20, జులై 2026, సోమవారం

 

:: శ్రీకృష్ణ లీలలు: యజ్ఞపత్నుల అనుగ్రహం ::

    భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ "పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి..." అని ఉపదేశించినట్లుగా, భగవంతుడికి కావాల్సింది అహంకారం, ఆడంబరాలు లేదా కేవలం మంత్రోచ్ఛారణలు కావు; నిశ్చలమైన భక్తి, హృదయపూర్వకమైన శరణాగతి మాత్రమే. ఈ మహత్తర సత్యాన్ని లోకానికి నిరూపించే దివ్యమైన భాగవత ఘట్టమే "యజ్ఞపత్నుల అనుగ్రహం".

    బృందావనంలో శ్రీకృష్ణుడు తన సోదరుడైన బలరాముడు, గోపబాలురతో కలసి గోవులను మేపుతూ, చెట్ల నీడన వివిధ క్రీడలు ఆడుకునేవాడు. ఒకరోజు గోపబాలురు తీవ్రమైన ఆకలితో బాధపడుతూ, "కృష్ణా! మాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఆహారం ఇప్పించు" అని వేడుకున్నారు.

    సమీపంలో కొంతమంది బ్రాహ్మణులు స్వర్గప్రాప్తి కోరి "ఆంగీరస" అనే యజ్ఞం చేస్తున్నారు. కృష్ణుడు గోపబాలురతో... "మీరు ఆ యజ్ఞశాలకు వెళ్ళి, నేను, బలరాముడు ఇక్కడ ఉన్నామని చెప్పి ఆహారాన్ని అర్థించండి" అని పంపాడు.

    గోపబాలురు యజ్ఞశాలకు వెళ్ళి బ్రాహ్మణులకు నమస్కరించి, జగన్నాథుడైన శ్రీకృష్ణుడు ఆకలితో ఉన్నాడని చెప్పి ఆహారం అడిగారు. కానీ కర్మకాండల యందు, స్వార్థ చింతన యందు మునిగిపోయిన ఆ విప్రులు అహంకారంతో, సాక్షాత్ సర్వేశ్వరుడైన కృష్ణుడిని సామాన్య గోపబాలుడిగా భావించారు.

    ఈ ఘట్టంలో వారి దుర్మతిని పోతనగారు అద్భుతంగా వర్ణించారు:

క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములుం గాలంబు దేశంబు దే

వతయున్ ధర్మము నన్నన్యముల్ దలప నెవ్వాడట్టి సర్వేశ్వరున్ 

మతినూహింపక గోపబాలుడనుచున్ మందస్థితింజూచి దు

ర్మతులై యన్నము లేదు లేదనిరి సమ్మానక్రియా శూన్యులై

    యజ్ఞము, మంత్రము, తంత్రము, ధనము, కాలము, దేశము, దేవత, ధర్మము అనేవన్నీ ఏ సర్వేశ్వరునికంటె వేరుకావో... అటువంటి పరమాత్మను మనస్సులో గ్రహించలేకపోయారు. ఆ కృష్ణుడిని ఒక సామాన్యమైన 'గోపబాలుడు' అని అజ్ఞానంతో చులకనగా చూసి, కనీస గౌరవమర్యాదలు కూడా ఇవ్వకుండా, దుర్బుద్ధితో "ఇక్కడ ఆహారం ఏమీ లేదు" అని తిరస్కరించి పంపివేశారు.

    గోపబాలురు నిరాశతో తిరిగి వచ్చి కృష్ణుడికి జరిగిన విషయమంతా చెప్పారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, "ఏమీ విచారించకండి, ఈసారి యజ్ఞశాలలో ఉన్న ఆ బ్రాహ్మణుల భార్యల (యజ్ఞపత్నుల) వద్దకు వెళ్ళి నా పేరు చెప్పి ఆహారం అడగండి" అని పంపాడు.

    గోపబాలురు యజ్ఞపత్నుల వద్దకు వెళ్ళి, "అమ్మా! కృష్ణబలరాములు ఆకలితో ఉన్నారు, ఆహారం కావాలి" అని అర్థించారు. ఆ మాట వినడమే తడవగా యజ్ఞపత్నులు పరమానందభరితులయ్యారు. వారు ఎప్పటినుంచో శ్రీకృష్ణుని దివ్య గుణగణాలను, వేణుగానాన్ని విని ఆయనను దర్శించుకోవాలని తపిస్తున్నారు. భర్తలు, బంధువులు వారిస్తున్నా వినకుండా, షడ్రసోపేతమైన భక్ష్యాలు, భోజ్యాలను పెద్ద పాత్రలలో తీసుకోని వెంటనే కృష్ణుని వైపు పరుగెత్తారు.

    యమునా తీరంలో ఉన్న శ్రీకృష్ణుడిని చూసి యజ్ఞపత్నులు కన్నులపండువగా తిలకించారు. ఆ నటనటశేఖరుని రూప సౌందర్యాన్ని పోతనగారు ఈ క్రింది పద్యంలో మనోహరంగా వర్ణించారు:

ఒక చెలికానిపై నొక చేయిసాచి వేఱొకచేత లీలాబ్జ మూచువాని 

గొప్పున కందని కొన్నికుంతలములు చెక్కుల నృత్యంబు సేయువాని 

గుఱుచచుంగులు పుచ్చి కొమరారగట్టిన పసిడి వన్నెలుగల పటమువాని 

నౌదల దిరిగిరా నలవడజుట్టిన దట్టంపుబింఛపు దండవాని 

రాజితోత్పల కర్ణపూరములవాని 

మహిత పల్లవ పుష్ప దామములవాని 

భువనమోహననటవేషభూతివాని 

గనిరి కాంతలు కన్నుల కఱవుదీర

    ఒక గోపబాలుని భుజంపై చెయ్యి వేసి, మరొక చేతితో లీలాపద్మాన్ని త్రిప్పుతున్నవానిని... ముడికి అందక చెంపలపై నాట్యం చేస్తున్న ముంగురులు కలవానిని... బంగారు వర్ణంలో మెరుస్తున్న పట్టువస్త్రాన్ని దట్టంగా కట్టినవానిని... తలపై రంగురంగుల నెమలిపింఛాల దండను ధరించినవానిని... చెవులకు కలువపూల ఆభరణాలు, మెడలో పల్లవ పుష్పమాలలు ధరించి, లోకాన్ని మోహింపజేసే నటవేషంతో అలరారుతున్న ఆ శ్రీకృష్ణుడిని ఆ కాంతలు కన్నుల కఱవు తీరేలా దర్శించి మైమరిచిపోయారు.

    భక్తితో వారు తెచ్చిన అన్నపానీయాలను సమర్పించగా, కృష్ణుడు ప్రేమతో స్వీకరించి, వారి కోరికను తీర్చి, వారిని దీవించి తిరిగి ఇళ్లకు పంపాడు.

    తమ భార్యల నిశ్చల భక్తిని, పరమాత్మ అనుగ్రహాన్ని చూసిన బ్రాహ్మణులకు ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. తమ అహంకారానికి, అజ్ఞానానికి కుమిలిపోతూ ఇలా పశ్చాత్తాపపడ్డారు:

కటకట! మోసపోయితిమి కాంతల పాటియు బుద్ధిలేదు నే

డిట హరి గానబో నెఱుగమేము దురాత్ముల మేము కల్మషో

ద్భటులము విష్ణుదూరగుల ప్రాజ్ఞతలేల? ప

ర్యటనములేల శీలములు యాగములున్ మఱియేల కాల్పనే

    " అయ్యో! ఎంత మోసపోయాము! మా భార్యలకు ఉన్నంత దివ్యబుద్ధి కూడా మాకు లేకపోయింది. ఇక్కడికి స్వయంగా విచ్చేసిన శ్రీహరిని గుర్తించలేకపోయాము. మేము దురాత్ములము, పాపభూయిష్టులము, విష్ణుదేవునికి దూరమైనవారము. హరిభక్తి లేని మా పాండిత్యాలు, తీర్థయాత్రలు, ఆచారాలు, యజ్ఞయాగాదులు అన్నీ వ్యర్థం, అవన్నీ తగలడిపోను!" అని ఆవేదన చెందారు.

    అనంతరం వారు పరమాత్మ తత్త్వాన్ని గ్రహించి, శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ శరణు వేడారు:

క్రతువుల్ ధర్మము మంత్రతంత్ర ధనముల్ కాలంబు దేశంబు దే

వతయున్ వహ్నులు మేదినీసురులు నెవ్వాడట్టి సర్వేశుడీ

క్షితి రక్షింప జనించినాడెఱుగ మా శ్రీభర్తకుం గర్తకుం

గుతలోద్ధర్తకు మేము మ్రొక్కెదము రక్షోనాథసంహర్తకున్

    యజ్ఞములు, ధర్మము, మంత్రములు, తంత్రములు, ధనములు, కాలము, దేశము, దేవతలు, అగ్నులు, బ్రాహ్మణులు – వీటన్నింటికీ మూలకారకుడైన సర్వేశ్వరుడు ఈ భూమిని రక్షించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించాడని తెలుసుకోలేకపోయాము. లక్ష్మీనాథుడు, సృష్టికర్త, భూభారాన్ని హరించినవాడు, రాక్షస సంహారకుడైన ఆ శ్రీకృష్ణునికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము అని స్తుతించారు.

    బాహ్యమైన ఆడంబరాలు, శాస్త్ర పాండిత్యం, హోదా లేదా కులం భగవంతుడిని చేర్చలేవు. హృదయపూర్వకమైన భక్తి, నిష్కల్మషమైన ప్రేమ, శరణాగతి మాత్రమే పరమాత్మ అనుగ్రహాన్ని అందిస్తాయి. యజ్ఞకర్తలైన విప్రుల అహంకారాన్ని అణచి, యజ్ఞపత్నుల నిశ్చల భక్తిని లోకానికి చాటిచెప్పడమే ఈ లీల ప్రధాన ఉద్దేశం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  ద్రౌపది నవ్వు       శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" ప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ ను...