29, అక్టోబర్ 2025, బుధవారం

:: గోదావరి అవతరణ :: 

    గంగా పార్వతులమధ్య ద్వేషం వర్థిల్లుతూండగా గంగా పుష్కరం వచ్చింది.

   నారదుడు పార్వతితో " ముక్కోటి దేవతలు వారి వారి మహత్తులు, శక్తులు గంగానదికి
సంక్రమించేలాగ పుష్కర స్నానాలు చేస్తున్నారు. అమ్మా గౌరీ! నీవు కూడా అలాగ చేస్తే, విశాల హృదయంగల మంచిదానివి నీవేనని, లోకం నిన్ను మెచ్చుకుంటుంది " అని చెప్పి అలాగే వెళ్ళి గంగతో " గంగాభవానీ! నిన్ను పావనం చేద్దామని పార్వతి విజయం చేస్తున్నది. తెలుసా? " అన్నాడు. 

    " అలాగా! దయాదాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా, రానీ చెబుతాను " అన్నది గంగ. 

    పార్వతి పూలుజల్లి గంగలో దిగబోతూంటే " ఆగు! నన్ను మలినపర్చకు " అని గంగ ఆటంక పరిచింది. ఇద్దరికీ గొప్ప వివాద సంవాదం జరిగింది. 

" కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది. నీ అవిటి చేతుల్లో నలిగిన బొమ్మ బాబు, పాపం గజముఖుడయ్యాడు. నీవు మాత్రం ఒఠ్ఠి గొడ్రాలివి " అన్నది గంగ. 

    " నే నెవర్నో తెలుసా, పరమ శివుని అర్థాంగిని. భాగేశ్వరిని " అన్నది పార్వతి 

    " తెలియకేం, కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమ పాతకివి " అన్నది గంగ. 

    " జారిపడిన భ్రష్ఠురాలివి నువ్వు " అన్నది పార్వతి. 

    " హాలాహలం గొంతు దిగకుండా మ్రింగిన తాపాన్ని చల్లార్చితే  మెచ్చి, వచ్చి మనోహర కుసుమకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి ఇష్టురాలినో, భ్రష్టురాలినో లోకానికి తెలుసు " అంది గంగ. 

    " ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులుపడిన అర్భకురాలివి  వల్లమాలిన సుకుమారితనం దేనికి? " అన్నది పార్వతి. 

" నువ్వలాగే అంటావులే! బలులుకోరే జాలిలేని అమ్మతల్లివి. వామాచారిణివి. మలినవు. అంటరాని మాతంగివి. మోటుదానివి. శక్తివి " అని గంగ గడగడా అనేసింది. 

    " బాగా గుర్తుచేశావు, గంగా! ఔను. నేను శక్తిని. మహాశక్తిని " అంటూ పార్వతి ఆవేశం పొందింది. ప్రళయ ప్రభంజనాలు వీచాయి. చీకట్లు కమ్మాయి. మెరుపులతో ఆకాశం గర్జించింది. పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. మంచుశిఖరాలు కరిగాయి. 

    పార్వతి ఆవేశానికి గంగ పరిహాసం చేస్తూ " చాల్లే! చల్లని దాన్ని కదా! అని నన్ను చిన్నచూపు చూశావే కాని, నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు. నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే " అంటూ గంగ హిమాలయ శిఖరాగ్రాల ఎత్తు పొంగింది. గంగానది పరవళ్ళు తొక్కుతూ ఉత్తరభూమిని జలమయం చేసింది. 

    దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన భీభత్సాన్ని చూస్తూ " అమ్మలు ఆడిపోసుకోవడం కాదుగాని ప్రళయం తెచ్చిపెట్టారు " అని నిట్టూర్చి, కలహబీజం నాటిన నారదుణ్ణి ఒక్కుమ్మడిగా నిందించారు. 

    విఘ్నేశ్వరుడు దక్షిణం నుంచి తిరిగి వస్తూ, నారదుణ్ణి చూసి, " కలహభోజనా! కడుపు నిండిందా? ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా! " అన్నాడు. 

    నారదుడు " ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా! కడుపునిండిన వినాయకులెవరో, లోకకల్యాణం కోసం నడుంబిగించి పాటుపడే నాయకుడెవడో తెలిసేది " అని చలోక్తిని విసురుతూ వెళ్ళాడు.  విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు. 

    కైలాసంలో పార్వతి పశ్చాత్తాపంతో తనలో తాను " మళ్ళీ మరొక భగీరథుడు తర్లించుకుపోతేనే గాని గంగ ఉధృతి తగ్గదు " అని గట్టిగా అనుకున్నది. 

    ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు. ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభివందనం చేసి " అమ్మా! ఒక మంచి పని తలబెట్టాను. ఆశీర్వదించమ్మా! అన్నాడు. 

    " విఘ్నేశ్వరుడు తలపెట్టితే అడ్డేమిటి నాయనా! ఇంతకూ నువ్వేదో దక్షిణంగా వెళ్ళినట్లున్నావు. విశేషమేమిటి? " అన్నది పార్వతి. 

    విఘ్నేశ్వరుడు " ఏం చెప్పమంటావు? వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉన్నది.  ఆ ప్రదేశం అంతా పైరుపచ్చగా, నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంతబాగుంటుంది అని అనిపించిందమ్మా! గంగమ్మ కాస్త అటువెళ్ళి చల్లగా చూస్తేకాదా, ఏమంటావమ్మా? " అన్నాడు. 

    పార్వతి " నేననేదేముందబ్బా! అంతా ఆ విశ్వనాథుడిదేకదా భారం " అన్నది. 

    విఘ్నేశ్వరుడు " అలా అని మనం ఊరికే చూస్తూండ వలసిందేనా? మన ప్రయత్నం ఉండాలా వద్దా! " అన్నాడు. 

    " తప్పకుండా ఉండాలి. అందునా నీలాంటి వాడు పూనుకుంటే జరగనిదేముంది " అంది పార్వతి 

" ఆ మాట చాలునమ్మా! వెళ్ళి వస్తాను " అని పార్వతి పాదాలు తొండంతో  కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు, తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. 

    గౌతముడు పడమటి కనుమల నడుమ ఆశ్రమం ఏర్పరుచుకొని, అవసరం మట్టుకు సేద్యం చేసుకంటూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు. 

    పెరిగిన చేను తొక్కుకుంటూ మేస్తున్న ఆవును అదలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు. ఆ నీటి చుక్కలు పడీ పడటంతో ఆవు పడిపోయి గిలగిల తన్నుకొని కొయ్యబారింది. గౌతముడు తన సుకృతాన్ని, తపస్సును ధారపోసినా మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు. 

    నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు. ఇంద్రునికి గౌతముడి మీద తీరని పగఉంది. బ్రహ్మ అపూర్వసుందరిగా అహల్యను సృష్టి చేశాడు. ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు. ఇంకా చాలామంది పోటీ పడ్డారు. భూదేవిని ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే, అహల్య అతని దవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు. 

    గౌతముడు ప్రసవిస్తూన్న ఆవుచుట్టూరా తిరిగి వచ్చి, బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు. 

    గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతిమీదుగా గోహత్య జరిగింది. పగతీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప మునిపుంగవుడి వేషంతో తిరిగి తిరిగి, " గౌతముడు గోహత్య చేసిన మహాపాపి. అతని ఆశ్రమం మైల పడిపోయింది. గౌతముడిని చూసినా, ఆశ్రమంలో అడుగుపెట్టినా మహాపాతకం చుట్టుకుంటుంది. గంగా జలాలు ఆశ్రమ సీమలో ఆవు మీదనుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏమీ లేదు " అని లోకమంతా చాటి, సాటి మహర్షులను రెచ్చగొట్టాడు.  ఋషులు గౌతముణ్ణి వెలివేశారు. ఆశ్రమ వాసులంతా వెళ్ళిపోయారు. 

    ఎక్కడి గంగానది? ఎక్కడి పడమటి కనుమలు? అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు. 

    కపిలమహాముని కోపాగ్నికి బూడిదపోగులైన తన తాతలను తరింప చేయడానికి భగీరధుడు జలాధి దేవతైన గంగాదేవిని తపస్సుచేసి మెప్పించి దివినుండి భువికి దింపాడు. శివుడు తన జటాజూటంలో గంగను ధరించాడు. గంగ గంగాభవాని అనిపించుకుంది. గంగను ఒదలమని భగీరధుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు జడలముడి సవరించి గంగను కొద్దిగా ఒదిలాడు. గొప్ప వేగంతో గంగ చిమ్ముకొచ్చి నలుదెసలా హిమాలయాల్లో పడింది. భగీరధుడి వెంట గంగ ప్రవాహంగా తూర్పుముఖంగా వెళ్ళింది.  గంగకు భాగీరధి అని పేరు వచ్చింది. 

    హిమాలయాల్లో పడిన గంగ కొంత హిందూకుశ శిఖరాల మీదుగా పడమరకు ఇందు నదిగా ప్రవహించింది. ఇందునదినే సింధునది అన్నారు. భరతఖండానికి వాయవ్యంగా ఉన్న సింధునది మూలంగా హిందూదేశమనే పేరు వచ్చింది. 

    భగీరధుడి వెంట మహావేగంగా వెడుతున్న గంగను తన ఆశ్రమం పాడవకుండా జహ్ను మహాముని తాగేశాడు. భగీరధుడు జహ్ను మునిని ప్రార్థించి గంగను విడుదల చేయించాడు. జహ్ను మహాముని చెవినుండి గంగ వెలికి వచ్చినందువల్ల గంగకు జాహ్నవి అనే పేరుకూడా వచ్చింది. తరువాత కపిలాశ్రమం చేరి, భగీరధుడి పితరుల మీదుగా ప్రవహించి తరింపజేసి భగీరధుడి ప్రయత్నాన్ని ఫలింపజేసింది. 

    భగీరధుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముణ్ణి మెచ్చుకొని గంగ ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది. దారిపొడవునా గంగాదేవి అడుగుజాడల్లో ఎన్నో యేర్లూ, వాగులూ పుట్టాయి. 

    గౌతమాశ్రమం చేరుతూనే గంగ నదీప్రవాహమై గౌతముడు దారిచూపుతూ ముందు నడుస్తూంటే, ఆవుమీదనుంచి జలజలా పారి గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది. మాయదారి ఆవు దిగ్గునలేచి నాలుగడుగులు వేసి, అలా పైకెగసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. 

    విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి " అమ్మా! తనయుణ్ణి మన్నించు. నీ దయామృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని యింతపని చేశాను. దక్షిణగంగగా అవతరించిన నీవు, గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదావరి అని పేరుపొందుతావు " అని చేతులెత్తి మ్రొక్కి అదృశ్యమయ్యాడు. 

    గోదావరి అనేక ఉపనదులతో తూర్పుగా పయనించి తూర్పు మైదానాన్ని సస్యశ్యామలం చేసింది. సప్తఋషులు, దేవతలు గోదావరిలో జలకమాడారు. గౌతముణ్ణి ఎన్నోవిధాల శ్లాఘించి అపర భగీరధుడు అన్నారు. గోదావరి సప్త గోదావరిగా చీలి తూర్పు సముద్రాన్ని చేరింది. 

    గంగ, గోదావరి ప్రవాహంగా మారుతున్నప్పుడు, ఆమె నల్లని వేణీభరము విరజిమ్ముకుని పడమటి కనుమల్లో చిక్కుపడింది. విష్ణువు తన చేతివేళ్ళతో ఆ చిక్కు విడదీశాడు. కృష్ణవర్ణుడైన విష్ణువు వేళ్ళసందులనుంచి కొప్పులోని నీరు జారుతూ కృష్ణవేణి, కృష్ణానది అని పిలువబడుతూ మరొక గొప్పనది ప్రవహించింది. 

    అలాగే గంగాజలం ఆకాశంలో ఎగిరి, దక్షిణంగా ఉన్న కవేర మహాముని ఆశ్రమంలో కమండలంలో పడి, కన్యగా పెరిగి, అగస్త్యుని వెంట అరణ్యాల్లో విహరిస్తూ, కావేరీనదిగా మారి, అందమైన జలపాతాలతో దక్షిణసీమలో ప్రవహించింది. 

    ఆ విధంగా గౌతమ మహర్షి తెచ్చిన గంగ మరొక మూడు గొప్ప నదులుగా దక్షిణ భారతభూమిని సుభిక్షం చేసింది. 

    గంగ, గోదావరి, కృష్ణ, కావేరి అని నదులపేర్లు చెప్పుకోవటం పరిపాటి అయింది. 

    గౌతముని ఆశ్రమం తిరిగి కళకళ లాడింది. గోదావరి పొడవునా అనేక క్షేత్రాలు వెలిసాయి. గౌతముడి కీర్తిగూడా వ్యాపించింది. గంగ పడమటి కనుమలకు ప్రవహించడం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడే గాని, అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి క్షమాపణ వేడుకున్నాడు. 

    గౌతముడికి మాత్రం సంతోషం లేకపోయింది. అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా ఉండమని శపించి, ఉత్తరదేశంనుంచి వింధ్యదాటి  పడమటి చరియలో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకొంటున్నాడు. గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి. అత్రిమహాముని త్రిమూర్తుల అంశలతో పుత్రవంతుడయ్యాడు. అనసూయ అతిథులకు నిరతాన్నదానం చేస్తున్నది. 

    గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్నా, అహల్యలేని కొరత కనిపిస్తూనేఉంది. తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనస్సులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి " గౌతమా! త్వరలోనే విష్ణువు రాముడై తన పాదంమోపి, నీ భార్యను మనిషిగా చేస్తాడు. పాషాణ పునీత అవుతుంది. గోదావరి అవతరణానికిగాను నీకు చాలా శ్రమ యిచ్చాను. గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది " అన్నాడు. 

    గౌతముడు ఆ మాటలకు సంతోషంతో " విఘ్నేశ్వరా! అంతా నీ సంకల్పబలం వల్లనే కదా జరిగింది. గోదావరి జలాలూ, విఘ్నేశ్వరుని కృపా ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి " అన్నాడు. 





     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...