:: లలితాదేవి - భండాసుర వధ - భాగం 1 ::
మన్మథుడి బూడిదనుండి పుట్టి, ముల్లోకాలను వణికించిన మహా రాక్షసుడు భండాసురుడు. వానిని అంతం చేయడానికి సాక్షాత్తు పరాశక్తి ఏ రూపంలో ఉద్భవించిందో తెలుసా?
శివుని మూడవ కంటి అగ్నికి మన్మథుడు భస్మమైపోయిన వృత్తాంతం మనకు తెలిసిందే. ఆ మన్మథుడి బూడిదను చిత్రకర్ముడు అనే ప్రమథగణాల నాయకుడు ఒక బొమ్మగా మలుస్తాడు. ఆ బొమ్మను చూసి పరమశివుడు మోహన దృష్టితో వీక్షించగా, ఆ బూడిద బొమ్మకు ప్రాణం వస్తుంది. ఆ ప్రాణం పోసుకున్న బాలుడే భండాసురుడు.
అతడు పుడుతూనే మహా బలశాలి. రుద్రుని అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవ్వగా, భండాసురుడు ఒక వింతైన వరం కోరుకుంటాడు. " స్వామీ! నాకు ఎదురు నిలిచి యుద్ధం చేసే శత్రువుయొక్క సగం బలం నాకు సంక్రమించాలి. అంతేకాదు, నా మరణం అంటూ సంభవిస్తే అది ఒక స్త్రీ చేతిలోనే జరగాలి. కానీ, ఆ స్త్రీ గర్భవాసాన జన్మించినది కాకూడదు. అంటే, అయోనిజయై ఉండాలి " అని వరం పొందుతాడు.
వరం చేతికి చిక్కడంతో భండాసురుడిలో అహంకారం తలకెక్కింది. శుక్రాచార్యుని ఆధ్వర్యంలో " శూన్యకపురం " రాజధానిగా అసుర సామ్రాజ్యాన్ని స్థాపించి, ముల్లోకాలపై దండెత్తుతాడు. దేవతలను హింసించి, స్వర్గాన్ని ఆక్రమిస్తాడు.
దిక్కుతోచని ఇంద్రాది దేవతలు త్రిమూర్తులను ఆశ్రయిస్తారు. భండాసురుడిని సాధారణ శక్తులు ఏమీ చేయలేవని, వానిని సంహరించాలంటే సాక్షాత్తు జగన్మాత మహాశక్తి రూపంలో అవతరించాలని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఇందుకోసం దేవతలంతా కలిసి హిమాలయ పర్వతాలపై ఒక మహా యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. అదే " మహాభైరవ యాగం ". ఈ యాగంలో దేవతలు తమ శరీరాలలోని మాంసాన్ని, రక్తాన్ని కూడా ఆహుతిగా యిస్తూ ఘోరమైన ప్రార్థన చేస్తారు.
యాగాగ్ని తీవ్ర రూపం దాల్చింది. అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయాన ఆ యజ్ఞకుండం నుండి కోటిసూర్యుల ప్రకాశంతో, దివ్యమైన కాంతితో, సర్వాలంకార భూషితయై , చిరునవ్వు చిందిస్తూ సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆవిర్భవిస్తుంది.
అమ్మవారిని చూసి దేవతలు ఆనంద బాష్పాలతో స్తుతిస్తారు. లలితాదేవి దేవతలకు అభయమిచ్చి , భండాసురుడిని వధించడానికి, సమర శంఖారావం పూరిస్తుంది. కోట్లమంది శక్తులు, వారాహి, శ్యామల వంటి మహా దేవతలతో కూడిన దేవి సైన్యం శూన్యకపురం వైపు కదులుతుంది. భండాసురుడి సైన్యానికి, దేవి సైన్యానికి మధ్య భీకరమైన యుద్ధం మొదలవుతుంది.
యుద్ధం తీవ్రరూపం చేరుకుంది. లలితాదేవి బాణాల ధాటికి భండాసురుడి సోదరులు, సైన్యం కూలిపోతూంటారు. అది చూసి ఆగ్రహోదగ్రుడైన భండాసురుడు, లలితాదేవి సైన్యాన్ని మట్టుబెట్టడానికి, ఎవరూ ఊహించని ఒక అత్యంత ప్రమాదకరమైన మాయా అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం పేరు " పాషండ అస్త్రం ".
ఆ అస్త్ర ప్రభావంతో లలితాదేవి సైన్యమంతా ఒక్కసారిగా నిర్వీర్యమైపోతుంది. అప్పుడు లలితాదేవి ఏమి చేసింది? భండాసురుడి మాయను ఎలా తిప్పికొట్టింది? సశేషం.
తరువాతి అద్భుతమైన ఘట్టాన్ని రేపటి భాగంలో విందాం. ఈ సీరిస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
భండాసురుడి తమ్ముడు విషంగుడు ప్రయోగించిన భయంకర " విఘ్నయంత్రం " ప్రభావంతో దేవి సైన్యమంతా నిద్రమత్తు, బద్ధకంతో స్తంభించిపోయింది. సాక్షాత్తు వారాహి, శ్యామలాదేవి వంటి మహావీరులు సైతం శస్త్రాలు కింద పడేశారు. మరి ఈ మహా విపత్తు నుండి అమ్మవారి సైన్యం ఎలా బయటపడింది?
శత్రువులు పన్నిన కుతంత్రానికి దేవి సైన్యం దిక్కుతోచకుండా పడి ఉండడం చూసి, జగన్మాత లలితా పరమేశ్వరి ముఖంలో ఒక అద్భుతమైన " మందహాసం " వికసించింది. ఆమె చిరునవ్వుల దివ్య తేజస్సునుండి, శివశక్తుల ఐక్య స్వరూపంగా సాక్షాత్తు " మహా గణపతి " ఆవిర్భవించాడు.
పదిచేతులతో, ప్రచండ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలగణపతి సమరరంగంలో ప్రవేశించాడు. తన పదునైన దంతాన్ని ఆయుధంగా మలచుకుని, గదతో ఒక పోటు పొడిచి, రాక్షసులు రహస్యంగా నాటిన ఆ దుష్ట " విఘ్నయంత్రాన్ని " పిండి పిండిగా ధ్వంసం చేసేశాడు.
యంత్రం బద్దలవగానే దేవి శక్తులను కమ్మిన నిద్రమత్తు క్షణంలో పటాపంచలయిపోయింది. శక్తులన్నీ తిరిగి సింహనాదాలు చేస్తూ శత్రువులపై విరుచుకు పడ్డారు. భండాసురుడు వరుసగా కొత్త రాక్షస సైన్యాన్ని ప్రయోగిస్తుంటే, లలితాదేవి తన పదిగోళ్ళ కాంతి నుండి సాక్షాత్తు " మహావిష్ణువు దశావతారాలను " సృష్టించింది. ( దీనినే లలితా సహస్రనామాల్లో " కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి: - అంటారు). ఆ దశావతార శక్తులు రాక్షస దళాలను నామరూపాలు లేకుండా చేశాయి.
చివరి ఘట్టం చేరుకుంది. లలితాదేవి తన చెరకు విల్లు (కోదండం) నుండి విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన " మహాకామేశ్వరాస్త్రాన్ని " సంధించింది. కోటి సూర్యుల తేజస్సుతో దూసుకెళ్ళిన ఆ మహాస్త్రం భండాసురుడి గుండెలను చీల్చింది. క్షణాల వ్యవధిలో దుష్ట భండాసురుడు, అతని శూన్యక నగరం అగ్నికీలల్లో భస్మీపటలమయ్యాయి.
అలా భండాసురుడి వధతో ముల్లోకాలకు కష్టాలు తీరాయి. ఆ సమయంలో దేవతలు అమ్మవారిని కీర్తిస్తూ చేసిన అద్భుతమైన స్తోత్రమే, నేటికీ మనం పఠించే పరమ పవిత్రమైన " శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ".
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి