:: అత్తాకోడళ్ళ పరివర్తన ::
శ్రోతక మహాశయులకు క్రొవ్విడి వెంకట రాజారావు అనేక నమస్కారములు. విఘ్నేశ్వర వైభవ లీలలకు సంబంధించిన కథలలో భాగంగా ఈ వారం అత్తాకోడళ్ళను బాధించిన " పిశాచాల భరతం పట్టిన ఏనుగు " నకు సంబంధించిన వృత్తాంతం విందాం. విన్న తరువాత బాగుంటే లైక్ చెయ్యండి. తప్పకుండా ఛానల్ ను ఫాలో అవండి.
పావనమిశ్రుడు సాయంత్రం వేళల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలోని గోడలపై చిత్రితమై ఉన్న విఘ్నేశ్వరుని గాథలు పిల్లలకు చెబుతూండేవాడన్న విషయం మనకు తెలిసిందే కదా! మరొక సాయంత్రం ఒక బాలిక మంటపం గోడలపైగల ఒక చిత్రాన్ని చూపించి అడిగిన కథను ఆయన ప్రారంభించి ఇలా చెప్పసాగాడు.
కళ్యాణి నగరంలో కలహకంఠి అనే ధనికురాలు, కోడలు పుట్టింటినుంచి ఎక్కువగా నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెటి పెట్టి, చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది.
కలకంఠి అని నామకరణం చేయబడినప్పటికీ, కలహకంఠి గా పేరుపొందిన ఆ ధనిక అత్త కోడలు సౌదామిని, పుట్టెడు దు:ఖంతో పుట్టింటికి బయలుదేరి దారితప్పి అరణ్యంలో పడి, ఆకలితో అటమటించి పోతూ ఒక వెలగచెట్టు దగ్గర పడిపోయింది.
తను పుట్టింటికెళ్ళి కూడా ప్రయోజనంలేదు. తన పెళ్ళికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. మరి నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు అనుకుంటూండగా చెట్టునుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్లుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకుని సౌదామిని లేచి కూర్చుంటుండగా భూమి అదిరేలాగ ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది.
సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై భక్తివిశ్వాసాలు కలది. విఘ్నేశ్వరుణ్ణి తలచుకొని ఏనుగు పాదాల క్రింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు ఠక్కున ఆగిపోయింది.
ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండుని తొండంతో తీసుకొని నోటవేసుకొని, దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామని తల నిమిరి తొండంతో చేయి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకువెళ్ళింది.
గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి, గజరాజు లోపలికెళ్ళి కొంతసేపయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకువచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాల్ని, కంఠాభరణాల్ని ఆమె మెడనిండా వేసి, తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి, మిగతా నగలను ధరించినన్ని ధరించి, తక్కినవి మూటకట్టుకొని తీసుకెళ్ళమని సైగచేసి చెప్పింది.
సౌదామిని అలాగే చేశాక, ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది.
బంగారు విగ్రహంలాగా నగలుతో తళుక్కు తళుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంఠి నిర్ఘాంతపోయి, సంబాళించుకొని, మెల్లమెల్లగా ఆ నగలన్నీ ఎలాగ వచ్చాయో చెప్పేవరకు వేధించి, సౌదామిని చెప్పినదంతా విని, " ఏనుగుకు వెలగపళ్ళు అంత ఇష్టమన్నమాట " అని తల పంకించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపళ్ళు కొనుక్కు వచ్చింది.
నగలు నింపుకుని రావడానికి ఒక గట్టి గోతాన్ని భుజాన వేసుకొని , వెలగపళ్ళ సంచితో కలహకంఠి బయలుదేరింది.
అరణ్యం ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగచెట్టు కనబడక విసిగి, ఒక చింతచెట్టు క్రింద చతికిలపడి, తినాలని వెలగపండు తీసింది.
తినాలనే తీసినా ఎలాగో నిగ్రహించుకొని, వెలగపండు చేత్తో ఎత్తిపట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగును రమ్మంటూ గట్టిగా భజన పాట మొదలెట్టింది. పాట సాగుతున్నది. ఏనుగు రాలేదు కాని, అడవి దద్దరిల్లేలాగా గాండ్రు మనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారము కాబోలు అనుకొని కలహకంఠి సంతోషపడుతూ మెడచాచి చూడగా పెద్దపులి దూకుతూ రావడం కనిపించింది.
భుజంమీది గోతాన్ని వదలకుండా కలహకంఠి తిరిగి చూడకుండా పరుగెత్తి, పరుగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం సరిగా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. తన అదృష్టానికి కలహకంఠి పొంగిపోతూ గుహలోకి వెళ్ళింది.
గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూచి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగ నగలన్నీ వేసుకొని, గోతంనిండా నగలు కుక్కి మూతికట్టి, ఎత్తలేక ఎత్తి, మోయలేక మోస్తూ, నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో, తెల్లగా మెరుస్తున్న కోరపళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగ కనిపించింది.
ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగ " ఓహో కలహకంఠీ! నువ్వు కోడల్ని కాల్చుకుతినే అత్తవైతే, అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని. నా చరిత్ర విను " అంటూ చెప్పడం ప్రారంభించింది.
వెనుకటికి నేను చురకత్తిలాంటి అందగత్తెను. అమ్మ, నాన్న పెట్టినపేరు కలహంసి. కాపురానికి వెళ్ళాక, నా నోటి ప్రతాపానికి ఆ పేటంతటికీ నేను సంపాదించుకొని సార్థకపరుచుకున్న పేరు కలహదుందుభి.
నువ్వెంత చెడ్డ అత్తవో, కలహంఠీ! నా అత్త అంత ఉత్తమురాలు. పరమ సాధువు.
నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే, నేనెంత ఉత్తమ ఇల్లాలునో ఊహించుకో! నాకు నగల పిచ్చి అంతా ఇంతా కాదు. బంగారు పంటలు పండే భూములు పుట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కుపుల్ల నుంచి అన్నీ నాకే యిచ్చేసింది.
అటువంటి అమాయకురాలైన అత్తను, ఒకపూటైనా సరిగా తిననిచ్చేదానను కాను. చిక్కి శల్యమైన వృద్ధురాలిచేత ఇంటి చాకిరీ అంతా చేయించేదాన్ని.
చివరికి నా అత్తమామలు విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్నుమూద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా లాక్కోవటంతో, ఆవిడ తూలిపడిపోయి, ఆయాసంతో రొప్పుతూ కనుమూసింది.
అంతవరకూ ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అనని నా మామగారు, ఆపలేని దు:ఖంతో, పైకుబికిన కోపంతో " పాపిష్ఠిదానా! నువ్వు మా కోడలివయిపోయినావు. లేకుంటే శపించేవాణ్ణి. ఎప్పటికైనా, మా ఒక్కగాని ఒక్క కొడుకు తిరిగివస్తాడనీ, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను. వాడొస్తే సరిగా చూడు " అని చెబుతూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు. తపశ్శాలి.
అదేసమయంలో ఒక సన్యాసి అక్కడకు వచ్చాడు. నా అత్తమామల మృతదేహాలపై రోదిస్తూ, నేను లాక్కోబోయేటప్పుడు క్రిందపడిన మూటను తీసి విప్పాడు. అందులో రెండు చిరుగుల బట్టలు తప్ప మరేమీ లేవు.
ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లు చూస్తూ, " నువ్వు బ్రహ్మరాక్షసివిగా పుట్టవలసిన దానవు " అని అన్నాడు. అంతే, తరువాత వృద్ధ దంపతుల ఉత్తరక్రియలు జరిపి వెళ్ళిపోయాడు.
ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే " అని బ్రహ్మరాక్షసి చెప్పి, కాసేపాగి, మరల చెప్పసాగింది.
నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకూ ఈడ్చుకు వచ్చాయంటే, నేను కొంతమంది గజదొంగలను చేరదీసాను. దొంగల రాణిని అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగు పోస్తూండేవారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విష భోజనం పెట్టాను. వాళ్ళు చచ్చేముందు ఛావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు.
కలహకంఠీ! ఇదే గుహలో ఆ నగల్నీ, ధనరాసుల్నీ చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్నుమూసి, ఇలాగ భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే, నా పిశాచజన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వలన తెలిసింది.
ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవీ, అత్యాశకొద్దీ పోగుచేసి గోతాం నిండా కట్టుకున్నవీ ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి.
కలహకంఠి భుజానికెత్తుకున్న గోతం కట్టువిడి దాంట్లోంచి పాములు, జెర్రులు, కొండతేళ్ళు, ఊడిపడుతూ జరజరా గుహ నలుమూలలకూ ప్రాకాయి.
ఒంటిమీద పాములూ, తేళ్ళు ప్రాకుతూంటే బెంబేలు పడిపోతున్న కలహకంఠిని చూసి గుహ మారుమ్రోగుతుండగా బ్రహ్మరాక్షసి వికవికా నవ్వుతూ " నువ్వు కోడల్ని కాల్చుకుతినే కలహకంఠివి. నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహదుందుభిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరేసరి, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసివై పడిఉండటం ఇక నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంఠీ! " అని చెప్పింది.
కలహకంఠి లెంపలు వేసుకొని, రాక్షసికి దండం పెట్టి " బుద్ధి వచ్చింది. కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను. గుహనుండి నన్ను బయటకు పడనిచ్చి అరణ్యం దాటించు అని మొర పెట్టింది.
బ్రహ్మరాక్షసి కలహకంఠిని అడవి దాటించి, కళ్యాణి నగర పొలిమేరకు చేర్చి, " మాట తప్పావో, బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు. జాగ్రత్త " అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైంది.
కలహకంఠి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి, సౌదామిని ముందు మోకరిల్లి , మోకాళ్ళు పట్టుకుని " అమ్మా! సౌదామినీ! నన్ను మన్నించు. కొడుకు, కోడలు చిలకా గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించడం కంటే నాకు కావలసిందేమీ లేదు " అన్నది.
అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహకంఠి తిరిగి కలకంఠి అనిపించుకున్నది.
పావనమిశ్రుడు కథను ముగించి " ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం " అన్నాడు.
పిల్లలే కాకుండా పెద్దలుకూడా ఆనందోత్సాహాలతో గొంతెత్తి " విఘ్నేశ్వరుడు , మన విఘ్నేశ్వరుడే " అంటూ గొల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇళ్ళకు వెళ్ళారు. సశేషం.
వచ్చేవారం మరొక ఆసక్తికరమైన కథ విందాం. సర్వేజనా సుఖినోభవన్తు! స్వస్తి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి