4, జులై 2026, శనివారం

 

:: శ్రీకృష్ణ లీలలు — కాళియమర్దనము ::

     శ్రోతలందరకూ క్రొవ్విడి వెంకట రాజారావు అనేక నమస్కారములు. శ్రీకృష్ణ లీలామృతానికి మీకందరకూ స్వాగతం. ఈవారం మనం శ్రీకృష్ణుడు కాళీయుని గర్వాన్ని అణచిన ఘట్టాన్ని గూర్చి ముచ్చటించుకుందాం. 

    కృష్ణ పరమాత్మ చేసిన దివ్య లీలలలో అద్భుతమైనది, ఆబాలగోపాలాన్ని అలరించినది 'కాళియమర్దనము'. యమునా నది కేవలం ఒక నది కాదు, అది ప్రజల జీవననాడి. అలాంటి నదిలో కాళియుడనే మహాసర్పం చేరి, తన భయంకరమైన విషాగ్నితో ఆ నీటిని, పరిసరాలను విషపూరితం చేసింది. పక్షులు ఆకాశంలో వెళ్తూ ఆ విషవాయువుకు చనిపోతున్నాయి. పశువులు ఆ నీరు తాగి మరణిస్తున్నాయి. రేపల్లె గుండెలాంటి యమునమ్మను, ఆశ్రయించిన ప్రజలను రక్షించడానికి ఆ నల్లనయ్య నడుం బిగించాడు.

    ఒకరోజు ఆవులను మేపుతూ, కృష్ణుడు కాళియ హ్రదం (మడుగు) దగ్గరకు వచ్చాడు. ఆ కాళియుడి గర్వాన్ని అణచాలని, యమునను పవిత్రం చేయాలని నిశ్చయించుకున్నాడు.

    భగవంతుడు లీలామానుష విగ్రహుడు. ఆ కాళియ హ్రదం ఒడ్డున ఉన్న ఒక పెద్ద కదంబ వృక్షం ఎక్కాడు. పరమాత్మ యుద్ధానికి సిద్ధమవుతున్న సింహంలా తన వస్త్రాలను, పింఛాన్ని సర్దుకున్నాడు. ఇక్కడ పోతనగారి అద్భుతమైన వర్ణనను మనం స్మరించుకోవాలి:

కటిచేలంబు బిగించి పింఛమున జక్కం గొప్పు బంధించి దో

స్తట సంస్ఫాలన మాచరించి చరణ ద్వంద్వంబు గీలించి త -

త్కుట శాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది -

క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుబగుబధ్వానంబనూనంబుగన్

    ఆ గోపాలసింహం... తన నడుము వస్త్రాన్ని (కటిచేలము) గట్టిగా బిగించాడు. నెమలి పింఛాన్ని కొప్పులో చక్కగా ముడివేశాడు. భుజాలు చరిచాడు (దోస్తట సంస్ఫాలనము). రెండు పాదాలను గట్టిగా ఊని, ఆ కదంబ వృక్షపు కొమ్మ చివరి నుండి దిక్కులన్నీ మారుమ్రోగేలా, యమునా నది మడుగులోకి 'గుబగుబ' మనే భయంకరమైన ధ్వనితో ఉరికాడు! ఆ ఉరవడికి యమునా నది తరంగాలు ఉప్పొంగాయి.

    ఆ మడుగులో అంతవరకు తనను ఎదిరించేవాడే లేడని గర్వంతో ఉన్న కాళియుడు, ఈ ధ్వనికి మేల్కొన్నాడు. చూస్తే ఒక చిన్న బాలుడు ఒంటరిగా ఈదుతున్నాడు. కాళియుడికి కోపం నషాళానికి అంటింది.

బాలుండొక్కడు వీడు నామడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ క 

ల్లోలంబై కలగంజరించె నిట నే లో నుంట జూడండు, మ 

త్కీలాభీల విశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్ భస్మమై 

కూలంజేసెద నేడు లోకులకు నా కోపంబు దీపింపగన్

     కాళియుడు బుసలు కొడుతూ అనుకుంటున్నాడు: "ఎవడు వీడు? ఒక చిన్న బాలుడు! నా మడుగును ఇంతగా కలచివేస్తూ, అలలు ఎగసిపడేలా తిరుగుతున్నాడు! ఇక్కడ నేను ఉన్నాననే భయం లేదా వీడికి? నా భయంకరమైన, దుస్సహమైన విషాగ్ని జ్వాలలతో వీడిని ఇప్పుడే భస్మం చేసేస్తాను. లోకానికి నా కోపం ఎలాంటిదో చూపిస్తాను!" అంటూ ఆ కాళియసర్పం కృష్ణుడిని చుట్టేసింది. తన పడగలతో కృష్ణుడిని బంధించి, కరవడం ప్రారంభించింది.

    కృష్ణుడు మడుగులోకి దూకి, పాము బంధనంలో చిక్కుకున్నాడనే వార్త బృందావనమంతా పాకింది. ప్రకృతిలో అపశకునాలు మొదలయ్యాయి.

భూతలము వడకె నుల్కా

పాతంబులు మింట గానబడె ఘోషములో 

వ్రేతలకును గోపకసం 

ఘాతములకు నదరె గీడుకన్నులిలేశా!

    భూమి కంపించింది. ఆకాశం నుండి ఉల్కలు పడ్డాయి. రేపల్లెలోని గోపికలకు, గోపాలురకు కీడును సూచించేలా కళ్ళు అదరసాగాయి. యశోదమ్మ, నందగోపుడు, ఊరి జనులంతా పరుగు పరుగున యమునా తీరానికి వచ్చారు. అక్కడ కృష్ణుడు సర్పాకారంలో ఉన్న కాళియుడి బంధనంలో నిశ్చలంగా కనిపించేసరికి అందరూ గుండెలు పగిలేలా ఏడ్చారు. యశోదమ్మ మూర్ఛపోయింది. గోపికలు కృష్ణుడితో తమకున్న బంధాన్ని తలచుకుంటూ రోదించిన తీరు హృదయవిదారకం:

శ్రవణ రంధ్రంబులు సఫలత బొందంగ నెలమి భాషించు వారెవ్వరింక? 

గరచరణాదుల కలిమి ధన్యతనొంద నెగిరి పైబ్రాకువారెవ్వరింక? 

నయనయుగ్మంబులున్నతి గృతార్థములుగా నవ్వులుసూపువారెవ్వరింక? 

జిహ్వలు గౌరవశ్రీ జేర బాటలయెడ బలికించువారెవ్వరింక? 

 

దండ్రి! నీవు సర్పదష్టుండవై యున్న

నిచట మాకు బ్రభువులెవ్వరింక? 

మరగి పాయలేము, మాకు నీ తోడిద,

లోకమీవు లేని లోకమేల?

 

తండ్రీ కృష్ణా! మా చెవులు సఫలం అయ్యేలా ఇక ఎవరు మాట్లాడతారు? నీవు సర్పదష్టుడవై ఉంటే మాకు దిక్కెవరు? మమ్మల్ని నెట్టిపైకి ఎగబాకే వారెవరు? నీ నవ్వులు చూడకుండా మా కళ్ళు ఎందుకు? నీవు లేని ఈ లోకం మాకెందుకు కృష్ణా! నిన్ను విడిచి మేముండలేము" అని ఆక్రందించారు.

    తన భక్తుల ఆవేదన చూసిన పరమాత్మ, ఇక చాలనుకున్నాడు. ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచాడు. ఆ దెబ్బకు కాళియుడి బంధనాలు సడలిపోయాయి. కృష్ణుడు కాళియుడి పడగల మీదకు లంఘించాడు. అది యుద్ధంలా లేదు, ఒక దివ్యమైన నృత్యంలా సాగింది. సృష్టికర్త అయిన ఆ రంగనాథుడు, కాళియుడి ఫణాలనే రంగస్థలంగా మార్చుకున్నాడు.

    పోతనగారు  వ్రాసిన ఈ సుందరమైన సీస పద్యం ఆ నృత్య వైభవాన్ని కళ్ళకు కడుతుంది:

ఘనయమునానదీకల్లోలఘోషంబు సరసమృదంగఘోషంబుగాగ 

సాధుబృందావన చరచంచరీకగానంబు గాయకసుగానంబుగాగ 

గలహంససారసకమనీయమంజుశబ్దంబులు దాళశబ్దములుగాగ 

దివినుండి వీక్షించు దివిజగంధర్వాదిజనులు సుఖాసీనజనులుగాగ 

 

బద్మరాగాది రత్నప్రభాసమాన,

మహిత కాళియ ఫణిఫణామండపమున 

నళినలోచన విఖ్యాత నర్తకుండు,

నిత్యనైపుణ్యమునచేర్చి నృత్యమాడె

     ఆహా! ఎంతటి అద్భుత దృశ్యం! యమునా నది తరంగాల యొక్క భయంకర ఘోష... ఆ నృత్యానికి మృదంగ ధ్వనిలా మారింది. బృందావనంలోని తుమ్మెదల ఝుంకారాలు... గాయకుల సుగీతాలు అయ్యాయి. నదిలోని హంసలు, సారస పక్షుల మంజుల శబ్దాలు... తాళ ధ్వనులుగా మారాయి. ఆకాశం నుండి దేవతలు, గంధర్వులు ఈ అద్భుతాన్ని ఆసీనులై వీక్షిస్తున్నారు. పద్మరాగమణుల వలె మెరుస్తున్న కాళియుడి వందలాది పడగలే (ఫణామండపము) రంగస్థలం కాగా, ఆ పద్మపత్రాక్షుడు (నళినలోచనుడు), జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణుడు తన అఖండ నృత్య నైపుణ్యంతో తాండవం చేశాడు!

    కాళియుడు ఏ పడగనెత్తితే ఆ పడగను తన సుకుమార పాదాలతో తొక్కుతూ, రక్తం కక్కించాడు. కాళియుడి గర్వం సర్వనాశనమైపోయింది.

    చివరకు కాళియుడు తట్టుకోలేక, పరమాత్మ పాదాల చెంత శరణు వేడాడు. కాళియుని భార్యలైన నాగకన్యలు వచ్చి కృష్ణుడిని ప్రార్థించారు: "స్వామీ! వీడు అజ్ఞాని, నీ మహిమ తెలియక తప్పు చేశాడు. క్షమించి ప్రాణభిక్ష పెట్టండి" అని వేడుకున్నారు. భక్తవత్సలుడైన కృష్ణుడు కరుణించి, "కాళియా! ఇకపై ఈ యమునా నదిని వదిలి, నీ పరివారంతో సముద్రంలోకి వెళ్ళిపో. నా పాద ముద్రలు నీ తలపై ఉన్నాయి కాబట్టి నిన్ను గరుడుడు కూడా ఏమీ చేయడు" అని అభయమిచ్చాడు.

    కాళియుడు యమునను విడిచి వెళ్ళిపోయాడు. విషపూరితమైన యమునమ్మ మళ్లీ అమృతవాహినిగా మారింది. రేపల్లె ప్రజలు ఆనందబాష్పాలతో కృష్ణుడిని గుండెలకు హత్తుకున్నారు.

    ఇదీ కాళియమర్దన లీలా విశేషం. భగవంతుడు మన హృదయాలనే యమునా నదిలో ఉన్న అహంకారమనే విషసర్పం (కాళియుడు) యొక్క గర్వాన్ని కూడా ఇలాగే అణచి, మనకు జ్ఞానామృతాన్ని ప్రసాదించాలి. విన్నారుకదా! కథనం బాగుంటే లైక్ చేసి, మీమీ బంధుమిత్రులకు షేర్ చేసి మన ఛానల్ ను ఇప్పుడే సబ్ స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  ద్రౌపది నవ్వు       శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" ప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ ను...