23, నవంబర్ 2025, ఆదివారం

 

:: విఘ్నేశ్వరచరిత్రలో సుందరకాండ ::

వినాయకచవితినాటి మునిమాపువేళ విఘ్నేశ్వరుడు తన దంతంలాగే ఉన్న చంద్రుణ్ణిచూస్తూ, నిండుబొజ్జతో మందంగా అడుగులు వేస్తున్నాడు. చిట్టెలుక వెంట వస్తున్నది.

నెలవంక విఘ్నేశ్వరుడి సంకేతం అంటారు. విఘ్నేశ్వరుడి నుదుట తెల్లని మంచి గంధంతో తీర్చిదిద్దిన బాలచంద్ర తిలకం, ఆకాశంమీది చవితి చంద్రుడి ప్రతిబింబంలాగ ప్రకాశిస్తున్నది. ఫాలచంద్రుడు, బాలచంద్రుడు అని కూడా విఘ్నేశ్వరుడికి పేర్లున్నవి.

కాలి బొటనవ్రేలికి చిన్నరాయి తగిలి వినాయకుడు అమాంతంగా బోర్లాపడ్డాడు. కడుపు పగిలిపోయింది. తినుబండారాలు వెలికివచ్చి నేల విరజిమ్ముకున్నాయి. అదే అదనుగా ఎలుక వాటిని గబగబా తినసాగింది. ఆ వినోదానికి ఆకాశపు చిరునవ్వులా ప్రకాశించే చందమామ పకపకా నవ్వాడు. దేవతలు మొదలైన వారంతా వచ్చి, పెద్ద సర్పంతో వినాయకుడి బొజ్జ కలిపి కుట్టారు.

పార్వతికి చంద్రుడిమీద చాలా కోపం వచ్చింది. ఆమె “ వినాయకచవితి నాడు చంద్రుణ్ణి చూస్తే, నీలాపనిందలు వచ్చి పడతాయి “ అని శపించింది.

అది మొదలు పిల్లల్నిసైతం చూడనివ్వకుండా వినాయకచవితి నాడు చంద్రదర్శనం కాకుండా, అంతా జాగ్రత్త పడుతూ వచ్చారు.  

ద్వాపరయుగం వచ్చింది. దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టి, గోకులంలో యశోద ముద్దులపట్టిగా పెరుగుతున్న బాలకృష్ణుడు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు అనే రాక్షసుల్ని అప్పటికే చంపేశాడు. బాగా మాటలు నేర్చాడు.

ఆరోజు వినాయక చవితి. యశోద పాలు పితుకుతున్నది. బాలకృష్ణుడు యశోద వీపుమీద నుంచి వంగి పాత్రలోని పాలలో ప్రతిబింబించిన చంద్రవంకను చూసి “ చందమామ! పాలలో చందమామ “ అంటూ చప్పట్లు చరిచాడు.

యశోద గతుక్కుమని “ ఎంతపని చేశావు కన్నా! ముందుముందు ఎన్ని నీలాపనిందలు పడవలసి వస్తుందో మరి, అని నొచ్చుకుంది.

“ నీలాపనింద అంటే ఏమిటమ్మా? “ అన్నాడు కృష్ణుడు.

“ ఉత్తినే నిన్ను దొంగ అంటారు “ అన్నది యశోద.

“ విచారించకమ్మా! పాలూ, వెన్న దొంగతనం చేస్తూంటానమ్మా! అప్పుడది నీలాపనింద అవదుగా! “ అన్నాడు కృష్ణుడు.

“ ఆరి పిడుగా! నీనోట బ్రహ్మాండాలు విరుచుకుపడా! “అని అంటూ గోపమ్మ బుగ్గలు నొక్కుకున్నది.

“ బ్రహ్మాండాలు చూశావా అమ్మా? “ అని కృష్ణుడడిగాడు.

యశోద “ బ్రహ్మాండాలకెం గాని, పెద్దయినా నీమీద అభాండాలు పడ్డం ఖాయం “ అంటూ సున్నితంగా బాలుడి తలమీద మొట్టికాయ పెట్టింది.

“ అప్పుడు మళ్ళీ ఇలాగే చందమామను చూడాలికదూ? “ అన్నాడు కృష్ణుడు.

“ పెద్దయ్యాకచూస్తే మరీ తప్పు” అంది యశోద. మనసులో “ విఘ్నేశా! అభం శుభం తెలియని పసివాడు. నీడ చూశాడు. అంతే! మన్నించు అని అనుకుంది. 

ఆ మర్నాడు బలరాముడు గబగబా వచ్చి యశోదతో “ అమ్మా! తమ్ముడు మన్ను తింటున్నాడు. అబద్ధం కాదు. వాడి నోరు చూడు “ అని చెప్పాడు. యశోద చరచరా వెళ్ళింది.

కృష్ణుడు మట్టి ముద్దలు వరుసగా పేరుస్తున్నాడు. యశోద కృష్ణుడి చెవిబట్టి “ ఏది, నోరు తెరు “ అన్నది.

“ నన్ను నీచేత కొట్టించాలని ఎవరో ఏదో చాడీ చెప్పినట్టుంది. నీలాపనిందలు పడతాయని నిన్ననే కదా నువ్వు చెప్పావు? మట్టితో ఉండ్రాళ్ళు, లడ్లు చేస్తున్నానమ్మా! మట్టితో చేసిన వినాయకుడు మన్నుతో చేసినవయితేనే నిజంగా తింటాడమ్మా “ అన్నాడు కృష్ణుడు.

యశోద లెంపలు వేసుకుంటూ “ తప్పు నాయనా! తప్పు. మన్నుతో చేసినా, రాయితో చెక్కినా దేవుడు దేవుడే. అపచారం స్వామీ! విఘ్నేశా! పిల్లవాడి మాటలు ఏ మాత్రం పట్టించుకోకు “ అని ధ్యానించింది.

“ అయితే, వచ్చే వినాయక చవితికి వెన్న ఉండ్రాళ్ళు నేతిలడ్లు బోలెడన్ని చెయ్యి. ఎన్ని తింటాడో చూస్తా, తినకపోతే తినిపించుతా “ అన్నాడు కృష్ణుడు.

“ ముందు నీ నోరు చూపించు” అంటూ యశోద వంగి చూడబోతుంటే కృష్ణుడు “ ఆ” అంటూ బార్లా నోరు తెరిచాడు.

యశోద అలా చూస్తూనే ముచ్చెమటలు పట్టి చతికిల కూలబడింది. కృష్ణుడి నోటిలో బ్రహ్మాండాలు, నక్షత్రమండలాలు, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, సముద్రాలు, పర్వతాలు, సమస్తమూ కనిపించాయి. పాలు పితుకుతున్న యశోద వీపున వాలి, మెడ చుట్టూరాచిట్టి చేతులు చుట్టి, పాలల్లో చందమామను చూపిస్తూన్న కృష్ణుడు కనిపించాడు. యశోద కల అనుకొని గిల్లుకుని కళ్ళు నులుముకుంది. కలకాదు. ఏ దేవతో, వినాయకుడో తనను మాయలో ముంచేస్తున్నాడని అనుకుంటూ చుట్టూరాచూసింది. యశోద వెర్రిచూపులకు చుట్టూచేరిన పిల్లవాళ్ళు కేరింతలు కొడుతున్నారు. స్తంభం చాటున బలరాముడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

కృష్ణుడు యశోద ముఖం మీదికి వంగి " చూడమ్మా! చూడు. మన్ను కనిపించిందా? బాగా చూడు " అంటూ తెరచిన నోరు మరింత దగ్గరగా చాపుతూంటే, యశోదకు దేవాదిదేవుళ్ళు కనిపించారు. కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుతూంటే, విఘ్నేశ్వరుడు తాండవం చేస్తూ కనిపించాడు. కృష్ణుడు నల్లని పెద్ద సర్పం తలలమీద తంతున్నాడు. అది కృష్ణుణ్ణి చుట్టివేస్తున్నది. 

యశోద కెవ్వున అరచి మూర్చపోయింది. 

యశోద తిరిగి కళ్ళు తెరిచేసరికి మంచం చుట్టూరా గొల్లభామలూ, గొల్ల అవ్వలూ కనిపించారు. 

" నాకేమయింది? " అని ఆశ్చర్యంగా అడిగింది యశోద. 

ఆమెకు ఏదీ జ్ఞాపకం లేదు. ఏమీ జరగనట్టే అంతా మరచిపోయింది. 

" నీకేమయిందో మాకు తెలియదు గాని, మా ఇళ్ళలో దొంగతనాలు జరిగాయి. ఆ దొంగ నీ ముద్దుల కొడుకే! వెన్న, మీగడ, పాలు, పెరుగులూ కుర్ర మూకకీ, కోతులకూ పంచిపెడుతూండగా కళ్ళారా చూశాము " అని చెప్పారు గోపకాంతులు. 

యశోద, " ఏమిటేమిటి? అవన్నీ మీ ఇళ్ళలోవని ఎలాగ అనుకొన్నారు? మా ఇంట లేవనుకున్నారా? గోకులం ఊళ్ళోని ఇల్లన్నీ కలిపినా మా ఇంట ఉన్నవాటిలో సగానికైనారావు. వెళ్ళండి " అంటూ వాళ్ళని సాగనంపింది. 

కృష్ణుడు మెల్లగా వచ్చి " ఏం జరిగిందమ్మా? " అని అడిగాడు. 

" ఏం జరుగుతుందని అన్నానో అదే జరిగింది. నీమీద నీలాపనింద పడింది " అన్నది యశోద. 

" నీలాపనింద తప్పించేసుకున్నానమ్మా! వాళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా! " అన్నాడు కృష్ణుడు. 

యశోదకు పట్టరాని కోపం వచ్చింది. పెద్ద తాడుతో కృష్ణుణ్ణి పెద్దరోలుకు వేసి కట్టింది. కృష్ణుడు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి, జంటగా పెరిగిన రెండు మద్దిమానుల సందున దూరి రోటిని లాగాడు. మహావృక్షాలు రెండూ వ్రేళ్ళతో పెళ్ళగించుకొని కూలాయి. శాపవిముక్తులైన గంధర్వులు కృష్ణుణ్ణి నుతించి ఆకాశాని కెగసి అదృశ్యులయ్యారు. 

ఏడాది తిరిగింది. వినాయక చవితి వచ్చింది. రంగురంగుల పెద్ద వినాయక విగ్రహాన్ని నందుడు చేయించాడు. యశోద పాలమీగడతో పిండి కలిపి ఉండ్రాళ్ళు, వెన్న అప్పాలు, నేతి లడ్లు, పాలతో జిల్లేడు కాయలు దండిగా చేసింది. 

నైవేద్యాలన్నీ పళ్ళేలనిండా నింపి, పూజామందిరంలో అమర్చి తలుపు చేరవేసి, యశోద అలా వెళ్ళింది. 

కృష్ణుడు మెల్లగా పూజామందిరం ప్రవేశించి, తలుపు మూసి, తినుబండారాల్ని వినాయక విగ్రహానికి అందిస్తూ, " తినవయ్యా తిను " అంటూ ప్రతిమ బొజ్జ నిమిరాడు. 

ప్రతిమ విఘ్నేశ్వరుడై తొండంతో అందుకుంటూ, " కృష్ణా! నేనందించేవి నువ్వూ తినాలి. విఘ్నేశ్వర చరిత్రలో ఇది సుందర కాండ " అంటూ వెన్నతో చేసిన తినుబండారాల్ని కృష్ణుడి నోట కుక్కాడు. పళ్ళేలు ఖాళీ అవుతున్నాయి. 

యశోద పూజామందిరానికి వస్తూ గవాక్షం గుండా లోపల జరుగుతున్న సుందర కాండ చూచి కొయ్యబారి పోయింది. ముచ్చెమటలు పట్టాయి. మళ్ళీ తమాయించుకుని, " అబ్బే! నేనేదో భ్రమ పడుతున్నాను. నాకళ్ళకేదో మాయ తెగులు పట్టుకుంది " అని సర్దిచెప్పుకుంటూ తలుపు తెరచి వచ్చింది. 

వినాయక విగ్రహం విగ్రహంలాగే ఉన్నది. అమర్చిపెట్టిన తినుబండారాలు కనిపించటంలేదు. కృష్ణుడు బిక్కమొహం పెట్టి చూస్తున్నాడు. 

" నీ తిండి తగలడా! పూజ కాకుండా అంతా పాడుచేశావు " అంటూ యశోద కృష్ణుడి వీపుమీద గట్టిగా నాలుగు చరిచింది. 

కృష్ణుడు ఏడుస్తూ, ఎవరికీ చిక్కకుండా పరుగుదీసి, కాళింది మడుగు చేరాడు. ఆ వెనుకనే యశోదతోబాటు గోకులంలోని వారంతా ఆదుర్దాగా వెళ్ళారు. 

కాళింది మడుగులో ఉంటున్న కాళీయ మహాసర్పం వల్ల గోకుల వాసులకు ఎన్నో విధాలుగా హాని జరుగుతూ వస్తున్నది. కృష్ణుడు మడుగు ఒడ్డునే ఉన్న చెట్టెక్కి, మడుగు మధ్యకు వ్యాపించి ఉన్న కొమ్మ మీద నుంచి, మడుగులోకి దూకి కాళీయ నాగుడి నెత్తిమీద పిడుగులాగ పడ్డాడు. గజ్జెలందెలు ఘల్లుఘల్లు మనగా కృష్ణుడు కాళీయుడి తలలమీద తాండవం చేశాడు. అద్భుతంగా కాళీయమర్దనం జరిగింది. కాళీయుడి శాపం తీరింది. కుమార్తెలను తీసుకెళ్ళి పాతాళంలో వాసుకికి అప్పగించి, కాళీయరూపం ఉపసంహరించుకొని, విఘ్నం విఘ్నేశ్వరుడికి అధీనమయింది. 

కొడుకు నెత్తుకొని యశోద ఇంటికొచ్చి చూసేసరికి, పూజామందిరంలో పళ్ళాలన్నీ నిండుగా ఎలాగ పేర్చినవి అలాగే ఉన్నాయి. బాలకృష్ణుడి వీపుమీద మాత్రం యశోద వ్రేలితట్లు కనిపిస్తున్నాయి. యశోద వాటిని చూసి " నా చేతులు పడిపోను! నాకళ్ళకేదో మాయరోగం వచ్చి నిష్కారణంగా కొట్టాను. పాపిష్ఠిదాన్ని " అని వలవలా ఏడ్చింది. 

" అమ్మా! బోలెడు వేళ ఉంది. పూజచెయ్యవూ, మరి! " అన్నాడు కృష్ణుడు. నందుడు యశోద కృష్ణుడిచేతే పూజ చేయించారు. నైవేద్యాన్ని ఊరందరికీ పంచారు. ఆ తినుబండారాల్లో అమృతం ఉందనిపించింది. గోకులమంతా ఆనందం పొంగి పొర్లింది.

( ఇప్పటికి సశేషం. తరువాయి కథ వచ్చే వారం. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! ) 

                    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...