04-02-2026-బుధవారం
::జనమేజయుని ప్రతీకారం - భాగవతసుధ-4 ::
కురువంశపు
వారసుడు, పాండవుల
మునిమనవడు అయిన పరీక్షిత్తు మహారాజు మరణం.. ఆర్యవర్తనాన్ని శోకసముద్రంలో
ముంచెత్తింది. అది సహజ మరణం కాదు.. కాలసర్పం తక్షకుడి కుట్ర! తక్షకుడు కేవలం
పరీక్షిత్తుని చంపడమే కాదు,
ఒక మహోన్నత వంశపు
అస్తిత్వాన్ని సవాలు చేశాడు.
తండ్రి అంత్యక్రియలు
ముగిశాక, జనమేజయుడు తన
తండ్రి మరణానికి గల కారణాన్ని తెలుసుకున్నాడు. తక్షకుడు చేసిన మోసం, ఆ విషాద ఘట్టం
జనమేజయుని హృదయాన్ని గాయపరిచాయి. దుఃఖం కాస్తా ప్రళయాగ్నిలాంటి కోపంగా మారింది.
సింహాసనంపై కూర్చున్న ఆ యువరాజు కళ్ళలో ప్రతీకార జ్వాలలు ఎగిసిపడ్డాయి.
జనమేజయుడు సభలో
గర్జించాడు.. 'నా తండ్రిని
పొట్టనబెట్టుకున్న ఆ సర్ప జాతిని ఈ భూమిపై ఉండనివ్వను!' అని భీకర
ప్రతిజ్ఞ చేశాడు. బ్రాహ్మణులను, వేద పండితులను పిలిపించి, లోకం ఎన్నడూ చూడని, వినని ఒక
భయంకరమైన యాగానికి పూనుకున్నాడు. అదే.. సర్పయాగ యజ్ఞం.
యజ్ఞశాల
సిద్ధమైంది. హోమగుండంలో అగ్ని ప్రజ్వరిల్లింది. ఋషులు మంత్రోచ్ఛారణలు
మొదలుపెట్టారు. ఆ మంత్రాలు సామాన్యమైనవి కావు.. అవి సర్పాల ప్రాణాలను లాగేసే
మృత్యు పాశాలు! 'సర్పేభ్యః
స్వాహా.. తక్షకాయ స్వాహా..'
అంటూ
హోమగుండంలోకి ఆహుతులు సమర్పించడం మొదలైంది.
మంత్రాల శక్తికి
దిక్కులు దద్దరిల్లాయి. పాతాళంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా.. సర్పాలన్నీ ఒక అదృశ్య శక్తికి
లోబడి గాలిలో కొట్టుకుంటూ రాసాగాయి. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పాములు వచ్చి ఆ మండుతున్న
హోమగుండంలో పడి భస్మమైపోతున్నాయి. సర్ప జాతి ఆర్తనాదాలతో భూమ్యాకాశాలు
నిండిపోయాయి.
ఇక మిగిలింది
ప్రధాన దోషి.. తక్షకుడు! వాడు ప్రాణభయంతో ఇంద్రుడి శరణు కోరాడు. ఇంద్రుడు తన
సింహాసనం కింద తక్షకుడిని దాచాడు. కానీ జనమేజయుని మంత్రబలం ముందు దేవేంద్రుడి
శక్తి కూడా సరిపోలేదు. తక్షకుడితో పాటు ఇంద్రుడి సింహాసనం కూడా హోమగుండం వైపు
వేగంగా లాగబడటం మొదలైంది! సర్వం సిద్ధమైంది.. తక్షకుడు అగ్నిలో పడబోతున్నాడు..
సర్ప జాతి అంతం కాబోతోంది!
సరిగ్గా
అప్పుడే.. ఒక స్వరం వినిపించింది! 'ఆగండి!' అంటూ ఒక యువ బ్రాహ్మణుడు యాగశాలలోకి
ప్రవేశించాడు. ఎవరా యువకుడు? జనమేజయుని ప్రతీకారాన్ని అడ్డుకునే సాహసం చేసిందెవరు? ఆ మండుతున్న
అగ్ని నుండి తక్షకుడు ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా సర్పజాతి మొత్తం మసి అయిపోయిందా?
"వీటన్నిటికీ సమాధానం.. వచ్చే ఎపిసోడ్‌లో
తెలుసుకుందాం!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి