27, ఆగస్టు 2026, గురువారం

 :: హనుమంతుడి ముందు కుప్పిగంతులు ::  

    " హనుమంతుడి ముందు కుప్పిగంతులు "  అను దానిని దైనందిన జీవిత పరిభాషణమందు విస్తృత వ్యాప్తినొందిన నానుడిగా గుర్తించవచ్చు. ఒకరిముందు మరొకరు అతిశయవాక్కులను పలుకుతూ, డాంబికమైన చేష్టలను నిర్వర్తించుచూ గొప్పలు చెప్పుకోవడము , ఉన్న స్వల్పప్రతిభను ప్రకటించబోయి చివరలో నవ్వులపాలగుటను తెలియజెప్పుటకు వాడు జాతీయమది. తనను మించిన అపార పాండిత్యము, జ్ఞానము కలిగిన నిపుణులైన పూజ్యుల ముందర మిడిమిడి జ్ఞానము కలిగిన అల్పజ్ఞుడు అహంభావముతో ప్రవర్తిల్లినప్పుడు ఈ సామెత నూటికి నూరు శాతమూ సరిపోవును.

     అనుక్షణము రామభక్తిలో మునిగి తేలెడి హనుమంతుడు అపార శౌర్య పరాక్రమములతో ప్రకాశించునట్టివాడు. శ్రీరామాయణంలో సీతామాత జాడను అంవేషించు సందర్భమందు అవలీలగా సముద్ర లంఘనమును నిర్వహించుట, లంకాదహన కర్తగా చూపిన ధైర్య సాహసములు, లక్ష్మణుని ప్రాణ రక్షణకై సంజీవినీ పర్వతమును పెకలించి తెచ్చునప్పుడు ప్రదర్శించిన సామర్థ్య పటుత్వము హనుమంతుని మహత్తర శక్తిని లోకమునకు వెల్లడి చేసినవి. అటువంటి అపారమైన బలపరాక్రమశాలి ముందర ఒక చిన్న వానరమొచ్చి తన సత్తువమేర చిన్నచిన్న విన్యాసముల నొనరించుచు, " నేను చాలా వాసిగలవాడినని విర్రవీగినపుడు అది ఎంత హాస్యాస్పదముగా ఉంటుందన్నది ఊహించుకోవచ్చు. 

     విస్తృత అనుభవముండి, అన్ని విషయములలోను నిపుణత్వమున్న వారిచెంత అల్పుడొకడు తనకు సర్వమూ తెలుసునన్నట్లు డాంబిక మాటలాడినపుడు మన పెద్దలు ముందు నీ ప్రదర్శన " హనుమంతుడి ముందు కుప్పిగంతు లాంటిది " అని హెచ్చరించుట కద్దు. పరిశీలనగా చూచినపుడు, ప్రతిభా వ్యుత్పత్తులతో అలరారే వ్యక్తి ఏనాడునూ తన ప్రఖ్యను గూర్చి బాహాటముగా తెలియజెప్పడు. అతడొనరించు క్రియలే వాని సామర్థ్యమును నిరూపించగలవు. అపారమైన జ్ఞానసంపదను నిండుగా కలిగి ఉన్నవారు వినయ గుణాన్ని ఆభరణముగా ధరించి ఉంటారు. ఇంకనూ. ఎదుటి వారినుండి మరింత నేర్చుకోవలసి ఉన్నదన్నట్లుగా ప్రవర్తించుదురు.  

    ఈ పౌరాణిక నానుడి మనకొక పరమ సత్యమును ఉపదేశిస్తుంది. ఎల్లప్పుడు మనిషి తన పరిధిని, సామర్థ్యమును తాను స్పష్టముగా గ్రహించి తీరవలయును. మనను మించిన వారి అనుభవసారమును , విజ్ఞాన స్థాయిలను అంచనావేసి ఆదరించి వారిని అనుసరించ ప్రత్నించాలి. అంతియే తప్ప గర్వాతిశయాలను ప్రకటించుకోకూడదు. ప్రతిభకు వినయతత్త్వం తోడుగా నున్నప్పుడు పరిపూర్ణ విలువ లభిస్తున్నదన్న నిజాన్ని ఈ జాతీయం వెల్లడి చేస్తున్నదన్నది సర్వవిదితమే! - 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  ద్రౌపది నవ్వు       శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" అప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ న...