:: దేవకీ వసుదేవుల కారాగారవాసం - కంసుని దుశ్చర్యలు ::
దేవకీ వసుదేవుల వివాహ సమయంలో జరిగిన ఆకాశవాణి హెచ్చరిక కంసుని కలవరపెట్టినప్పటికీ, వసుదేవుడు ఇచ్చిన మాట కంసుని కొంత శాంతింపజేసింది. కాలక్రమేణా దేవకికి మొదటి కుమారుడు (కీర్తిమంతుడు) జన్మించాడు. పుట్టిన బిడ్డను చూడగానే తల్లిదండ్రుల మనసు పుత్రవాత్సల్యంతో నిండిపోయింది. కానీ, ఇచ్చిన మాట తప్పని ధర్మమూర్తి వసుదేవుడు, ఆ పసికందును తీసుకువెళ్లి కంసుడికి అప్పగించాడు. తన ప్రాణ సమానమైన బిడ్డను మృత్యువు లాంటి కంసుడి చేతిలో పెట్టడం వసుదేవుని సత్యనిరతికి నిదర్శనం. ఆ ధర్మబుద్ధిని చూసి కంసుడు ఆశ్చర్యపడి, "వసుదేవా! నీ సత్యసంధతకు మెచ్చాను. నాకు ముప్పు ఎనిమిదవ గర్భం వల్లనే కదా! ఈ మొదటి బిడ్డ వల్ల నాకేమి ప్రమాదం? వీడిని చంపి పాపం మూటగట్టుకోవడం ఎందుకు?" అని దయ తలచి ఆ శిశువును తిరిగి ఇచ్చివేశాడు.
సరిగ్గా కంసుడు ఆ శిశువును వదిలివేసిన తరుణంలో, దేవకార్యార్థమై నారద మహర్షి అక్కడకు వేంచేశాడు కంసునితో ఇలా అన్నాడు— "కంసా! నువ్వు చాలా అమాయకత్వంతో ఆలోచిస్తున్నావు. నందుని గోకులంలో ఉన్నవారు, ఇక్కడ ఉన్న యాదవులు అందరూ దేవతాంశ సంభూతులు. విష్ణువు నిన్ను సంహరించడానికి ఎనిమిదవ గర్భాన జన్మించబోతున్నాడు. ఒక చక్రంలా చూస్తే ఏ బిడ్డ ఎన్నవదో లెక్కించడం సాధ్యం కాదు. ఒక వైపు నుండి లెక్కిస్తే మొదటివాడు, మరోవైపు నుండి లెక్కిస్తే ఎనిమిదవ వాడు కావచ్చు. కాబట్టి శత్రువు విషయంలో అశ్రద్ధ వహించకు." నారదుడి ఈ బోధనతో కంసునిలో భయం తిరిగి పుట్టింది. ఆ భయమే అతడిని ఉన్మాదిగా, రాక్షసుడిగా మార్చింది.
నారదుడు చెప్పిన మాటలకు మనస్సులో మిక్కిలి కలవరపాటు నొందిన కంసుడు, పెల్లుబికిన కోపంతో చెల్లెలు (దేవకి), మరది (వసుదేవుడు) అని కూడా చూడకుండా వారిని తిరిగి పట్టి బంధించాడు. ఆ సన్నివేశాన్ని పోతన గారు భాగవతంలో ఇలా వర్ణించారు:
కలగం బాఱి మఱంది జెల్లెలి నుదగ్ర క్రోధుడై పట్టి బ
ద్ధుల గావించి హరిం దలంచి వెస తోడ్తో వారు గన్నట్టి పు
త్రుల జంపెన్, గురు నుగ్రసేను యదుదద్భోజాంధకాధీశు ని
ర్మలు బట్టెం గడువాలియేలె జలమారన్ శూరంబులన్.
ఉగ్రమైన కోపంతో ఊగిపోయిన కంసుడు, తన చెల్లెలిని, బావను కటిక చీకటి కారాగారంలో బంధించాడు. విష్ణుమూర్తిని తన ప్రధాన శత్రువుగా తలచుకుంటూ, వారికి పుట్టిన పుత్రులను కనికరం లేకుండా వెంటవెంటనే వధించాడు. అంతటితో ఆగక, తన తండ్రి అని కూడా చూడకుండా, పరమ నిర్మలుడైన ఉగ్రసేన మహారాజును సైతం బంధించి జైలులో వేశాడు. శూరసేన రాజ్యాలను బలవంతంగా ఆక్రమించుకుని తానే పాలిస్తూ రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు.
దేవకీ వసుదేవుల కాళ్లకు, చేతులకు బరువైన ఇనుప సంకెళ్లు పడ్డాయి. క్రూరమైన కాపలాదారుల పహారా నడుమ వారు గడిపారు. దేవకి గర్భాన జన్మించిన ఆరుగురు శిశువులను ( కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, భద్రుడు, సమ్మర్ధనుడు - కొన్ని పురాణాలలో ఈ ఆరవ శిశువును భద్రకారుడు లేదా ఉద్భవుడు అని పిలుస్తారు) కంసుడు ఏమాత్రం దయలేకుండా, పుట్టిన వెంటనే బండకేసి కొట్టి సంహరించాడు. కన్నబిడ్డలు తమ కళ్లముందే రక్తసిక్తమై ప్రాణాలు కోల్పోతుంటే, ఆ తల్లిదండ్రులు అనుభవించిన గర్భశోకం వర్ణనాతీతం. ఆ కారాగార గోడలు వారి రోదనలతో ప్రతిధ్వనించాయి.
ఏడవ గర్భంగా శేషాంశ సంభూతుడైన బలరాముడు ప్రవేశించగా, యోగమాయ ఆ గర్భాన్ని రోహిణి గర్భానికి మార్చింది. అనంతరం, లోక రక్షణార్థం శ్రీమన్నారాయణుడు దేవకి అష్టమ గర్భాన ప్రవేశించాడు. ఆమె ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతుండగా, కంసుడు భయంతో మరింత అప్రమత్తమయ్యాడు. జగత్తును ఏలే జగన్నాథుడు అవతరించడానికి ప్రకృతి అంతా సిద్ధమైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి