4, డిసెంబర్ 2025, గురువారం

 :: అర్జునుడు శ్యమంతకమణిని భూమిలో ఎందుకు నిక్షిప్తం చేశాడు? :: 


    మణిని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు, అరణ్యంలో ఒకచోట చచ్చిపడి ఉన్న ప్రసేనుడినీ, సింహాన్నీ, జాంబవంతుడి అడుగుజాడలనూ చూసి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు. 

    గుహలో నవ యవ్వనవతి, సుందరి అయిన జాంబవతి మణిని బంతిలాగ ఎగరవేసి పట్టుకొంటూ ఆడుకొంటున్నది. జాంబవతి పసిపిల్లగా అరణ్యంలో జాంబవంతుడికి దొరికిన అనాధ రాజపుత్రిక. అతడామెను తన ముద్దుల కూతురిగా పెంచుకొచ్చాడు. 

    మణిని తీసుకొనడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకొన్నాడు. జాంబవతి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా తలవాల్చి సిగ్గు దొంతరలతో క్రీగంట కృష్ణుణ్ణి చూస్తున్న సమయంలో జాంబవంతుడు గుహకు వచ్చి, కృష్ణుడిపై లంఘించాడు. ఇద్దరికీ పన్నెండు రోజులు గొప్ప యుద్ధం జరిగింది. కృష్ణుడు పిడికిటితో జాంబవంతుడి గుండెమీద బలంగా పొడిచాడు. ఆ పోటుతో రాముడే కృష్ణుడిగా అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు. 

    జాంబవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి, " కృష్ణా! జాంబవతి చేతిని పట్టనే పట్టావు, జాంబవతి నీదే! " అంటూ శ్యమంతకమణినీ, జాంబవతినీ కృష్ణుడికి సమర్పించాడు. 

    జాంబవతితో జాంబవంతుడు వెంటరాగా, కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి, సత్రాజిత్తుకు మణిని అందజేశాడు. జాంబవంతుడు సత్రాజిత్తుకు జరిగినదంతా చెప్పాడు. 

    సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో " కృష్ణా! సొమ్ము పోయినవాడు పాపాత్ముడు అనే విధంగా నేను మహాపరాథం చేశాను. నన్ను నీ యిష్టమొచ్చినట్లు దండించు " అన్నాడు. 

    కృష్ణుడు సత్రాజిత్తుతో " నీ పశ్ఛాత్తాపమే నీకు దండన " అన్నాడు. 

    అప్పుడు సత్రాజిత్తు తన అపచారానికి పరిహారంగా, మన్ననగా శ్యమంతకమణినీ, సత్యభామనూ కృష్ణుడి ఎదుట ఉంచి స్వీకరించమని వేడుకొన్నాడు. 

    కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ, శ్యమంతకమణిని సత్రాజిత్తునే ఉంచుకోమని తిరిగి యిచ్చి వేశాడు. సత్యభామ, కృష్ణుడు తనను స్వీకరించిన ఆనందం పొంగిపొర్లుతుండగా, " చూశావా నాన్నా! నేను గొప్పదాన్నో, మణి గొప్పదో ఇప్పుడు తెలిసిందా! " అన్నట్లు సగర్వంగా సత్రాజిత్తుని చూసి, " నాన్నా! ఒకప్పుడు విఘ్నేశ్వరుడి మహత్తును గుర్తించలేని వాడవై ఏమో అన్నావు. నేను విఘ్నేశ్వరుణ్ణే నమ్ముకున్నదాన్ని. నా అబీష్టం నెరవేరింది " అంటూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి చేతులెత్తి మ్రొక్కింది. 

    అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లీలగా కనుపించి " భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన సత్యానికి ఎల్లప్పుడూ వశవర్తిగా ఉంటాడు. సత్యమే అతని సొత్తు " అనే అర్థం స్ఫురించేలాగ " సత్యభామా పరిణయంతో కృష్ణుడు సత్యాపతిగా పేరుపడతాడు " అని చెప్పాడు. 

    సత్రాజిత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి మ్రొక్కి " నా అపచారాన్ని మన్నించు దేవా! " అంటూ లెంపలు వేసుకున్నాడు. 

    కృష్ణుడు " విఘ్నేశా! అంతా నీ లీల. నీ దయవలన అపవాదు తొలగించుకొని మణికంటే అమూల్యమైన సత్యభామా మణిని సంపాదించాను " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " శ్యమంతకమణి కథ విన్నవారికి అపనిందలు అంటవు " అని చెబుతూ అంతర్థానమయ్యాడు. 

    సత్రాజిత్తు కృష్ణుడి కాళ్ళు కడిగి కన్యాదానంచేసే తన అదృష్టానికి పొంగిపోతూ, కృష్ణుడితో సత్యభామ వివాహాన్ని మహా వైభవోపేతంగా జరిపించాడు. తరువాత కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకొన్నాడు. జాంబవంతుడు కృష్ణుడితో " కృష్ణా! నీవు రామావతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం చేయాలని అభిలాషను వ్యక్తం చేశాను. నీవంటి అల్లుడిని పొందిన జనకమహారాజు అదృష్టానికి అసూయపడుతున్నాననికూడా అన్నాను. ఆ రెండు కోరికలు ఇప్పుడు తీర్చావు. నేను ధన్యుణ్ణి. జీవన్ముక్తుణ్ణి " అని చెప్పి తపస్సు చేసి తరించడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. 

    కొంతకాలం తరువాత శతధన్వుడు కసితో సత్రాజిత్తుని చంపి మణిని తీసుకొని కృతవర్మ, అక్రూరులు తోడుగా పారిపోయాడు. కృష్ణుడు సత్యభామను ఓదార్చి శతధన్వుడిని యుద్ధంలో సంహరించాడు. అక్రూర కృతవర్మలు మణితో పారిపోయారు. వారిని వెదకిపట్టి కృష్ణుడు మణిని తీసుకొచ్చి, తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు యిచ్చాడు.

   కృష్ణుడు మిత్రవింద, కాళింది, భద్ర, నాగ్నజితి, లక్ష్మణ అనేవారిని కూడా వివాహం చేసుకొన్నాడు. ఎనమండుగురు భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తులతూగుతూ ప్రతియేటా వినాయకచవితిని భక్తిశ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు. 

    శ్యమంతకమణి ప్రభావంవల్ల సత్యభామ అంత:పురం అంతులేని బంగారంతో నిండిపోయింది. ఆ బంగారంతో సత్యభామ రత్నరాసులనూ, అమూల్యాభరణాలనూ, చీనిచీనాంబరాలనూ కోకొల్లలుగా తనయింట నింపుకొంది. అష్టమహిషులలో తానే ఐశ్వర్యవంతురాలననే సంపద్గర్వంతోబాటు, తానే అధికురాలననీ, కృష్ణుడికిష్ట భార్యననే అహంభావం క్రమక్రమంగా పెరిగింది. 

    కృష్ణుని అష్టమహిషులలో జాంబవతి గొప్ప వైణిక విద్వాంసురాలు. నారదుడు తన మహతి వీణను వాయించుతూ గగనమార్గంలో పయనిస్తూండగా పరిహాసం చేస్తున్నట్లుగా పకపకా నవ్వు వినిపించింది. 

    నారదుడు నివ్వెరపోయి, " ఎవరా నవ్వేది? ఎందుకు నవ్వుతున్నావు? " అంటూ నలుదెసలా చూశాడు. 

    " నారదా! యింకా నీవు చాలా నేర్చుకోవలసి ఉంది. నీ వీణానాదానికి నీవు నీలో పొంగిపోతూంటే నవ్వు వచ్చింది " అని అశరీరవాణి పలికింది. 

    నారదుడు, " ఎవరివద్ద ఇంకా నేర్చుకోవాలి? " అని అనుకుంటూండగా, విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి " జాంబవతివద్ద వీణావాద్యంలోని మెళకువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకో! " అని చెప్పాడు.

    ఆవిధంగా నారదుడు కృష్ణుడి అనుగ్రహంతో జాంబవతి వల్ల వీణావాదంలోని మెళకువలన్నీ తెలుసుకొన్నాడు. 

    ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంత:పురంలో ఉండగా నారదుడు పారిజాతపుష్పాన్ని అతనికిచ్చాడు. కృష్ణుడు దానిని రుక్మిణికిచ్చాడు. అదివిని సత్యభామ అలిగింది. కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడవాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి, నందనవనంలోని పారిజాత వృక్షానికి వృక్షాన్నే తీసుకువచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు. అయినప్పటికీ, కృష్ణుడికి తనపై గురి తగ్గిపోతూన్నదేమోనని దిగులు పట్టుకొన్నది సత్యభామకు. కృష్ణుణ్ణి తన చెప్పుచేతల్లో తన మందిరంలో ఉండిపోయేలాగా చేసుకోవాలన్న తాపత్రయం పెంచుకొన్నది. 

    నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి, పుణ్యకవ్రతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె అధీనంలోనే ఉంటాడని చెప్పాడు. సత్యభామ వ్రత నియమం ప్రకారం కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది. నారదుడు కృష్ణుణ్ణి ఎత్తుకెత్తు బంగారమిచ్చి కొనుక్కోవచ్చునని అమ్మకానికి పెట్టాడు.  సత్యభామ తన ఇంటనున్న అంతులేని బంగారాన్ని కృష్ణ తులాభారంలో పెట్టింది. శ్యమంతకమణిని కూడా వేసింది. కానీ, కృష్ణుడు కొంచెమైనా తూగలేదు. అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచిపెట్టి, రుక్మిణిని కృష్ణుణ్ణి విడిపించుకునే మార్గం చెప్పమని వేడింది. 

    రుక్మిణి, " చెల్లీ! కృష్ణుడితో సరితూగగల సంపద భక్తి ఒక్కటే! భక్తిపూర్వకంగా వేసిన ఒక్క తులసీదళం చాలును! " అనిచెప్పి సత్యభామకు చిన్న తులసి ఆకు యిచ్చింది. 

    సత్యభామ ఆ తులసీదళాన్ని కన్నుల కద్దుకొని, భక్తిపూర్వకంగా తక్కెడలో వేసింది. కృష్ణుడు కూర్చున్న సిబ్బె పైకి లేచి సమానంగా తూగింది. అప్పుడు నారదుడు తులసీదళాన్ని మాత్రమే తీసుకొని కళ్ళకు అద్దుకొని, కృష్ణుణ్ణి సత్యభామపరం చేసి వెళ్ళిపోయాడు. 

    కృష్ణ తులాభారంతో సత్యభామకు జ్ఞానోదయం అయింది. ఐశ్వర్యంమీద, మణి మీద వ్యామోహం నశించి కృష్ణుడే తన పెన్నిధిగా భక్తిభావం కలిగింది. 

    మణి వలన లభించిన బంగారాన్ని అంతటినీ కృష్ణుడు చెప్పినట్లుగా యాత్రికులకూ, బాటసారులకూ భోజన వసతి సౌకర్యాలుగల ధర్మశాలలనేకం, దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది. ఆ ధర్మశాలలు సత్రాజిత్తుపేరు స్ఫురించేలాగా సత్రములు అని పిలువబడ్డాయి. 

    అటుపిమ్మట కొంతకాలానికి కృష్ణబలరాముల చెల్లెలైన సుభద్రకు అర్జునిడితో వివాహం జరిగినప్పుడు, సత్యభామ శ్యమంతకమణిని సుభద్రకు అరణంగా పెట్టింది.  ఆవిధంగా మణి పాండవులను చేరింది. 

    మణిగూర్చిన బంగారం ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి బాగా ఉపయోగపడింది. తరువాత ధర్మరాజు జూదమాడి తనతోబాటు తమ్ములనూ, ద్రౌపదినీ, రాజ్యాన్ని ఓడిపోయాడు. రాజసూయయాగం చూసి దుర్యోధనుడికి కన్నుకుట్టింది. ద్రౌపదిని పరాభవించాలనే దుశ్చింత రేపింది. 

    పాండవుల పురోహితుడైన థౌమ్యుడు తొలినుండి అనేక అనర్థాలకు కారణమవుతూ వచ్చిన శ్యమంతకమణిని విసర్జించమని చెప్పగా, అర్జునుడు మణిని వింటికి సంధించి బలంగా భూమికేసి కొట్టాడు. మణి భూగర్భంలో నిక్షిప్తపడిపోయింది. 

    పాండవులు జూదంలో కౌరవులకు ఓడి అరణ్యవాసం చేస్తూండగా, ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి, రాజ్యప్రాప్తికి భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశవ్రతాన్ని చేసి, తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళమని చెప్పాడు. 

( మరొక గాథ వచ్చేవారం. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! ) 

    

    

    

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...