31, ఆగస్టు 2026, సోమవారం

 :: భస్మాసుర హస్తం :: 

    సహాయమందించిన వ్యక్తులకు హానిచేయు నిమిత్తము పథకమాలోచించి , తుదకు ఆ కుట్రనందుననే తాను చిక్కుకుని వినాశము కోరి తెచ్చుకొనుటను సూచించు నానుడి " భస్మాసుర హస్తం ". విశ్వాసమును, నమ్మకమును త్రోసిరాజని ద్రోహము తలపెట్టినప్పుడు ఎటువంటి పతనము సంభవించునో వివరించుటకు ఈ సామెత అచ్చమైన ఉదాహరణ. 

     శివపురాణము ప్రకారము దానవుడయిన భస్మాసురుడు శివుని కొరకై తీవ్ర తపమాచరించి ఆ దేవదేవుని మెప్పించి , తానెవరి శిరమందు కరముంచితే వారు మరుక్షణమే భస్మమౌలాగున అత్యంత భయంకరమైన వరమును కోరి పరమేశ్వరునిచే తధాస్తు అనిపించుకుని , ఆ తదుపరి వెంటనే తనకు వరమొసంగిన ఆ ఈశ్వరుని శిరస్సుపైననే తన హస్తమునుంచి దహించుటకు ప్రయత్నించుచు వెంటబడినాడు. దానిని గ్రహించిన విష్ణుదేవుడు శివుని రక్షణార్థము మోహినీ అవతారము ధరించి భస్మాసురుని ముందుకు వచ్చినంతట, కామచిత్తుడైన ఆ రాక్షసుడు వివాహమాచరించమని మోహినీ పక్షమునకు మరలినాడు. అంతట మోహిని తనతో నృత్యమొనరించి తనను మెప్పించమని షరతు విధించినది. అందులకు సమ్మతించిన భస్మాసురుడు మోహిని చేయు నృత్య భంగిమలను తుచ తప్పక అనుసరించే క్రమంలో తన కరమును శిరముపై పెట్టుకున్న మోహినిని విడంబించుచు తానుకూడా పారవశ్యములో హస్తమును తలపై ఉంచుకుని భస్మీపటలమయినాడు.  

    ఈకథ మనకు వివేకము, విశ్వసనీయతకు గల ప్రాధాన్యమును గాఢముగా తెలియజెప్పుచున్నది. మనకు అదృష్టవశాత్తు మహాద్భుతశక్తి , జ్ఞానసంపద లభ్యపడినప్పుడు వాటిని నేర్పుగా వివేకతత్త్వంతో వినియోగించుకోవాలి. లేనిచో ఆ శక్తులే చివరకు మనకు వినాశహేతువులవలె రూపొందుతాయి. ఆపత్కాలమందు చేయూత నిచ్చినవారికి లేదా మేలొనరించిన వారికి హాని తలపెట్టుట స్వయంకృతాపరాధమగును. 

     పరులకై గోతులు తీయువారు చివరకు తాము తీసిన గోతులందు తామే సమాధి కాగలరన్నదానికి ఈ జాతీయమే సజీవ సాక్ష్యము . తనకు అనుగ్రహించబడ్డ వరమే తన నాశనమునకు కారణమైన రీతి, గర్వాతిశయముతో సల్పెడు ద్రోహము ఎప్పటికైనను స్వనాశనమునకే దారితీయునని భస్మాసుర హస్తం హెచ్చరించుచున్నది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 ::  భస్మాసుర హస్తం ::       సహాయమందించిన వ్యక్తులకు హానిచేయు నిమిత్తము పథకమాలోచించి , తుదకు ఆ కుట్రనందుననే తాను చిక్కుకుని వినాశము కోరి తెచ...