:: "చావని వారధులు - ప్రకృతి చెక్కిన ఇంజనీరింగ్ అద్భుతం" ::
మనం సిమెంటు, ఇనుము, కాంక్రీటుతో కట్టిన భారీ వంతెనలను చూశాం. అవి ఎంత బలంగా ఉన్నా, కాలం గడిచేకొద్దీ పాతబడి, తుప్పు పట్టి కూలిపోతాయి. కానీ ఈ ప్రపంచంలో వింతైన వంతెనలు ఉన్నాయి. అవి పాతబడే కొద్దీ ఇంకా బలంగా మారతాయి. అవి చనిపోవు. సజీవంగా పెరుగుతాయి.
మేఘాలయలోని దట్టమైన అడవుల్లో, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి, మాసిన్రామ్ ప్రాంతాలలో ఈ 'లివింగ్ రూట్ బ్రిడ్జెస్' కనిపిస్తాయి. ఇవి మనిషి నిర్మించినవి కావు.. మనిషి సహాయంతో ప్రకృతి పెంచుకున్న అద్భుతాలు.
ఇక్కడ వంతెనలను ఎవరూ కట్టరు, అవి 'పెరుగుతాయి'. ఇక్కడి 'ఖానీ' (Khasi) మరియు 'జైంతియా' తెగకు చెందిన ప్రజలు వందల ఏళ్ల క్రితమే ఒక అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నారు. అక్కడ ప్రవహించే ఉధృతమైన నదులను దాటడానికి ఇనుప వంతెనలు నిలబడవు. అందుకే వారు అక్కడ పెరిగే 'రబ్బరు చెట్ల' (Ficus Elastica) వేర్లను వాడుకున్నారు.
ఈ చెట్టు వేర్లు చాలా బలంగా, సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. గిరిజనులు వెదురు బొంగులను వాడి, ఈ వేర్లను నదీ తీరాలకు అడ్డంగా మళ్ళిస్తారు. ఈ వేర్లు మెల్లగా అల్లుకుంటూ, అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి 15 నుండి 20 ఏళ్లు పడుతుంది. అంటే, ఒక తరం వారు నాటిన వేర్లు, తర్వాతి తరం వారు నడవడానికి వంతెనగా మారుతాయి. ఇది కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాదు, ప్రకృతి పట్ల వారికకున్న అపారమైన సహనానికి నిదర్శనం.
సాధారణ వంతెనలకు మెయింటెనెన్స్ అవసరం. కానీ ఈ వంతెనలు స్వయంగా తమను తాము రిపేర్ చేసుకుంటాయి. వేర్లు పెరిగే కొద్దీ వంతెన బలం పెరుగుతుంది. కొన్ని వంతెనలు 100 అడుగుల పొడవు ఉండి, ఏకకాలంలో 50 మంది మనుషుల బరువును కూడా సునాయాసంగా మోయగలవు.
వీటిలో అత్యంత వింతైనది 'డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్'. అంటే ఒకదానిపై ఒకటి రెండు అంతస్తులుగా ఈ వంతెనలు ఉంటాయి. వర్షాలు ఎంత పడితే ఈ వేర్లు అంత తేమను పీల్చుకుని మరింత గట్టిగా అల్లుకుపోతాయి. కొన్ని వంతెనలు 500 ఏళ్ల నుండి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి