25, అక్టోబర్ 2025, శనివారం

:: స్వామి అవతరణ ::  

    గణాధిపత్య పట్టాభిషేకానికి పార్వతి ధగధగ మెరిసే రంగుబట్టల్ని ఎన్నిక చేసింది. కాని, విఘ్నేశ్వరుడు తెల్లని వస్త్రాలు ధరించాడు. 

    " మంచి బట్టలు వేసుకోవలసిన సమయంలో శుక్లాంబరధరుడు అనిపించుకున్నావేమయ్యా " అంది పార్వతి. 

    " మంచి బట్టలు కదమ్మా వేసుకోవాలి? అవే వేసుకున్నానమ్మా! తెలుపు మంచితనాన్ని, వివేకాన్ని తెలుపుతుంది " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    పట్టాభిషేకం జరిగింది. విఘ్నేశ్వరుడు గణనాథుడు అయ్యాడు. జయలక్ష్మి పేరుగల సిద్ధి, విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వరుణ్ణి వరించి ఇరుప్రక్కలా చేరారు. గణనాథుడు సిద్ధిబుద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అదే సమయంలో ఎనిమిది దిక్కులనుండి అష్ట సిద్ధులు ఎనమండుగురు చక్కని కన్యలై వచ్చి వకుళమాలలు వేసి వినాయకుణ్ణి వరించారు. విఘ్నేశ్వరుడు సిద్ధివినాయకుడు అనిపించుకున్నాడు. కళ్యాణమహోత్సవాలు వైభవంగా జరిగాయి. 

    విష్ణువు మహేశ్వరుడితో " కోటి విఘ్నాలు వచ్చినా వినాయకుడి పెళ్ళి ఆగదు అనే కొత్తసామెత అమలుజరిగింది. ఓ కళ్యాణ గణేశా! ఇక నీ చేతి మీదుగా కళ్యాణాలు జరగాలి. అలా జరిగిన కళ్యాణ ఫలంగా అవతరించిన జన్మే జన్మ! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " అలాగే జరుగుతుందిలే. కౌసల్యకు రాముడివై అవతరించి రావణ దశ అంతం చేద్దువుగాని " అని అన్నాడు. 

    మళ్ళీ విష్ణువు " గజాననా! నీ ప్రసన్న వదనం చూస్తూంటే ఏనుగు అంటే మక్కువగా ఉందోయ్ " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " మొసలి బారినుండి గజేంద్రుణ్ణి రక్షించి కరివరదుడు అనిపించుకుందువులే " అన్నాడు.  

    ఎనమండుగురు సిద్ధి కన్యలు చామర వింజామరాలు వీస్తూండగా, సింహాసనంపై సిద్ధిబుద్ధులతో చుక్కల్లో చంద్రుడిలాగ విఘ్నేశ్వరుడు ప్రకాశిస్తున్న ఆ సమయంలో, లక్ష్మి ముఖం తిప్పుకొని వెళ్ళిపోబోతూంటే  విష్ణువు ఆమెను ఆపి, విఘ్నేశ్వరుడితో " సిద్ధివినాయకా! లక్ష్మి స్థిరమైనది కాదు అని వాదు పడుతున్నది. నీ ఒడిలో కాస్త కూర్చుండనియ్యి. లక్ష్మికి స్థిరత్వం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను " అని అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు మహానందంతో " తల్లీ! మహాలక్ష్మిని ఒడి పట్టే నా అదృష్టం ఎంత గొప్పది " అని అంటూ లక్ష్మి పాదాలను తొండంతో చుట్టి తన కుడి తొడమీద కూర్చుండ బెట్టుకున్నాడు.

    అప్పుడు విష్ణువు " ఇప్పుడు విఘ్నేశ్వరుడు " లక్ష్మీగణపతి " . తల్లి కుమారుణ్ణి ఏ విధంగా కనిపెట్టుకుని ఉంటుందో అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది " అని చెప్పాడు. 

    నారదుడు " ఓహో! విఘ్నేశ్వరుడికి ఎన్ని పేర్లు? సిద్ధివినాయకుడు, లక్ష్మీగణపతి, శుక్లాంబరధరుడు - ఇంకా...ఎన్నో ఎన్నో ! " అని అంటూ మహతివీణను వాయిస్తూ " జయజయ గణనాయక జయహే " అని గానంచేస్తూ లోకాలన్నీ తిరిగాడు. 

    ఒకనాడు విఘ్నేశ్వరుడు ఎలుక వాహనంపైన ఆకాశమార్గంలో పయనిస్తూ వింధ్య పర్వతశ్రేణిని దాటి ఇంకా దక్షిణంగా వెళ్ళి ఒక పెద్ద నల్లని కొండగగ్గర దిగాడు. కొండ దిగువనే శబరులు డోళ్ళు, డప్పులూ కోలాహలంగా వాయిస్తూ పెద్ద సంబరం జరుపుకుంటున్నారు.

    విఘ్నేశ్వరుడు తన రూపాన్ని ఉపసంహరించుకొని అందమైన కుర్రవాడి రూపంతో ఉత్సవాన్ని సమీపించాడు. 

    శబరులు కుర్రవాణ్ణి చుట్టుముట్టి " దేవర తనకోసం మంచి చిన్నోడిని పంపినాడు " అంటూ ఎత్తుకుపోయి ఉత్సవం మధ్యలో దింపారు. 

    అక్కడ రక్తచారలతో పెద్ద నల్లని గండశిల ఉన్నది. ఎదురుగా ఒక పసివాడు మూగగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి ఒంటినిండా పసుపురాసి, మొలకు నల్లని గుడ్డ కట్టి, ఎర్రని మందారమాలతో అలంకరించారు. 

    విఘ్నేశ్వరుడు శబర నాయకుడితో " మీ దేవరతో నేను మాట్లాడాలి. నన్ను అతని దగ్గరకు తీసుకు వెళ్ళండి " అన్నాడు. 

    శబర నాయకుడు పకపకా నవ్వుతూ " బలే చిన్నోడివే. మా స్వామితోనే మాటాడతావా? మా స్వామి కారుచీకటిలాగ మహా భీకరంగా ఉంటాడు. ఎవరూ చూళ్ళేరు. చూస్తే రక్తం కక్కుకొని చచ్చిపోతారు." అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నవ్వి, తటాలున వెళ్ళి గండశిలను సమీపించి  " మీ భయాన్నే మీ స్వామికి అంటగట్టి భయంకరంగా ఉంటాడని అనుకుంటున్నారు. భయాన్నే భక్తి అనుకుంటున్నారు. మీలో ఉండే క్రూర స్వభావమే బలిగా తయారయింది.  ఇదంతా తప్పు. మీరెవ్వరూ మీ స్వామిని చూసి ఎరుగరు. మీ స్వామి ఎన్నడు ఇలాంటి ఉత్సవాన్ని, బలినీ కోరలేదు. మీ స్వామి ఎంతో అందంగా ఇలాగ ఉంటాడు " అని చెబుతూ అరచేత్తో రాతిని తట్టాడు. నల్లని బండరాయి తెల్లని అరటి దవ్వలాంటి అందమైన స్వామి విగ్రహంగా మారింది. ముణుకులపై చేతులుచాచి కూర్చున్న స్వామి విగ్రహం నవ్వు ముఖంతో మనోహరంగా కనిపించింది. విఘ్నేశ్వరుడు పసివాడి తల నిమిరాడు.

    ఆ పిల్లవాడు గొంతెత్తి " స్వామీ! నీవే శరణం " అంటూ విగ్రహం ముందు మోకరిల్లి స్తోత్రం మొదలుపెట్టాడు. 

    నల్లరాయి స్వామి విగ్రహంగా మారడం, మూగపిల్లవాడు గొంతెత్తి మాటలు పలకడమూ రెప్పపాటున జరిగాయి. 

    అద్భుతాలకు శబరులు నివ్వెరపాటుతో చేతులెత్తి, భయం భయంగా విఘ్నేశ్వరుడికి మ్రొక్కారు. 

    కుర్రవాడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు వారిస్తూ " నన్ను కాదు మీరు మ్రొక్కవలసింది మీ స్వామిని. భయాన్ని విడిచి ప్రేమతో కొలవండి. మీరు నమ్మిన దేవరను తండ్రిలాగ, అన్నలాగ, స్నేహితుడిలాగ చూసుకోండి. బలులు మొదలైన చెడ్డపనులు మానేసి ఫల పుష్పాలతో, అరటి తోరణాలతో ఆనందంగా పండుగలు చేసుకోండి. ఈ మాటలు వచ్చిన పిల్లవాడె మీకు గురువుగ, స్వామి పూజారిగా ఉంటాడు. నేను మీ స్వామి దగ్గరకు వెడుతున్నాను. మీ స్వామి మీకు దర్శనమిస్తాడు " అని చెప్పి చరచరా కొండను ఎక్కుతూ వెళ్ళాడు. 

    శబరులు కొంతవరకు అతనిని అనుసరించి వెళ్ళి ఆగిపోయారు. 

    విఘ్నేశ్వరుడు కుర్రవాని రూపంతోనే పర్వతాగ్రానికి చేరాడు. అక్కడ భైరవస్వామి తలవాల్చుకొని విచారంగా కూర్చొని ఉన్నాడు. అతని శరీరం కారునల్లగా ఉన్నది. 

    విఘ్నేశ్వరుడు పరుగున వెళ్ళి భైరవుణ్ణి రెండు చేతులా చుట్టి ఆలింగనం చేసుకున్న క్షణంలో భైరవుడి శరీరం తెల్లగా వెన్నెలకాంతితో ప్రకాశించింది. 

    దివ్యమంగళరూపాన్ని పొందిన భైరవుడు కుర్రవాణ్ణి ఆనందంతో కౌగలించుకొని " నీవు విఘ్నేశ్వరుడివి. నాకు తెలుసు. నీ అనుగ్రహంతో నా కారుదనం పోయి దైవత్వం సిద్ధిస్తుందని నేను అవతరించినపుడు ఆకాశవాణి చెప్పింది. ఈ కొండ ఎక్కడానికి ఎవ్వరూ సాహసించరు. నన్ను చూసి పక్షులుగూడా ధ్వని చెయ్యవు. నన్ను నేనే అసహ్యించుకొంటూ నీకోసం ఎంతకాలం నుంచో నిరీక్షిస్తూ ఉన్నాను. నీ నిజరూపంతో నా కన్నులకు విందు చెయ్యి " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నిజరూపాన్ని పొంది అతనితో " ఇకనుండి నీవు దైవంగా ఆరాధింపబడే స్వామివి. శివకేశవులిద్దరూ నీలో ఉన్నారు. నీ గురించి అమ్మ చెప్పినప్పట్నుంచి నిన్ను కలుసుకోవాలని తహతహ పడుతూనే ఉన్నాను. మోహం చీకటి లాంటిది. శివుడు మోహపరవశుడై జగన్మోహినీ రూపం ధరించిన విష్ణువు వెంట బడ్డాడు. శివ, విష్ణువుల తేజస్సులు ఒకటిగా కలిసి నీ అవతరణం జరిగింది. అందువలన నీకు నల్లని రూపు వచ్చింది. ఇప్పుడు నీ అంత దివ్య మంగళ సుందరుడైన స్వామి వేరొకడు లేడు. శబరులకు ఒకసారి కనిపించు " అన్నాడు. 

    తరువాత కుర్రవాని రూపంతో శబరుల దగ్గరకు వచ్చి " మీ స్వామి విగ్రహం ముందు మోకరిల్లి ఏకకంఠంతో " స్వామీ శరణం " అని పిలవండి. మీ స్వామి మీకు కనిపిస్తాడు. పిలిచినప్పుడల్లా పలుకుతాడు. పంటలు పండించండి. ఇళ్ళు వాకిళ్ళు పల్లెలు కట్టుకొని సుఖంగా మనుష్యుల్లా జీవించండి. మీ స్వామి అండదండలెప్పుడూ మీకు రక్షగా ఉంటాయి, వెళ్ళండి " అని చెప్పి అదృశ్యమయ్యాడు. 

    శబరులు నివ్వెరపోయి దండాలు పెట్టి, విగ్రహం దగ్గరకు చేరుకొని స్వామిని నోరారా పిలుస్తూ మ్రొక్కారు. దివ్యసుందర రూపంతో స్వామి వారికి సాక్షాత్కరించి చిరునవ్వులతో అభయముద్ర పట్టి వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. 

    అప్పటినుంచి శబరులు ఏటేటా మార్గశిరమాసంలో అరటిచెట్టు బోదెను, లేత ఆకును అనేక విధాలుగా ఉపయోగించి స్వామికి మంటపాలనూ, పందిళ్ళనూ అలంకరణచేసి, బలులు మొదలైనవి మాని సాత్వికారాధనతో స్వామిని భయంలేని భక్తితో అర్థిస్తూ, నాగరికులై, విద్యావంతులై ఉన్నత మానవత్వాన్ని సాధించారు. స్వామి నివసించిన కొండపై గొప్ప ఆలయాన్ని శిల్పకళానిలయంగా నిర్మించి సంగీతనృత్యకవితలతో అలరించి గర్వించదగ్గ మానవజాతిగా రూపొందారు. 

