అందరకూ నమస్కారం. "మాటలు కోటలు దాటుతాయి... కానీ చేతలు గడప కూడా దాటవు! ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తుంటాం... వేదికలెక్కితే అద్భుతంగా మాట్లాడతారు, కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆ మాటలకి, వాళ్ళు చేసే పనులకి అస్సలు పొంతన ఉండదు. ఇలాంటి మనుషుల గురించి సమాజం ఏమనుకుంటుందో తెలుసా? నా 'సుజనా శతకం' లో నేను రాసిన ఈ పద్యం వినండి..."
పలికెడి వాచకములకును
చలిపెడి పనులకు పొరపులు సంభవమగుచో
పలుకులవి పలుకు వానిని
ఇలను వసించెడి జనమ్ము లెంచరు సుజనా!
ఈ పద్యం యొక్క సరళమైన అర్థం ఏమిటంటే... ఓ మంచివాడా!సుజనా! ఒక వ్యక్తి చెప్పే మాటలకూ, అతడు చేసే పనులకూ మధ్య తేడాలు వస్తే, పొరపాట్లు జరిగితే... ఈ భూమిపై ఉన్న జనులు ఆ వ్యక్తిని అస్సలు నమ్మరు. అతడి మాటలను గౌరవించరు సరే కదా, కనీసం అతడిని ఒక మనిషిగా కూడా లెక్కచేయరు."
"ఈ పద్యం వెనుక ఉన్న నా కవి హృదయాన్ని మీతో పంచుకోవాలి. ఈ ఆధునిక సమాజంలో 'నమ్మకం' అనేది ఒక ఖరీదైన వస్తువు అయిపోయింది. ఎందుకంటే మనుషుల వాక్కు వేరు... వాళ్ళ ప్రవర్తన వేరు. 'చెప్పేవి శ్రీరంగ నీతులు... దూరేవి గుడిసెలు' అన్నట్టు తయారైంది వ్యవస్థ.
కానీ, జనాలు అమాయకులు కాదు. సమాజం మనల్ని చాలా నిశితంగా గమనిస్తుంది. మనం మాట్లాడేటప్పుడు చప్పట్లు కొట్టిన చేతులే... మన చేతల్లో తేడా రాగానే అంతే వేగంగా మనల్ని పక్కన పెట్టేస్తాయి. మాట తప్పడం అంటే కేవలం అబద్ధం చెప్పడం కాదు, మన వ్యక్తిత్వాన్ని మనమే చంపుకోవడం!"
"గుర్తుపెట్టుకోండి... మాట-చేత ఒక్కటైనవాడే నిజమైన 'సుజనుడు'. మన వాక్కు, మన కర్మ ఒకేలా ఉన్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది.
నా ఈ పద్యం, నా కవి హృదయం మీకు నచ్చినట్లయితే... ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని ఇటువంటి పద్యాలకోసం ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి