:: నమీబియా ఎడారిలోని మాయా వలయాలు ::
నమస్కారం! జీవనస్రవంతికి స్వాగతం! ననమీబియా ఎడారి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ఇక్కడ వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గడ్డి భూముల్లో లక్షలాది వింత వలయాలు కనిపిస్తాయి. వీటిని 'ఫెయిరీ సర్కిల్స్' అంటారు. అంటే 'దేవకన్యల వలయాలు'. ఇవి చూడటానికి ఎవరో కావాలని గడ్డిని గుండ్రంగా పీకేసినట్లు ఉంటాయి. కానీ, ఈ వలయాల మధ్యలో ఒక్క గడ్డి పోచ కూడా మొలవదు. చుట్టూ మాత్రం దట్టమైన గడ్డి పెరుగుతుంది. ఇది ఎలా సాధ్యం?
ఈ వలయాలు 2 మీటర్ల నుండి 15 మీటర్ల వ్యాసం వరకు ఉంటాయి. స్థానిక హింబా తెగ ప్రజలు వీటిని 'దేవతల పాదముద్రలు' అని నమ్ముతారు. మరికొందరు భూమి అడుగున ఉన్న ఒక డ్రాగన్ వదిలే విషపూరితమైన గాలి వల్ల అక్కడ గడ్డి మొలవదని చెబుతారు. కానీ సైన్స్ ఏం చెబుతోంది? శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్నా, ఇప్పటికీ ఒక ఖచ్చితమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు.
అయితే, ఇక్కడ రెండు ప్రధాన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి భూమి అడుగున ఉండే ఇసుక చెదపురుగులు నీటి కోసం గడ్డి వేర్లను తినేయడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడతాయన్నది, నీటి ఎద్దడి ఉన్నప్పుడు, మొక్కలు నీటి కోసం ఒకదానితో ఒకటి పోటీ పడి. బలమైన మొక్కలు నీటిని లాగేసుకోవడం వల్ల బలహీనమైనవి చనిపోయి ఇలాంటి ఆకారాలు ఏర్పడతాయన్నది మరొకటి.
చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ వలయాలు ఒక క్రమ పద్ధతిలో అమర్చినట్లు ఉంటాయి. ఆకాశం నుండి చూస్తే ఇది ఒక అద్భుతమైన డిజైన్‌లా కనిపిస్తుంది.
ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటివి కనిపించినా, నమీబియాలోని వలయాలు అత్యంత స్పష్టంగా ఉంటాయి. ప్రకృతి తనలో దాచుకున్న వేల మిస్టరీలలో ఈ 'ఫెయిరీ సర్కిల్స్' ఒకటి. మానవ మేధస్సుకి అందని ఇలాంటి వింతలు మరెన్నో ఉన్నాయి. మరి, వినడానికి జీవనస్రంతి ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి