ్మణప్రభావము ::

    పూర్వకాలంలో పరిక్షితుడు అనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. సూర్యవంశజుడైన ఆ రాజు సూర్యుడివలె తేజస్సుతో వెలుగుతూ ఉండేవాడు. అతడు ఒకనాడు గుర్రమెక్కి అడవికి వేటకెళ్ళాడు. అనేక మృగాలను వేటాడాడు. ఒకచోట ఆ మహారాజు ఒక అందగత్తెను చూచి, మదన భావానికి వశుడై ఆమెను సమీపించాడు. ఆమె కూడా అతనిని నర్మగర్భంగా చూచి వలపును ప్రకటించింది. ఆమె తండ్రి ఆజ్ఞ చొప్పున తగిన వరుడి కొరకు అన్వేషిస్తూ ఆ అడవిలో నడయాడుతున్నదని తెలిసికొని ఆమెపై గల తన వలపును తెలియబరిచాడు. ఆమె అతడిని వివాహమాడటానికి అంగీకరించింది. కాని, ఆమెను ఎప్పుడూ జలవిహారానికి వినియోగించకూడదని కట్టడి చేసింది. అతడు ఆ నియమానికి కట్టుబడి ఆమెను రాజదానికి తనతో తీసికొనిపోయాడు. అక్కడ క్రీడాభవనాలలో, ఉద్యానవనాలలో ఆమెతో రమిస్తూ విహరించాడు. ఒకనాడు విలాసభవనం నుండి వెలువడిన పరిక్షితుడి శరీరం చెమటతో తడిసింది. అందువలన సమీప సరోవరంలో స్నానం చేయాలని అనుకున్నాడు. తన ప్రియురాలిని కూడా రమ్మని, సరోవరంలో దిగి జలకాలాడుమని పిలిచాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఆ కొలనులో దిగి వెంటనే అదృశ్యమైపోయింది.

    రాజు అందుకు ఆశ్చర్యపడిపోయాడు. ఆ కొలనంతా ప్రియురాలికోసం గాలించాడు. నీరంతటనీ తోడి బైటపోయించాడు. అయినా, ఆమె కనబడలేదు. కాని, అడుగున ఎన్నో కప్పలు ఉండటం గమనించాడు. అవే తన ప్రియురాలిని మ్రింగి ఉంటాయని భావించి ఆగ్రహించి, తన రాజ్యంలో ఉన్న కప్పలన్నింటినీ వెదకి వెదకి చంపటానికి భటులను ఆజ్ఞాపించాడు. వారు నీటిపట్టులన్నింటినీ గాలించి కప్పలను చంపి కుప్పలుగా పోయ నారంభించారు. 

    దానిని గమనించి కప్పల రేడు ఒక మహర్షి రూపం ధరించి పరిక్షితుడు వద్దకు వచ్చి అతడి కప్పలమీది ద్వేషానికి కారణమడిగాడు. తన ప్రేయసికి చేసిన అపకారానికి ప్రతిగా కప్పలను చంపుతున్నానని ఆ రాజు చెప్పాడు. ఆమాటలు విని మునివేషం వదలి కప్పలనాయకుడైన ఆయువు నిజరూపంలో కనబడి, పరిక్షితుని ప్రేమించిన కన్య తన కూతురనీ, ఆమె పేరు సుశోభన అనీ ప్రకటించాడు. ఆమె తన వలపుతో అంతకుముందే ఎందరినో మోసగించిందని చెప్పాడు. రాజు కోరికపై ఆమెను నిజరూపంతో అతడికి అప్పగించాడు. ఆమె రాజులను చులకనగా భావించి మోసగించింది కాబట్టి ఆమెకు పుట్టే కొడుకులు మోసగాండ్రు అవుతారని శపించాడు. ఆయువు కూతురుకు హితవు చెప్పి వెళ్ళిపోయాడు. పరిక్షితుడు సుశోభనయందు శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులను పడశాడు. వారిలో పెద్దవాడైన శలుడికి పట్టంకట్టి తపోవనానికి వెళ్ళిపోయాడు. 

    ఒకనాడు శలుడు బంగారు తేరుమీద అడవికి వేటకు వెళ్ళాడు. ఎన్నో మృగాలను సంహరించాడు. ఒక మృగాన్ని వాడియైన బాణంతో కొట్టాడు. గ్రుచ్చుకొన్న బాణంతో ఆ లేడి తప్పించుకొని పారిపోసాగింది. దాని వెంట రథాన్ని పరిగెత్తించాడు. కాని, ఆ రథాశ్వాలు అంత వేగంగా రథాన్ని లాగలేకపోయాయి. రథసారథి కామ్యజాతి గుర్రాలయితే రథాన్ని అద్భుత వేగంతో లాగగలవని రాజుకు విన్నవించుకున్నాడు. కామ్యహయాలు వామదేవుడనే మహర్షివద్ద ఉంటాయని తెలియజెప్పాడు. శలుడు వామదేవాశ్రమానికి వెళ్ళి, ఆ కామ్యాశ్వాలను అర్థించాడు. ఆముని కరుణించి, పని తీరిన తరువాత వెంటనే ఆ గుర్రాలను తిరిగి తనకిచ్చే కట్టడితో ఆరాజుకు కామ్యాశ్వాలను యిచ్చాడు. శలుడు ఆ కట్టడికి అంగీకరించి, కామ్యాశ్వాలను రథానికి పూన్చుకొని, మృగాన్ని వేటాడి దానిని చంపి, తన పట్టుదల సాధించి సంతృప్తి చెందాడు. కాని, ఆ కామ్యాశ్వాలను వామదేవుడికి తిరిగి ఇవ్వకుండానే తన రాజధానికి వెళ్ళాడు. " ఆ మేటి గుర్రాలు రాజులదగ్గర ఉండదగినవి కాని, పేద బాపడు కెందు"కని భావించి అహంకరించి ఆ గుర్రాలను తన అంత:పురంలో ఉంచుకొన్నాడు. 

    నెలరోజులు గడిచాయి. వామదేవుడు శలుడి దురహంకారాన్ని పసికట్టాడు. అశ్వాలను అడిగి తెమ్మని తన శిష్యుడైన ఆత్రేయుడిని పంపాడు. ఆత్రేయుడు రాజును దర్శించి వామదేవుడి సందేశాన్ని వినిపించాడు. శలుడు దురహంకారంతో దుర్భాషలాడి గుర్రాలనిచ్చేది లేదని, తిరిగి పొమ్మని తిరస్కరించాడు. ఆత్రేయుడు తిరిగి వెళ్ళి గురువుకా సంగతి చెప్పాడు. వామదేవుడు ఆగ్రహించాడు. శలుడి దగ్గరకు స్వయంగా వెళ్ళాడు. పరద్రవ్యాపహరణ పాపహేతువని హెచ్చరించి తన గుర్రాలను తిరిగి ఇచ్చి మాట నిలబెట్టుకోమని కోరాడు. శలుడు అతడి మాటలు పట్టించుకొనలేదు. బ్రాహ్మణులకు గుర్రాలు నిరుపయోగాలనీ, గుర్రాలకు బదులు ఎద్దులనుగానీ, అధిక సంఖ్యలో కంచరగాడిదలనుకానీ ఇస్తానని చెప్పాడు. అంతటితో ఆగక కామ్యజాతి గుర్రాలను ముని కోరటం అనుచితమనీ నిందించి, తిరిగి పొమ్మని పరుషంగా పలికాడు. అతడి మాటలను వామదేవుడు సహించలేకపోయాడు. " విప్రుల ధనాన్ని అపహరించటమే ఒక పాపం. దానికి బదులు మరేదో ఇస్తాననటం హాస్యాస్పదం. అది అన్యాయం " అన్నాడు. ఆ మాటలకు శలుడు మండిపడ్డాడు. వామదేవుడిని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండని భటులను ఆజ్ఞాపించాడు. వామదేవుడి ముఖం కోపంతో ఎర్రబారింది. అందులోనుండి ఆ క్షణంలో అనేకమంది రాక్షసులు పుట్టి, శలుడిపై లఘించి శూలాలతో పొడిచి అతడిని చంపేశారు. మునీంద్రుడు తిరిగి వెళ్ళాడు. 

    శలుడి తరువాత అతడి తమ్ముడు నలుడు రాజయ్యాడు. కొంతకాలం గడిచాక వామదేవుడు మరల రాజాస్థానానికివచ్చి, తన గుర్రాలను తిరిగి ఇచ్చి ధర్మాన్ని కాపాడుమని నలుడిని అడిగాడు. నలుడు మండిపడ్డాడు. వామదేవుడికి యుక్తాయుక్త విచక్షణ లేదని నిందించాడు. విషబాణంతో వామదేవుడి వక్షాన్ని చీల్చి చంపుతానని సారథిని విల్లుని సిద్ధం చేయమన్నాడు. ఆమాటలు వామదేవునికి ఈటెలుగా చెవులకు తాకాయి. " ఓ రాజా! నీవు ప్రయోగించే బాణం అంత:పురంలో ఉన్న పసివాడైన నీ కొడుకును సంహరిస్తుంది చూడు " అని హెచ్చరించాడు. వామదేవుడన్నంత పనీ అయింది. అంత:పురంలో బాలుడు చనిపోయాడని స్త్రీలు రోదించ నారంభించారు. నలుడు కోపోద్రిక్తుడయ్యాడు. బాణంతో బ్రాహ్మణుడిని చంపటానికి వింటినారి సారించాడు. కాని, వామదేవుడి మహిమతో నలుడి చేతులు అమ్ముతోపాటు స్తంభించిపోయాయి. నలుడు ఆశ్చర్యపడి, చేసేదిలేక తలవంచుకున్నాడు. కొంత తడవు విచారించి అందరూ వినేటట్లు ఈ విధంగా ప్రకటించాడు. " నేను అనేక దుర్భాషలాడాను. అవన్నీ వమ్మయిపోయాయి. బాణంవేసే శక్తి నాకు పోయింది. బ్రాహ్మణమాహాత్మ్యం నిజంగా గొప్పది. నేను వామదేవుడిముందు ఓడిపోయాను. ప్రజలారా! మీ ముందు ఈ మహామునిని శరణు వేడుతున్నాను " అని పేర్కొన్నాడు. అందరూ అతడితోపాటు మునీంద్రుని శరణు వేడారు. వామదేవుడు ప్రసన్నుడై స్తంభనస్థితినుండి రాజును విముక్తుడిని చేశాడు. మృతబాలుడిని తిరిగి బ్రతికించాడు. నలుడు తన అంత:పురంనుండి వామ్యాశ్వాలను తెప్పించి వామదేవుడికివినయంతో సమర్పించాడు. వామదేవుడు వామ్యాశ్వాలను తీసికొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. బ్రాహ్మణ ప్రభావం అంటే ఇటువంటిది అని మార్కండేయమహర్షి ధర్మరాజుకి వివరించి చెప్పాడు. 

15, మే 2025, గురువారం

:: శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించిన కథ ::

    ద్రవిళదేశానికి రాజైన సత్యవ్రతుడు నీటిని మాత్రమే ఆహారంగా గ్రహిస్తూ ఒకనాడు కృతమాలిక అనే పేరుగల నది ఒడ్డున హరి సమర్పణంగా జలతర్పణం చేస్తూ ఉండగా అతని దోసిలిలో ఒక చేపపిల్ల కనిపించింది. అతడు ఉలిక్కిపడి ఆ చేపపిల్లను నదిలో వదలినాడు. నీటిలోనుండి చేపపిల్ల రాజుతో ఇలా అన్నది. " దయానిలయుడా! ఈ యేటిలో దాయాదులను చంపే పాపిష్ఠి చేపలున్నాయి. అవి చిన్నచేపలను పట్టి మింగుతాయి. అందువల్ల నేను ఇక్కడ ఉండలేక నీ దోసిటిలోనికి వచ్చినాను. దయలేకుండా నన్ను నట్టేటిలో త్రోయడం న్యాయంకాదు. పుణ్యాత్ముడా! ఇకమీదట చేపలుపట్టే జాలరులు వలలు తీసుకొని వస్తారు. నదిని కలతపెట్టి బంధించి, ఎగిరిపోనీయకుండా నామెడ పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ దాగుకోగలను? దీనవత్సలా! నన్ను పెద్దచేపలయినా తింటాయి. అలాకాని పక్షంలో ధూర్తులయిన వేటకాండ్రయినా పట్టుకొంటారు. ఆ విధంగా చచ్చిపోకుండా నన్ను రక్షించు. బలహీనులను కాపాడటం కన్నా మరొక పుణ్యం ఉందా? "  చేపపిల్ల మాటలు విని జాలిపడి దయకు నిలయమైన వాడగు సత్యవ్రతుడు, ఆ చేపపిల్లను నెమ్మదిగా అందుకొని తన కమండలంలోని నీటిలో ఉంచి తన నివాసానికి తీసికొని వెళ్ళినాడు. ఒక్కరాత్రిలోనే ఆ చేపపిల్ల పెరిగి పెద్దదై కమండలమంతా నిండిపోయింది. కదలటానికి తావులేక ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది " ఓ రాజేంద్రా! నేను ఉండడానికి ఈ కమండలం చాలా చిన్నది. చాలటం లేదు. ఇంకొక దానిని తీసుకురా! " అని చేపపిల్ల అడుగగా సత్యవ్రతుడు, ఒక నీళ్ళ కడవలో దానిని విడిచినాడు. ఆ చేప క్షణకాలంలోనే మూడు చేతుల పొడవై ఆ పాత్ర అంతా నిండిపోయింది. ఆ చోటు దానికి చాలక ఇంకొక దానిని తెమ్మన్నది. దయానిధి అయిన సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న మడుగులో విడిచినాడు. అది ఆ మడుగుకంటే పెద్దదై " నేను తిరగడానికి ఇది చాలదు " అని చెప్పింది. ఉత్తముడైన రాజు ఆ చేపను ఎక్కువ నీళ్ళుండే పెద్ద చెరువులో విడచినాడు. ఆ చేప ఆ చెరువుకన్నా పెద్దదిగా పెరిగింది. చోటు చాలదని చెప్పుకొన్నది చేప. ఆ పుణ్యాత్ముడు ఆ పెద్ద చేపను పెను కడలిలో విడిచినాడు. సముద్రంలో చేరిన తరువాత " పెద్ద మొసళ్ళు నన్ను పట్టుకొని చంపి మ్రింగుతాయి. ఇంతకాలమూ కాపాడి ఇప్పుడు నన్ను విడవవద్దు. బయటకు ఎత్తు " అని ఆ చేప రాజుతో మొరపెట్టుకొన్నది. 

    అప్పుడు నేర్పరియైన చేపతో రాజు ఇట్లా అన్నాడు. " పురుషోత్తమా! ఒక్క దినంలోనే నీవు నూరు యోజనాల దూరం వ్యాపించినావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనీవిని ఎరుగము. చేప జాతులకు ఇంత శరీరము ఉండదు. నీవెవరు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీవు దీనులను కాపాడటం కోసం చేపరూపం ధరించిన విష్ణుదేవుడవని తెలుసుకున్నాను. అచ్యుతా! నారాయణా! లోకాలను సృష్టించి, పోషించి, లయించే మహానుభావుడవు నీవు. దిక్కులేని భక్తులమయిన మాకు నీవే దిక్కు. మహిమతోకూడిన నీ అవతారాలు అన్ని ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను. మేము నీకు పరాయివాళ్ళం కాము. నిర్మలమైన జ్ఞానం కలవాళ్ళం. మా రక్షణకు నీవున్నావు. ఎల్లప్పుడు భక్తులు ఎక్కడ ఉంటే నీవూ అక్కడనే ఉంటావు. నిన్ను స్తుతించిన వారికి ఎప్పటికీ కీడు జరుగదు. శ్రీహరీ! నీవు లక్ష్మీదేవి వక్షస్థలంమీద క్రీడిస్తూ సంతోషంతో విహరించే ఆనంద స్వరూపుడవు. అజ్ఞానంతో కూడిన చేప రూపాన్ని ఎందుకు ధరించావో చెప్పు " ఈ విధంగా సత్యవ్రత మహారాజు అడుగగా ఆ యుగం చివర ప్రళయ కాలంలో ఒంటరిగా సాగరంలో సంచరించటానికి చేపరూపాన్ని ధరించిన విష్ణుమూర్తి సత్యవ్రతునితో ఇలా అన్నాడు/ 

    " ఓ నృపవర్యా! ఈ రేయి గడచిన తరువాత రాబోయే పదవ దినంతో బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. భూలోకాది ముల్లోకాలూ ప్రళయ సాగరంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆనతి మేరకు ఒక పెద్ద ఓడ నీ చెంతకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధీ సమూహాలనూ, విత్తన రాశులనూ ఆ నౌకపై ఉంచుకొని ప్రళయ సముద్ర జలాలలో విహరిస్తావు. నీతో కలిసి సప్త ఋషులు కూడా ఆ ఓడలో ఉంటారు. మీ ముందు భాగంలో పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల శరీర కాంతులు మిణుకు మిణుకుమంటూ మెరుస్తుంటాయి. సాగరంలో నౌక ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది. ఆ నౌక కడలి అలలకు దెబ్బతినకుండా మత్స్యరూపం ధరించిన నేను అన్ని వైపులా పెద్ద ఈకలు కలిగిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నా ఆనతి మేరకు ఒక పెద్దపాము అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరుగబడకుండా ఆ పాముతో నా కొమ్ము కొనకు ఆ నౌకను కట్టివేసి, నీకూ మునులకూ కీడు కలుగకుండా ఆ ప్రళయరాత్రి గడిచేవరకు నేను కాపాడుతుంటాను. ఇందుకోసమే నేను ఇలాంటి మత్స్యరూపాన్ని ధరించినాను. ఇంకా విశేషమేమంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను. పరబ్రహ్మ స్వరూపమయిన నా మహిమను తెలుసుకో " ఈ విధంగా పలికి శ్రీహరి సత్యవ్రతుడు చూస్తుండగానే అదృశ్యమైనాడు. చేపరూపంలో మాధవుడు పలికిన మాటలను తలుచుకొంటూ తాపసియైన సత్యవ్రతుడు దర్భల శయ్యపై తూర్పువైపు తలగడగా పరుండి ప్రళయ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అటు పిమ్మట ప్రళయం సమీపించింది. 

    మెరుపులతో కూడిన మేఘాలు ఎడతెరపి లేకుండా భయంకరమైన వర్షం కురిపించినాయి. సముద్రాలు చెలియలికట్టలు దాటి పొంగి పొరలి దేశాలను ముంచివేసినాయి. బ్రహ్మకల్పం యొక్క అంత్యకాలంలో ఏర్పడిన ఆ ప్రళయం నైమిత్తికమయినది. ప్రళయం అయిదువిధాలు. అవి దైనందినం, బ్రాహ్మం, ఆదిభౌతికం, నిత్యం నైమిత్తికం అనేవి. నిత్యం, నైమిత్తికం, దైనందినం, మనుప్రళయం, మహాప్రళయం అనికూడా కొందరు చెబుతారు. జలప్రళయం, అంటే., ఉప్పెన, అగ్నిప్రళయం అంటే, దహనం, పృథివీప్రళయం, అంటే, భూకంపం, వాయుప్రళయం అంటే, వాయుగుండం, ఆకాశప్రళయం అంటే కుంభవృష్టి అనే పాంచభౌతిక ప్రళయాలూ ఉన్నాయి. సరే!, ఇక్కడ, ఆకాశంలో ఎగిసిపడుతున్న అలలుగల ప్రళయకాల జలరాశిలో సకల భూతరాశులూ కూలిపోయినాయి. లోకాల సరిహద్దులు మాయమయినాయి. 

    బ్రహ్మదేవుడు విశ్రాంతి లేకుండా పూనికతో ప్రాణులను సృష్టించి అలసిపోయినాడు. ఆయన నడుమూ, వీపు బిగుసుకుపోయినాయి. అతడు నీలుగుతూ, ఆవులిస్తూ సృష్టి కార్యాన్ని ఆపినాడు. శరీరాన్ని వాల్చి, రెప్పలు మూసుకొని, చెయ్యి తలగడగా ఉంచుకొని, గురకలు పెడుతూ, కలలుకంటూ నిద్రపోయినాడు. ఆయన నోళ్ళనుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడనే ఒక రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించినాడు. హయగ్రీవుడనే దేవుడు విష్ణువు అవతారంగా పురాణాలలో కీర్తింపబడినాడు. అతడు జ్ఞానానంద స్వరూపుడు. సర్వ విద్యలకు ఆధారమైనవాడు. ఇక్కడి దానవుని పేరుగూడా హయగ్రీవుడే! ఇతడు జ్ఞాననిలయాలైన వేదాలను బ్రహ్మ దగ్గరనుండి దొంగిలించినాడు. వేదాలను చేజిక్కించుకొన్న ఆ రాక్షసుడు వాటిని చదువుతూ, బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడినాడు. బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం కనిపెట్టి వాడు వేగంగా సాగరంలోనికి ప్రవేశించినాడు. ఆ ప్రళయకాలంలో వేదాలను అపహరించి సముద్ర జలాలలో మునిగి దాగిన ఆ రాక్షసుడిని జయించడమూ, ఓషధులూ, విత్తనాల పొట్లాలు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడం, ఈ రెండూ పురుషోత్తముడగు విష్ణుదేవునకు కర్తవ్యాలయినాయి. 

    ఆ పురుషోత్తముడు ఆ మహారాత్రి ప్రవేశించే సమయాన మత్స్యావతారం ధరించినాడు. చిన్న రెక్కలూ, పెద్ద మీసాలూ, పొట్టి తోకా, బంగారు కాంతులీను మేనూ, అందమైన మచ్చలూ, చక్కని మొగమూ, ఒక కొమ్ము, మిరుమిట్లు కొలిపే చూపులూ కలిగి ఆ మహామత్స్యం విరాజిల్లుతున్నది. మత్స్యావతారుని క్రీడలు అద్భుతంగా ఉన్నాయి. తళతళలాడే పెనుచేప రూపంలో ప్రళయ జలాలలో వేదాలను వెదకటానికి పూనుకొన్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకసానికి ఎగురుతాడు. ఒకసారి నీటిలో ఒదిగి దాగుతాడు. ఒకసారి సముద్రంలో మునిగి తేలుతాడు. ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపల గుంపును మ్రింగుతాడు. ఒకసారి నీటిని పీల్చి వెలుపలికి చిమ్ముతాడు. అలా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, మేని పొడలు మెరిపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ, ఒడలు విరుచుకొంటూ, తళతళలాడుతూ సముద్ర గర్భంలో విహరించినాడు. 

    సత్యవ్రతుడు నారాయణుని స్మరిస్తుంటాడు. ప్రళయ సముద్రం భూలోకాన్ని ముంచెత్తే సమయం వచ్చింది. శ్రీహరి ప్రేరణతో ఒక ఓడ వచ్చింది. ఆ ఓడను చూచినాడు సత్యవ్రతుడు. అతడు ఓడపై పెక్కు ఓషధులను, విత్తనాలను అమర్చినాడు. విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ, మునులతోపాటు ఓడపై కూర్చున్నాడు. భయంతో సముద్రంపై తేలిపోతున్నాడు. అప్పుడు ఆ రాజుకు భక్తుల హృదయాలను అలంకరించే విష్ణుమూర్తి మహామత్స్యరూపంతో ఎదుట సాక్షాత్కరించినాడు. సత్యవ్రతుడు ఒక పెద్ద పామును తాడుగా చేసి ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకొన్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణుమూర్తిని ఇలా పొగడ సాగాడు. " ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానం వల్ల కొందరు భ్రాంతిలో తిరుగుతుంటారు. మునుగుతూ, కల్లోలపడుతూ పెక్కు దారులవెంట పరుగులు తీస్తుంటారు. అలాంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి కైవల్యాన్ని పొంది సంతోషిస్తుంటారు. అలా అందరినీ ఆదరించే నీవు మమ్ములను రక్షించు. ఓ లక్ష్మీపతీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తుంటావు. జ్ఞానం లేనివానికి, దుర్భుద్ధి కలవానికి, తండ్రివి నీవే. కనుక కన్నులున్నవాడు కనులు లేని వానికి దారి చూపిన రీతిగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు దారిని చూపించు. శ్రీహరీ! అగ్నిలో చేరడంవల్ల బంగారానికి రంగు, అదే మెరుగు కలుగుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై ముక్తి లభిస్తుంది. అంటూ అనేక రీతుల విష్ణుదేవుని ప్రార్థించాడు. అతని ప్రార్థనను ఆలకించి మత్స్యావతారుడై సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించినాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగ శాస్త్రాలతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించినాడు. మునీశ్వరులతోపాటు సత్యవ్రతుడు పరమ పురుషుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడైనాడు. సత్యవ్రతుడు తరువాతి కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి, విష్ణుమూర్తి దయవల్ల ఏడవ మనువైనాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆ విధంగా విష్ణువు మత్స్యరూపంతో తిరుగుతున్నాడు. 

    ప్రళయ సముద్రంలో వ్యర్థమై మునిగి ఉన్న వేదాల దైన్య స్థితిని అవి మొరపెట్టుకోగా మీనావతారుడగు విష్ణుమూర్తి విన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరచినాడు. ఉత్సాహంతో తోక ఊగించినాడు. మేను మెరపించినాడు. దౌడలు చక్క జేసుకొన్నాడు. మీసాలు కదిలించినాడు. పిడికిటి పోటుతో కొండలను పిండి చేయగలవాడు, దుర్జనుడు అయిన హయగ్రీవుని హతమార్చినాడు. ఎప్పుడు తెల్లవారునా అని ఆతురులై ఎదురు చూస్తున్న మునీశ్వరులకు సంతోషకరంగా వేకువ కనిపించింది. మెలకువ శక్తితో నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మ ప్రక్కన కూర్చొని జారిన పయ్యెద కొంగును సవరించుకొన్నది. నిద్రవలన ప్రళయకాలంలో మసకబారిన బ్రహ్మదేవుని ముఖం ప్రకాశించింది. జీవులు సంపాదించుకొన్న పూర్వ పుణ్యాలు ఆయన కడకన్నులకు కనిపించినాయి. బ్రహ్మదేవుడు తన అవయవాలను కదలించినాడు. ఆవులించి నిదురనుండి మేల్కొన్నాడు. కొద్దిగా నీలిగినాడు. ఒత్తిగిలినాడు. ఒడలు విరుచుకొన్నాడు. కన్నులు నులుముకున్నాడు. తిరిగి సృష్టి చేయటం కోసం సిద్ధమై కూర్చున్నాడు. భగవానుడు విష్ణువు హయగ్రీవుని చంపి వాడు దొంగిలించిన వేదాలను చిక్కునుండి విడిపించినాడు. వాటిని మేల్కొన్న బ్రహ్మదేవునికి దయతో అప్పగించినాడు. విష్ణుమూర్తికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించినాడు. ప్రళయ సముద్రంనుండి బయట పడినాడు. మనువు అయినాడు. రాజర్షి అయిన సత్యవ్రతుడూ, మీనరూపుడైన శ్రీపతీ ప్రవర్తించిన ఈ పవిత్ర గాథను విన్నవారు బంధాలనుంచి విముక్తిని పొందుతారు. 


10, మే 2025, శనివారం

:: నారదుడు ధర్మరాజుకు చెప్పిన కర్ణుని చరిత్ర :: 

    కుంతీదేవి కన్నెగా ఉన్న కాలంలో దుర్వాసోమహర్షి ఇచ్చిన మంత్ర ప్రభావం వలన సూర్యదేవుడిని ఆసక్తితో ప్రత్యక్షం చేసికొని కొడుకును కన్నందువలన మిక్కిలి సిగ్గుతో ఆ వాస్తవాన్ని ప్రకటించలేక పోయింది. కొడుకును కన్నప్పటికీ ఆమెకు కన్యాత్వం భగ్నం కాకుండా ఉండేటట్లు సూర్యదేవుడి వరం ఉండటంవలన ఆమె ఉత్తమ గృహిణిగా ప్రసిద్ధికెక్కింది. ఇదంతా దేవ రహస్యం. ఆవిధంగా కుంతిచేత నదిలో విడువబడిన ఆమె కొడుకును సూతుడు చూచి ఇంటికి ఎత్తుకొనిపోయాడు. అందువలన కర్ణుడు సూతుడికి పుట్టినవాడనీ, సూతకులంలో పుట్టినవాడనీ లోకంలో ప్రసిద్ధికెక్కుతూ పెరిగాడు. ధర్మరాజు నేర్పరితనం, భీముడి బాహుబలం, అర్జునుడి కోదండపాండిత్యం, అర్జునుడికి, శ్రీకృష్ణుడికి గల స్నేహం - ఇవన్నీ చూచి హృదయం మండి కర్ణుడు బాగా బాధపడుతూ ఉండేవాడు. నకుల సహదేవులకుండే నీతి, శాస్త్ర కళా పాండిత్యాన్ని ప్రజలు మిక్కిలి ప్రీతితో మెచ్చుకుంటూ ఉండటం కర్ణుడికి నచ్చేది కాదు. తోడు దానికి మనసు కలతపడగా బాధపడుతూ ఉండేవాడు. 

    అది అతడి స్వభావం. అంతేగాక విధి సంవిధానం కూడా అటువంటిదే. పాండవులమీది ద్వేషంతో ఆ కర్ణుడు అసూయ పెంచుకొని, దుర్యోధనుడితో చేతులు కలిపాడు. ఆ తరువాత అర్జునుడి విలువిద్యలోని మేటితనాన్ని గమనించి ఒకసారి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు బ్రహ్మాస్త్రాన్ని సాంగోపాంగంగా ఉపదేశించమని కోరాడు. " నేను యుద్ధం చేయటంలో అర్జునుడికి సమానుడను కావాలని కోరి వచ్చాను. నీవా- శిష్యులందరినీ సమానంగా చూచేవాడవు. కాబట్టి నీ దయవలన బ్రహ్మాస్త్రాన్ని పొంది ప్రకాశించవద్దా! " అని అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడితో ద్రోణుడు ఇలా అన్నాడు. " వేదోక్త విధివిధానాలను జీవిత వ్రతంగా పాటించే బ్రాహ్మణ శ్రేష్ఠుడు కానీ, సాటిలేని తమ ప్రభావం వలన పుణ్యశీలుడైన రాజుకానీ,  బ్రహ్మాస్త్రాన్ని దానంచేస్తే స్వీకరించటానికి యోగ్యులౌతారు కానీ ఇతరులు కాదు. కాబట్టి నీకు నేను బ్రహ్మాస్త్రాన్ని దానం చేయటం ధర్మంకాదు ". 

    ద్రోణాచార్యుడు ఈవిధంగా అనగానే, మంచిదని కర్ణుడు తన ఇంటికి తిరిగిపోయి, మరునాడు బయలుదేరి మహేంద్రపర్వతానికి వెళ్ళి పరశురాముడిని దర్శించి వినయంతో నమస్కరించాడు. " నేను బ్రాహ్మణుడను. భృగువంశంలో పుట్టాను. అస్త్రవిద్య నేర్చుకోవాలన్న కోరికతో నిన్ను ఆశ్రయించటానికి వచ్చాను." అని అన్నాడు. ఆ మాటలకు సంతోషపడి పరశురాముడు కర్ణుడిని శిష్యుడిగా స్వీకరించాడు. ఆపైన కర్ణుడు అస్త్రవిద్యలో అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు ఆశ్రమ సమీప ప్రదేశంలో అస్త్రవిద్యాభ్యాసం చేస్తూ ఉండగా అతడి బాణం ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడి హోమధేనువు దూడకు తగలటం చేత అది చనిపోయింది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణుడికి శాపం పెట్టాడు. దానివలన అతడి రథం కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునిడితో పోరుచేసే సందర్భంలో నేలలో క్రుంగి పోయింది. 

    కర్ణుడు భక్తుడై పరశురాముని సేవించటం వలన ఆయన అతడికి బ్రహ్మాస్త్రం మొదలుకొని అనేక అస్త్రాలను నేర్పాడు. ఆ తరువాత ఒకనాడు పరశురాముడు కర్ణుడి తొడమీద తలపెట్టి నిద్రపోయాడు. వికారమైన, భయంకరమైన ఆకారం గలిగిన అళికం అనే పురుగొకటి కర్ణుడి క్రింది తొడభాగాన్ని వడివడిగా తొలిచివేసింది. కర్ణుడు గురువుకు నిద్రాభంగం కావటానికి ఇష్టపడక, ధైర్యంతో ఆ పురుగు చేసే కొరుకుడుకు సహించి కదలకుండా ఉన్నాడు. నెత్తురు కారటం మొదలుపెట్టి క్రమంగా సాగి పరశురాముడి శరీరాన్ని తాకింది. ఆ స్పర్శకు పరశురాముడు మేల్కొని " ఈ రక్తం ఎక్కడిది? " అని అడిగాడు. కర్ణుడు తొడ ఎత్తి కీటకాన్ని చూపి " ఇది తొలుస్తూ ఉండగా మీ నిద్ర చెడకుండా ఉండాలని ఆ బాధను సహించి నేను కదలకుండా కూర్చున్నాను " అన్నాడు. పరశురాముడు ఆ కీటకాన్ని చూడగానే ఆ పురుగు చనిపోయి రాక్షసరూపం పొంది, ఆకాశప్రదేశంలో నిలచి యిలా పలికింది. " ఓ దయామయా! నీకారణంగా నాకు భయంకరమైన శాపం నివృత్తి చెందింది. నేను నా పూర్వ రూపాన్ని పొందగలిగాను. గ్రస్తుడు అనే పేరుతో పిలువబడే ఒక రాక్షసుడిని నేను. భృగుమహర్షి భార్యను అపహరించి అతడి శాపానికి గురిఅయి కీటకంగా ఉంటూ వచ్చాను. ఓ పరశురామా! నీ చూపులనే అమృతపు చిలకరింపుల వలన నేను మరల నిజ రూపాన్ని పొంది సుఖంగా ఉన్నాను " అని చెప్పి నమస్కరించి స్వేచ్ఛగా వెడలి పోయాడా రాక్షసుడు. 

    ఆ తరువాత పరశురాముడు కర్ణుడు ప్రదర్శించిన అపూర్వ ధైర్యాన్ని మనస్సులో లోతుగా భావించి అతడితో " బ్రాహ్మణ జాతికి ఇటువంటి ఓర్పు ఉండదు. నిజంగా నీవెవడవు? " అని అడుగగా " నేను సూత పుత్రు "డనని కర్ణుడు భయపడుతూ సమాధానం చెప్పాడు. అందుకు పరశురాముడు మిక్కిలి కోపించి " బ్రాహ్మణుడనని పలికి నీవు వంచనతో నా శిష్యత్వాన్ని గ్రహించావు. దాని ఫలితాన్ని అనుభవించుము. నావలన నేర్చుకొన్న అస్త్రవిద్యా సంపద మొత్తం భగ్నమైపోవుగాక! " అని శపించాడు. కర్ణుడు గూడా చేయగలిగిందేమీ లేక విచారపడుతూ వచ్చి దుర్యోధనుడిని చూచి " ప్రభూ! నేను పరశురాముడిని ఆశ్రయించి అస్త్రవిద్యను గడించాను. ఇప్పుడీ లోకంలో వీరులెవ్వరూ యుద్ధంలో నన్ను ఎదుర్కొనేవారు లేరు " అంటూ కర్ణుడు అలా అనగా విని దుర్యోధనుడు సంతుష్టాంతరంగుడయ్యాడు. 

     " ఓ ధర్మజా! మీ అన్న అయిన కర్ణుడు నడచిన విధానాలటువంటివంటూ " నారదుడు  ఇంకా ఇలా చెప్పాడు. ఆ విధంగా కర్ణుడు దుర్యోధనుడికి ఆప్తమిత్రుడై ఉండగా, కళింగ రాజ్యాన్ని పరిపాలించే చిత్రాంగదుడనే రాజు తన పుత్రిక శుభాంగికి స్వయంవర మహోత్సవాన్ని చాటాడు. దానికి శిశుపాలుడు, నీలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులెందరో చిత్రాంగదుడి రాజధానీ నగరమైన రాజపురానికి చేరారు. దుర్యోధనుడు కూడా ఉత్సాహంతో చతురంగ బలాలను వెంటబెట్టుకొని, కర్ణ సహాయుడై, రథమెక్కి రాజపురానికి వెళ్ళాడు. అట్లా సమావేశమైన రాజులకందరికీ చిత్రాంగదుడు సముచిత సత్కారాలు చేసి తన కూతురైన శుభాంగికి స్వయంవర మహోత్సవ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. చెలికత్తెలు, దాదులు పేరు పేరున రాజులను చూపి పరిచయం చేస్తూ ఉండగా, ఆ కన్య వారిని చూస్తూ చేతిలో కల్యాణ పుష్పమాలను ధరించి రాజుల నడుమనున్న దారిని మెల్లగా నడుస్తూ దుర్యోధనుడిని దాటి పోయింది. అందుకు రారాజుకి కోపం వచ్చింది. ఆమెను ముందుకు సాగకుండా ఆపి పట్టి రథంమీద ఉంచటానికి ఆజ్ఞాపించి, తాను సభను వీడి వెళ్ళనారంభించాడు. సభలోని రాజులందరూ కలవరపడి గుమికూడి అతిభయంకరమైన విధంగా అతడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడు కూడా వెనుకాడక, అందరూ అతడి బలపరాక్రమాలను పొగిడేటట్లు యుద్ధం చేశాడు. ఆ సమయంలో బల్లెములను ప్రయోగించి రాజుల శిరస్సులను భయంకరంగా నేల రాలేటట్లు చేస్తూ ఏనుగుల, రథాల, గుర్రాల, పదాతుల సమూహాలను మట్టుపెట్టుతూ, అందరికీ వారించడానికి శక్యం కాని వాడుగా కర్ణుడు యుద్ధరంగంలో నిలిచాడు. ఆ విధంగా బల పరాక్రమాలను ప్రదర్శించే వీరవర్యుడైన కర్ణుడిని చూచి , చావగా మిగిలిన రాజులు భయపడి పలాయనం చిత్తగించారు. దుర్యోధనుడు సంతోషించి కన్యారత్నమైన శుభాంగిని తీసికొని హస్తినాపురాన్ని చేరుకున్నాడు. అయితే, అప్పటి పగను మనస్సులో పెట్టుకున్న జరాసంధుడు కర్ణుడిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. కర్ణుడు వెళ్ళాడు. 

