:: కృష్ణవినాయకీయం ::
కృష్ణుడు బాగా ఎదిగాడు. గోవర్థనగిరిని ఎత్తి ప్రళయభీకరమైన జడివాన నుండి గోవులను, గోపబాలకులను కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు.
గోవర్థన ప్రాంతంలో ఒకనాడు కృష్ణుడు ఆవులను కాస్తూండగా, చంకను పెద్ద మద్దెల పెట్టుకొని వస్తున్న ఒక పెద్దమనిషి " అబ్బాయీ! ఇక్కడ కృష్ణుడు అనే అబ్బాయి ఉన్నాడట. మురళి చాలా గొప్పగా వాయిస్తాడని చెప్పుకొంటున్నారు. ఆ మురళీగానం ఏ పాటిదో చూద్దామని వచ్చాను. అతడి ఉనికి చెప్పగలవా? " అన్నాడు కృష్ణుడితో.
" స్వామీ! ఆ కృష్ణ పరమాణువును నేనే! తమరెవరో చాలా గొప్ప మృదంగ విద్వాంసుల్లాగా ఉన్నారు. తమరెవరో తెలియని వాణ్ణి. కాస్త సెలవియ్యండి స్వామీ! " అని కృష్ణుడు చేతులు జోడిస్తూ అన్నాడు.
" నన్ను మృదంగకేసరి అని పిలుస్తారు. మాది దక్షిణదేశం. మధురానగరానికి వెడుతున్నాను.. కంసుడు ధనుర్యాగం చేస్తాడుట. అప్పుడు నా మద్దెల విద్వత్తును ప్రదర్శిద్దామని వెడుతున్నాను " అన్నాడు మృదంగకేసరినని చెప్పుకొన్న పెద్దమనిషి.
అతని కాలికి రత్నఖచితమైన గండపెండెరం, చేతులకు కెంపులు తాపిన సింహతలాటాలు, మెడలో బంగారు నిమ్మకాయల దండ, చెవులకు పెద్ద కుండలాలు ధగధగా మెరుస్తున్నవి. మద్దెలనిండా నవరత్న స్వర్ణపతకాలు తాపి ఉన్నవి.
కృష్ణుడు వాటిని చూసి అబ్బురపడుతూ, " స్వామీ! నేను ఆవుల్నికాసే సామాన్య గోపకుణ్ణి. నా పిల్లనగ్రోవి సాదా వెదురు బొంగుముక్క. మీ దక్షిణదేశ విద్వాంసులు తాళానికి ప్రసిద్ధులు. ఇహ నేను ఏదో ఒక రాగాన్ని ఊది, ఆవుల్ని పాలించుకోవడం తప్పితే, మరేది తెలియని గాలి పాటగాణ్ణి మాత్రమే " అన్నాడు.
కృష్ణుడి మాటలకు నవ్వి, మృదంగకేసరి " అలాగని తప్పించుకుపోబోతున్నావా? వీల్లేదు. నీ మురళీగానం గొప్పదో, నా మృదంగ వాయిద్యం గొప్పదో ఇప్పుడే తేలిపోవాలి " అన్నాడు.
కృష్ణుడు గడగడలాడుతూ, ఊదడానికి మురళి తీసాడు. మృదంగకేసరి మఠం వేసి మద్దెల వాయించ మొదలుపెట్టాడు. కృష్ణుడు యమునాకళ్యాణి రాగాన్ని వాయిస్తూ మృదంగకేసరిని తికమకపెట్టి ఠక్కున హంసధ్వని రాగాన్ని అందుకొని అద్భుతంగా వాయిస్తూంటే, మృదంగకేసరి పరవశించి మైమరచి మద్దెల విడిచి నృత్యం చెయ్యడం మొదలుపెట్టాడు.
కృష్ణుడు హంసధ్వని రాగాన్ని చిత్ర విచిత్ర గతులతో స్వరాలు మరింత దురితంలో పలికిస్తూంటే, మృదంగకేసరి రూపువిడిచి విఘ్నేశ్వరుడై తొండమెత్తి, బొజ్జ ఊపుకుంటూ తాండవం చేశాడు మద్దెల మాయమై ఎలుక గంతులు వేసింది.
విఘ్నేశ్వరుడు తనకు ప్రియతమమైన హంసధ్వని రాగానికి పులకరించిపోతూ, తాండవం చేస్తూ అలసిపోతూంటే కృష్ణుడు ఠక్కున మురళి వాయించడం ఆపి, విఘ్నేశ్వరుడు పడిపోకుండా ఒడిసి పట్టుకొని " పార్వతీనందనా! మళ్ళీ బోర్లాపడ్డావంటే, మీ అమ్మ మురళీగానాన్ని వినకూడదని శపించి పోతుందేమోనన్న భయంతో, నిన్ను క్రింద పడిపోకుండా పట్టుకున్నాను. మరేం అనుకోకు లంబోదరా! " అన్నాడు.
విఘ్నేశ్వరుడు " కృష్ణా! నీ మురళీ గానాన్ని వినాలనే ఇలా వచ్చాను. మన కృష్ణ వినాయకీయం నిజంగా సుందరకాండే " అన్నాడు.
కృష్ణుడు " విఘ్నేశా! పాపం, నీ వాహనం మద్దెల దరువులు బాగా తిన్నదే " అని అంటూ ఎలుకను ముద్దుగా నిమిరాడు.
విఘ్నేశ్వరుడు " కృష్ణా! కంసుడికి అంత్యకాలం సమీపించింది. ధనుర్యాగం సాకుతో నిన్ను తీసుకురమ్మని అక్రూరుణ్ణి పంపుతాడు. వెళ్ళు. విజయోస్తు " అని చెప్పాడు.
కృష్ణుడు " అంతా నీదయ స్వామీ! " అని చేతులు మోడ్చి మ్రొక్కాడు.
విఘ్నేశ్వరుడు " అవతార మూర్తివి. నా దయకాదు. నీ లీల. అన్నట్టు, అర్క కుబ్జ రూపంతో నీకోసం ఎదురు చూస్తూంటుంది, అనుగ్రహించు " అని చెప్పి ఎలుక వాహనం ఎక్కి, ఆకాశానికి రివ్వున వెళ్ళి అంతర్థానమయ్యాడు.
అక్రూరుడు కృష్ణ బలరాములను మధురాపురానికి రథం మీద తీసుకువెళ్ళాడు. అష్ట వంకరులతో ఉన్న కుబ్జ, కృష్ణుడికి ఎదురొచ్చి, పాదాలకు మ్రొక్కి, చందనం పూసింది. కృష్ణ బలరాములకు పూల మాలలు వేసింది.
కృష్ణుడు ఆప్యాయంగా కుబ్జను రెండు చేతులతో లేవనెత్తాడు. కుబ్జ రూపం పోయి అప్సరస రూపంతో అర్క దేవలోకం చేరుకుంది.
కంసుడు తనని చంపాలని చేసిన కపటోపాయాలన్నిటినీ చిత్తుచేసి, కృష్ణుడు కంసుణ్ణి పట్టుకొని సింహాసనం నుంచి ఈడ్చి లాగాడు. కంసుడు మరణించాడు.
దేవకీ వసుదేవులను కారాగార విముక్తులను చేసి, కృష్ణుడు ఉగ్రసేనుడిని కూడా కారాగారం నుండి విడిపించి, అతని సింహాసనం అతని పరం చేశాడు. కృష్ణ బలరాములు పెద్దవాళ్ళయ్యారు. కృష్ణుడు అనేకమంది దుర్మార్గులను, రాక్షసులను నిర్మూలించాడు. సముద్రంలోనికి చొచ్చుకొని దుర్భేధ్యంలాగా ఉండేలాగా ద్వారకా నగరాన్ని నిర్మాణం చేయించి, అన్న బలరాముణ్ణి యాదవులకు పెద్దగా చేసి రాజరికాన్ని నెలకొల్పాడు.
కృష్ణుడు రుక్మిణిని తెచ్చుకొని వివాహం చేసుకున్నాడు.
సర్వసంపదలతో తులతూగుతున్నా, కృష్ణుడు ఎప్పటివలెనే ఆవులను కాస్తూ, పాలు పితుకుతూ గోపాలకృష్ణుడుగానే ద్వారకలో ఉంటున్నాడు.
ద్వారకా నగరం ప్రక్కనే సత్రాజిత్తు అనే ప్రముఖుడు రాజువలె సంస్థానం ఏర్పరచుకొని భోగభాగ్యాలతో తులతూగుతున్నాడు. తాను సూర్యవంశ క్షత్రియుడనని సగర్వంగా చెప్పుకుంటూ, సూర్యోపాసకుడై గొప్ప తపస్సు చేశాడు. సూర్యుడు ప్రసన్నుడై శమంతకమణి అనే పెద్ద వజ్రాన్ని అతనికి ప్రసాదించాడు. శమంతకమణి నుండి వెలువడే కాంతికిరణాలు బంగారు కణికలై ప్రతిరోజూ అతనికి అంతులేని బంగారం సమకూరుతూండేది.
సత్రాజిత్తు ప్రముఖులనిపించుకుంటున్న వారికి ఆహ్వానాలు పంపి మరీ వచ్చిన వారందరికీ మణిని చూపించి, మణి ప్రభావాన్ని వర్ణిస్తూ మురిసిపోతూండేవాడు. కృష్ణుడికి గూడా ఆహ్వానం పంపించాడు. కానీ, కృష్ణుడు రాలేదు. ఎప్పుడో వీలుచూసుకొని వస్తానని తిరుగు కబురు పంపించాడు. గర్విష్ఠి అయిన సత్రాజిత్తు కృష్ణుడిపై ద్వేషం పెట్టుకున్నాడు. కృష్ణుడి గురించి ఎన్నో విశేషాలు విన్నా, ఒక యాదవ ప్రముఖుడుగా తప్పితే కృష్ణుడిపై అతనికి పెద్ద అభిప్రాయం ఏర్పడలేదు.
సత్రాజిత్తుకు సత్యభామ అనే అసమాన సౌందర్యవతియైన కుమార్తె ఉన్నది. శమంతకమణితో బాటు సత్యభామ సౌందర్యం కూడా విఖ్యాతి కెక్కింది. జరాసంధుడిలాంటి రాజాధిరాజులు సైతం సత్యభామను చేపట్టాలని కాచుకొని ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి