:: ఖాండవవన దహనం ::
ఒకప్పుడు గ్రీష్మకాలంలో కృష్ణార్జునులిద్దరూ వనవిహారం బయలుదేరారు. పోయిపోయి, ఖాండవవనం సమీపానికి చేరుకున్నారు. అక్కడ వారు సుఖావిష్టులై ఉండగా, ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి " మీరెవరో మహానుభావులలాగా ఉన్నారు. నేను చాలా ఆకలిబాధతో వచ్చాను. ' తీరుస్తాను ' అని మీరు మాట ఇస్తే, నా కథ చెబుతాను అన్నాడు.
వెంటనే అర్జునుడు " చెప్పవయ్యా, బ్రాహ్మడా! నేనుండగా నీకేం భయం? " అన్నాడు ధీమాగా. ఈ మాట చెవిని పడగానే వృద్ధుని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఇలా చెప్పాడు.
" నేనే అగ్నిని. లోగడ శ్వేతకి అనే రాజు లెక్కలేనన్ని యాగాలు చేశాడు. ఆయన చేసిన యాగాలు ఎన్ని అని లెక్క చెప్పాలంటే వినండి. వాటిలో పాల్గొన్న బ్రాహ్మణులకు పొగవల్ల నేత్రరోగాలు వచ్చినై. హోమం చేసిన నెయ్యి తాగితాగి నాకు కడుపునొప్పి పట్టుకొన్నది. ఈబాధ వదుల్చుకోవటం ఎలాగా? అని బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తే, " ఖాండవవనాన్ని దహించవయ్యా, నీరోగం ఇట్టే నయమవుతుంది " అని అన్నాడు. నేను ఎన్నోసారులు ప్రయత్నం చేశాను కాని, ఆ వనానికి అధిపతి అయిన దేవేంద్రుడు వర్షం కురిపించడంవల్ల ఆటంకం కలిగి, నాకోరిక నెరవేర్చుకోలేకపోయాను.
ఈ సంగతి మళ్ళీపోయి బ్రహ్మతో చెప్పుకొనేసరికి, ఆయన " త్వరలోనే కృష్ణార్జునులు ఆ వనానికి రాబోతున్నారు. అప్పుడు వారికి నీ సంగతి వినిపించి, సహాయం కోరుకో. వారు తప్పక నెరవేరుస్తారు " అని సలహా చెప్పాడు. అలానే మీరు దయచేశారు. నాకోరిక తీర్చాలి " అని ప్రార్థించాడు.
మాట తప్పటానికి మనస్కరించక అర్జునుడు " బాగానే ఉంది. మరిప్పుడు మావద్ద ఆయుధాలు లేవే? " అన్నాడు. అప్పుడు అగ్ని వరుణదేవుని వేడుకోగా, వరుణుడు వచ్చి అర్జునునకు గాండీవము, అక్షయతూణీరమూ, దివ్యరథమున్నూ, కృష్ణునికి చక్రము, కౌమోదకి అనే గద సమర్పించాడు. ఈ పరికరాలతో కృష్ణార్జునులు ఒక పక్షం రోజులు కాపలాకాస్తూ ఉండగా, అగ్నిదేవుడు ఖాండవవనం దహించి, తన కోరిక సఫలం చేసుసుకున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి