09-02-2026: సోమవారం
:: శివలీలామృతం - భాగం 1 - శివలింగోద్భవ రహస్యం ::
నమస్కారం! శివలీలామృతం సిరీస్ కు స్వాగతం. " ఆకాశం లింగమిత్యాహు: పృథివీ తస్య పీఠికా " అంటే., అనంతమైన ఆకాశమే లింగం. ఈ భూమియే దాని పీఠం. మన పురాణాలలో శివుని లీలలు అపారం. అసలు శివలింగం ఎలా ఆవిర్భవించింది? బ్రహ్మ, విష్ణువుల మధ్య జరిగిన ఆ అద్భుత ఘట్టం ఏమిటి? ఈనాటి భాగంలో శివలింగోద్భవ రహస్యం గురించి తెలుసుకుందాం.
సృష్టి ఆరంభ కాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, స్థితి కారకుడైన మహావిష్ణువుకు మధ్య ఒక చిన్న వివాదం తలెత్తింది. " నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప " అని బ్రహ్మ, " నేను లోకాలను రక్షించే వాడిని కాబట్టి నేనే గొప్ప " అని విష్ణువు వాదించుకున్నారు. ఈ వివాదం కాస్తా తీవ్రరూపం దాల్చి, ఇద్దరూ యుద్ధానికి సిద్ధపడ్డారు. వారిద్దరి అస్త్రశస్త్రాలవల్ల లోకాలు తల్లడిల్లిపోయాయి.
దేవతలందరూ భయపడి పరమశివుని ప్రార్థించారు. అప్పుడు వారి గర్వాన్ని అణచడానికి, యుద్ధాన్ని ఆపడానికి పరమేశ్వరుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో వారిద్దరిమధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి మొదలు ఎక్కడో, అంతం ఎక్కడో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: " మీలో ఎవరు ఈ స్తంభం యొక్క అగ్రభాగాన్ని (పైకొనను), మూలాన్ని (అడుగు భాగాన్ని) కనుగొంటారో వారే గొప్ప " అని.
వెంటనే మహావిష్ణువు వరాహ ( అడవిపంది) రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ ఆ స్తంభం యొక్క అడుగుభాగాన్ని వెతకడానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరి పైభాగాన్ని వెతకడం ప్రారంభించారు. వేల సంవత్సరాలు గడిచినా, విష్ణువుకు ఆ లింగం యొక్క మొదలు దొరకలేదు. తన ఓటమిని అంగీకరించి ఆయన వెనక్కి వచ్చారు.
కానీ బ్రహ్మదేవుడు పైకి వెడుతూండగా శివుని తలపై నుండి జారిపడుతున్న ఒక మొగలిపువ్వు (కేతకి) ను చూశారు. బ్రహ్మ ఆ పువ్వును అడిగారు: " నీవు ఎక్కడి నుండి వస్తున్నావు " అని. అది " నేను శివుని తలపై నుండి కొన్ని యుగాల క్రిందట జారిపడ్డాను " అని చెప్పింది. బ్రహ్మ ఒక ఉపాయం ఆలోచించి, " నేను శివుని తల చూశానని నువ్వు సాక్ష్యం చెప్పాలి " అని ఆ పువ్వును ఒప్పించారు.
బ్రహ్మ క్రిందకు వచ్చి " నేను శివుని శిరస్సు చూశాను. దానికి ఈ మొగలిపువ్వే సాక్ష్యం " అని అబద్ధం చెప్పారు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఆడిన అబద్ధానికి ఆగ్రహించి, " లోకంలో బ్రహ్మకు ఎక్కడా ఆలయాలు, పూజలు ఉండవు " అని శాసించారు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలిపువ్వును శివపూజకు (దైవపూజకు) అనర్హంగా ప్రకటించారు. నిజాయితీగా ఓటమిని ఒప్పుకున్న విష్ణువును ఆశీర్వదించి, తనతో సమానంగా పూజలు అందుకుంటావని వరమిచ్చారు.
మహాశివరాత్రి రోజున అర్థరాత్రి వేళ ఈ లింగోద్భవం జరిగింది. అందుకే ఆ సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, భగవంతుడి ముందు గర్వం పనికిరాదు. ఎంతటి వారైనా సత్యానికి కట్టుబడి ఉండాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. వచ్చే భాగంలో శివుడు " మన్మథ దహనం " ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమ: శివాయ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి