:: గంగావతరణము ::
పూర్వం ఇక్ష్వాకువంశంలో సగరుడనే చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒకామెకు ఒక్కగానొక్క కొడుకు ' అసమంజసు' డనేవాడు. వీడి దుర్మార్గం సహించలేక తండ్రి వీడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. రెండవ భార్యకు అరవైవేలమంది పుత్రులు. వాళ్ళు చాలా గర్విష్ఠులు.
సగరచక్రవర్తి ఒకప్పుడు అశ్వమేథయాగం తలపెట్టాడు. యజ్ఞాశ్వం మాయమయింది. దానిని వెతికి పట్టటానికి ఈ అరవైవేలమంది బయలుదేరి పాతాళలోకం చేరుకున్నారు. అక్కడ కపిలమహర్షి వద్ద ఈ అశ్వం కనపడగా, ఆయనే దొంగిలించాడని వీళ్ళు గోలచేశారు. మహర్షి ఉగ్రుడై, వారిని శపించేసరికి, వారంతా ఉన్నపాటున భస్మమైపోయారు.
చివరకు సగరచక్రవర్తికి ' అంశుమంతుడు ' అనే ఒక్క మనుమడు మిగిలాడు. వానికి పట్టం కట్టి చక్రవర్తి తపస్సు చేసుకోబోయాడు. ఈ అంశుమంతుని మనుమడె భగీరథుడు. కపిలమహర్షి వల్ల భస్మమైపోయిన తన ముత్తాతలకు గతులు కల్పించాలని భగీరథుడు సంకల్పించాడు.
వారికి గతులు కలుగవలెనంటే, పవిత్రమైన గంగాజలం వారిమీదనుంచి ప్రవహించాలి. అయితే, ఆ కాలమందు గంగ భూలోకమందు ఇంకా అవతరించలేదు. అప్పుడు భగీరథుడు అనేకవేల సంవత్సరాలు ఘోర తపస్సుచేసి గంగాదేవిని ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై " నాయనా! నేను దిగివస్తే, నన్ను భూదేవి భరించలేదు. కనుక పరమేశ్వరుణ్ణి గూర్చి తపస్సుచేసి, మొట్టమొదట నా శక్తిని ఆయన భరించేటట్టు వరం పొందు " అని చెప్పి అదృశ్యమయింది.
భగీరథుడు శివుని గురించి తపస్సుచేసి వరం పొందాడు. తరువాత గంగ దిగివచ్చి పరమేశ్వరుని తలపైనపడి, ఆయన జటాజూటం లోపలినుండి దారిచేసుకొని, భగీరథుని వెంబడే భూమిమీద ప్రవహించింది.
ఇలా గొప్ప ప్రయత్నం చేసి, గంగను పాతాళానికి కొనిపోయి, అరవైవేల సగర పుత్రులకూ గతులు కల్పించాడు భగీరథుడు. దీనినిబట్టే, " భగీరథప్రయత్నం " అనే జాతీయం ఏర్పడింది. గంగకు భాగీరథీ అనే పేరు వచ్చింది. శివుడు గంగాధరుడయ్యాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి