అందరకూ నమస్కారం. ప్రతి సోమవారం మనం భాగవత కథలను ముచ్చటించుకుంటున్నాం కదా! అలాగే, ఇకపై మంగళవారంనుండి ఆదివారం వరకు మన నిత్య జీవితానికి ఎంతో భక్తిని, నీతిని అందించే కృష్ణ శతక పద్యాలను, వాటి వెనుక ఉన్న గూఢార్థాన్ని, విశేషాలను తెలుసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. కృష్ణ శతక కర్త సరళమైన తెలుగులో, ఎంతో మధురంగా అందించిన ఈ పద్యాలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ఒక పద్యం వింటూ, భగవంతుని కృపకు పాత్రులమవుదాం. ఇక ఈరోజు మొదటి పద్యంలోకి వెడదాం.
శ్రీరుక్మిణీశ! కేశవ!
నారద సంగీతలోల నగధరశౌరీ!
ద్వారక నిలయ జనార్దన!
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా! n
లక్ష్మీస్వరూపిణి అయిన రుక్మిణీదేవికి ప్రాణనాథుడవైన ఓ కేశవా! నారదమహర్షి పాడే మధురమైన సంగీతాన్ని అమితంగా ఇష్టపడేవాడా! భక్తులను రక్షించడంకోసం గోవర్థనపర్వతాన్ని ఎత్తిన నగధరా! ద్వారకా నగరంలో కొలువై ఉండి, జనుల బాధలను నివారించే ఓ జనార్దనా! కృష్ణా! నీ అపారమైన కరుణతో మమ్ములను ఎల్లప్పుడూ రక్షించు తండ్రీ! - అని ఈ పద్యం యొక్క సరళమైన భావం.
ఈ పద్యంలోని విశేషమేమంటే, ఇందులో భగవంతుని లీలలను ఎంతో చక్కగా స్మరించారు. రుక్మిణీ కల్యాణం, నారదుడి భక్తి, గోవర్థనోద్ధరణం, ద్వారకలో కృష్ణుడి వైభవం - ఇలా స్వామివారి యొక్క ముఖ్య లీలల నన్నింటినీ ఒకే పద్యంలో స్తుతిస్తూ, ఆయన కరుణకోసం ప్రార్థించడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే ఇలాంటి ఒక మధురమైన పద్యాన్ని స్మరిస్తూ రోజంతా భగవన్నామ స్మరణలో గడుపుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. రేపు సోమవారం కాబట్టి మంగళవారం రెండో పద్యంతో కలుద్దాం. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి