30, ఆగస్టు 2026, ఆదివారం

::  త్రిశంకు స్వర్గము  :: 

    ఆచరించ తలపెట్టిన వ్యాసంగము పూర్తిగాక , అటు ప్రారంభ స్థితికి తిరిగి రాలేక , ఇటు సాధించదలచిన లక్ష్యమును పూర్తి చేయలేక రెంటి మధ్యను డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతూండే అనిశ్చిత దశను తెలియజెప్పుటకు వాడు పౌరాణిక నానుడి  " త్రిశంకు స్వర్గము " శ్రీరామాయణమందలి బాలకాండమునందు ఈ నానుడి రూపుదిద్దుకున్నది. బ్రహ్మర్షి విశ్వామిత్రునకు, త్రిశంకు చక్రవర్తికి మధ్య జరిగిన ఆసక్తికరమైన గాథనుండి ఈ సామెత ఉద్భవించినది. //

     ఇక్షాకు వంశజుడయిన త్రిశంకు చక్రవర్తికి సశరీరముగా స్వర్గమునకు పోవలయునన్న చిత్రమైన ఆలోచన మనస్సులో ప్రభవిల్లి వెంటనే గురూత్తముడయిన వశిష్ఠ మహర్షిని , ఆయన కుమారులను తన అభీష్టమును నెరవేర్చ గలందులకు అవసరమైన యజ్ఞయాగాదులను నిర్వహింపజేయుమని కోరినంత, సృష్టికి విరుద్ధమైన దని తెలుపుతూ వారందరూ తమ అసమ్మతిని తెలియజేసినారు. పుణ్యకార్యములొనర్చిన మానవులు దేహత్యాగమయిన తదుపరి స్వర్గమునకు జేరుట సర్వసాధారణము. అయితే, బొందితో స్వర్గమునకు వెళ్ళడమన్నది అసంబద్ధమే అవుతుంది. చేసేది లేక త్రిశంకుడు కొంతకాలమాగి తిరిగి తీవ్ర తపోనిష్ఠలో ఉన్న విశ్వామిత్ర మునీంద్రుని చెంతకు చేరి తన కోరికను వెల్లడి చేయగా , వశిష్ఠునిపై పంతగించిన ఆయన తపస్సు ధారపోసి అందుకు తగ్గ క్రతువును నిర్వహించి త్రిశంకు మహారాజును భౌతిక శరీరముతోనే సరాసరి స్వర్గమునకు పంపినాడు. స్వర్గాధిపతియైన దేవేంద్రుడు దీనిని గమనించి త్రిశంకునితో అధర్మముగా ప్రవేశించు నీకు స్వర్గప్రవేశ మెట్లగునని కోపముతో నాతనిని స్వర్గమునుండి క్రిందకు త్రోసినాడు. అంతట త్రిశంకుడు భూమిపై పడబోతూ విశ్వామిత్రుని రక్షణ కొరకై ప్రార్థించినాడు.  

    ఈ దృశ్యమును దివ్య చక్షువులతో గమనించిన విశ్వామిత్ర మహర్షి తన యోగబలముతో త్రిశంకుని అంతరిక్షమ6దుననే స్థిరపరచి అక్కడనే స్వర్గతుల్యమైన ప్రపంచమును సృష్టించి అందు నాతనిని నిలిపినాడు. అదియే " త్రిశంకు స్వర్గ "మని వ్యావహారమునకొచ్చినది. 

     దైనందిన జీవితమందు జనావళికి ఈ సామెత పలు పాఠములను నేర్పుతున్నది. ప్రస్తుతము నిర్వర్తించుచున్న వర్తక వాణిజ్యములను లేదా ఉద్యోగ బాధ్యతలను మార్పుచేసుకుంటూ నూతన కార్యక్రమములను చేపట్టు సమయమందు పాతవి చేజారి నూతనముగా ప్రతిపాదించుకున్న విషయములు లభ్యపడక మధ్యలో చిక్కుకుని తబ్బిబ్బుపడు అభద్రతా స్థాయికి అద్దంపడుతుంది ఈ జాతీయము. అటులనే అర్హతలేని స్థానములను పదవులను , ధర్మవిరుద్ధమైన కోరికలను పట్టుబట్టి సాధించవలెనని తలంచి, చివరకు ఎటూకాక నష్టమొందుదురన్న హెచ్చరికయూ ఈ నానుడిలో నిక్షిప్తమై యున్నది. // ఉన్నతమైన ఆశయములు, లక్ష్యములు కలిగి ఉండుటన్నది కోరదగినదే అయినప్పటికినీ , అవి ధర్మశాస్త్రమునకు , కాలగమనమునకు మరియు శక్తి సామర్థ్యములకు అనుగుణమై వరలునప్పుడు చేరదలచిన పథమును క్షేమకరముగా అందుకోగలుగవచ్చునన్నది " త్రిశంకు స్వర్గము " నానుడి వెనుకనున్న పరమార్థము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

::   త్రిశంకు స్వర్గము  ::       ఆచరించ తలపెట్టిన వ్యాసంగము పూర్తిగాక , అటు ప్రారంభ స్థితికి తిరిగి రాలేక , ఇటు సాధించదలచిన లక్ష్యమును పూర్త...