:: మెప్పు ::
సుగ్రీవుడి నాయకత్వంలో వానర సేన లంకకు బయలు దేరింది. అడ్డం వచ్చిన సముద్రం మీద వారధి నిర్మాణం జరుగుతోంది. వానరులంతా ఉత్సాహంగా రామ నామాన్ని జపిస్తూ రాళ్ళు ఎత్తుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఒడ్డున ఉన్న శ్రీరాముడు తనకోసం శ్రమిస్తున్న వానరులను సంతోషంగా చూస్తున్నాడు. తమ శ్రమను శ్రీరామచంద్ర ప్రభువు కళ్ళారా చూస్తున్నాడన్న విషయం వానరులను మైమరపింపజేస్తోంది. వారు రెట్టించిన ఉత్సాహంతో పని చేయసాగారు. ఎండలో నిలబడిఉన్న శ్రీరాముడు, లక్ష్మణుడి కోరికమేరకు కాసేపు సమీపంలోని వటవృక్షం క్రింద విశ్రమించాడు. రాళ్ళు మోస్తున్న వానరులు యధాలాపంగా అటు చూసారు. శ్రీరాముడు కన్పించలేదు. తాము ఎవరి మెప్పు కోసం ఈ శ్రమ పడుతున్నామో ఆయనే గుర్తించనప్పుడు ఈ శ్రమ దేనికని బాధ పడ్డారు. అసలే వానరులు. వెంటనే సముద్రంలో వేసిన రాళ్ళను తెచ్చి ఒడ్డున పడవేయసాగారు. వారి చర్యను తెలుసుకున్న శ్రీరాముడు చిరునవ్వు నవ్వి తిరిగి వచ్చి యధాస్థానంలో కూర్చున్నాడు. శ్రీరాముడు కనిపించగానే వానరులు తిరిగి రాళ్ళను సముద్రంలో పడవేసి వారధి కట్టసాగారు. " చూసేవాడు లేనప్పుడు చేసేవాడికి పనిలో ఉత్సాహం ఉండదు. "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి