:: రుక్మిణి వేదాంతం ::
సత్యభామకు విఘ్నేశ్వరుడిపై ఎనలేని భక్తివిశ్వాసములున్నవి. ఆమె ప్రతి వినాయకచవితికి విఘ్నేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి కృష్ణుణ్ణి తన అధీనుడుగా చేయవలెనని కోరుకుంటూండేది. కృష్ణుడు ఆ దారిని వచ్చినప్పుడల్లా సౌధాగ్రంమీద నిల్చొని చూసి చూసి, ఒకసారైనా అతడు తలపైకెత్తి తనను చూడలేదు కదా అని నిరాశతో విఘ్నేశ్వరుడి మ్రోల మోకరిల్లి తన ఆశ ఫలింపచేయమని మరీమరీ ధ్యానిస్తూండేది.
సత్రాజిత్తుకు కుమార్తె మనసు తెలిసినా తెలియనట్టే ఉండేవాడు. ఒకనాడు సత్య విఘ్నేశ్వరుడి ముందు మోకరిల్లి ఉండగా చూసి " ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని అనుగ్రహం మనపై ఉండగా, ఇలాంటి మ్రొక్కుబడులు దేనికమ్మా? " అన్నాడు.
సత్యభామ చివాలున లేచి " అలా అనకూడదు నాన్నా! మనోవాంఛితాన్ని సఫలం చేయగల దేవుడు విఘ్నేశ్వరుడు ఒక్కడే " అన్నది.
" ఏమిటి నీ మనోవాంఛితం? రుక్మిణితో పాలు పంచుకోవడమేనా? " అన్నాడు సత్రాజిత్తు.
" పాలు పంచుకోవడమేమిటి? కృష్ణుణ్ణి నా అధీనంలో పెట్టుకుంటాను " అన్నది సత్యభామ.
సత్యభామ పట్టుదల ఎలాంటిదో సత్రాజిత్తుకు తెలియనిదికాదు. అయినా, వట్టి బేల అని తనకు తాను సర్దిబెట్టుకుంటూ వెళ్ళాడు.
మరునాడే కృష్ణుడు సత్రాజిత్తు దగ్గరకు వచ్చాడు. రాకరాక వచ్చిన కృష్ణుడి కళ్ళపడాలని సత్య సంబరపడుతూ ముస్తాబు సవరించుకొని సభామందిరానికి వెళ్ళేసరికి కృష్ణుడు అప్పుడే వెళ్ళిపోయాడు. సత్రాజిత్తు శ్యమంతకమణిని గుప్పెట్లో భద్రంగా పట్టుకొని ఉగ్రంగా కృష్ణుడు వెళ్ళిన వేపే చూస్తూ ఎంతో దిగులుగా నిలుచున్నాడు.
సత్యభామ తండ్రితో " ఏమిటి నాన్నా! అలాగ ఉన్నారు? వచ్చినవాడు నన్ను తనకు యిమ్మని అడగలేదుగద? " అన్నది.
" అలా అడిగినా నేనంతగా పట్టించుకోను కాని, ఏమడిగాడో తెలుసా? శ్యమంతకమణిని యిమ్మన్నాడు. తనలాంటి వాడి దగ్గర ఉంటే, ప్రజలందరి శ్రేయస్సుకు ఎన్నోవిధాల ఉపయోగపడుతుందని కూడా అన్నాడు " అని సత్రాజిత్తు చెప్పాడు.
సత్యభామ చిరుకోపంతో " ఇంతకూ నాకంటే శ్యమంతకమణే నీకు ఎక్కువైనదికదూ? " అంటూ చరచర వెళ్ళబోతూంటే, సత్రాజిత్తు బుజ్జగింపుగా " అలా అనుకోవద్దమ్మా! ఆ కృష్ణుడి పేరాసకు విస్తుబోతున్నాను, అంతే! " అంటూ నసిగాడు.
" అతడు మణి ఇచ్చే బంగారాన్ని దాచుకుంటానని అనలేదుకదా! అతనిది పేరాస ఎలా అవుతుంది నాన్నా? కృష్ణుడంతటివాడు అడిగినప్పుడు సంతోషంతో యిచ్చివేస్తే ఎంతో బాగుండేది నాన్నా! " అన్నది సత్యభామ.
సత్రాజిత్తు కంపించిపోతూ " ఇవ్వను. ప్రాణాలతో ఉండగా నా దగ్గరనుంచి మణిని ఎవరూ తీసుకోలేరు. మణి నా ప్రాణం. నా సర్వస్వం " అంటూ గట్టిగా అరిచాడు.
సత్యభామ ముఖం జేవురించుకొని " ఔను! మణి నీకు అంత గొప్పది. నాకంటే గొప్పది. ఆ శ్యమంతకమణి గొప్పదో, నేను గొప్పో ఆ కృష్ణుడే రుజువు చెయ్యాలి " అంటూ చరచరా వెళ్ళింది.
కొద్దిరోజుల తరువాత వినాయకచవితి వచ్చింది. సత్యభామ యధావిధిగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించి, ఆ సాయంత్రం పల్లకిలో ద్వారకానగరానికి బయలుదేరి వెళ్ళింది.
ఆ సాయంత్రం ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది. చీకటి అవుతున్నది. కృష్ణుడు ఆవు పాలు పితుకుతున్నాడు. ఒక్కసారిగా మబ్బు విడిపోయి చవితి చంద్రవంక పాలల్లో తళుక్కున ప్రతిబింబించి కృష్ణుడికి కనిపించి క్షణంలో మబ్బు క్రమ్మి మాయమైంది.
వినాయకచవితినాడు చంద్రుడి కంటపడినందుకు కృష్ణుడు నొచ్చుకుంటూ, పూజామందిరంలోకి వెళ్ళి అక్షతలు తలమీద చల్లుకొని, విఘ్నేశ్వరుని ముందు నిల్చొని కన్నులుమూసి " దేవా! ప్రతిబింబమే అయినా చూశాను. అంతా నీ దయ " అని ధ్యానించాడు. అతడు అలా ధ్యానిస్తున్నప్పుడు " కృష్ణా! నీవు చూడాలని చూడలేదుగా! నీలాపనింద పడినా మబ్బు విడిపోయినట్లే విడిపోతుంది. ఇదీ ఒక లాభానికే అనుకోవయ్యా! " అంటూ విఘ్నేశ్వర ప్రతిమలోంచి వెలువడినట్లుగా మాటలు వినిపించాయి.
కృష్ణుడు కన్నులు తెరచి " స్వామీ! అంతా నీ లీల " అన్నాడు.
అదే సమయంలో రుక్మిణి పూజామందిరం ప్రవేశిస్తూ విఘ్నేశ్వరునిముందు నిల్చుని ఏదో జపిస్తున్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూసి " శ్రీవారు విఘ్నేశ్వరుల వారితో ఏవో మంతనాలు జరుపుతున్నట్లున్నదే! " అన్నది.
కృష్ణుడు " ఇదేవేళ ఒకానొక వినాయకచవితినాడు నన్ను పెంచిన యశోదమ్మతో నేను అన్న మాటలు గుర్తుకొచ్చాయి అంతే " అన్నాడు.
" ఆ ముద్దుమాటలేమిటో నాకు కూడా వినిపించవా స్వామీ! " అన్నది రుక్మిణి.
కృష్ణుడు " యశోదమ్మ పితుకుతున్న పాలలో చవితి చంద్రుడి బింబం చూసి కేరింతలు కొట్టాను. ఎన్ని నిందలు పడతావోకదా! అని యశోదమ్మ నొచ్చుకున్నది. పెద్దయ్యాక అయినా నింద తప్పదన్నది. దానికి నేను అమ్మా! అప్పుడు మళ్ళీ చూడాలికదు! అని అన్నాను " అని చెప్పాడు.
రుక్మిణి " మరి అప్పుడు నీలాపనింద సంగతి ఏమైంది? " అని అడిగింది.
" మన్ను తింటున్నానని అన్నయ్య చెప్పనే చెప్పాడు " అన్నాడు కృష్ణుడు.
రుక్మిణి " మళ్ళీ ఇప్పుడు చంద్రుణ్ణి చూడలేదుకదు. చూడాలన్నా కనిపించడులెండి. బాగా మబ్బుపట్టి ఉంది " అని అంటూ ఏదో చెప్పబోతున్నట్లు చూసింది.
" రుక్మిణీ! ఏదో చెప్ప వచ్చినట్లున్నావే, ఏమిటి విశేషం? " అని అడిగాడు కృష్ణుడు.
" విశేషమే! సత్రాజిత్తులవారి ఇంటిమణి మన యింటికి విచ్చేసింది " అన్నది రుక్మిణి.
కృష్ణుడు " శ్యమంతకమణి మన యింటికి రావడమేమిటి? " అన్నాడు ఆశ్చర్యంగా
" ఆ మణి కాదు. సత్రాజిత్తులవారి కన్యకామణి, సత్యభామామణి వచ్చింది. చాలాసేపుగా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాము. చూసిచూసి ఇప్పుడే పల్లకిలో వెళ్ళింది. ఆమెను సాగనంపి యిలా వచ్చాను. మీరు కనిపించారు " అన్నది రుక్మిణి.
కృష్ణుడు తలపంకించి " అలాగా! మన ఇంటి విఘ్నేశ్వరదేవుణ్ణి కూడా చూడాలని వచ్చి ఉంటుంది. చూసిందికదా! " అన్నాడు.
రుక్మిణి " విఘ్నేశ్వరదేవుణ్ణి చూడాలని వచ్చిందో, మీ కనుసన్నల్లో పడాలని వచ్చిందో మరి! ఉన్నంతసేపూ ఆమె చూపులు మిమ్మల్నే తెగ వెతికి వెతికి వేసారాయని మాత్రం నాకు రూఢిగా తెలుసు " అన్నది.
" ఏమిటీ వింత? మాటలు రావనుకున్న రుక్మిణీదేవి, ఈరోజు చతురంగా మాట్లాడుతున్నదే! " అని కృష్ణుడు అన్నాడు.
కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో " ఔను నాథా! ఈరోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ కన్యకామణికి మీమీద ఎంత ఆశ! అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పెట్లో ఉంచుకోవాలన్నంత మమత నాకు కనిపించింది " అన్నది.
" మరి, నీ సంగతి చెప్పలేదు " అన్నాడు కృష్ణుడు.
" మీలోపల ఒక అణువునై ఇమిడి ఊండిపోవడమే నాకు కావలసినదల్లా! మీరు ఎవరి గుప్పిటలో ఉన్నా, నేను మీలోనే ఉంటానుగదా! " అన్నది రుక్మిణి.
" రుక్మిణీ! ఎంత గొప్ప భావాల్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు, అందుకే, నిన్ను కోరికోరి ఎత్తుకు వచ్చాను " అన్నాడు కృష్ణుడు.
" నాకు నిజమని తోచింది చెబుతున్నాను, నాకంటే సత్యభామదే గొప్ప మమత. బలమైనది. ఆ మమతలో, అనంతమైన ప్రకృతిశక్తి అంతా ఉంది. స్వామీ! నాలో ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే! " అని చెబుతున్న రుక్మిణిని వారించి, కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ " రుక్మిణీ! వేదాంతం మాట్లాడకు " అన్నాడు.
కొద్దిదినాలు గడిచాయో లేదో " కృష్ణుడు శ్యమంతకమణిని అపహరించాడు " అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది. ఆవిధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దు:ఖంతో పిచ్చివాడై వీధి వీధులా తిరిగి అరుస్తూ విశేషప్రచారం చేశాడు.
తనమీద పడ్డ అభాండానికి చింతించి ప్రయోజనం లేదని కృష్ణుడు దిటవు తెచ్చుకొని, " విఘ్నేశ్వరా! ఇదంతా నీ లీల, తరువాత నీ దయ " అని ధ్యానించి, మణిని అన్వేషించడానికి అరణ్యాల్లోకి వెళ్ళాడు.
జరిగిన దేమంటే సత్యభామను సత్రాజిత్తు వరుసకు తనకు మేనల్లుడైన శతధన్వుడు అనే రాజుకిచ్చి వివాహంచేసే నిర్ణయానికొచ్చి, తన తమ్ముడు ప్రసేనజిత్తును, శతధన్వుడితో మాటామంతీ చేసి రమ్మని పంపాడు. ప్రసేనుడు శ్యమంతకమణిని ధరించి అరణ్యమార్గంలో వెడుతూండగా, ఒక సింహం మణిచేత ఆకర్షింపబడి అతణ్ణి చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి, మణిని తీసుకుపోయి, తన కుమార్తె జాంబవతికిచ్చాడు.
మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో, ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించి మణిని అపహరించాడని సత్రాజిత్తు చాటాడు. సత్యభామను పెళ్ళాడటానికి ఉవ్విళ్ళూరుతున్న శతధన్వుడు, జరాసంధుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరచి పగతీర్చుకోవడానికి సాయపడతామంటూ కబురుపెట్టారు.
( ఇప్పటికి సశేషం. తరువాతి వృత్తాంతము వచ్చే వారం. అంతవరకు శలవు. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి