:: శ్రీకృష్ణ లీల - గోపికా వస్త్రాపహరణ ఘట్టం ::
అందరకూ నమస్కారం! మనం ఈవారం శ్రీకృష్ణ పరమాత్మ గావించిన దివ్య లీలలలో అత్యంత గూఢమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉన్న ఘట్టం "గోపికా వస్త్రాపహరణం" గురించి తెలుసుకుందాం. పైకి ఇది కేవలం ఒక లౌకిక పరిహాసముగా అనిపించినప్పటికీ, దీని అంతరార్థం జీవాత్మ పరమాత్మలో లీనమవడానికి పడే వేదన మరియు సర్వస్వ శరణాగతి. మార్గశిర మాసంలో వ్రజభూమిలోని కన్యలంతా నందనందనుడైన శ్రీకృష్ణుడిని పతిగా పొందాలని అత్యంత నిష్ఠతో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించారు. వ్రత సమాప్తి రోజైన నాడు, గోపికలంతా యమునా నదికి చేరుకున్నారు. తమ వస్త్రాలన్నింటినీ నదీ తీరంలో ఉంచి, కృష్ణుడి ధ్యానంలో మునిగి జలకాలాడటం ప్రారంభించారు. ఆ సుందర దృశ్యాన్ని భాగవతంలో పోతన గారు ఇలా వర్ణించారు:
"వారిజలోచను బాడుచు
వారిజలోచనులు వారివారికి వేడ్కన్
వారి విహారము సలిపిరి
వారివిహారములు జగతి వారికి గలవే"
తామర రేకుల వంటి కన్నులు గల ఆ గోపికలు, ఆ తామరాక్షుడైన శ్రీకృష్ణుని లీలలను మధురంగా పాడుకుంటూ, యమునా నది నీటిలో అత్యంత సంతోషంతో విహరించసాగారు. అటువంటి పవిత్రమైన, దివ్యమైన జలక్రీడలు ఈ జగత్తులో సామాన్య మానవులకు సాధ్యమా? సాధ్యం కాదు. అది కేవలం ఆ పరమాత్మపై అనన్య భక్తి కలిగిన గోపికలకే చెల్లింది.
సమస్త ప్రాణుల హృదయాలలో నివసించే ఆంతర్యామి అయిన కృష్ణ పరమాత్మకు గోపికల మనోరథం నెరవేరవలసిన సమయం ఆసన్నమైందని తెలిసింది. ఆయన తన సఖులతో కలిసి యమునా తీరానికి విచ్చేశాడు. ఒడ్డున ఉన్న గోపికల చీరలన్నింటినీ చకచకా గుమికూర్చి, అక్కడే ఉన్న ఒక పెద్ద కడిమిచెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత గోపికలు తీరం వైపు చూసి, తమ వస్త్రాలు కానరాకపోవడంతో కంగారుపడ్డారు. చెట్టుపై నవ్వుతూ కూర్చున్న నల్లనయ్యను, ఆయన చేతిలో ఉన్న తమ వస్త్రాలను చూసి తాము కృష్ణుడి చేతిలో చిక్కామని గ్రహించారు. సిగ్గుతో నీటిలోనే ముడుచుకుపోతూ, ఆర్తితో కృష్ణుడిని ఇలా బ్రతిమాలసాగారు:
"మామావలువలు ముట్టకు
మామా కొనిపోకుపోకు మన్నింపు తగన్
మా మానమేల కొనియెదు
మా మానాపహరణమేల్ మానుము కృష్ణా!"
"ఓ కృష్ణా! మా వస్త్రాలను ముట్టుకోవద్దు. వాటిని దూరాన ఉన్న ఆ చెట్టుపైకి తీసుకుపోవద్దు. మమ్మల్ని దయతో మన్నించు. మా దుస్తులను తీసివేసి మా మానాన్ని ఎందుకు హరిస్తావు? మా వస్త్రాలను అపహరించడం తగదు, ఈ పరిహాసాన్ని ఆపు స్వామీ!" అని వేడుకున్నారు. కానీ, భగవంతుడు వారి బాహ్య వస్త్రాలనే కాదు, వారి అంతరంగంలోని అజ్ఞానాన్ని కూడా తొలగించాలనుకున్నాడు. కాబట్టి, "మీరు నీటి నుండి ఒడ్డుకు వచ్చి, మీ మీ వస్త్రాలు స్వయంగా తీసుకెళ్లండి" అని కృష్ణుడు నిష్కర్షగా చెప్పాడు.
కృష్ణుడి మాటలకు గోపికలు లోలోన ఆనందిస్తున్నా, పైకి మాత్రం లౌకిక మర్యాదలను, లోక రీతులను గుర్తు చేస్తూ ఆయనను కాస్త గద్దించే ప్రయత్నం చేశారు. లోక రక్షకుడైన కృష్ణుడికి ధర్మ సూత్రాలను గుర్తు చేస్తూ ఇలా అన్నారు:
"మా వలువలు లాఘవమున
నీ వేటికి బుచ్చుకొంటి నీవల్పుడవే
నీ వెఱుగనిదేమున్నది
నీ వందఱిలోన ధర్మనిరతుడవు గదే"
"ఓ కృష్ణా! ఇంత సులువుగా మా వస్త్రాలను ఎందుకు దొంగిలించావు? నువ్వేమైనా అల్పుడివా, హీనుడివా? నీకు తెలియని ధర్మం ఏముంది? ఈ లోకంలో అందరికంటే మిన్నగా ధర్మాన్ని ఆచరించే ఉత్తముడవు కదా నువ్వు! మరి ఇలా చేయడం నీకు తగునా?" అని ప్రశ్నించారు. అయినా కృష్ణుడు లొంగలేదు సగారముగా నవ్వుతూనే ఉన్నాడు. చలిగాలులు వీస్తుండటంతో నీటిలో ఉండలేక, బయటకు రాలేక గోపికలు అమితమైన ఆవేదనకు గురయ్యారు. పురుషోత్తముడైన కృష్ణుని ముందు లౌకిక పురుష లక్షణాలను ఆపాదిస్తూ తమ బాధను ఇలా వెళ్లగక్కారు:
"ఇంతుల్ తోయములాడుచుండ మగవారేతెంతురే వచ్చిరా
యింతల్ సేయుదురే కృపారహితులై యే లోకమందైన నీ
వింతల్ నీతల బుట్టె గాక మఱి యేవీ కృష్ణ! యో చెల్ల! నీ
చెంతన్ దాసులమై చరించెదము మాచేలంబులిప్పింపవే"
"కృష్ణా! అయ్యో ఎంత ఘోరం! స్త్రీలు ఇక్కడ నగ్నంగా స్నానాలు చేస్తుంటే ఏ లోకంలోనైనా మగవారు ఇలా వస్తారా? ఒకవేళ వచ్చినా, ఇంత దయలేకుండా బట్టలు ఎత్తుకెళ్లి ఇంతటి వింత పనులు చేస్తారా? ఇటువంటి వింత ఆలోచనలు నీ తలవొకదానికే వస్తాయి కానీ మరెవరికీ రావు. కృష్ణా! ఇక చాలు, మేము నీకు దాసులమై నీ నీడలోనే చరిస్తాము, దయచేసి మా వస్త్రాలు మాకు ఇప్పించు" అని దీనంగా అర్ధించారు.
కానీ, భగవంతుని నిబంధన మారలేదు. "నగ్నంగా నదిలో స్నానం చేయడం ద్వారా మీరు వరుణ దేవునికి అపరాధం చేశారు. ఆ పాపం తొలగాలి అంటే, లోక లజ్జను, అహంకారాన్ని విడిచిపెట్టి, రెండు చేతులూ పైకెత్తి నాకు నమస్కరించి వస్త్రాలు తీసుకెళ్లండి" అని ఆ పరమాత్మ ఆజ్ఞాపించాడు. అప్పుడు గోపికలకు జ్ఞానోదయం అయింది. తమను బంధిస్తున్నది వస్త్రాలు కాదని, లోక లజ్జ అనే అహంకారమని వారు గ్రహించారు. సర్వాంతర్యామి అయిన కృష్ణుడి ముందు దాచవలసినది ఏముంటుంది? ఈ సత్యాన్ని తెలుసుకుని, వారు లజ్జను పూర్తిగా వీడి, కృష్ణుడికి తమ హృదయాలను అర్పించుకుంటూ ఇలా పలికారు:
"కొంటివి మా హృదయంబులు -
కొంటివి మానంబు లజ్జ గొంటివి వలువల్
గొంటివిక నెట్లు జేసెదొ -
కొంటెవుగద నిన్ను నెఱిగికొంటిమి కృష్ణా!"
"ఓ కృష్ణా! నువ్వు కేవలం మా వస్త్రాలనే కాదు.. మా హృదయాలను ముందే దోచుకున్నావు. మా మానాన్ని, మా సిగ్గును, మా సర్వస్వాన్ని నీవే హరించావు. నువ్వు చాలా కొంటెవాడివి స్వామీ, నీ లీలను మేము ఆలస్యంగా తెలుసుకున్నాము. ఇకపై మమ్మల్ని నువ్వు ఎలా ఉంచితే అలా ఉంటాము. మా సర్వస్వం నీదే!" అని ప్రకటిస్తూ, గోపికలు రెండు చేతులూ పైకెత్తి ఆ కృష్ణ పరమాత్మకు సంపూర్ణ శరణాగతి చేశారు. ఆఖరి ప్రయత్నంగా వారు పరమాత్మ ఆజ్ఞను శిరసావహిస్తూ ఇలా వేడుకున్నారు:
"వచ్చెదము నీవు పిల్చిన
నిచ్చెద మేమైనగాని యెట్లు చొరమనం
జొచ్చెదము నేడు వస్త్రము
లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా!"
"కృష్ణా! నువ్వు పిలిస్తే చాలు మేము నీ వద్దకు వస్తాము. నువ్వు ఏది అడిగినా మా ప్రాణాలనైనా ఇస్తాము. సందేహం లేకుండా నీ శరణు జొచ్చుతున్నాము. మా అహంకారాన్ని వీడాము. కాబట్టి, దయతో మా వస్త్రాలు మాకు ఇచ్చి, మమ్మల్ని నీ కరుణా కటాక్షాలతో రక్షించు" అని వేడుకున్నారు.
గోపికల అంతరంగం పూర్తిగా నిర్మలమై, దేహ భావన నశించి, ఆత్మ భావన స్థిరపడటాన్ని కృష్ణ పరమాత్మ గమనించాడు. ఎప్పుడైతే జీవుడు తన 'నేను', 'నాది' అనే అహాన్ని, లోక లజ్జను వీడి భగవంతుని ముందు నిలబడతాడో, అప్పుడే ఆ దేవుని అనుగ్రహం లభిస్తుంది. గోపికల నిష్కల్మష భక్తికి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, వారి వస్త్రాలను వారికి తిరిగి ఇచ్చివేశాడు. అంతేకాక, వారి పవిత్రమైన కాత్యాయనీ వ్రత ఫలితంగా రాబోయే శరదృతువులో వారితో కలిసి 'రాసలీల' గావిస్తానని వరమిచ్చాడు.
ఈ విధంగా, గోపికా వస్త్రాపహరణ ఘట్టం అనేది లోక లజ్జను వీడి భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయాలనే పరమ వేదాంత సత్యాన్ని చాటిచెబుతూ భక్తిభావంతో ముగుస్తుంది.
అందరూ విన్నారుగదా! నచ్చితే లైక్ చెయ్యండి. మీ మీ బంధుమిత్రులకు దీనిని షేరు చెయ్యండి. మరిన్ని శ్రీకృష్ణి లీలలకు సంబంధించిన ఘట్టాలను వినడానికి మన ఛానల్ ను ఇప్పుడే సబ్ స్క్రైబ్ చేసుకోండి.
సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి