:: వింతభక్తులు ::
పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా యిష్టం. ' భక్తులూ ' అంటే మనుష్యులే కాదు. జంతువులు, పక్షులు. పురుగులు - వీటిలో ఏవి కాస్త భక్తి కనబరచినా సరే ఆయన సంతోషించి, వాటిని అనుగ్రహిస్తాడు.
ఒకమాటు ఆయన తాను అంతకు మున్ను గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లనగ్రోవిని ఊదుకుందామని బుద్ధిపుట్టి, మురళి తెచ్చి హాయిగా వాయించటం మొదలెట్టేడు. ఆ గానం వినేటప్పటికి చుట్టుప్రక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపుకు వచ్చాయి. ఎవరూ పితక్కుండానే అవి ధారలు కట్టి కురిసాయి. అంతలో ఒక పెద్ద గాలివేసి, ఆ పాల నురగలో రవంత తుంపరపోయి పాండురంగస్వామి శిరస్సుపైన పడింది.
ఆ ఆవు భక్తి పారవశ్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాలచుక్క తన శిరస్సుపై పడ్డంతోనే అదే ఒక గొప్ప సేవగా తలచి, ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదాన్నిగా చేర్చుకున్నాడు.
పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావిచెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగస్వామి కోసం అత్తెసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికిమల్లే వేగంగా వచ్చి స్వామి ముందు వ్రాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్ము అంతా ఎగిరిపోయి తుడిచినట్లై, పాండురంగనికి సంతోషం కలిగింది.
" నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకుని చిమ్మినట్లు పోగెట్టేవు కనుక నిన్ను నా భక్తులలో ఒకణ్ణిగా చేసుకుంటా " నని కాకిని గూడా తన భక్తులలో చేర్చుకున్నాడు.
ఇంతలో అక్కడకు ఒక హంస వచ్చింది. ఆ హంస ఎక్కడినుంచి వచ్చిందో కాని, వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తితీరా ఈత లాడింది. తర్వాత స్వామి వద్దకు వచ్చి, రెక్కలు తపతపా కొట్టుకుంది. ఆ నీళ్ళన్నీ అక్కడ నేలమీద పడి నేల శుభ్రంగా పాచి చేసినట్లై పోయింది. " కాకి తుడిచేసింది. నీవు నీళ్ళు జల్లేవు గనుక నిన్ను కూడా కాకితోబాటే నా భక్తుల్లో చేర్చుకుంటా " నన్నాడు పాండురంగస్వామి.
" కాకి తుడిచింది. హంస నీళ్ళు చల్లింది. ఇంక ఎవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండును " అని పాండురంగస్వామి అనుకుంటుంటే ఒక చిలుక ఎగిరివచ్చి స్వామి ప్రక్కన వ్రేలాడే ఒక దండెం మీద వ్రాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూండేది. ఆనాడేం బుద్ధి పుట్టిందో కాని ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచి ఉంచుకున్న ఒక ముత్యాల హారాన్ని ముక్కున కరుచుకొచ్చింది. ఆ హారాన్ని దండేం మీద కాళ్ళక్రింద నొక్కిపట్టి తన కరుకు ముక్కుతో పుటుకూ పుటుకూ నాలుగు పోట్లు పొడిచేటప్పటికి హారం తెగపోయి ముత్యాలు స్వామి సన్నిధిని చిందర వందరగా పడ్డాయి.
" సెబాష్ చిలుకా! ఉత్తుత్తి మ్రుగ్గుకాక నాయింట ముత్యాలతో మ్రుగ్గులు పెట్టేవు. కనుక కాకి, హంసలకు మల్లేనే నిన్నుకూడా అనుగ్రహిస్తున్నాను " అన్నాడు విఠలుడు.
ఆ తరువాత అక్కడికి ఒక ఎలుకపిల్ల పరుగెత్తుకు వచ్చింది. వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకొచ్చింది. స్వామిని చూచేటప్పటికి ఆ పాము ఎలుక మాట మరచిపోయింది. పాండురంగడంటే ఆ పాముకు అమిత భక్తి.
" స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్ళు జల్లి ముగ్గులుపెట్టేరు. కానీ, దీపం పెట్టేరుకారు " అనుకుంది.
పాము నెత్తిమీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారుకదూ? ఆ పాము పడగ ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికి, దీపంకన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యంమూలాన్ని అక్కడ చీకట్లన్నీపోయి వెలుగొచ్చింది.
" సెబాష్ సర్పరాజా! నువ్వుకూడా నా భక్తులలో చేరేవు " అన్నాడు స్వామి.
మరికాసేపటికి ఆ దారినే తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరి పోతున్నాయి. వాటిల్లో ఒక్క ఈగ మటుకు ఆగి స్వామి పాద సన్నిధిని ఉన్న ఒక పువ్వుమీద వ్రాలి అందులో స్వామియొక్క పాద తీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని త్రాగింది. మహాభక్తులూ, మునులూ పాద తీర్థంతో కలిసి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ త్రాగింది కనుక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఈవిధంగా ఆవు, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ పాండురంగని భక్తులైనై. భక్తులై ఏమి లాభం పొందాయో వినండి.
ఆ ఆవు చాలాకాలం బ్రతికి, ముసలి పండై, అఖరికి ప్రాణాలు విడిచేసింది. తర్వాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగని దయవల్ల ఒక విష్ణు భక్తుడికి కుమార్తె అయిపుట్టింది. ఆ విష్ణు భక్తుడా అమ్మాయికి 'సుశీల' అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది.
సుశీల పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేశారు. ఆ అమ్మాయి ఎంతమంచిదో, దాని మగడు అంత చెడ్డవాడు. ఉత్త నీచుడు. డబ్బుకోసం ఎలాంటి కక్కుర్తి అయినా సరే పడేవాడు. తినటానికి సరిపోయేది ఉన్నా, ఎరగని వాళ్ళ దగ్గరకెళ్ళి " అయ్యా! బీద బ్రాహ్మణ్ణి. పిల్లకి పెళ్ళి చేసుకోవడానికి డబ్బులేదు " అని యాచించే వాడు. పోనీ, ఆ యాచించి తెచ్చిందైనా కడుపునిండా తినేవాడా? ఉహూ! , పాతరేసి, దాచుక్కూచునేవాడు. అంత లోభి. పైగా ఏదో వంక పెట్టుకుని సుశీలను కొడుతూండేవాడు. కాని, సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు. మహా పతివ్రత గనుక ఓర్చుకునేది.
వాని సంగతి తెలిసిన చుట్టం ఎవరూ వాళ్ళింటికి భోజనానికి దిగేవాళ్ళు కాదు. ఒకవేళ తెలియని వాడెవడైనా వస్తే సుశీల మొగుడు " అయ్యా! మాకు మైల వచ్చింది " అని చెప్పి పంపేవాడు. కాని సుశీలకు మాత్రం అది కష్టంగా ఉండేది. ఏమంటే, ఆవిడకు అతిథులంటే చాలా గౌరవమూ, భక్తీని. అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం ఆ విష్ణుమూర్తితో సమానమని ఆమె నమ్మకం. కాని, తన భర్త ఒప్పుకోనప్పుడేం చేస్తుంది?
తన దయవల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చినా, భర్త దుర్మార్గుడవటంవల్ల సుఖపడలేక పోతున్నదన్న సంగతి పాండురంగస్వామికి తెలిసి సుశీలను కటాక్షించటం కోసం, ఒకనాడు ఒక వడుగు రూపంలో వచ్చాడు.
అప్పుడామె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరిక్షించడానికి యిదే సమయం అని ఆలోచించి, ఆ బ్రహ్మచారి, ఇంటి లోపలున్న సుశీలను పిలిచి " అమ్మా! ఆకలి వేస్తోంది. పట్టెడన్నం ఉంటే పెట్టు " అని అడిగేడు.
ఆమె, " ఉండు నాయనా! ఒక్క నిముషంలో వండి వడ్డిస్తాను " అంది.
" అబ్బెబ్బే, నువ్వు వండేదాకా నేనెక్కడాగగలను? చద్దికుండలో చద్ది అన్నమైనా సరే, ఉంటే పెట్టు . పెట్టి పెట్టి చద్ది అన్నం పెట్టడమేమిటి? పెడితే, నాకు పాపం. తింటే నీకు పాపం " అంటావేమో! నువ్వేమీ సందేహించకు. నా ఆకలి తీరిస్తివా, మూడు లోకాలనూ తృప్తి పరచినట్లే. ఇంక నాకు వచ్చే పాపం మాటన్నావ్? జపంచేసి పోగొట్టుకుంటాను " అని ఆమెను తొందరపెట్టేడు. సుశీల ఏం చేస్తుందింక? పీటవేసి, అరిటాకు పరచి, చద్దికుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చి చూచేటప్పటికి, ఆ కపట బ్రాహ్మణ వడుగు కుండలో ఉన్నదంతా వడ్డించుకుని ఆకులో ఒక్క మెతుకైనా మిగల్చకుండా అన్నమంతా తినేశాడు. " అమ్మా! ఇంకా ఆకలి తీరలేదు. ఆ కుండలో, అడుగునా పక్కల్నీ అంటిబెట్టుకుని ఏమైనా మెతుకులు ఉన్నాయేమో చూడు " అన్నాడు.
ఆమె వెతికి చూచింది కాని, కుండలో ఒక్క మెతుకుగూడా మిగలలేదు. మూడు రోజుల్నుంచి ఏ పూట కాపూట వండుకోవడం, భర్త ఊళ్ళో లేడు గనుక, పతివ్రతయైన సుశీలకు ఆ అన్నం నోటికి పోకపోవడం, అదంతా ఆ తరవాణి కుండలో వెయ్యటం జరిగింది. ఆ అన్నమంతా ఒక్క మాటుగా ఆ పొట్టివాడు తినేశాడూ అంటే, ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చిత్రమేమంటే అదంతా తిన్నాకూడా అతని ఆకలి తీరలేదు.
నిలబడి ఆలోచిస్తే ఏం లాభమని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకొని తినకుండా అలాగే ఉంచేసిన అత్తెసరు అన్నం తెచ్చి వడ్డించింది. తినేశాడు. పొయ్యిమీద కాగుతున్న చిక్కటి పాలు తెచ్చి త్రాగమంది. తాగేశాడు. కాని, ఆకలి తీరలేదు. " ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు " అన్నాడు.
అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది. భర్తకిష్టమైన మినపసున్ని, చక్కిలాలూ, చేగోడీలూ మొదలైన పిండివంటలు కొన్ని మొగుడు ఊరికెళ్ళక పూర్వమే చేసి యిచ్చింది. ఆ లోభి మగడు, ఆ వంటలు ఒక్కమాటుగా తినేస్తే అయిపోతాయేమోనన్న భయంకొద్దీ కొంచెమే తిని, సుశీలకేనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండలలో దాచి అటకమీద పెట్టుకుని వెళ్ళేడు. అవి తెచ్చిపెడితే యీ పిల్లవాని ఆకలి తీరుతుందేమో!
భర్తవచ్చి, ఆ మినపసున్నీ అవీ లేకపోవడం చూస్తే మండిపడి తనని చావకొడతాడని తెలిసుండికూడా సుశీల ఆ అతిథిని అర్థాకలితో పంపటం ఇష్టంలేక పిండివంటల్ని క్రిందికి దింపి ఆ పిల్లవానికి వడ్డించింది. వడ్డించటం తడవుగా విస్తరి ఖాళీచేసేసాడు ఆ దొంగ అతిథి. పోనీ అప్పుడైనా విస్తరిముందు నుంచి లేవచ్చా? ఉహు, " ఇంకా ఏమైనా ఉంటే తే " అన్నాడు.
అప్పుడు సుశీలకంతా అర్థమైంది. " ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న బిడ్డలా కనబడుతున్నాడే గాని, నిజంగా ఇతడు పిల్లవాడై ఉండడు. నన్ను కటాక్షించటానికి వచ్చిన ఆ పాండురంగస్వామియే అయి ఉండాలి కాని, ఈ స్వామి ఆకలి నేనెలా తీర్చగలను? " అనుకుంది.
సుశీల ఇలా ఆలోచించుకుంటూంటే ఆమెకో ఉపాయం తట్టింది. " స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రిలాంటివాడు. ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని. ఆమె తక్షణమే అగ్ని దేవుణ్ణి ప్రార్థించింది. అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నిరకాల భోజన పదార్ధాలతోటి, పిండివంటలతోటి నింపేశాడు.
అప్పుడు పాండురంగస్వామి తన వామనరూపం వదిలేసి నిజరూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. " సుశీలా! నువ్వు మహా పతివ్రతవు. అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి, అతిథి భక్తికి మెచ్చుకున్నాను. వరం కోరుకో! " అన్నాడు.
" స్వామీ!నాకు మోక్షం యియ్యి " అని కోరుకుంది సుశీల.
అది విని పాండురంగస్వామి " మోక్షమా! మోక్షమెలాగా యిస్తాను. ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి, కొడుకులూ, మనుమలూ, మునిమనుమలూ ఎత్తేక మోక్షం సంపాదించుదువు గాని " అన్నాడు.
" స్వామీ! నాకింతవరకూ ఒక్క కుమారుడైనా కలుగలేదు. మనుమలూ, మునిమనమలూ అంటావేమిటి? " అంది సుశీల.
" ఒక్కడే కాదు. నీకు అయిదుగురు కుమారులు పుడతారు. ఆ అయిదుగురూ కూడా పూర్వజన్మలో నా భక్తులే. అన్నట్లు చెప్పటం మరచిపోయాను. నీ పూర్వ జన్మలో నువ్వో ఆవువి. నాకు భక్తురాలివి కావటంవల్ల నీకీ జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకీ, హంసా, చిలుకా, పామూ, తేనెటీగ నాకు భక్తులయాయి. ఆ అయిదుగురూ నీకు కొడుకులై పుడతారు " అని చెప్పి అంతర్ధానమయిపోయాడు.
పాండురంగడు పోతూ పోతూ సుశీలకు మరో ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త ఉత్తి పిసినారి, నీచుడు, దుర్మార్గుడు అనికదూ చెప్పేను. పాండురంగవిఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉండటంకోసమని, ఆమె మగని స్వభావమే మార్చివేశాడు.
ఊరినుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పటికే, ఆ లోభి అల్లా గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పటం, యాచించటం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీలదే ఇప్పుడు. కొట్టడం, తిట్టడం మచ్చుకైనా లేదు. అప్పట్నుంచీ వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది.
క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిదుగురు కొడుకులూ పుట్టేరు. ఆ కొడుకులకు కొడుకులు ఆ కొడుకులకు గూడా కొడుకులు పుట్టేదాకా ముత్తయిదువై బ్రతికుండి ఆఖరుకు సుశీల భర్తతో పాండురంగస్వామి వద్ద మోక్షాన్ని పొందింది.