:: నృగమహారాజు - ఊసరవెల్లి ::
ద్వారకలో ఒకరోజు కృష్ణుడి కుమారులు (సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైనవారు) ఆడుకుంటూ ఒక పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తారు. అందులో ఒక వింతైన, కొండంత పరిమాణం ఉన్న భయంకరమైన ఊసరవెల్లిని చూస్తారు. దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలమై, కృష్ణుడికి విషయం చెబుతారు. కృష్ణుడు అక్కడికి వచ్చి, తన ఎడమ చేతితో ఆ ఊసరవెల్లిని తాకగానే, అది ఒక దివ్యమైన దేవతా పురుషుడిగా మారిపోతుంది. ఆయనే నృగమహారాజు. ఆయన దానం చేసిన గోవులను బ్రహ్మకూడా లెక్కించలేడు. చేసిన దానాలన్నీ న్యాయార్జితమైన సొమ్ముతోనే చేశాడు. పంచ మహాయజ్ఞాలు చేశాడు.
ఒకసారి ఆయన కశ్యపుడనే బ్రాహ్మణునకు దానంచేసిన గోవు ఒకటి దారితప్పి తిరిగి నృగమహారాజు ఆవులమందలో కలుస్తుంది. ఆ విషయం తెలియని నృగువు దానిని మరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చాడు. అతడు గోవును తీసుకొని వెడుతూండగా, ఆ ఆవును చూచి పూర్వం దానం పొందిన కశ్యపుడు ఇది నా ఆవు అని వాగ్వివాదం చేసి నేరుగా రాజు వద్దకు వచ్చి నీవు దాతవు, అపహర్తవూ కూడా అయ్యావని నిందిస్తాడు. ఆ మాటలకు భృగువు " నాకు తెలియక ఈ పాపం జరిగింది. పరిహారంగా లక్ష గోవులను ఇస్తాను " అని చెప్పి ఎంత వేడుకున్నా కశ్యపుని మాత్సర్యం పెరిగిందే తప్ప ఫలితం లేకపోయింది. ఆయన అక్కడనుండి వెళ్ళిపోతాడు. అలాగే రెండవ బ్రాహ్మణుడు కూడా తిరస్కరించి వెళ్ళిపోతాడు.
రాజు మరణించాక యమధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. యముడు "రాజా! నీవు అనంతమైన పుణ్యం చేశావు, కానీ తెలియక ఒక చిన్న పాపం (ఒకరి ఆవును మరొకరికి ఇవ్వడం) కూడా చేశావు. ముందు దేన్ని అనుభవిస్తావు?" అని అడిగాడు. రాజు తన పాపాన్ని ముందు అనుభవిస్తానన్నాడు. వెంటనే ఆయన ఊసరవెల్లిగా మారి ద్వారకలోని బావిలో పడిపోయాడు. వేల సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుని స్పర్శతో ఆయనకు మోక్షం లభించింది.
కృష్ణుడు ఈ సందర్భంలో తన కుమారులకు మరియు లోకానికి ఒక హెచ్చరిక చేస్తాడు: "బ్రాహ్మణ సొత్తు విషం కంటే ప్రమాదకరమైనది. విషం తాగిన వాడిని మాత్రమే చంపుతుంది, కానీ పరుల సొమ్మును ఆశించడం లేదా దానమిచ్చిన దాన్ని తిరిగి తీసుకోవడం అనేది వంశాలనే నాశనం చేస్తుంది."
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి