:: రుక్మిణీ కల్యాణం ::
నమస్కారం! భాగవతసుధకు స్వాగతం! మద్భాగవతంలో అత్యంత మధురమైన ఘట్టం... రుక్మిణీ కల్యాణం. విదర్భ రాజపుత్రి రుక్మిణీదేవి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. చిన్నతనం నుండే కృష్ణుడి గుణగణాలను, విక్రమాలను విని, ఆయన్నే తన ప్రాణనాథుడిగా మదిలో ప్రతిష్టించుకుంది. కానీ, ఆమె అన్న రుక్మి... స్వార్థంతో, అహంకారంతో చెల్లెలిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు.
పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. అటు శిశుపాలుడు పెళ్లి కొడుకుగా వస్తున్నాడు. దిక్కుతోచని స్థితిలో రుక్మిణి ఒక సాహసం చేసింది. వృద్ధ బ్రాహ్మణుడైన అగ్నిద్యోతనుని పిలిచి ఆయనద్వారా , తన హృదయావిష్కరణ చేస్తూ ఏడు శ్లోకాలతో కూడిన ఒక లేఖను కృష్ణుడికి పంపింది.
"శ్రుత్వా గుణాన్ భువనసుందర..." "ఓ ప్రాణేశ్వరా! నా సిగ్గును వదిలి చెబుతున్నాను... నిన్ను తప్ప వేరొకరిని నేను వరించలేను. రేపు నేను పార్వతీ దేవి పూజ కోసం ఆలయానికి వస్తాను. రాక్షస వివాహ పద్ధతిలో నన్ను నీదానిగా చేసుకో. నువ్వు రాకపోతే ఈ ప్రాణాలు వదిలేస్తాను" - ఇది ఆ తల్లి వేడుకోలు.
ఆర్తత్రాణ పరాయణుడు కదా ఆ నల్లనయ్య! సందేశం అందగానే రథం ఎక్కి కదిలాడు. అటు ఆలయంలో రుక్మిణి ఎదురుచూస్తోంది. మనసులో గౌరీ మాతను ప్రార్థిస్తోంది... "అమ్మా! ఆ కృష్ణుడే నాకు భర్త కావాలి". పూజ ముగించుకుని బయటకు రాగానే, వేలమంది రాజుల మధ్యలో, సింహంలా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక్క ఉదుటున రుక్మిణి చేయి పట్టుకుని తన రథంపై ఎక్కించుకున్నాడు.
అడ్డువచ్చిన శత్రువులను తన పరాక్రమంతో చెల్లాచెదురు చేసి, రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకెళ్లాడు. అక్కడ వేదమంత్రాల సాక్షిగా, లోక కళ్యాణార్థం రుక్మిణీ-కృష్ణుల వివాహం వైభవంగా జరిగింది.
ఈ కథ నచ్చితే లైక్ చెయ్యండి. మరిన్ని భాగవత కథలకోసం ఛానల్ ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి.
ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఒక్కటే... మనం నిష్కల్మషమైన భక్తితో ఆ పరమాత్మను పిలిస్తే, ఆయన ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే, మన కోసం పరుగున వస్తాడు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
అన్నట్టు రేపు సోమవారం శివలీలామృతంలో భాగంగా మన ఛానల్ లో మృత్యుంజయ విజయం - భక్త మార్కండేయ చరిత్రను తెలుసుకుందాం. మీరంతా తప్పక వింటారని ఆశిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి