1, ఫిబ్రవరి 2026, ఆదివారం

:: కాలుడి కాలపాశం ఎలా భగ్నమయింది :: 

    శ్రోతక మహాశయులకు మీ క్రొవ్విడి వెంకట రాజారావు అనేక నమస్సులు. ఇప్పుడు మనం  ప్రతి సోమవారం విఘ్నేశ్వర వైభవ లీలలను గురించి చెప్పుకుంటున్నాం. మహాభారత లేఖకునిగా ఉండి ఆ గ్రంథ రచనా సమయంలో అనేక మహిమలు చూపిన ఆ విఘ్నేశ్వర దైవానికి భక్తిపూర్వక నమస్సులర్పించి చివరగా ఇప్పుడు చెప్పే " కాలుడి కాలపాశం ఎలా భగ్నమయిందో " నన్న విషయాన్ని తెలుసుకున్న తరువాత దిగ్విజయంగా ముగింపు చెప్పుకొందాం. యధావిధిగా మీ అందరి ప్రోత్సాహంతో సోమవారం, మంగళవారం తప్ప ఇదే సమయానికి భాగవతసుధ షార్ట్స్ రిలీజు అవుతున్నాయి. వాటిని గూడా విని మరింత ప్రోద్బలం చేకూర్చండి. సోమవారం పెద్ద వీడియోలు వస్తున్నాయి. అయితే, వచ్చే సోమవారం నుండి  ఆదిదేవుడైన ఆ పరమేశ్వరునకు సంబంధించిన విశేష సత్యాలతో కూడిన నాచే విరచితమైన " శివలీలామృతం " అనే క్రొత్త సీరీస్ ను ప్రారంభించబోతున్నాను. ముందుగా శివలింగోద్భవ రహస్యం గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడే ఛానల్ ను తప్పక సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరి, ఈవారం కథ - 

    ఒకనాడు చాలామంది పిల్లలు, వారి వెనుక పెద్దలు గుమికూడి ఒక చిత్రాన్ని వింతగా చూస్తున్నారు. ఆ చిత్తరువులో ఒక విచిత్రమైన జంతుభూతం చిత్రించబడి ఉంది. అప్పుడే మంటపం ప్రవేశిస్తున్న పావనమిశ్రుడు పిల్లల కుతూహల కారణం గ్రహించి, " పిల్లలూ! ఆ కథ విందురుగాని కూర్చోండి " అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు సగరచక్రవర్తి యాగాశ్వాన్ని దాచాడు. పృథుచక్రవర్తి యాగం సరిగా పూర్తవకుండా గుర్రాన్ని దొంగిలించుకుపోయాడు. పాషండ వేషాలు వేశాడు. చేయరాని పనులెన్నో చేశాడు. 

    పృథుచక్రవర్తి సంతతివాడైన అభినందనుడనే మహారాజు ఇంద్రుడికి భాగం లేకుండా ఉండే ఒక మహా యాగాన్ని ప్రారంభించాడు. ఇంద్రుడు పట్టరాని ఉక్రోషంతో కాలుడిని ఇచ్ఛకాలతో, సుఖభోగాలతో బాగా తృప్తిపరచి, అభినందనుడి యాగాన్ని ధ్వంసం చేయమని కోరాడు. 

    కాలుడు కాలానికి అధినేత. జీవుల జీవన మరణాలకు కాలుడే మూలము. కాలుణ్ణి కాలయముడు, కాలధర్ముడు అని కూడా అంటారు. 

    కాలుడు యజ్ఞపురుషుణ్ణి ఆవహించి అభినందనుడి యాగహోమాగ్ని నుండి కనీవినీ ఎరుగని మహాభయంకరమైన పర్వతం లాంటి జంతుభూతం వెలువడేలాగా చేశాడు. ఋత్విజులు, అధ్వర్యులు మొదలైన వారంతా పారిపోయారు. 

    అభినందనుడు గణేశ భక్తుడు. అతని గురువైన వశిష్ఠుడు, " రాజా! ఇలాంటి అవాంతరం రావచ్చునని తెలిసే హోమగుండానికి ఎదురుగా పెద్ద స్వస్తికా పీఠాన్ని వేయించాను. స్వస్తిక గణేశుని సంకేత చిహ్నం. గణేశ్వరునికి ప్రతిరూపంగా పసుపు ముద్దను స్వస్తిక కేంద్రంలో పెట్టి ప్రణమిల్లు. ఆ స్వస్తిక అవాంతరాన్ని నిర్మూలిస్తుంది.  " అని చెప్పాడు. 

    రాజు అలాగే చేశాడు. 

    ఆ స్వస్తికముగ్గు కేంద్రం నుంచి అద్భుత ప్రకంపనంతో నాదం వెలువడి, అణువులు విజృభించి పైకెగసి మహాజంతుభూతాన్ని ఆవరించాయి. అణువులు పెద్దవిగా పెరుగుతూ ఎలుకలుగా మారాయి. అనేక రంగురంగుల్లో మెరసిపోతున్న చెట్టెలుకలు చీమల బారుల్లాగా భూతజంతువు నిండా పట్టుకొని కొరికి కొరికి, బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కి చచ్చిన విధంగా చేసినై. భూతజంతువు గిలగిలా తన్నుకొని చచ్చినట్లు చచ్చి అదృశ్యమైంది. 

    హోమాగ్ని గుండం నుండి పుట్టిన భయంకరమైన జంతువు అదృశ్యం కాగానే కాలుడు విఘ్నాసుర రూపం దాల్చి కాలపాశాన్ని విసిరాడు. కాలపాశం గిరగిరా తిరుగుతూ ప్రళయంగా అంతా చుట్టబెట్టింది. అభినందనుడు పరాక్రమించి దానిని ఛేదించడానికి యత్నించి నేలకొరిగాడు. కాలపాశం మరింత విజృంభించి జీవకోటిని అంతమొందిస్తూంటే, వశిష్ఠుడు మొదలైన సప్తమహర్షులు, ఋషులు, లోకకళ్యాణం కోరేవారంతా కలసి బ్రహ్మను ప్రార్థించారు. 

    బ్రహ్మ, " కాలపాశాన్ని తప్పించడం ఎవరితరమూ కాదు. కాలప్రభావాన్ని అరికట్టి, కాలుణ్ణి నిగ్రహించ గలిగినవాడు గణేశుడొక్కడే " అని చెప్పి వారందరితో కలసి గణెశ్వరుణ్ణి ప్రార్థించాడు. 

    మహాగణాధిపతి స్వస్తికా పీఠంపై ఆశీనుడై సాక్షాత్కరించాడు. తన చేతనున్న పాశాన్ని వదిలాడు. గణేశుని పాశం  కాలపాశాన్ని ఉచ్చుపన్ని పట్టినట్లు గణాధిపతి ముందు కట్టి పడేసింది. 

    కాలుడు పరాభవంతో మండిపడుతూ మరింత భీకర జుగుప్సాకరంగా విఘ్నాసుర రూపం చూపుతూ కాలదండాన్ని ఎత్తి ఝళిపించాడు. గణేశుడు అంకుశాన్ని వదిలాడు. అంకుశం విఘ్నాసురుడి వెన్నెముకలో గుచ్చింది. 

    విఘ్నాసురుడు అంకుశం తాకిడితో అలాఅలా కుదించుకుపోయి, అంకుశం వెన్నంటి తరుముతూండగా శరణు కోరుతున్నట్లుగా గణేశుడి రెండు పాదాల ఇరుకునపడి బందీగా చిక్కుకున్నాడు. గజముఖుడు విఘ్నాసురుణ్ణి రెండు పాదాలతో గట్టిగా నొక్కాడు. 

    అప్పుడు కాలుడు విఘ్నాసురుడి నుంచి బయటపడి గణేశుడికి మ్రొక్కుతూ " గణేశా! నీ మహావిశ్వపాశం ముందు ఈ భూమికీ, సూర్యోదయ సూర్యాస్తమయాలకు మాత్రమే సంబంధించిన నా కాలపాశం ఎంత? విశ్వాన్ని అదుపులో ఉంచే నీ అంకుశం ముందు నా దండమేపాటిది? పర్వతం లాంటి భూతాన్ని నీ వాహన రూపాలైన చిట్టెలుకలు తుదముట్టించాయి. నీవు విఘ్నాసురుణ్ణి అధీనంలో పెట్టుకున్న విఘ్నేశ్వరుడివి. దేవా! నన్ను మన్నించు " అని వేడుకొన్నాడు. 

    విఘ్నేశ్వరుడు, " కాలా! ఇతరుల పని నెత్తిని వేసుకోవడం, కోరి ముప్పు తెచ్చుకోవడమే. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. ఇక ఇక్కడినుండి కదలివెళ్ళు " అని మందలించాడు. 

    కాలుడు మెలివేసిన చేతులతో చెవులు పట్టుకుని మూడుసార్లు వంగి లేచి, లెంపలు వేసుకొని  " బుధ్ధి బుద్ధి , ఆ ఇంద్రుడి మాటవిని గడ్డి కరిచాను. బుద్ధి వచ్చింది దేవా! విఘ్నేశ్వరుడవైన నిన్ను నమ్మి కొల్చినవారి దాపులకు నేను పోను. వారిని వ్యాధులు సోకవు. వారికి విఘ్నాలుండవు " అని చెప్పి శలవు తీసుకున్నాడు. 

    కాలుణ్ణి విఘ్నేశ్వరుడు భంగపుచ్చినప్పుడే కాలపాశం వల్ల నేలకొరిగిన అభినందన మహారాజు మొదలైన వారంతా సజీవులై నిద్రలేచినట్లు లేచారు. పూలజల్లు కురిసింది. 

    వినాయకుడిని విఘ్నేశ్వరుడనీ, విఘ్నరాజని అందరూ కీర్తించారు. 

    అప్పటినుంచి ఏ మంచి పనికైనా, శుభకార్యానికైనా స్వస్తికను ముగ్గుగా తీర్చిదిద్దడం, పసుపుముద్దను విఘ్నేశ్వరుని ప్రతిరూపంగా ఉంచి పూజించడం సంప్రదాయంగా నిలిచింది. 

    " కాలపురుషుణ్ణి భంగపుచ్చి పాదాక్రాంతుణ్ణి చేసుకున్న విఘ్నేశ్వరుడి మీద విశ్వాసం కలవారూ, విఘ్నేశ్వరుడి ఆశీర్వాదబలం ఉన్నవారూ కాలప్రవాహానికి ఎదురీత ఈది నిలద్రొక్కుకుని, విజయం సాధించగలరు " అని చెప్పి పావనమిశ్రుడు ముగించాడు. 
    
    సమాప్తం. ఈ సీరీస్ అందించడంలో మీ అందరి ప్రోత్సాహానికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే వారం నుండి ప్రారంభమయ్యే " శివలీలామృతం " విశేష సత్యాలను గూడా ఆదరిస్తారని ఆశిస్తూ - " సర్వేజనా సుఖినోభవన్తు - స్వస్తి ". 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...