14, నవంబర్ 2025, శుక్రవారం

:: విఘ్నేశ్వరుడు హనుమంతునికిచ్చిన జ్యోతిర్లింగమేమయింది? :: 

    త్రేతాయుగంలో ఆర్యావర్తంలో కోసలుడు, కైకయుడు, వసుమిత్రుడు అనే రాజులు ముగ్గురు ఆప్తమిత్రులుగా ఉండేవారు. కోసలుడికి కౌసల్య, కేకయుడికి కైకేయి, వసుమిత్రుడికి సుమిత్ర అనే కుమార్తెలున్నారు. అయోధ్యను పాలించే దశరథుడికి తమ కుమార్తెలను యిచ్చి పెళ్ళిచేయాలని ముగ్గురు రాజులకూ ఏకాభిప్రాయం కలిగింది. దశరథుడు అంగీకరించాడు. 

    ముగ్గురు రాజులూ జైమిని మహర్షిచేత వివాహానికి లగ్నం పెట్టించారు. జైమిని ముహూర్తం నిర్ణయించి " నేను పెట్టిన ముహూర్త బలం ఎటువంటిదంటే విఘ్నేశ్వరుడి సాక్షిగా ఈ ముగ్గురి వివాహం దశరథుడితో జరిగి తీరుతుంది. అయితే, వివాహం జరిగేముందు రాకుమార్తెలకు రాక్షసగండం కనిపిస్తున్నది. కనుక, ముగ్గుర్నీ జాగ్రత్తగా ఉంచాలి " అని చెప్పాడు. 

    ముగ్గురు కన్యలనూ రాజులు ఒక పెద్ద పెట్టెలో భద్రంగా దాచారు. 

    నారదుడు రావణాసురిడితో " లంకేశ్వరా! అతి త్వరలోనే దశరథుడికి వివాహం కాబోతున్నది. దశరథుడికుమారుడు నిన్ను హతమారుస్తాడు " అని చెప్పాడు. 

    రావణుడు రాకుమార్తెలను ఎత్తుకురమ్మని మహోదరుడు అనే గొప్ప రాక్షసుణ్ణి పంపాడు. మహోదరుడు కన్యలను పెట్టెలో భద్రపరచినది కనిపెట్టి, ఆ పెట్టెను మ్రింగేశాడు. వాడు ఆకాశమార్గంగా సముద్రం మీదుగా లంకకు వెడుతూండగా, కడుపునొప్పి వచ్చి పెట్టెను కక్కేశాడు. సముద్రంలో పడి పెట్టె కెరటాలమీద కొట్టుకొంటూ పోయింది. 

    దశరథుడు సముద్రంమీద దూరతీరాలకు వెళ్ళి పెద్ద నౌకలో తిరిగి వస్తున్నాడు. ప్రయాణం ఆలస్యమయింది. అనుకున్న నాటికి చేరలేకపోతున్నందుకు విచారిస్తూ, దశరథుడు సముద్రాన్ని చూస్తూండగా నౌకవేపే కొట్టుకొని వస్తూన్న పెద్ద పెట్టె కనిపించింది.  పెట్టె నౌకను ఢీకొని పైకప్పు ఊడిపోయింది. అందులో రాకుమార్తెలు కనిపించారు. తాళ్ళనిచ్చెనలతో వారిని నౌకమీదకు రప్పించాక, ఆ ముగ్గురూ తాను వివాహం చేసుకోనున్న పెండ్లికుమార్తెలేనని దశరథుడు తెలుసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి జైమిని మహర్షి ముహూర్తం పెట్టాడు. అప్పుడు అక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై, ముగ్గురు రాకుమార్తెలతో దశరథుడి వివాహం జరిపించి అంతర్థానమయ్యాడు. ముగ్గురు వధువులతో దశరథుడు ఆనందంగా స్వదేశం చేరుకున్నాడు. 

    చిరకాలానికి దశరథుడికి నలుగురు కుమారులు పుట్టారు. పెద్దవాడయిన రాముడు కైకేయి కారణంగా సీతతో, లక్ష్మణుడితో అరణ్యవాసం వెళ్ళాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు. రాముడు హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వానరుల సహకారంతో లంకను ముట్టడించి రావణ సంహారం చేశాడు. సీతతో పుష్పక విమానంలో బయలుదేరి, వారధికట్టడం ప్రారంభించిన సముద్రతీరంలో ఆగి, అక్కడ శివపూజ జరిపి, అయోధ్యకు వెళ్ళాలనుకున్నాడు. 

    శివలింగ ప్రతిష్ఠకు తగిన లింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని కైలాసానికి పంపాడు. హనుమంతుడు మనోవేగంతో కైలాసం చేరుకొని, అక్కడ ఉన్న శివలింగాల్లో పెద్దలింగాన్ని చూసి రెండు చేతుల్తో ఎత్తబోయాడు. లింగం కొంచెమైనా కదల్లేదు. దానికంటే చిన్నలింగాన్ని తీయబోయాడు. అదీ కదల్లేదు. చివరికి అన్నిటికంటే చిన్నలింగాన్ని కూడా ఎత్తలేకపోయాడు. 

    కాలం మించిపోతున్నది. తన అసమర్థతకు హనుమంతుడు విచారిస్తుండగా, బుడిబుడి నడకలతో అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు. " ఎవరయ్యా నీవు? హనుమంతుడిలాగే ఉన్నావు, కానీ కావు " అన్నాడు పిల్లవాడు. 

    " నేను హనుమంతుడినే. ఒక శివలింగాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు. ఇంతకూ, నీవెవరివోయి బాలుడా? " అన్నాడు హనుమంతుడు. 

    " ఇక్కడి లింగాలను ఎవరూ ఎత్తుకుపోకుండా నన్ను కాపలా ఉంచారు గాని, నీవు హనుమంతుడవని చెబుతున్నావు. హనుమంతుడు శివుని అవతారమే అనీ, పంచముఖాంజనేయుడనీ విన్నాను. నీ పంచముఖాలు ఏవి? " అన్నాడు బాలుడు. 

    అప్పుడు హనుమంతుడు గరుడ,వరాహ, సింహ, అశ్వముఖాలను కలుపుకొని, పంచముఖాంజనేయుడై, ఉన్నతంగా పెరిగి పిల్లవాడితో నవ్వుతూ " విఘ్నేశ్వరా! నా వంతు అయింది. పంచముఖ విఘ్నేశ్వరుడి రూపంలో కనిపించడం నీ వంతు " అన్నాడు. 

    అప్పుడు బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు, అయిదు తలలతో సమాన ఎత్తున పెరిగి విశ్వరూపంతో కనిపించాడు. 

    హనుమంతుడు పంచముఖ విఘ్నేశ్వరుడికి నమస్కరించి " పిల్లవాడి రూపంలో వస్తున్నప్పుడే విఘ్నేశ్వరుడవని గ్రహించాను. శివలింగాలు కదలకుండా చేసింది నీవే కదా! నీవే ఒక లింగాన్ని ప్రసాదించు " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " హనుమా! నీ పంచముఖరూపం చూడాలని నేను అలా చేసాను. నీవు శివాంశలో పుట్టినవాడవు. నీకు అడ్డేమిటి? అయినా, అడిగావు కనక విశేషాంశలుగల లింగాన్ని నీకు యివ్వాలనే ఎంచి ఉంచాను. తీసుకువెళ్ళు " అని చెబుతూ, హనుమంతుడి దోసిట్లో గొప్పదైన జ్యోతిర్లింగాన్ని ఉంచాడు. 

    హనుమంతుడు మామూలు రూపంతో దోసిట్లోని లింగాన్ని పదిలంగా పట్టుకొని రివ్వున ఎగిరివెళ్ళాడు. అప్పటికి కాలాతిక్రమణ జరిగింది. 

    సమయం మించిపోకుండా సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని చేసింది. రాముడు జలాభిషేకం చేసి, పూజకు ఉపక్రమించబోతూండగా, హనుమంతుడు లింగంతో అక్కడ వ్రాలాడు. 

    హనుమంతుడు జరుగుతున్నది చూసి, తోకతో సైకత లింగాన్ని చుట్టి తీసివేయ బోయాడు. కానీ, ఇసుకలింగం చెక్కుచెదరలేదు. హనుమంతుడు మరింత తోక గట్టిగా బిగించి లాగితే తోక నొప్పిపెట్టిందే కాని లింగం కదలలేదు. 

    అప్పుడు రాముడు హనుమంతుణ్ణి శాంతపరచి " హనుమా! బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కప్పుడు పొరపాటు పడుతూంటారు సుమీ! అన్నీ తెలిసిన వాడివి. సైకత లింగమైనా, అది శివునికి ఆనవాలు కదా! ఇంతకూ, ఇప్పుడేం మించిపోతుంది గనక, నీవు తెచ్చిన లింగాన్ని సైకత లింగం దాపునే ప్రతిష్ఠించి, పూజించి మరీ వెడతాను " అని చెప్పాడు. 

    హనుమంతుడు తను తెచ్చిన లింగాన్ని రాముడికి ఇచ్చి, లెంపలు వేసుకొని సైకత లింగానికి మ్రొక్కాడు. 

    రాముడు హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి, యధావిధిగా పూజాక్రమం సీతతో కలిసి జరిపిన పిమ్మట అందరితో పుష్పకం మీద అయోధ్యకు చేరి, పట్టాభిషిక్తుడయ్యాడు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...