26, జూన్ 2025, గురువారం

 

:: ఊర్ణనాభుడు ::

మనం ఉండే ఈ లోకాన్నీ, దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన లోకాల్నీ బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చెయ్యటంలో తన నేర్పంతా చూపి ఎంతో అందంగా చేశాడు గనుక బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకున్నారు. కాని, ఊర్ణనాభుడనే వాడు మాత్రం మెచ్చుకోలేదు.

ఊర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు. విశ్వకర్మ ఎవరంటే, దేవతలకు మంచి మంచి మేడలు, మిద్దెలు, సభలు కట్టియిచ్చేవాడు. తోటలు, ఉద్యానవనాలు, వాటిలో చిన్నచిన్న సరస్సులు ఇలాంటివన్నీతయారుచేసి యిచ్చి, దేవతలకు ఆనందం కలుగజేసేవాడు. అతని కొడుకు ఊర్ణనాభుడు తండ్రికన్నా నేర్పు కలవాడు. చూసినదల్లా చేసెయ్యగలడు అతడు.

బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకోవడం విని, “ ఓస్, బ్రహ్మ గొప్ప ఏమిటి? ఇలాంటి లోకాలూ, వింతలూ నేనూ చెయ్యగలను “ అంటూ బ్రహ్మకు మల్లేనే ప్రతీదీ చెయ్యటం మొదలెట్టేడు ఊర్ణనాభుడు.

ఊర్ణనాభుడు తనతో పోటీ చేస్తున్నాడని తెలియడంతోనే బ్రహ్మకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. అతణ్ణి పిలిపించి “ ఏమోయ్! నువ్వేదో తెలివైన వాడినన్న గర్వంతో నన్నేధిక్కరిస్తున్నావే. తగుదునమ్మ అని నాతో పోటీకి వస్తున్నావు. నువ్వెంత చేసినా అది నా సృష్టిలాగా ఉంటుందా? నీ సృష్టి నీ పేరుకు తగినట్లే ఉంటుంది. ఊర్ణనాభం అంటే సాలెపురుగు ‘. నీ పని సాలెపురుగు కట్టిన గూడుకుమల్లే పైకి డాబే కాని, ఉఫ్ మని ఊదితే నిలువదు. అంచేత నాతో పోటీకి రాక, బుద్ధి తెచ్చుకుని మసలుకో “ అని కూకలేశాడు.

కాని, ఊర్ణనాభుడు ఊరుకోలేదు. “ ఏమయ్యోయ్, నీ డబాయింపు నా దగ్గర పనిచెయ్యదు. నన్ను మానుకోమనటానికి నువ్వెవరవు? “ అని ఎదిరించాడు.

ఎంత మంచి దేవుడైనప్పటికీ ఎదిరిస్తే ఊరుకుంటాడా? బ్రహ్మదేవునికి పట్టరాని కోపం వచ్చి, “ ఒరేయ్, ఊర్ణనాభా! ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు కనుక నీవు పోయి, భూలోకంలో ఒక ఊర్ణనాభానివై ( సాలెపురుగు ) పుట్టి, ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండు “ అని శపించేశాడు.

ఇంకేముంది? శాపం తగలటంతోనే ఊర్ణనాభుడు గజగజా వణుకుతో బ్రహ్మదేవుని కాళ్ళమీద పడి “ దేవా! క్షమించు. నన్ను కాపాడు. సాలెపురుగు జన్మలోంచి తప్పించు “ అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు.

బ్రహ్మదేవునికి జాలివేసింది. “ నా శాపానికి తిరుగు లేదు. నీవు సాలెపురుగువై పుట్టకతప్పదు. ఎటొచ్చీ, ఆ జన్మలోనే నీకు మోక్షం వచ్చే ఉపాయం ఒకటి చెపుతాను విను. నువ్వు ఒక అడవిలో ఒక బిల్వ వృక్షం మీద పుట్టబోతున్నావు. ఆ అడవిలోనే ఒక చోట శివుడు లింగమై వెలిశాడు. ఆ శివుడికి పూజ చెయ్యటానికి భక్తుడొకడు బిల్వ పత్రాలకోసం నీవున్న చెట్టువద్దకు వస్తాడు. ఆ పత్రితో పాటు నువ్వు శివుని సాన్నిధ్యానికి చేరుకుని ఆ దేవుణ్ణి సేవించి మోక్షం పొందు “ అని చెప్పేడు.

ఊర్ణనాభుడు శాపం ప్రకారం ఆ అడవిలో బిల్వవృక్షం మీద సాలెపురుగై పుట్టాడు. సాలెపురుగై ఉన్నా, అతనికి పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకముంది. ఆ శివభక్తుడు ఎప్పుడు వస్తాడా. తన్ను శివలింగం వద్దకు ఎప్పుడు తీసుకుపోతాడా అని సాలెపురుగు ఆ చెట్టుమీదే కనిపెట్టుకుని ఉంది.

అలా కొంతకాల మయాక, బ్రహ్మ చెప్పిన శివభక్తుడా చెట్టు దగ్గరకొచ్చి ఆకులు కొయ్యటం మొదలెట్టాడు. సాలెపురుగు అతను ఆకులు కోస్తున్న కొమ్మమీదకెళ్ళి, ఒక ఆకులో దూరి, ఆకుతోపాటు తాను కూడా అతని బుట్టలోకి చేరుకుంది. అతడా పత్రి అంతా తీసుకెళ్ళి, ఆ అడవిలోనే వెలసి ఉన్న శివలింగానికి పూజ చేయసాగాడు. ఒక్కొక్క దళమే తీసి లింగంమీద వేస్తూంటే సాలెపురుగు దాక్కొనిఉన్న ఆకుగూడా అతని చేతికివచ్చి ఆ పురుగుకు శివదర్శనమయింది. పురుగు ఆకుతోబాటు తనుకూడా లింగం మీద పడిపోకుండా తప్పించుకుని, భక్తుడు వెళ్ళొపోయాక శివలింగాన్ని తనివితీరా చూడటం మొదలెట్టింది. “ ఈ మహాదేవుణ్ణి నిత్యం సేవించి, మోక్షం సంపాదించుకుంటాను “ అని నిశ్చయించుకుంది.

కాని ఆ సాలెపురుగుకు పట్టుకున్న ఆలోచన ఏమిటంటే, “నేనుత్తి సాలెపురుగును. ఆ దేవుడికి పూజ చెయ్యాలీ అంటే పువ్వులు, పత్రి మొదలైనవెన్నో కావాలి.నేను వీటిని తేలేను కదా! మరి, ఈ దేవుడికి సేవ చెయ్యటం ఎలాగా?” అని.

ఇలా ఆలోచిస్తూ పోగా చటుక్కున దానికో ఆలోచన తోచింది. “ సేవించాలీ అంటే, పువ్వులూ, పత్రీ తెచ్చే పూజించనక్కరలేదు. నేను ఎంచక్కా అందంగా గూళ్ళు కట్టగలను. ఈ దేవుడికి ఏ భక్తుడూ ఇంకా గుడి కట్టించలేదు. నేను నా శక్తి అంతా ఉపయోగించి, ఈ దేవుడికి గుడీ, గోపురం అన్నీ కడతాను “ అనుకుంది. అనుకున్న వెంటనే పని ప్రారంభించింది. సాయంకాలం అయ్యేటప్పటికి, లింగానికి గుడి, గోపురం, ప్రాకారం అన్నీ కట్టేసింది. వేటితో కట్టిందో తెలుసా? ఇటుకలు, రాళ్ళు, సున్నంతోనూ కాదు. సాలెపురుగు అవన్నీఎక్కడ తేగలదు? సాలెపురుగుకు తన బొడ్డులోనే ఒకరకం జిగురు ఉంటుంది. ఆ జిగురుతోనే జలతారు పోగులకు మల్లే తళతళ మెరిసిపోయే పోగులు చేసి వాటితో గూళ్ళు కడుతుంది. మన సాలెపురుగు కూడా ఆ పోగులతోటే శివుడికి గుడి, గోపురం, ప్రాకారం ఎంతో నేర్పుగా కట్టేసింది. అవన్నీ ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు! , మర్నాడు పొద్దునే లేచి చూచేటప్పటికి, మంచు బిందువులు వాటి మీద పడి, ఆ గుడి, గోపురం, ప్రాకారం కూడా తెల్లటి ముత్యాలతో కట్టారా అన్నట్టు కనపడినై. క్రమంగాఎండ వచ్చి సూర్యకిరణాలు వాటి మీద పడేటప్పటికి, అవన్నీ రంగురంగులుగా మెరిసి, నవరత్నాలతో కట్టినట్లు కనపడ్డాయి.

కాని ఒక చిక్కొచ్చింది. సాలెపురుగు పోగులతో కట్టిన గుడీ, గోపురం, ప్రాకారం అందంగా ఉన్నాయన్నమాటేగాని వాటిల్లో గట్టి ఎక్కడుంది? కాస్త గాలి వేసేటప్పటికి ఆ పోగులు అక్కడక్కడా తెగిపోతూండేవి. ఆ తెగిపోయిన వాటికి అతుకు పెట్టడంతో ఆ సాలెపురుగుకు ప్రొద్దస్తమానం సరిపోయేది. ఐతేం? విసుగూ, విరామం లేకుండా అది అలా అతుకులు పెడుతూనే ఉండేది. శివుడంటే దానికున్న భక్తి, శ్రద్ధ అటువంటివన్న మాట.

ఇలా కొంతకాలమయాక శివుడికి దాని భక్తిని పరిక్షిద్దామని బుద్ధి పుట్టింది.

సాలెపురుగును పత్రితోబాటు శివలింగం వద్దకు తెచ్చిన భక్తుడొకనాడు మామూలు ప్రకారం శివుడికి పూజచేసి, దీపం పెట్టి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళేక శివుడు తన ప్రభావంచేత ఆ దీపాన్ని పెద్దదయేటట్లు చేశాడు. మొదట ముత్యంలా ఉన్న దీపం సాలెపురుగు చూస్తుండగానే దివిటీలాగైపోయి, మరో నిమిషానికి తాటిచెట్టంతై, సాలెపురుగు ఎన్ని సంవత్సరాలనుంచో శ్రమపడి కట్టిన గుడినీ, గోపురాన్నీ, ప్రాకారంతో సహా తగులబెట్టి నాశనం చేసింది.

సాలెపురుగుకు దీపం మీద పట్టరాని కోపం వచ్చింది. “ నేను పరమేశ్వరుని కోసం చేసిన ఈపని అంతా ఈవిధంగా వృధా అయిపోయాక ఇంక నా బ్రతుకెందుకు? నాకూ, పరమేశ్వరుడికీ అకారణంగా ఇలా అపచారం చేసిన ఈ దీపం పని పడతాను. ఛస్తే ఛస్తాను దీన్ని మింగేసి, నా కసి తీర్చుకుంటాను “ అని నిశ్చయించుకుని, దీపాన్ని మింగటానికి గబగబా లింగం వద్దకు పరుగెత్తికొచ్చింది.

శివుడాశ్చర్యపోయాడు. “ అబ్బా, ఈ సాలెపురుగుకి ఎంత భక్తి “ అనుకున్నాడు. తక్షణమే శివుడు లింగంలోకి ప్రత్యక్షమై, “ ఆగు, ఆగు, దీపాన్ని మింగకు. నీ భక్తిని పరిక్షిద్దామని నేనే చేయించాను ఈ పని. నీ భక్తికి మెచ్చుకున్నాను. నీకేం కావాలో వరం కోరుకో ఇస్తాను “ అన్నాడు.

ఈశ్వరుడల్లా ప్రత్యక్షమయ్యేటప్పటికి ఆ సాలెపురుగుకు కలిగిన సంతోషానికి అంతు లేకపోయింది. దానికి శివుణ్ణి స్తోత్రం చెయ్యటానికి శ్లోకాలూ, మంత్రాలూ రావు కదా! అంచేత భక్తి పొంగివస్తూంటే, అదేపనిగా స్వామికి మ్రొక్కటం మొదలెట్టింది.

వరం కోరుకొమ్మన్నారు గనుక, సాలెపురుగు జన్మపోయిమంచి జన్మ ఏదైనా కోరుకోవచ్చు. డబ్బు, దస్కం ఇమ్మని కోరుకోవచ్చు. కాని, ఆ సాలెపురుగు అలాంటి స్వల్ప కోరికలేమీ కోరలేదు.

“ ఎంత గొప్ప పుట్టుక పుట్టినా బాధలు తప్పవు. ఏ బాధా లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా పోవాలి. కనుక నన్ను నీలో చేర్చుకో స్వామీ! “ అని మనసారా కోరింది.

ఈశ్వరుడు దాని తెలివికి, జ్ఞానానికి మెచ్చుకుని, తనలో ఐక్యం చేసుకుని మోక్షమిచ్చాడు. ఈ విధముగా కీటకముగా మారినప్పటికీ, ఊర్ణనాభుడు తరించాడు.  

 

       

25, జూన్ 2025, బుధవారం

 

:: తుమ్మెదల మెట్ట ::

                                                      

        పూర్వం అనగా సుమారు రెండు వందలసంవత్సరముల క్రిందట సింహాచలం దేవాలయంలో ఒక చిత్రం జరిగింది. అది ఏమిటంటే –

        సింహాద్రి నారసింహస్వామికి కృష్ణమాచార్యులు అనే ఆంతరంగిక భక్తుడు ఒకాయన ఉండేవాడు. ఆ వైష్ణవోత్తముడు భక్తిపూర్వకంగా మధురగానం చేసేసరికి స్వామి మెచ్చుకుని అతని ఎదుట ప్రత్యక్షమై ఆచార్యులు పాడే పాటకు అనుగుణంగా నృత్యం చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆచారిలో ఒక విధమైన గర్వం బయలుదేరింది. “ సింహాద్రినాథుడికి నేనే ప్రియమైన భక్తుణ్ణి. స్వామికి నేనుఎంత చెబితే అంత “ అని మనసులో అనుకునేవాడు.

        ఇదే సమయంలో విశిష్టాద్వైత మతాన్ని ఉద్ధరించినటువంటి శ్రీరామానుజ స్వామివారు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ ఈ దేవాలయానికి విజయం చేశారు. మహానుభావుడైన రామానుజస్వామిని అవతార పురుషునిగా ఎంచి అందరూ అనేక విధాల గౌరవిస్తూ ఉండగా కృష్ణమాచార్యులు మాత్రం నమస్కారమైనా చేయక నా అంతటి వాడను నేను అనే అహంభావంతో ఆయనవైపే చూడటం మానివేశాడు.

        సర్వజ్ఞుడైన రామానుజాచార్యులు ఈపాటి గ్రహించలేరా? అతనిమనసుకి పుట్టిన గర్వాన్ని ఇట్టే తెలుసుకున్నారు. ఆయనే స్వయంగా కృష్ణమాచారిని పలుకరించి, వినయపూర్వకంగా “ స్వామీ! కృష్ణమాచార్యోత్తమా! మీరు నాకొక్క ఉపకారం చేసి, తరుణోపాయం చెప్పాలి. ఈ రాత్రి సింహాద్రినాథుని సన్నిధానమందు దేవరవారు గానమొనర్చి, ఆ దేవదేవుని ప్రసన్నునిగా చేసికొన్న తరువాత దాసునికిముక్తి ఉన్నదా లేదా? అని అడగండి. వారు ఏమి సెలవిస్తారో వినండి. తరువాత, మీకు మోక్షంఉన్నదా లేదా? అనికూడా ప్రశ్నించండి. స్వామి చెప్పే ప్రత్యుత్తరం జాగ్రత్తగా తెలుసుకుని రేపు ఉదయాన ఈ దాసునికి తెల్పండి “ అన్నారు.

        ఈ మాటకు కృష్ణమాచారి చాలా సంతోషించాడు.ఏమి అంటే- అవతారమూర్తి అని ఎవరికైతే లోకమంతా జోహారు చేస్తున్నదో, ఆ రామానుజుడే తనను ఈ విధంగా ఆశ్రయించడంకంటే కావలసినదేముంటుంది?

        అందుచేత ఆ రాత్రే తన దివ్యగానం చేత స్వామిని మెప్పించి, ప్రత్యక్షం చేసుకుని “ దేవాదిదేవా! దక్షిణదేశాన్నుంచి రామానుజాచార్యుడనే యతీశ్వరుడు ఒకాయన వచ్చి ఉన్నారు. ఆయనకు ముక్తి ఉన్నదా లేదా? ఈ విషయం దేవరను అడిగి జవాబును చెప్పమన్నాడు. ఏమిటి ఆజ్ఞ ?” అని అడిగాడు.

        అప్పుడు సింహాద్రినాథుడు “ ఓయీ! భక్తవరేణ్యా! ఆ రామానుజుడు కేవలమూ మునీంద్రుడాయెనే. ఆయన యిచ్చిన వారికే ముక్తి కలుగు   తూండగా ఆయనకు ముక్తి ఉన్నదా లేదా? అనేది ఒక ప్రశ్నా? అది సందేహమేనా? “ అని బదులు చెప్పాడు.

        అయితే, “ స్వామీ! నాకు మోక్షం కలదా? “ అంటూ మళ్ళీప్రశ్న వేశాడు కృష్ణమాచారి. అందుకు స్వామి, “ ఓయీ! కృష్ణమాచార్యా! నీవు నాకు ప్రియమైన భక్తుడివే. నిజమే, కాని, నీకు మోక్షమివ్వటానికి మాత్రం నాకు అధికారం లేదు. ఏమంటే, విభూతిద్వయాధికారం ఇదివరకే రామానుజాచార్యునికి ఇచ్చివేశాను,. ఎవరికి మోక్షమివ్వటానికైనా ఆయనే సర్వాధికారి. కనుక, నీకు మోక్షంకావలెనంటే నీవు వెళ్ళిఆయననే ఆశ్రయించాల్సి ఉంటుంది “ అని చెప్పాడు.

        భగవంతుని వాక్యాలు వినగానే అంతులేని అహంకారం చెలరేగి, కృష్ణమాచార్యుడు ఉగ్రుడయ్యాడు. “ ఇంతకాలమై నిన్ను ఆశ్రయించిన ఫలమిదేనా? పరమపదం కోసం పరులను ప్రార్థించమంటావా? అమితమైన భక్తితాత్పర్యాలతో అన్నేళ్ళుగా నిన్ను కీర్తించి భజించానే? చివరకు నన్ను ఇలా మోసగిస్తావా? “ అని నోటికి వచ్చినట్లల్లా నిష్టూరంగా మాట్లాడ జొచ్చాడు.

        ఈ నిష్టురాలకు సహించలేకపోయాడు సింహాద్రినాథుడు. “ కృష్ణమాచార్యా! నీవు రాజసుడివి, తామసుడివి. భక్తితో పాడానని ఏదో మహా ఉపకారంగా చెబుతున్నావే? నీవు పాడావు. నేను ఆడాను. నీ పాటకూ, నా ఆటకూ సరిపోయింది. మరేమీ బాకీ మిగలలేదు. ఇప్పుడు అనాలోచితంగా ఉద్రేకం తెచ్చుకుని నీవు నా పట్ల కఠినంగా మాట్లాడావు. కాబట్టి నీవు రచించిన కీర్తనలన్నీ నీచులపాలై పోవుగాక! “ అంటూ శపించి వేశాడు.

        దేముడిలా శపించే సరికి ఆయన భక్తుడైన కృష్ణమాచార్యునికి కూడా తీవ్రమైన కోపం వచ్చేసింది. “ ఓయీ! అప్పన్నా! సమస్తమూ నీవేనని నమ్ముకుని ఉన్న నన్ను మోసగించావు. నా జీవితమంతా నాశనం చేశావు. ఇదిగో నేనే నిజమైన భక్తుణ్ణయితే, నీ ఆలయమంతా ఒక్క రీతిగా ఏడు రోజులు మండి, గోపురాలూ, మంటపాదులూ అన్నీ కళా కాంతీ లేక పాడిబడి పోవుగాక! “ అంటూ సింహాద్రినాథుడికి ప్రతిశాపం యిచ్చాడు.

        సింహాద్రినాథుని శాపంవల్ల కృష్ణమాచార్యుల కీర్తనలన్నీ నీచుల పాలైనాయి. కృష్ణమాచార్యుని శాప ప్రయోగంవల్ల మరికొద్ది కాలానికే “ మలికనేబు “ డనే మ్లేచ్ఛనాయకుడు బ్రహ్మాండమైన తన దండుతో సహావచ్చి సింహాచలక్షేత్రాన్ని ధ్వంసం చేయబూనాడు. క్రూరుడైన ఆ యవనుడు ఆలయాన్ని ముట్టడించి ఆక్రమించబోతాడనే వర్తమానం మహాభక్తుడు, మహాకవి అయినటువంటి గోగులపాటి కూర్మనాథునికి ముందుగానే తెలిసింది. 

        ఎవరికీ తెలియకుండా ఆయన తక్షణమే దేవాలయ అంతర్భాగంలోకి పోయి కూర్చొని మహాభక్తితాత్పర్యాలతో సింహాద్రి దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు ఫలితంగా అతనికి కవితా ప్రభావం కలిగి “ వైరి హరరంహ! సింహాద్రి నారసింహ “ అనే మకుటంతో సీస పద్యాలు చెప్ప నారంభించాడు. ఈ పద్యాలలో కూర్మనాథకవి, ఆ యవనుడొనర్చే ఘోరాలను శాంతింప జేయమనీ, శత్రుక్షయము చేయుమనీ కోరాడు. సింహాద్రి దేవుని దుర్బలత్వాన్ని హెచ్చరిస్తూ అరవై పద్యాలవరకూ ముందు నిష్ఠురంగా వర్ణించాడు.

        కూర్మనాథుడు అరవై ఎనిమిదో పద్యం చెప్పిన వెంటనే కవిచంద్రుని భక్తికి సంతసించి, స్వామి గండు తుమ్మెదలను సృష్టించాడు. ఆ తుమ్మెదల దండు యవనుల సేనను మర్ధిస్తూ, వాడి అయిన తొండాలతో పొడుస్తూ, చీల్చి చెండాడుతూ సుమారు పదిమైళ్ళ దూరం వరకూ శత్రు దండును పారద్రీలినై.

        ఈ దెబ్బకు తట్టుకోలేక యవనుల దండు వాల్తేరుకు అరమైలు దూరాన ఉండే ఒక మెట్ట వరకు పారిపోయింది. నాటినుంచి ఆ మెట్టకు “ తుమ్మెద మెట్ట “ అనే పేరు వచ్చింది. తుమ్మెదల మెట్ట ఇప్పటికీ ఉన్నది. విశాఖపట్టణానికి అది శ్మశాన వాటికగా ఉపయోగపడుచున్నది. ఈ విధంగా కూర్మనాథకవి సూక్తుల వల్లనే సింహాచలక్షేత్రానికి క్షేమం కలిగింది. తరువాత కూర్మనాథ కవి తన నరసింహ శతకంలోనే స్వామి మహిమను కొనియాడుతూ కొన్ని క్షమాపణా పద్యాలు చక్కగా వర్ణించి చెప్పాడు.

  


21, జూన్ 2025, శనివారం

:: నారదసంసారం :: 

    నారదమహర్షి చాలా  గొప్పవాడు. కాని, అంత గొప్పవానికి కూడా ఒక గర్వం ఉండేది. " అందరూ పెళ్ళిచేసుకుని పెళ్ళామనీ, పిల్లలనీ మాయలో పడిపోతున్నారు. నేను మాత్రం అలాంటి మాయలో పడలేదు. ఎన్నటికీ పడబోను " అంటూండేవాడు. పెళ్ళి చేసుకున్న ప్రతి మహర్షిని ఆక్షేపిస్తూండేవాడు. అతని అహంకారం ఎంతవరకూ వెళ్ళిందంటే, పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే ఆక్షేపించాడు ఒకనాడు. 

    " ఈ త్రిమూర్తులు మరీని. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుకమీద ఉంచుకున్నాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలంమీద కూర్చోబెట్టుకున్నాడు. శివుడు గంగను నెత్తిమీదనే కూర్చోబెట్టుకు మోస్తున్నాడు. పైగా పార్వతీదేవికి సగం శరీరమూ ఇచ్చేశాడు " అని నిందించాడు. 

    నారదుడు తమరినిలా ఆక్షేపించాడని బ్రహ్మవిష్ణుమహేశ్వరులు తెలుసుకోలేక పోతారా? తెలుసుకొన్నారు. కాని నారదుడేమన్నా, తన కొడుకే గనక బ్రహ్మదేవుడు వినీవిననట్లు ఊరుకొన్నాడు. విష్ణుమూర్తి " పోనీ, ఆక్షేపిస్తే వాడి నోరే నొప్పెడుతుందని ఊరుకొనేవాడే గాని శివుడు మాత్రం అలా ఊరుకోనిచ్చాడు కాదు. " ఇలా ఊరుకుంటే ప్రతివాడూ ఇంకా మనల్ని ఆక్షేపిస్తూనే ఉంటాడు. కనుక ఈ నారదుడికి తగిన శాస్తి చెయ్యాలి" అన్నాడు శివుడు. 

    " సరే, అయితే చెప్తాను వీడి పని " అని విష్ణుమూర్తి తగిన సమయానికి ఎదురుచూశాడు. 

    ఆ తర్వాత కొన్ని రోజులయాక నారదుడే వైకుంఠానికి వచ్చాడు. విష్ణుమూర్తి " ఏమిటి విశేషాలు నారదమహర్షీ? " అని అడిగాడు. 

    మూడు లోకాలూ సంచారం చేసి వచ్చిన నారదుడు, " విశేషాలు ఏమి ఉన్నాయి? ఎవణ్ణి చూసినా పెళ్ళాం, పిల్లలూ, సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు, నేనొకణ్ణి తప్ప " అని తన మామూలు ధోరణి మొదలెట్టాడు. 

    విష్ణుమూర్తి మారుచెప్పక, " నారదా! అలా పోయివద్దాము పద " అన్నాడు. నారదుడు విష్ణుమూర్తితో బయలుదేరాడు. 

    ఎక్కడికి అని నారదుడు అడగనూ లేదు, విష్ణుమూర్తి చెప్పనూ లేదు. ఇద్దరూ ఆ కబురూ, యీ కబురూ చెప్పుకుంటూ వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించారు. 

    ఉన్నట్టుండి విష్ణుమూర్తి, " నారదా! నాకు దాహం వేస్తోందయ్యా " అన్నాడు. 

    " నడవండి, ఎక్కడైనా కోనేరు ఉన్నదేమో చూద్దాం " అన్నాడు నారదుడు. 

    విష్ణుమూర్తి, " నేను ఒక్క అడుగయినా వెయ్యలేను. నువ్వు వెళ్ళి, ఏ ఆకు దొప్పలోనో ఇన్ని నీళ్ళు తెచ్చి, నా ప్రాణాలు నిల్పు " అంటూ ప్రాణం పోతున్నవాడికి మల్లే అక్కడ చతికిలబడ్డాడు. 

    " మూడు లోకాలలోనూ ఉండే కోటానుకోట్ల జీవులందరకూ ఆకలీ, దప్పీ తీర్చే మహావిష్ణువుకు దాహమేమిటి? అనే జ్ఞానం లేక నారదుడు విష్ణుమూర్తి మాయలో పడి, " నిజంగా నీరు కావాలి కామోసు " అనుకొని నీటికోసం పరుగెత్తాడు. సమీపంలోనే పుష్కలంగా జలం ఉన్నటువంటి కోనేరు ఒకటి కనబడింది. తామరపూవులతోటి, ఆకులతోటి కలకల్లాడుతూ ఆ సరస్సు ఆ మునికి కన్నుల పండుగు చేసింది. ఆ నీటిని చూడ్డంతోనే, అతనికి కూడా దాహం వేసి, " విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు మొదట నా దాహం తీర్చుకుంటాను " అనుకొని నారదుడు కొలనులోనికి దిగేడు. చాలాదూరం నడిచి నడిచి, కాళ్ళు లాగటం చేత, ఆ కాళ్ళకు నీళ్ళు తగిలేటప్పటికి అతని ప్రాణం లేచివచ్చింది. ఆ చెరువులో స్నానం చేస్తే పూర్తిగా బడలిక పోతుందని తోచి, కంఠంలోతువరకూ వెళ్ళి ఒక్క మునుగు మునిగేడు. 

    మునిగిలేచేటప్పటికి, అంతకు ముందున్న పిలకజుట్టు కాస్తా పోయి, తలనిండా పట్టుకుచ్చులా నిగనిగలాడే బారెడు జుట్టు మొలిచింది. " ఇదేమిటా? అని ఆశ్చర్యపోతూ, చేతులెత్తి తల తడుముకుంటూంటే, అతని ముంజేతుల్ని గలగలలాడుతూ గాజులు కనబడ్డాయి. మెడలో ఉండే తులసి పూసలపేరు ముత్యాలహారమై తళతళమెరిసింది. అతని కాషాయవస్త్రం పట్టుచీరగా మారిపోయింది. గట్టుమీదకి వచ్చి  చూసుకొంటే నారదముని ఒక స్త్రీగా మారిపోయాడు. ఆ చెఱువులో నీరు ఎప్పటిలాగా మళ్ళీ నిశ్చలమై అద్దంలా కనబడింది. ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనబడి " అబ్బో, నేనెంత అందంగా ఉన్నాను " అనిపించింది. 

    అయ్యో! నేను నారద మహర్షినే! ఇలా ఆడదానిగా మారిపోయానేమిటి? అన్న జ్ఞానంగాని, విచారంగాని ఇప్పుడు ఆమెకు లేదు. తనతో కూడా వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకంలేదు. 

    ఆ చెఱువు గట్టమ్మటే నడచి వెళ్ళి, అక్కడేదో పువ్వుల చెట్టు ఉంటే చూసి పువ్వులు కోసుకోవటం మొదలుపెట్టింది. దూరాన్నుంచి విష్ణుమూర్తి ఇదంతా కనిపెట్టి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు. ఆప్పుడు ఆ దారిని ఒక రాజకుమారుడు వేటకని వచ్చి, విష్ణుమూర్తిని చూచి ఎవరో అనుకొని  " అయ్యా! దాహం వేస్తోంది, సమీపంలో చెఱువు ఏదైనా ఉన్నదా? " అని అడిగాడు. విష్ణుమూర్తి రాజకుమారునకు నారదుడు సంచరిస్తూన్న ఆ కొలనువైపు చూపించాడు. ఆ రాజకుమారుడు అక్కడకు వెళ్ళి, తలలో పువ్వులు అలంకరించుకొని ఒయ్యారంగా నిలబడ్డ ఆ అందగత్తెను చూసి " ఎవరు నువ్వు? గంధర్వ కాంతవా? లేక అప్సరసవా? లేక వనదేవతవా? " అని అడగడం మొదలెట్టేడు. 

    తానెవరో తనకే తెలియక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడి పోయిందామె. " సరే! నువ్వెవరివైతేనేమి? చాలా అందంగా ఉన్నావు. నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను. నాతో వచ్చేసెయ్యి. నాకు రాణిగా ఉందువుగాని " అన్నాడు. పెళ్ళి అనటంతోనే ఆమెకు సరదాపుట్టి ఆ రాజుతో వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి శివుడి దగ్గరకెళ్ళి జరిగినదంతా చెప్పాడు. శివుడూ, పార్వతి మొదలైన వాళ్ళంతా కడుపులుబ్బేటట్లు నవ్వుకున్నారు. 

    అక్కడ రాజు ఆమెను పట్టణానికి తీసుకెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు. ఆమెకు ఒకరూ, ఇద్దరూ కాదు - వరసన అరవైమంది పిల్లలు పుట్టేరు. వాళ్ళకు ప్రభవుడు, విభవుడు, శుక్లుడు మొదలైన అరవై పేర్లూ పెట్టించింది. ఆ పిల్లలకు నీళ్ళు పొయ్యడం, బొట్టూకాటుకా పెట్టడం, బట్టలు తొడగడం, బువ్వ పెట్టడం, నిద్దర పుచ్చడానికి, జోల పాడడం - ఈ పనులతో ఆమెకు పొద్దస్తమానం సరిపోయేది. " పిల్లలూ, సంసారం మాయ " అని అందర్నీ ఆక్షేపించే నారదుడే ఇలా ఓ పెద్ద సంసారంలో తగులుకొని, ఆ సముద్రంలో ఊపిరి సలుపకుండా కొట్టుకోడం మొదలెట్టేడు. శివుడూ, విష్ణువూ కూడా " మంచి శాస్తి అయింది నారదుడికి " అని సంతోషించారు. కాని, బ్రహ్మదేవుడికి మటుకి నారదుడు తన కొడుకే గనుక, అతను అవమానింప బడటం బాధగానే ఉంది. " కుఱ్రవాడేదో తెలియక అంటే ఇంత కఠిన శిక్ష వెయ్యడం ఏమిటి? " అని విష్ణుమూర్తి వద్ద బ్రహ్మ సణిగాడు. 

    బ్రహ్మమాత్రం ఎవరు? తన కొడుకేగా! అంచేత విష్ణుమూర్తి తాను నారదుణ్ణి స్త్రీగా మార్చి సంసారంలో తగిలించటం బ్రహ్మకు బాధగా ఉందని తెలియటంతోనే, ఆమెను మళ్ళీ నారదునిగా మార్చివేద్దామని నిశ్చయించుకున్నాడు. కాని నారదుడు స్త్రీగా మారి తీరా సంసారంలో ఎలాగూ ప్రవేశించాడు గనుక అదెటువంటి మాయో అతను అనుభవ పూర్వకంగా తెలుకొని మరీ అవతలకు రావటం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు. 

    ఆలోచించి ఏం చేశాడంటే, ఆ రాజు పాలించే రాజ్యం మీదికి ఒక శత్రురాజు సైన్యంతో దండెత్తి వెళ్ళేటట్లు చేశాడు. ఆ రాజుకీ ఈ రాజుకీ పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారదుడు స్త్రీగా మారి పెండ్లి చేసుకున్న రాజూ, ఆ రాజువల్ల ఆమెకు కలిగిన అరవై మంది కొడుకులూ ఒక్కరైనా మిగలకుండా చచ్చిపోయారు. 

    భర్త, పిల్లలూ యుద్ధంలో చనిపోయారని తెలిసేటప్పటికి ఆమెకు దు:ఖం ఆగలేదు. తాను రాణినన్న మాటే మరచిపోయి ఆమె యుద్ధభూమికి వచ్చేసి, భర్త శవాన్ని, కొడుకుల శవాల్నీ చూసి గుండె బాదుకుంటూ ఏడవడం మొదలెట్టింది. " సంసారం-పిల్లలు-ఇదంతా మాయ " అన్న నారదుడేనా యీమె అని విష్ణుమూర్తికే ఆశ్చర్యం వేసింది. ఆమెకు అతడక్కడ ప్రత్యక్షమై, " నారదా! నాకు మంచినీళ్ళు తెస్తానని వెళ్ళి, ఇక్కడిలా ఏడుస్తూ కూచున్నావేమిటి? " అని అడిగాడు. 

    కాని, ఆ స్త్రీకి తాను నారదుడన్న జ్ఞానం ఇంకా రాలేదు. " నేనీ పట్టణపు రాణిని. నన్ను నారదుడంటావేమిటి? అందామె. 

    " నాతో రా, చెపుతా " అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్ళీ ఆ చెఱువు దగ్గరకు తీసుకెళ్ళి, " ఆ చెఱువులో దిగి స్నానం చేసి రా, ఒక చెయ్యి మాత్రం నీటికి తగులకుండా పైకెత్తి స్నానం చెయ్యి " అన్నాడు. ఆమె అలాగే చేసి గట్టుమీదకొచ్చింది. ఏమి ఆశ్చర్యం! జుట్టంతాపోయి పిలక వచ్చింది మళ్ళీ. ముత్యాలహారం తులసి పేరుగా మారిపోయింది. కాని పెకెత్తి ఉంచిన చెయ్యి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది. 

    నారదునికి నిద్రపోయి లేచినట్లయింది. తాను రాణి అయి అరవైమంది పిల్లల్ని కనటం, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి, యుద్ధంలో చనిపోయి వాళ్ళకోసం తాను ఏడవటం - ఇదంతా ఒక కలగా జ్ఞాపకానికి వచ్చింది. కాని, ఆ గాజుల చెయ్యి చూసుకుంటే, " కలకాదు నిజమే! " అని తేలింది. తనూ సంసారపు మాయలో తగులుకున్నందుకు నారదుడు సిగ్గుపడ్డాడు. 

    విష్ణుమూర్తి, " సిగ్గు అక్కర్లేదు నారదా, ఇది వరకు నీకు సంసారం అంటే యేమిటో, మాయ అంటే ఏమిటో తెలీదు. అందులో పడి, దు:ఖం అనుభవించావు. కనుక ఇప్పుడు తెలిసింది. ఇంక నువ్వు జ్ఞానివవుతావు " అని నచ్చచెప్పేడు.  

    నారదుడు ఆ మాటలకు సంతోషించాడు. కాని, తాను స్త్రీ అయినప్పుడు పుట్టిన అరవైమంది పుత్రులమీదా అతనికి మమకారము పూర్తిగా పోయింది కాదు. అంచేత అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరకెళ్ళి " తండ్రీ! నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి " అని కోరుకున్నాడు. 

    కుమారుని కోర్కె ప్రకారం బ్రహ్మ " సరే " నని చెప్పి ప్రభవా, విభవా, శుక్లా మొదలైన ఆ అరవై మంది పేర్లు మన సంవత్సరాలకి పెట్టి, లోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశాడు. 

    

15, జూన్ 2025, ఆదివారం

 :: శ్రీ ముఖలింగేశ్వరుడు :: 

    చాలా కాలానికి పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సవరవాడు చిన్న గెడిసె వేసుకొని కాపురం ఉండేవాడు. 

    అతనికి యిద్దరు భార్యలు. అందులో పెద్ద భార్య ఉత్తమురాలు. చిన్న భార్య గయ్యాళి గంప. ఈమెకు కోపము, ద్వేషము, అసూయ మొదలయిన దుర్గుణాలన్నీ ఉన్నాయి. పెద్దామె పరమ సాత్వికురాలు. సవతి ఎన్ని విధాలు తిప్పలు పెట్టినా ఊరుకొనేది కాని, పల్లెత్తు మాట ఆడి ఎరుగదు. 

    రోజురోజుకూ చిన్న భార్య ఆగడం మరీ ఎక్కువయిపోతున్నది. పెద్దామె లొంగినకొద్దీ మరింత లోకువకట్టి, చిన్న భార్య అస్తమానం భర్తతో చాడీలు చెప్పటం, పేచీలు పెట్టటం ప్రారంభించింది. 

    సవరివాడి భార్యలిద్దరకూ ఒక్క క్షణమైనా పడటంలేదు. వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకోవటం చూసి, అతను ఇక ఈబాధ పడలేననుకున్నాడు. తను కాపురమున్న గుడిసెను రెండు భాగాలుగా చేసి, తూర్పు భాగం పెద్ద భార్యకూ, పడమటి భాగం చిన్న భార్యకూ పంచి యిచ్చాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య యింట్లో ఉండటానికి నిర్ణయం చేసుకున్నాడు. 

    వాళ్ళ పెరట్లో ఒక మారేడు చెట్టూ, పారిజాతం చెట్టూ కలసి పుట్టి పెద్ద మానులయ్యాయి. ఆ ఇల్లు రెండు భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగా గోడమందడికి వచ్చాయి. ఇద్దరు భార్యలూ ఎవరి భాగం వేపున ఉన్న కొమ్మల పువ్వులు వాళ్ళు కోసుకొని తలలో పెట్టుకొనేవాళ్ళు. 

    సరే, ఈ పద్ధతి బాగా ఉంది. ఇక భార్య లిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారు. ఇకముందు పేచీలేవీ ఉండవు. మనస్సుకు కాస్త శాంతి ఉంటుందికదా అని సవరవాడు ఆశపడ్డాడు.   

    కానయితే, చిన్నభార్య చుప్పనాతితనం  ఎప్పటిలాగానే ఉంది. ఆమెకు పెద్దామె పైన ఉండే అసూయ ఎంతమాత్రమూ తగ్గలేదు. సమయం దొరికినప్పుడల్లా పెద్దామె పైన కసి తీర్చుకుందామనీ, ఆమెను కష్టపెడదామనే చిన్నభార్య ఎదురుచూస్తూ ఉండేది. 

    పెద్దామె దైవభక్తి గలది. మారేడు చెట్టులో ఈశ్వరుని అంశ ఉందనీ, పారిజాతం పువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమనీ పెద్దలవల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకొన్నది. దేవుని మహిమ తెలిసిన భక్తురాలు కనుక పెద్దభార్య, పెరట్లో ఉండే మారేడుతో కలసిన పారిజాతపు చెట్టును దేవునిగా భావించింది. ప్రతిరోజునా ఆ చెట్టుక్రింద అలికి ముగ్గుపెట్టి భక్తితో పూజించేది. 

    చిన్నభార్యకు పతిభక్తి లేదు. దైవభక్తి అంతకంటే లేదు. అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం  లేదు. పైగా సోమరిపోతు. అందుచేత ఇల్లు తుడిచిన ధూళీ, దొడ్డి తుడిచిన చెత్తా అంతా పోగుచేసుకు వచ్చి తనవేపున ఉండే ఆ చెట్టుకింద పారబోస్తూ ఉండేది. 

    అదేమి మాయోగాని, ప్రతిరోజూ తెల్లవారే సరికి పెద్దభార్య భాగం వేపున ఉన్న కొమ్మలు బంగారపు పువ్వులు పూచేవి. చిన్నభార్య భాగంలో ఉన్న కొమ్మలు, మామూలు పారిజాతం పువ్వులే పూచేవి. రోజూ బంగారం పువ్వులు దొరకటం వల్ల కొన్నాళ్ళకు పెద్దభార్య భాగ్యవంతురాలై పోయింది. 

    కొంతకాలం గడిచింది. పారిజాతం చెట్టు తూర్పుకొమ్మలకు బంగారుపూలు పూస్తున్నాయని చిన్నభార్య చెవిని పడింది. తనకు భర్త అన్యాయంచేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకుని, భర్త ఇంటికి రాగానే " నాకు తూర్పు భాగం కావాల" ని అడిగింది చిన్నభార్య. 

    " సరే, నీ యిష్టం వచ్చిన భాగం తీసుకో " అని సవరవాడు చిన్నభార్యకు ఆ భాగాన్ని యిచ్చేశాడు. పెద్దభార్య యిప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది. మళ్ళీ పూర్వంలాగే ఆమె యిక్కడ కూడా శుభ్రంగా బాగుచేసి మారేడుచెట్టును పూజించ సాగింది. 

    మామూలుగా తెల్లవారే సరికి పెద్దభార్య భాగంలో మళ్ళీ బంగారు పువ్వులు రాలుతూ ఉండేవి. " తెడ్డు ఎక్కడికి వెళ్ళినా ఏగానే " అన్నట్టు, సోమరిపోతు అయిన చిన్నభార్య తూర్పు భాగానికి వెళ్ళినా, ఆమె ఆ చెట్టును పూజించనూ లేదు, ఆమెకు బంగారు పువ్వులు దొరకనూ లేదు. 

    ఓ రెండురోజులు పోయాక, చిన్నభార్య ఉదయాన్నే లేచి పెద్దామె బంగారు పువ్వులు కోసుకుంటూ ఉండడం చూసింది. చిన్నభార్యకు మళ్ళీ అసూయ కలిగి, ఈ బంగారు పువ్వుల సంగతి భర్తకు చెప్పి, రోజూ ఆ పువ్వులు దొంగతనంగా తనకు తెచ్చి యిమ్మంది భర్తను.

    సవరవాడికి దొంగతనం ఇష్టంలేకపోయింది. " నే తెచ్చి యివ్వను " అనేశాడు. చిన్నభార్య రోజూ తెమ్మని నానా హంగామా చేస్తూండేది ఇంట్లో. ఇంక సవరవాడు ఆమె బాధ భరించలేక " ఈ చెట్టు ఉండటం మూలానే కదా యిన్ని తగవులు వస్తున్నాయి " అని ఆలోచించి, గొడ్డలి పుచ్చుకొని ఆ చెట్టు మొదటికే నరికేశాడు. 

    రెండు చెట్లు కలసి పుట్టడం మూలాన, పారిజాతం చెట్టుతో బాటు మారేడుచెట్టు కూడా పడిపోయింది. 

    ఆ మారేడుచెట్టు పడిపోగానే దాని మొదట్లోంచి రక్తం చిమ్మింది. " చెట్టులోనుంచి రక్తం చిమ్మడం ఏమిటి? అని ఆశ్చర్యంగా చూశాడు సవరవాడు. ఏమీ కనబడలేదు. గునపము తెచ్చి కొంచెం చుట్టూ త్రవ్వాడు. " ఒసేవ్! దేవుణ్ణి నరికేశానే " అమ్మో!" అంటూ త్రుళ్ళిపడి యింట్లోకి పరుగెత్తాడు. ఈ ఆశ్చర్యం చూడటానికి, భార్యలిద్దరూ పరుగెత్తుకు వచ్చారు. 

    అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది. దానికి నోరు, ముక్కు, కళ్ళు, సరిగ్గా మనిషికున్నట్టే ఉన్నాయి. గొడ్డలితో నరకడం మూలాన తలమీద చిన్న గాయం పడి, రక్తం కారుతున్నది కూడా పాపం ఆ ఈశ్వరుడికి. అయ్యో! దేవుణ్ణి నరికామే అని చాలా విచారించి, దంపతులు ముందు ఆ గాయం కడిగారు. తక్షణమే సవరవాడు అడవికి పోయి, తనకు తెలిసిన మందు ఆకులూ, మూలికలు తెచ్చి, పసరుపిండి గాయానికి పూశాడు. 

    " అయ్యో! దేవుణ్ణి కొట్టాను గదా, దేవుడేమి చేసి పోతాడో ! " అని భయపడ్డాడు పాపం సవరవాడు. ఎంత నిద్ర పోదామన్నా నిద్ర పట్టలేదు. వాడికి చివరకు ఎల్లాగో, వేకువ సమయాన చిన్న కునుకు పట్టింది. 

    కలలో ఈశ్వరుడు కనబడి " ఓయీ! సవరా! నీవేమి భయపడకు. నేనక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు? పాపం, తెలియక చేశావు. రేపు ఉదయాన్నే, నువ్వు ఇక్కడినుండి బస మార్చి, వేరే అడవికి పో! తరువాత పట్టణానికి పోయి, రాజుగారితో ఈ సంగతంతా చెప్పు. నీ దరిద్రం తీరిపోతుంది " అని చెప్పి మాయమైనాడు. 

    కల వచ్చిన వెంటనే సవరవాడు కన్నులు నులుముకుంటూ లేచి, భార్యలిద్దరనూ లేపాడు. ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్ళకు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యం పొందారు. దేవుని మహిమలు తెలిసిన పెద్దభార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం. అందుచేత ఒక్క క్షణమైనా ఆలశ్యం చేయక ఈశ్వరుని ఆజ్ఞ శిరసావహించాలని ఆమె భర్తను తొందర పెట్టింది. 

    తెల్లవారి లేవగానే, ఇంక ఆ స్థలంలో నిలువకుండా, భార్య లిద్దరనూ వెంటబెట్టుకొని సవరవాడు ఇంకో అడవికి కాపురం మార్చివేశాడు. ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయటానికి ఆ రోజే పట్నం వెళ్ళాడు. 

    పట్టణంలో ఉన్నవాళ్ళంతా, సవరవాడు చెప్పిన కథవిని చాలా అశ్చర్యపోయారు. చెట్టులో శివుడు ఉండటం ఏమిటని, సవరవాడూ, పట్టణంలోని ప్రజలూ, అందరూ కలసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే, రాజుగారికి కూడా ఆశ్చర్యమేసింది. చెట్టులో పుట్టిన శివుణ్ణి చూడటానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరాడు.

    ఆ అడవిలోంచి " వంశధార " అనే నది ప్రవహిస్తున్నది. దాని ఒడ్డున ఒక చిన్న సవర పల్లె ఉంది. రాజు, అతని పరివారమూ కూడా ఆ గ్రామానికి వెళ్ళి " ఆ దేవుడుండే స్థలం ఇక్కడికెంత దూరం?" అని గ్రామస్థులను అడిగారు. 

    " బాబూ! ఇక్కడి కింకా రెండు మైళ్ళ దూరం ఉంది. అదుగో, ఆ దిక్కు చూడండి, ఆ కనబడుతున్న శిఖరమే దేవాలయం " అన్నారా పల్లెవాళ్ళు. అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో, ఆ శిఖరం బంగారంలా మెరుస్తున్నది. సవరవాడూ, రాజూ, పరివారం, అందరూ ఆశ్చర్యపోయారు, నిన్నటికి లేని గుడి యివాళిటికెలా తయారయిందా! అని. 

    " ఆ గుడి ఎవరు కట్టారు? " అని రాజు పల్లెవాళ్ళను అడిగాడు. 

    " బాబూ! అదేమో మేము ఎరుగము, కాని నిన్న రాత్రి తెల్లవార్లూ అక్కడ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగుతోపాటు చాలామంది జనం మాట్లాడిన సందడి కూడా వినబడింది. మేము అందరం, అదేమిటో చూద్దామని కొంచెం దూరం పోయే సరికి దార్లో పులులు, సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయికావు. అందుకని తిరిగి వచ్చేశాము. ఉదయం లేచి చూద్దుముకదా, అక్కడ గుడి కనబడింది. ఈ విధంగా గుడికట్టడం మానవులవల్ల కాదు. తప్పకుండా ఇది దేవతలు చేసినపనే అనుకున్నాము. ఇంతే మాకు తెలిసినది " అని పల్లె వాళ్ళు చెప్పారు. 

    ఈ సంగతి వినేసరికి అందరకూ చాలా ఆశ్చర్యంవేసి, తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరకు పోయారు. ఆ గుడికి వెనుక భాగంలో పారుతున్న " వంశధార "  నదిలో స్నానం చేసి అందరూ గుడిలో ప్రవేశించారు. లోపల రెండు వెండి దీపపు సెమ్మెలలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాళ్ళకి కనబడింది. విగ్రహం తలమీద మాత్రం చిన్న లొట్ట కనబడింది. అదే, సవరవాడు నరకడంవల్ల ముక్క పోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడుచెట్టు గాని, పారిజాతంచెట్టు గాని, సవరవాడి గుడిసె గాని ఏమీ కనబడలేదు. 

    రాజుగారు, వెళ్ళిన జనం అంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి " ముఖలింగేశ్వరుడు " అని పేరు పెట్టారు. పువ్వులు, పత్రి తెచ్చి భక్తితో పూజించారు. ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసిచ్చారు. 

    ఇటువంటి గొప్ప దేవుణ్ణి సవరవాడు ముందుగా చూశాడు కాబట్టి, వాడికి చాలా ధనం ఇచ్చారు. సవరవాడికి కలలో ఈశ్వరుడు కనబడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినై. ఇదంతా దేవుని మహిమ కదా అని వాడు ఎంతో సంతోషించి, అప్పటినుంచి గొప్ప ఈశ్వర భక్తునిగా మారిపోయాడు. 

    గుడి తయారుగానే ఉంది కాబట్టి, రాజుగారు దేవునకు అనేకమంది అర్చకులను నియమించారు. ఆ అర్చకులందరకూ అక్కడనే ఇళ్ళు కట్టించి యిచ్చారు. ఇళ్ళన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారయింది. ఈ విధంగా వెలసిన ఆ గ్రామానికి కూడా " ముఖలింగం " అని రాజు గారు పేరు పెట్టారు. 

    సవరవాడు గుడిసె వేసుకొని నివసించిన ఆ అడవి ప్రదేశంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలిసింది. అక్కడ ఎల్లప్పుడూ అతి వైభవంగా అర్చనలూ, అభిషేకాలూ జరుగుతూ ఉంటాయి. శివరాత్రినాడు ముఖలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నమాట. 

    కొంత కాలమయిన తరువాత, భూమి దున్నుకునే వాళ్ళకు, నూతులు త్రవ్వుకొనే వాళ్ళకు ఎక్కడికక్కడే బోలెడన్ని శివలింగాలు కనబడుతూ వచ్చాయి. ఆ ఊరిచుట్టూ, ఎక్కడ చూసినా శివలింగాలే. 

    ఒక్కొక్క శివలింగానికి " భీమేశ్వరుడు " "సోమేశ్వరుడు " అంటూ పేర్లుపెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే ఆ " వంశధార " నది ఒడ్డునా, తోటల్లోనూ, కొన్ని ఇళ్ళలోనూ శివలింగాలు కనబడుతూనే ఉంటాయి. 

    ఇక్కడ దొరికే లింగాలు కోటికి ఒక్కటి తక్కువగా ఉన్నవని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. అదీగాక, వంశధారా నది గుడికి ముందు కాకుండా వెనుకవైపు ప్రవహించడం గూడా ఒక లోపమేనట. ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేది అని వారి ఉద్దేశం. 

    

    

    
 

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...