:: మహాభారత రహస్యాలు-7 ::
మహాభారతంలో భీష్మపితామహుడి మరణానికి పునాదివేసిన ఆ స్త్రీ అంబ. ఒక చిన్న పొరపాటు, ఒకరి మొండితనం చివరకు భీష్ముడి పతనానికి ఎలా దారితీసింది? ఆ చిన్న పొరపాటు ఏమిటి? తన తమ్ముడైన విచిత్రవీర్యుడి కోసం భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువస్తాడు. అయితే, అంబ అప్పటికే సాల్వరాజుని ప్రేమిస్తున్నానని చెప్పడంతో, భీష్ముడు ఆమెను గౌరవించి పంపేస్తాడు. కానీ, మరొకరు తీసుకువెళ్ళిన స్త్రీని తాను స్వీకరించనని సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు. తిరిగి భీష్ముడి వద్దకు వస్తే, విచిత్రవీర్యుడు కూడా ఆమెను వద్దంటాడు. భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞ బ్రహ్మచర్యం వల్ల ఆమెను పెళ్ళిచేసుకోలేనని చెబుతాడు. ఇరువైపుల న్యాయం జరగక, తన జీవితం నాశనమవడానికి భీష్ముడే కారణమని అంబ రగిలిపోతుంది. భీష్ముడిని చంపటమే లక్ష్యంగా శివుడి కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు " వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణ మవుతావు " అని వరం ఇస్తాడు. ఆ వరంతో అంబ మరుజన్మలో ద్రుపద మహారాజుకు శిఖండిగా జన్మిస్తుంది. పుట్టుకతో స్త్రీ అయినప్పటికీ, తరువాత పురుషుడిగా మారుతుంది. అయితే, భీష్ముడి అంతం ఎలా జరిగింది? కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఓడించటం ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు కృష్ణుడు శిఖండిని అర్జునుడి రథం ముందు నిలబెడతాడు. భీష్ముడికి ఆడవారిపై గానీ, పూర్వం ఆడదిగా పుట్టిన వారిపై గానీ ఆయుధం పట్టనన్న ధర్మ నియమం ఉంది. శిఖండి పూర్వజన్మలో అంబ అని భీష్ముడికి తెలుసు. అందుకే శిఖండిని చూడగానే భీష్ముడు తన విల్లును క్రింద పడేశాడు. అదే సమయంకోసం ఎదురుచూస్తున్న అర్జునుడు శిఖండి చాటునుండి భీష్ముడిపై బాణాలవర్షం కురిపించి అతడిని అంపశయ్యపై పడేశాడు. అంబ పగ శిఖండి రూపంలో భీష్ముడి నైతిక ధర్మాన్నే ఆయుధంగా మార్చుకుని ఆయన మరణానికి కారణమయింది.
భీష్ముడు అంపశయ్యపైకి చేరాక, కౌరవ సైన్యం బాధ్యత ద్రోణాచార్యుడి చేతికి వచ్చింది. కానీ, తనను ఎవరూ ఓడించలేరని తెసిన ద్రోణుడు యుద్ధభూమిలో అకస్మాత్తుగా ఆయుధం ఎందుకు క్రిందపడేశాడు? ధర్మరాజు చెప్పిన ఒక్క అబద్ధం ద్రోణుడి మరణానికి ఎలా కారణమయింది? వచ్చే భాగంలో తెలుసుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి