:: విఘ్నేశ్వరుడి తొండం ఎంతపనిచేసింది? ::
శ్రోతలందరకూ క్రొవ్విడి వెంకట రాజారావు నమస్సులు. మనం సీరీస్ గా ప్రతిరోజూ షార్ట్సులో మహాభారత రహస్యాలను, ప్రతిసోమవారం స్పెషల్ వీడియోలుగా విఘ్నేశ్వర వైభవ లీలలను చెప్పుకుంటున్నాం. ఆయా కథలనుండి మనకు తెలియని చాలా విషయాలను గ్రహిస్తున్నాం. సరే, ఈ సోమవారం నుండి విఘ్నేశ్వర వినోద గాథలను కొన్ని చెప్పుకొని త్వరలో కొన్నివారాల్లో ఈ సీరియల్ ను ముగింపు చేసుకుని మరొక సీరీస్ ను ప్రారంభించుకుందాం. మిమ్ములను నే కోరుకునేది ఒక్కటే. ఛానలును సబ్ స్క్రైబ్ చేసుకొని విన్న కథలు బాగుంటే లైక్ చెయ్యమని. చేస్తారుకదూ! సరే, ఇప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఎంతపని చేసిందో ఓ కథ ద్వారా విందాం.
వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడూ, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరం దేశాంతరాల్లో పేరుమ్రోగుతున్న కాలంలో, పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెబుతూండేవాడు.
మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్తరువుల్లో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు.
పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు.
ఒక నగరంలో సత్యశర్మ, లోభగుప్త ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలుపేరు లాభగుప్త. కానీ, అతని లోభితనానికీ, అత్యాశకూ ఊరిలోని వారంతా లోభగుప్త అనే స్థిరపరిచారు.
సత్యశర్మ, లోభగుప్త రోజూ శివాలయానికి వెళ్ళేవారు. సత్యశర్మ గర్భగుడిలోనికి వెళ్ళేదారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకుని వెళ్ళేవాడు.
లోభగుప్తుడు గర్భాలయం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు.
ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకొని వెడుతూండగా, లోభగుప్తుడు వస్తూన్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో " విఘ్నేశ్వరా! నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు. అతడిని ఆదుకోవలసిన అవసరం లేదా? " అన్నాడు.
" ఔనోయి నందీ! ఈ సాయంకాలానికి అతనికి వెయ్యి వరహాలు అందిస్తున్నాను " అని విఘ్నేశ్వరుడు అన్నాడు.
రాతివిగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని, క్షణం ఆలశ్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్ళి " శర్మా! నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది. అయిదువందల వరహాలు ఇస్తాను. తీసుకో! " అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు.
సత్యశర్మ " అయ్యా! గుప్తాగారూ! నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన ఋణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. ఈ అయిదువందలు ఎలాగ తీర్చగలను? " అన్నాడు.
లోభగుప్తుడు, " అదా! నీ సందేహం? ఈ అయిదు వందలు తీసుకొని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంత అయితే అంత నాకు ఇస్తే చాలు " అన్నాడు.
సత్యశర్మ తటపటాయిస్తుంటే, అతని భార్య " ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి. అవతల పెళ్ళివారు చాలాసేపై కూర్చొని ఉన్నారు " అని ప్రోత్సహించింది.
సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్ళి కుదిరింది. వరుడి తల్లి, దండ్రి అయిదువందల వరహాల విలువచేసే నగలు పిల్లవానికి పెట్టాలని పట్టుబట్టారు
సత్యశర్మ లోభగుప్తుడితో " అయ్యా! సాయంకాలానికి నాకు లబించింది యివ్వటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు కాని, అలా లభించే ఆస్కారం ఏదీ లేదు..." అంటూ నసుగుతుంటే, లోభగుప్తుడు " అదంతా వదిలెయ్యి. మనం ఇరుగు పొరుగు వారం. ఇప్పుడు నేనిస్తే తరువాత నువ్విస్తావు. యీ మాత్రం దానికి మొహమాటపడకు " అంటూ అయిదు వందల వరహాలమూట సత్యశర్మ చేత పెట్టాడు.
సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తుడికి బాగా తెలుసు.
సాయంత్రం అవుతున్నది కాని, సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించలేదు. లోభగుప్తుడు కంగారుపడుతూ దేవాలయానికి పరుగెత్తి, విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకుని లాగుతూ, " ఏమయ్యా విఘ్నేశ్వరా! సత్యశర్మకు వెయ్యివరహాలు త్వరగా యిప్పించు మరి .." అని అంటూండగా అతని అరచేయి తొండం సందున యిరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కిపట్టింది.
నొప్పితో లోభగుప్తుడు కిరకిరలాడి పోతుంటే, " సత్యశర్మకు వెయ్యివరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే, అంత త్వరగా నీకు విడుదల " అని విగ్రహం నుండి వినిపించింది.
లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తీనోరూ బాదుకొంటూ " అన్యాయం దేవుడా, అన్యాయం . అయిదువందలు ముందే యిస్తినిగదా! " అని పెడబొబ్బలు పెట్టాడు.
" అదా సంగతి అయిదు వందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునాయాసంగా అయిదు వందల వరహాలు కాజేద్దామని ఎత్తువేసావన్నమాట. ఆశపాతకుడా! నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా అయిదువందలు యివ్వడమే కాకుండా, అతడికిచ్చిన ఋణాన్ని చెల్లుపెట్టి, అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్ళిలాగా జరిపించు " అని విఘ్నేశ్వరుడి విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది.
లోభగుప్తుడు క్షణాలమీద తనవారిని పిలిపించి, సత్యశర్మకు మిగతా అయిదువందల వరహాలు ఇప్పించి, అతని ఋణానికి చెల్లుపెట్టించి, అతని కూతురు పెళ్ళి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేసాకనే అతని చెయ్యి ఇవతలికి వచ్చింది.
లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరుఊరంతా చెప్పుకొన్నారు.
లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురి వివాహంలాగా వైభవంగా జరిపించాడు. అప్పటినుండి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి, అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించి, విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై, గొప్ప ధార్మికుడనిపించుకున్నాడు.
కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్ళకు పరిగెత్తారు.
వచ్చే సోమవారం మరొక ఆసక్తికరమైన కథ. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి