11, జనవరి 2026, ఆదివారం

::  వాతాపి బాదామిగా ఎలా మారింది ::


    శత్రుంజయుడు  ఎలుకతో  చళుకవర్మను దూరంగా చిన్న యింటికి తరిమి, " నువ్వు మామధ్య ఉండవలసిన వాడవు కావు. నీ ఎలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్టు, ఆ వాహనం జాతిదే నీకు దగ్గ యిల్లాలు. నీ యిల్లాలు అసూర్యం పశ్యగా ఎవరికీ కనపడకుండా ఉండే అంత:పుర కాంతగా ఉండడానికి ఇంటినిండా ఎలుక బిలాలు ఉన్నవిలే " అంటూ ఎకసెక్కెం చేశాడు. 

    చళుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా, " తండ్రి, కుమారులందరికీ పెళ్ళి చేయడమనేది చాలా గొప్ప విషయం. ఎవరి కెవ్వరో అది ఏనాడో రాసిపెట్టిందే అంటారు. మన చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆ విఘ్నేశ్వరుని ఇచ్ఛ కదా! " అన్నాడు. 

    చళుకుడు ఉత్తమ గ్రంథాలను చదువు తున్నప్పుడు చుళుక ప్రక్కనే చేరి వింటూ ఉండేది. చళుకుడు విఘ్నేశ్వరుని అర్చిస్తూన్నప్పుడు నోటితో పువ్వులు అందించేది. చళుకుడు తిన్న తరువాత పెడితేనే తినేది. అలా కాలం గడుస్తూండగా వినాయక చవితి దగ్గరకొచ్చింది.  

    అందరూ ఇళ్ళకు వెల్లవేసి ధాన్యాలు దంచుకొంటున్నారు. చుళుక రాత్రికి రాత్రి ఎలుకలన్నింటిని పిలిచింది. ఎలుకలు తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి. పళ్ళతో పైపొట్టు ఒలిచి ధాన్యాన్ని మెరికల్లా బియ్యం చేశాయి. 

    వినాయక చవితి ఉదయాన చళుకుని వదినలు స్వయంగా బంగారు బిందెలతో నదీ జలాన్ని నెత్తి నెత్తుకొని వస్తున్నారు. అది చూచి చళుకుడు కొద్ది విచారం కనబరిచాడు. 

    చుళుక వెంటనే బిందెలో దూరి దొర్లించుకుంటూ నదీ తీరాన్ని చేరుకుని యివతలకు వచ్చి కొండంత బిందెనూ, పొంగి పొర్లి ప్రవహిస్తున్న నదినీ చూసి హతాశురాలై " బిందెనైతే దొర్లించుకొచ్చాను గాని నీళ్ళెలా ముంచగలను? బిందెతో ఎలా మోసుకెళ్ళగలను? అవివేకురాలిని. పనికిమాలిన దానిని. నేనెందుకు బ్రతికి? " అని అనుకుంటూ, తలను అక్కడున్న రాతికేసి కొట్టుకుంటూండగా విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, ఎలుకను చేతితో ముద్దుగా నిమిరాడు. శాపవిమోచనమై, ఎలుకరూపు మాయమై దేవకాంత కళ్యాణ కింకిణి నిజరూపంతో విఘ్నేశ్వరుడి పాదాలమీద ప్రణమిల్లి, అనేక విధాల స్తుతించింది. విఘ్నేశ్వరుడు కళ్యాణ కింకిణిని ఆశీర్వదించి  అంతర్ధానమయ్యాడు. 

    కళ్యాణ కింకిణి నీళ్ళబిందెను తలకెత్తుకొని నడిచి వెడుతూంటే, దారిపొడవునా ప్రజలు బొమ్మలవలె నిల్చుని చూస్తూ " ఎవరీ దేవసుందరి? ఎవరింటికి వెడుతున్నది " అని విస్తుపోయారు.   

    చళుకవర్మ వదినలు కళ్యాణ కింకిణి తమ చిన్న మరది యింటిలోకి వెళ్ళడం చూసి, ముఖాలు వేలాడ దీసుకున్నారు. 

    శత్రుంజయుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి, చళుకవర్మను సతీసమేతంగా రాజమందిరానికి తోడ్కొని వచ్చాడు. 

    చళుకుని అన్నలు తండ్రితో " మాకూ అలాంటి ఎలుకలతోనే ఎందుకు పెళ్ళిళ్ళు చెయ్యలేదు అలా చేసి ఉంటే మాకూ అప్సరసలే తయారై వచ్చి ఉండేవారు కదా! " అని గద్దించి అడిగారు. 

    ఇటువంటి తెలివిమాలిన కొడుకుల కోసమా నేను సామ్రాజ్యాన్ని ఆర్జించి పెట్టింది అని శత్రుంజయుడు  విరక్తి చెంది తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు పోయాడు. 

    చళుకవర్మ అన్నలు అసంతృప్తి, పరస్పర ద్వేషాలతో కలహించి యుద్ధాలు చేసి కొట్టుకు చచ్చారు. ఎంత వద్దంటున్నా వినక, ప్రజలు చళుకవర్మను తమ రాజుగా ప్రకటించుకున్నారు. చళుకవర్మ పాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవించారు. 

    చళుకవర్మ కళ్యాణి కింకిణి పేరున కళ్యాణి అనే మరో గొప్ప నగరాన్ని నిర్మించాడు. అతనికి కళ్యాణి కింకిణి వలన నలుగురు పుత్రులు కలిగారు. వారు చాళుక్యులుగా పిలువబడ్డారు. ఆ విధంగా చాళుక్య రాజవంశాలకు మూలపురుషుడైన చళుకవర్మ కాలంలో వాతాపి నగరం అనేక దేవాలయాలతో, ప్రాకారాలతో శోభిల్లింది. కళలకు కాణాచిగా, విద్వాంసులుకు, పండితులకు ఆటపట్టుగా, భూతల స్వర్గం అనిపించుకుంది. నగరాధిదేవతగా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడ్డాడు. ఉత్కృష్ట శిల్పానికి ప్రామాణికమైన ఆలయ మంటప శిల్పాన్ని చూడడానికి దేశం నలుమూలలనుంచి రాజులు మొదలుకొని సామాన్య యాత్రీకుల వరకూ ఎల్లప్పుడూ వస్తూండేవారు. 

    చాళుక్యులు నాలుగు దిక్కులా రాజ్యాలు ఏర్పరచుకొని పాలించారు. చాళుక్యవంశ రాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు చేశారు. వాతాపి నేలిన వారు వాతాపి చాళుక్యులని, కళ్యాణి నగరాన్ని పాలించిన వారు కళ్యాణి చాళుక్యులని, వేంగి నేలినవారు వేంగీ చాళుక్యులని, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, సౌరాష్ట్ర చాళుక్యులుగా పేరొందారు. కాలక్రమాన వాతాపిని బాదామి అనిగూడా వ్యవహరించారు. 
 
( సశేషం! వచ్చేవారం మరొక విఘ్నేశ్వర వినోద గాథ! అంతవరకూ శలవు! సర్వేజనా సుఖినోభవన్తు! స్వస్తి!! ) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...