    కర్ణ జరాసంధు లిరువురూ అసహాయ వీరులై యుద్ధం చేశారు. కర్ణుడు జరాసంధుని దివ్యాస్త్ర సముదాయాన్ని, ధనురాది సాధనాలను ద్వంసం చేశాడు. జరాసంధుడు కూడా కర్ణుడి అస్త్రశస్త్రాలను వమ్ము చేశాడు. ఆపైన ఇరువురూ రథాల పైనుండి నేలకు దిగి, పెరిగిన పట్టుదలతో బాహాబాహీ యుద్ధానికి పూనుకొని తలపడ్డారు. జరాసంధుడు బాధపొంది కీలు విరుగ గొట్టుకున్నాడు. అంతటితో పోరు ఇరువురూ చాలించారు. జరాసంధుడు కర్ణుడి పౌరుషానికి మెచ్చి గారవించి, అధిక సంపదలకు నిలయమైన మాలినీ నగరాన్ని అతడికి ఇచ్చాడు. కర్ణుడు అమిత తేజంతో తిరిగి వచ్చాడు. అట్లా బలపరాక్రమాలలో జగత్ప్రసిద్ధుడైన కర్ణుడి గొప్పతనాన్ని ధ్వంసంచేయదలచి ఇంద్రుడు అతని కవచకుండలాలను భిక్షగా అడిగి పుచ్చుకొన్నాడు. దాని వలన " ధర్మజా! నీకు మేలు జరిగింది. దానివలననే అర్జునుడు కర్ణుడిని సంహరించ గలిగాడు " అని నారదుడు చెప్పి మరలా ఇలా అన్నాడు. " ధర్మజా! నేను చెప్పేది విని గ్రహించుము. బ్రాహ్మణుడు కర్ణుడిని కోపగించి శపించాడు. ఆ తరువాత పరశురాముడు శాపం పెట్టాడు. ఇంద్రుడు మోసం చేసి సహజ కవచకుండలాలను గ్రహించాడు. కుంతి వరమనే నెపంతో కోరి కోపాన్ని మాన్పింది. భీష్ముడు కర్ణుడిని అర్థరథుడుగా చేసి అగౌరవ పరిచాడు. శల్యుడు అనుచిత సంభాషణలతో కర్ణుడి హృదయాన్ని కలతబెట్టాడు. కృష్ణుడు అతడికి దాటరాని విధిగా నిలిచాడు. ఇన్ని జరుగగా అర్జునుడు కర్ణుడిని రణరంగంలో వధించగలిగాడు. ధర్మరాజా! శివుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, ద్రోణుడు, కృపుడూ మొదలయిన వారందరూ లెక్కకుమించిన దివ్యబాణాలను ఉపదేశించటం వలన అర్జునుడి ప్రతాపతేజం కర్ణుడి పరాక్రమ తేజాన్ని ఆర్పగలిగిందిసుమా! " అని నారదుడు చెప్పగా విని తీవ్రమైన దు:ఖం చేత కలతచెంది ధర్మరాజు కన్నీరుమున్నీరుకాగా దీర్ఘనిశ్వాస విడుస్తూ ఉండగా అతడి సమీపంలో ఉన్న కుంతీదేవి అతడి అవస్థను చూచి, అతడి శోకాన్ని మాన్పాలని అతడితో ఇట్లా అన్నది. " కుమారా! పుట్టుకను గురించి నిజాన్ని చెప్పి అతడిని నీవైపు నేను ఆహ్వానించినప్పుడు, ఆ సూర్యభగవానుడు కూడా కన్నకొడుకనే భావంతో కలిగిన కరుణతో కుంతి చెప్పిన మాట నిజం. నమ్ము నాయనా! అని పలికాడు. కాని, కర్ణుడు దుర్యోధనుడిని ఆశ్రయించి నీవైపు రావటానికి ఏవిధంగానూ ప్రయత్నం చేయలేక పోయాడు. కాబట్టి అటువంటి కర్ణుడి కొరకు నీవెందుకు ఈవిధంగా మానసిక వేదనను పొందుతావు? " అని మాట్లాడిన కుంతీదేవి పలుకులు ధర్మరాజుకు ఏవగింపు కలిగించటంతో అతడు బాధపడి కుంతీదేవిని చూచి ఇటులన్నాడు. " నీవు నిర్వహించిన ఈ రాచకార్యాన్ని రహస్యంగా ఉంచటం వలననే ఇంతటి విపరీత పరిణామం కలిగింది " అని అంటూ అంతటితో ఆగక అన్ని లోకాలలో ఉండే ఆడవారికి రహస్యాలను రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులలో లేకుండా పోవుగాక! అని ధర్మరాజు శపించాడు. అటుతర్వాత అమిత దు:ఖంతో తమ్ములతో కలిసి కర్ణుడికి తర్పణాలను శ్రద్దగా విడిచిపెట్టాడు. 

4, మే 2025, ఆదివారం

  కాశ్యపగౌతమాఖ్యానం అనబడే బ్రాహ్మణ నాడీజంఘుల కథ

    భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మములను గురించి వివరిస్తూ - క్రూరుడు, పేరాశపరుడు, చాడీలు చెప్పేవాడు, మందకొడి, చేసిన మేలును మరచిపోయేవాడు, తెలివిమాలినవాడు, అబద్ధాలాడేవాడు, నిందపడేవాడు, పిరికివాడు, తెగింపులేనివాడు, నీతిమాలినవాడు, మితిమించిన చెడు అలవాట్లు కలవాడు, రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. అందునా, తగని స్వభావంగల నీచులలోకెల్లా చేసిన మేలు మరచిపోయేవాడు ఎక్కువ తగనివాడు. దీనిని చెప్పే పాతకాలంనాటి కథ ఒకటి చెబుతాను. వినుమంటూ చెప్పాడు. దానిని మీకు నేనిప్పుడు చెబుతాను వినండి. దీనినే కాశ్యప గౌతమాఖ్యానం అంటారు. 

    వెనుకటికి ఓ బాపడు, తన తాతముత్తాతలనుండి వస్తున్న కులవృత్తి గౌరవాన్ని వదులుకొని ఒక బోయ వనితను పెళ్ళాడాడు. బోయవారితో కలిసిపోయి వేటాడేవాడు. మాంసం తినేవాడు. బాగా సుఖాలు మరగిన అతడు ఒకసారి వ్యాపారనిమిత్తం  మరొక దేశానికి పోతున్న ఓ వర్తక బృందంలో చేరి వారితో కలసి తానూ వెళ్ళాడు. అట్లా పోతూ ఉండగా ఒక ఆడఏనుగు తటస్థపడి  ఆ బిడారులోని జనాన్ని పిచ్చెత్తినట్టు నేలమీద పడేసి కాలితో తొక్కి చంపటం మొదలుపెట్టింది. ఆ గుంపంతా చెదిరిపోయి తలోదిక్కుకూ చెల్లాచెదరయింది. ఆ బ్రాహ్మణుడు భయంకొద్దీ దిక్కుతోచక పరుగెత్తాడు. ఉత్తరం వైపుగా చాలాదూరంపోయి ఒక దోవ చూచాడు. అతడు ఆ త్రోవలో వెళ్ళగా ఆ ప్రక్కనే దట్టంగా ఉన్న డొంకల మధ్య గుబురుగా ఉన్న ఒక మర్రిచెట్టును చూచాడు. అది చాలా ఎత్తుగా, వెడల్పుగా ఎంతో గుండ్రంగా అందంగా ఉన్నది. అక్కడ కాసేపు నిలబడాలనిపించి ఆ చెట్టు క్రిందకు పోగా, అడవిపూల వాసనను ఇముడ్చుకున్న సుడిగాలి అతడి అలసటను కొంత పోగొట్టింది. ఆ బ్రాహ్మణుడు తనివితీరా ఆ చెట్టు నీడను కూర్చున్నాడు. అంతలో అక్కడికి చక్కగా నడుచుకొంటూ ఒక పెద్ద కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మ దయను నోచుకొన్నది. నాడీజంఘుడు, రాజధర్ముడు అనేవి ఆ కొక్కెర పేర్లు. ఆ మర్రిచెట్టుమీదే కొంగ ఉండేది. ఆ కొంగ అట్లా వచ్చి బాపనయ్యను చూచింది. ప్రేమతో ఆదరించి, " ఓ బ్రాహ్మణోత్తమా! ఎక్కడినుండి ఎక్కడకు ఏమి పనిమీద వెడుతున్నావు? నిన్ను చూచి సంతోషించాను. నాకు తగ్గ అతిథివి. నీ సంగతులు తెలియజెప్పుము " అని అడుగగా " నాది మధ్యదేశం. నాపేరు గౌతముడు. నేను ఉత్తముడైన ఓ బ్రాహ్మణుని కుమారుడను. నేను సోమరిపోతునై, వేదాలు వల్లించటం వంటి మా జాతి కర్మలను మానివేశాను. కామంలో పడి ఒక బోయ స్త్రీని పెళ్ళాడాను. బీదరికంతో విసిగిపోయి వర్తకం వెంబడి ఒక బిడారుతో కలిసి మరో దేశానికి వెడుతున్నాను. కాలుతీసి కాలు పెట్టలేనంత దట్టంగా ఉన్న కొండలలో, అడవులలో సాగుతున్న మాకు ఒక అడవి ఏనుగు తటస్థపడి బిడారుమీద పడి చంపబోయింది. ఆ గుంపులోని వారంతా తత్తరపడి పరుగెత్తారు. నేను భయపడి అడవిలో పరుగెత్తి త్రోవ తప్పాను. నా అదృష్టంకొద్దీ నీవు ఉండే ఈ మర్రిని చూచాను. " అనగానే, ఆ కొంగ " మంచిదే! నీ బీదతనాన్ని పోగొడతాను. నీవు బాధపడకుము " అని చెబుతూ తన ఆతిథ్యాన్ని అందుకొనమన్నది. మంచి రుచిగా ఉండే గంగానదిలోని చేపలను కాల్చి తెచ్చింది. తీయటి అడవి పళ్ళు పెట్టింది. అతిథి బ్రాహ్మణుడు తృప్తిపడేటట్లు భోజనం పెట్టింది. ప్రొద్దుపోవటంతో చిగురుటాకులతోనూ, పూలతోనూ ఒత్తుగా ప్రక్కను సిద్ధం చేసింది. ఆ కొంగలరాజు, ఆ బాపడు ముచ్చటలతోనూ, హాయి అయిన నిద్రతోనూ ఆ రాత్రి గడిపారు. 

    తెల్లవారగానే ఆ బ్రాహ్మణుడిని చూచి " వినుము - మనిషి పేదరికం పోవటానికి స్నేహితుడూ, వెండీ, బంగారమూ, ఆలోచన అనే నాలుగింటినీ కారణాలుగా దేవగురువు బృహస్పతి చెప్పాడు. వీటి అన్నింటిలోనూ, ఓ బాపనయ్యా! మిత్రుడు గొప్పవాడు. కశ్యపుడి సంతానంలోని వాడనైన నేను నీతో చెలిమి చేస్తూ ఉంటే, అంతులేని సిరిసంపదలకు యోగ్యుడవు కాకుండా పోతావా? నాకు విరూపాక్షుడనే మిత్రుడొకడున్నాడు. మధువ్రజం అతడి పట్టణం. అది యిక్కడకు మూడామడల దూరంలో ఉంటుంది. దానికి మరీ దూరం, మరీ దగ్గరాకాని త్రోవ వెంబడే గబగబా వెళ్ళుము.ఆ రాక్షస రాజును ఆశ్రయించుము. విరూపాక్షుడిని చూచి అతడితో నేను పంపించినట్లు చెప్పుము. అతడు ఎంతో సంతోషిస్తాడు. బంగారం, మణులూ యిచ్చి సత్కరిస్తాడు " ఆంటూ ఆ కొంగ మధువ్రజం పోయే దిక్కును చెప్పింది. ఆ దారి వెంబడి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుడిని చూచాడు. నేను నాడీజంఘుడికి ఆప్తమిత్రుడనని చెప్పాడు. అతడు పంపబట్టి డబ్బు కోరి వచ్చాను అని బ్రాహ్మణుడు చెప్పగానే విరూపాక్షుడు అతడిని తేరిపార చూచాడు. లోలోపల ఈ బ్రాహ్మణుడు నీచుడిగా అనిపిస్తున్నాడు. సంగతేమిటో అడిగి తెలుసుకోవాలి, అని అనుకొని " నీ వంశం, నీ చదువు, నీ నడవడి ఉన్నదున్నట్లుగా చెప్పుము " అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం జంకలేదు. తన సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు విరూపాక్షుడు కూడా ఎట్లాంటి మానసిక, శారీరక వికారాలకు లోబడని వాడవుతూ, " ఈ బ్రాహ్మణుడు ఎటువంటి వాడైతే నేమిలే. నాడీజంఘుడితో స్నేహమే ఈ బ్రాహ్మణుడి యోగ్యతను తెలుపుతుంది. కాబట్టి ఇతడికి కరువుతీరా ధనమిస్తాను " అని నిర్ణయించుకొని ఆ బ్రాహ్మణుడికి అవసరానికి తగ్గట్టుగా తిండి, బట్టలు సమకూర్చి పెట్టడానికి కొంతమందిని నియమించాడు.

    ఆ మరునాడు కార్తీక పౌర్ణమి. విరూపాక్షుడు తన ఇంట్లో వేలకొద్దీ బ్రాహ్మణులు బంగారు పళ్ళాలలో భోజనాలు ఆరగించటానికి, కానుకలు ఎక్కువగా పుచ్చుకొనటానికి అనువుగా గల కర్మల నాచరించాడు. ఆ మహాజనంతో బాటు ఎంతో ఆదరణతతో దొడ్డమనస్సుగల ఆ విరూపాక్షుడు ఆ బ్రాహ్మణుడికి ఎన్నో సేవలు చేశాడు. కడుపునిండా కమ్మని తిండి పెట్టాడు. మొయ్యలేనంత బంగారం, రత్నాలు యిచ్చి, తిన్న బంగారు పళ్ళాన్ని గూడా మనసారా యిచ్చాడు. బాహ్మణుడు ఆనందంగా అన్నీ పుచ్చుకున్నాడు. బరువు ఎక్కువ అవటంతో భుజాలు చేతులు మార్చుకొంటూ మోస్తున్నాడు. బరువువలన మెడా, వీపు, రెక్కలూ చాలా నొప్పి పుట్టాయి. ఆ నొప్పివలన వంగిపోతున్నాడు. గబగబా అడుగులు వేస్తూ నాడీజంఘుడు ఉండే మర్రిచెట్టును చేరుకున్నాడు. అతడిని చూచి కొంగ సంతోషించింది. అట్లా వచ్చిన బ్రాహ్మణుడిని చూచి కొంగ తృప్తి పడింది. దొప్పలవంటి తన రెండు రెక్కలతో మెల్లగా విసరి అతడి బడలిక పోగొట్టింది. ఆకలి తీర్చింది. రాత్రి అయింది. ఆదమరచి నిద్రపోతూండగా ఆ పాడు బాపడు మరునాటి ప్రయాణంలో తిండిని గురించి ఆలోచించాడు. ఈ కొంగ ఒళ్ళు బాగా కొవ్వి కండపట్టి ఉన్నది. ఇది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నది. దీనిని చావమోది, మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచించాడు. బట్టను లాగి బిగించి కట్టుకొని రెండు చేతులతోనూ కర్రను బాగా గట్టిగా పట్టుకొని అప్పటికప్పుడే మెడమీదా, తలమీదా దబదబా చితక బాదాడు. ప్రాణం పోయిందని రూఢిచేసుకొన్నాడు. ఈకలన్నీ గబగబా పెరికివేశాడు. పీకను చీల్చాడు. పేగులు బయటకు లాగి మాంసాన్ని పొందికగా మూటకట్టుకున్నాడు. 

    అంతలో తెలవారగా విరూపాక్షుడు నిద్రనుండి లేచి " మాంసం కంపు కొడుతున్నది. ఏం ముంపు ముంచుకొస్తుందో ఏమో! మనస్సులో కలతగా ఉన్నది " అని తన వారితో చెబుతూ భయంతో వణికిపోతున్నాడు. జాము పొద్దెక్కగా రాజధర్ముడిని అంటే నాడీజంఘుడిని గుర్తుతెచ్చుకొని, నా మిత్రుడు ప్రతి నిత్యం ప్రొద్దున్నే వచ్చేవాడు. ఈరోజు ఎందుకు రాలేదో ఏమో! బ్రాహ్మణుడు నీచుడని అపుడే అనుకొన్నాను. ఈ తుచ్ఛుడు ఏమి తలపెట్టాడో ఏమో! అయ్యో! దైవమా! నాడీజంఘుడు ఏమి కానున్నాడో ఏమో! ఏమీ కల్మషం ఎరుగనివాడు. అందరినీ నమ్ముతాడు అనుకొంటూ విరూపాక్షుడు తీవ్రంగా ఆలోచించాడు. తన పరివారానికి కొంగను వెదకండని పురమాయించాడు. ఆ పరిజనం వెళ్ళి వెదకి, కొంగ డొక్కను గుర్తుపట్టి వెంటనే ఆ సంగతి రాజునకు కబురు పంపారు. ఆ బ్రాహ్మణుడు ఎటువైపుగా వెళ్ళాడో ఏమిటో తెలుసుకొని, వడివడిగా పరుగెత్తి అ బ్రాహ్మణుని వెదకి పట్టుకున్నారు. వెంటనే రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు తెచ్చారు. విరూపాక్షుడు " ఇతడు చేసిన మేలు మరచినవాడు. వీడిని నా ఛాయలకు తేకండి. వెంటనే చంపి తినండి " అని సేవకులతో చెప్పాడు. ఆ మాటలు విన్న భటులు " ఈ పాపిష్టి శరీరం తినటానికి మేమంత నీతి లేని వారమా? ఇట్లాంటివి తింటే మాకు పాపం అంటుకొంటుంది." అని ఇష్టపడకపోవడం వలన ఆ విరూపాక్షుడు " తింటే తినండి, లేకపోతే మానెయ్యండి. ఏం చేసినా సరే! ఈ కృతఘ్నుడిని నా ఎదుటికి ఎందుకు తెచ్చారు? " అని రాజు అనగానే ఆ రాక్షసులు, మధువ్రజం వెలుపలికి తీసుకొని వెళ్ళి, అతడి శరీరాన్ని చిన్న చిన్న కండలుగా కోసి, గాయాలనుండి రక్తం చిందుతూ ఉండగా పడదోసారు. అంతలో ఆ పాపి శరీరాన్ని తినటానికి నకనకలాడుతున్న కడుపులతో కుక్కలమంద వచ్చిపడింది. అంత ఆకలితోనూ అవి ఆ పాపాత్ముడి శరీరాన్ని ముట్టకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. కృతఘ్నుని మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవు. రోత పడతాయని భీష్ముడు ధర్మరాజునకు చెప్పి , ఆ తరువాత జరిగిన వృత్తాంతమును గూడా  ఈ రకంగా వివరించాడు.

    విరూపాక్షుడు విలవిలా ఏడుస్తూ నాడీజంఘుడి డొక్కను తెప్పించాడు. స్నేహితులతో కలసి, తాను గౌరవంగా తలకొరివి పెట్టాడు. అపుడు దేవేంద్రుడు వచ్చాడు. ఇంద్రుడిని చూచాడు విరూపాక్షుడు. అతడిలో తత్తరపాటు, వినయం కలగలుపుగా దీనత్వం తోపగా, విలవిలా ఏడుస్తూ, " నా రాజధర్ముడిని తిరిగి బ్రతికించవా?" అంటూ వేడుకొన్నాడు. విరూపాక్షుడి ప్రార్థన విన్న ఇంద్రుడు " నీ చెలికాడు నాడీజంఘుడు బ్రహ్మకు స్నేహితుడని నీకింతవరకూ తెలియదా? అతడి గురించి ఏడవటం ఎందుకు? అతడు ప్రతినిత్యము తన దగ్గరకు రావాలని బ్రహ్మ కోరుకుంటాడు. కాబట్టి తరచూ రానందుకు బ్రహ్మ విచారించేవాడు. అతడికి ఇటువంటి దశ పట్టినదంటే, అతడి స్నేహితుడవటంవల్లనే, నీవు స్నేహితుడవటంవలన నీవు ఈ కొంగకు తలకొరివి పెట్టావు. అది చాలా మంచి పని కదా! అటు దహన సంస్కారం ముగించిన నీవు ఇటు వచ్చావో లేదో, ఆ వెంటనే ఆ చితిమంట దగ్గరలో ఒక ఆవు తన దూడకు ఎంతో ప్రేమగా పాలిస్తుండగా, చిన్న పాలచేపు రాగానే దూడ నోటినుండి నురగ తుంపర జారి పడింది. అది సుడిగాలికి ఎగిరి చితిమీద పడింది. ఆ నురగ పడిందో లేదో నాడీజంఘుడు తిరిగి బ్రతికాడు. మునుపటి మాదిరిగానే అదే రూపంతో వస్తూ ఉన్నాడు.  ఇట్లా జరిగింది అంటే, అది ఆ బ్రహ్మదేవుడి లోకాతీతమైన దయామహిమే! " అని ఇంద్రుడు చెప్పగానే కొంగల రాజు రానే వచ్చాడు. అతడి రాకకు విరూపాక్షుడు మరింత సంతోషించాడు. అంతకు మునుపే ఇంద్రుడు బ్రహ్మ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడిని తాళ్ళతో కట్టించాడు. ఆ రాజధర్ముడు, బ్రాహ్మణుడికి తన వలన కలిగిన దురవస్థకు తట్టుకొనలేక పోయాడు. అతడిని విడిపించమని ఇంద్రుడిని వరం అడిగాడు. ఈ వరం యివ్వటంలో బ్రహ్మదేవుడి దయ ఉందని ఇంద్రుడు దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు. వెంటనే బ్రాహ్మణుని విడిచిపెట్టి కొంగ కోరిక తీర్చాడు. రాక్షసరాజు ఆజ్ఞతో బ్రాహ్మణ ధనాన్ని తెచ్చిన వారు తిరిగి అతడికి ముద్రశుద్ధిగా ముట్టచెప్పారు. నాడీజంఘుడిని కొనియాడుతూ ఆ బ్రాహ్మణుడు ధనం మూటను మోసుకొంటూ వెనక్కి తిరిగి చూస్తూ తత్తరపడుతూ పోయాడు. ఆ తరువాత ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. విరూపాక్షుడు ఆ బకరాజు రాజధర్ముడిని సంతోషంగా సాగనంపాడు. అతడూ గొప్పగా తానుండే మర్రిచెట్టును చేరుకొన్నాడు. 

    

    

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...