    కుర్రవాని రూపంలో వచ్చినదెవరో శబరులకు తెలియదు. వారి దేవర స్వామియే ఆ రూపంలో వచ్చి తమ అజ్ఞానాన్ని తొలగించి అనుగ్రహించాడని అనుకున్నారేగాని, విఘ్నేశ్వరుని లీల అని ఎరుగరు. విఘ్నేశ్వరుడు అలా ఎరుకపడి ఉంటే విఘ్నేశ్వరుడే దేవుడని ఆరాధనలు మొదలుపెట్టి  తమ స్వామినే విస్మరించుతారని విఘ్నేశ్వరుడు అజ్ఞాత బాలకుడిగానే ఉండిపోయాడన్న సంగతి స్వామి పదే పదే తలచుకొని మనసారా విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తూండే వాడు. కైలాసానికి వెళ్ళి విఘ్నేశ్వరునితో, కుమారస్వామితో  ఆనందం పంచుకోవాలని ఉవ్విళ్ళూరేవాడు. 

    విఘ్నేశ్వరుడు శబరులను సంస్కరించి మూషికవాహనుడై ఆకాశమార్గంలో క్రిందకు చూస్తూ ఉత్తరదిశగా తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. కొండచరియలన్నీ కీకారణ్యములతో నిండి ఉన్నాయే గాని, భూమి అంతా బీడుపడిన మైదానంలా కనిపించింది. జలసమృద్ధి ఉంటే కనులపండుగగా పైరుపచ్చగా ఉండవలసిందిగాని, నీటి కొరత తీర్చే నదులు లేక సౌభాగ్యశూన్యంగా భూములు వెలవెల పోతున్నవి. ప్రజలు ఆకాశాన్ని మబ్బుల్ని నమ్ముకొని ఏదోఒకలాగ జీవయాత్ర సాగిస్తున్నారు. 

    గంగమ్మలాంటి నది కలిగిన ఉత్తరదేశ ప్రజలు ఎంత పుణ్యం చేసి పుట్టారో! అంత గంగ మనకు లేకపోయినా అందులో ఒక పాయ మనకు ఏ దేవుడైన్నా కనికరించి ఇవ్వకూడదా? ముక్కోటి దేవుళ్ళున్నారంటారు, ఎందుకు? ఒక్కరికీ జాలిలేదు " అంటూ సామాన్య ప్రజలు అనుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి విఘ్నేశ్వరుడి పెద్ద చెవులకు. 

    అటు పడమటి దిక్కున ఎత్తైన పర్వత శ్రేణులు, ఇటు తూర్పున చిన్న చిన్న కొండలబారుతో నిండిఉన్న భూభాగాలు విశాలంగా తూర్పు సముద్రం వరకూ ఊరికే ఉన్నాయి. ఎక్కువమంది జనులు జంతువుల్ని, పక్షుల్ని వేటాడి తింటూ ఆటవిక జీవనం సాగిస్తున్నారు. సేద్యం మీద ఆధారపడ్డ వారు అగచాట్లు పడుతూనే ఉన్నారు. సముద్రంమీద ప్రాణభీతి విడిచి చేపలుపట్టే జాలరులు విశేషంగా కనిపించారు. చాలీచాలని మేతతో పశుగణాలు బక్కచిక్కి దీనంగా కనిపించాయి. తూర్పుతీరం పొడవునా జాలరిపల్లెలే కనిపించాయి గాని మంచి ఊళ్ళు లేవు. 

    ఉత్తరభూమితో పోల్చి చూస్తే విఘ్నేశ్వరుడికి చాలా విచారం కలిగింది. హిమాచలసీమలో ఎటు చూసినా సుందరజలపాతాలతో, రమణీయ సరోవరాలతో, నదీనదాలతో మనోహరంగా కనిపించే పచ్చని ప్రకృతి కళకళలాడుతూ ఆనందదాయకంగా ఉంటుంది. ఇక్కడ పడమటి పర్వతాలు దిష్టిబొమ్మల్లాగా బోడిగా ఉన్నాయి.

    ఆ పర్వతశ్రేణి నడుమ సహ్యాద్రి చేరువనున్న లోయలో గౌతముని ఆశ్రమం మసిబొగ్గుల్లో మరకతంలాగా ఆకుపచ్చగా మెరుస్తున్నది. విఘ్నేశ్వరుడికి ఏదో ఆలోచన వచ్చినట్లుగా తలపంకించాడు. ఎలుకను వేగం పెంచమని హెచ్చరికగా తట్టి దక్షిణాదిని, వింధ్యను దాటి ఉత్తరాది చేరుకున్నాడు. ఉత్తరభూమి దూరానికి అంతా ఏదో కొత్తగా ఉన్నట్టు కనిపించింది. 

    సమీపించేసరికి అక్కడ అంతా అయోమయంగా ఉంది. 

( సశేషం. తరువాత విఘ్నేశ్వరుడేం చేశాడన్నది వచ్చే వారం. అంతవరకు శలవు. ) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...