:: స్వామి జయశ్రీల కళ్యాణం ::
ఒకానొకప్పుడు లక్ష్మి మానససరోవరంలో జలకమాడుతూండగా, పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవమోహనంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూచింది. నారాయణుని వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరూ సాభిప్రాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది. అందులో ధగధగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది.
లక్ష్మి నారాయణుని దగ్గర చేరి కౌగలించుకున్నది. పార్వతి పగలబడి నవ్వుతూ " నేను నారాయణుడిని కాను లక్ష్మి " అని నిజరూపంతో కనిపించింది.
లక్ష్మి " అన్నకు తగ్గ చెల్లెలివే. నారాయణి అనిపించుకున్నావులే " అన్నది.
పార్వతి " అప్పుడు మోహినీ రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇది చెల్లు వేసుకో " అన్నది.
స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు. అపార ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, " తల్లులారా! మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతి పరంగా జయ, లక్ష్మి పరంగా శ్రీ కలిసి జయశ్రీ గా పెరుగుతుంది. ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు " అనిచెప్పి, పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని కావేరి నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు. వాయుదేవుడలాగే జయశ్రీని కావేరి నదికి చేర్చాడు.
దక్షిణప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణకమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకెళ్ళి నామకరణ మహోత్సవం జరిపించుతూండగా, ఆకాశవాణి " జయశ్రీ అని పిలవండి " అని పలికింది. జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి, సాహసవంతురాలు ఉండదనిపించుకొన్నది.
జయశ్రీకి రాజభవనం కంటే, ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహరించడమే యిష్టంగా ఉండేది. విల్లమ్ములు ధరించి, వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూండేది.
హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుని, కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాడు. ఒకనాడు అలాగే వెళ్ళాడు. స్వామి, విఘ్నేశ్వరుడు, కుమారస్వాని ఆనందంగా ముచ్చటలాడుతూ, మానససరోవరంలో జలవిహారం చేస్తూండగా, విఘ్నేశ్వరుడు " ఈ మానససరోవరంలోనే లక్ష్మి పార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది " అని ఊరుకున్నాడు.
స్వామికి కుతూహలం కలిగినా అణచుకొని, మరికొంత కాలం అక్కడ గడిపి వెళ్ళబోతున్నప్పుడు, విఘ్నేశ్వరుడు " స్వామీ! మాకంటే పెద్దవాడవైన నీవు బ్రహ్మచారిగా ఉండడం బాగాలేదు. సత్వరంగా నీకు కళ్యాణం తప్పదు " అన్నాడు.
కుమారస్వామి, విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు యిచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు.
ఒకనాడు స్వామి వినోదంగా పెద్దపులి మీద స్వారీచేస్తూ అరణ్యంలో తిరుగుతూండగా, పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. కోపం పటాపంచలైంది. విల్లమ్ములతో ఠీవిగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించి, స్వామి గుండెలో బాణంలాగ గ్రుచ్చుకొన్నది. స్వామి అంతర్ధానమయ్యాడు.
జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు. అతని కోసమే అరణ్యాలలో తిరుగుతున్నది.
నారదుడి ఆదేశంతో, చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాధిరాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లమ్ములు ధరించి, పెద్ద నల్లనికుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు.
రాజాధిరాజులు ఠీవి ఒలకబోస్తూ శబర యువకుణ్ణి, అతడి పెంపుడు కుక్కనూ ఎకసెక్కెం చేశారు.
స్వామి సింహద్వారానికి అడ్డంగా, అందర్నీ కారాగారంలో బందీలను చేసినట్లు కుక్కమీద కూర్చున్నాడు. కుక్క పెద్దపులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జయశ్రీని పులిమీద ముందు కూర్చుండ బెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబర యువకుడి మీద ఒక్కుమ్మడిగా విరుచుకు పడి, ఆయుధాలు తీశారు. స్వామి విల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు.
అతని బలప్రయోగ ధాటికి దేవతలు చెల్లా చెదురై నిజరూపాలతో అస్త్రాలు ప్రయోగించారు. స్వామిని ఎలాంటి అస్త్రమూ తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిమాలినదైంది. అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహరస్వామిగా సాక్షాత్కరించాడు దేవతలు చేతులు మోడ్చారు. " శరణం స్వామీ! " అన్నారు.
స్వామి, జయశ్రీల కళ్యాణం దేవాదిదేవతల మధ్య మహావైభవంగా జరిగింది. జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి